యాప్ లక్ష.. యాడ్స్ కోట్లు! జగన్ సర్కార్ మరో వింత..
posted on Jun 29, 2021 @ 2:48PM
అందరిది ఒకదారి.. ఉలిపిరికట్టది మరో దారి అన్నట్లుగా ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలన ఉందనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. రివర్స్ టెండరింగ్ మొదలు... మూడు రాజధానులు, కొవిడ్ , వ్యాక్సినేషన్, పరీక్షలు, ఎన్నికలు.. ఇలా అన్ని విషయాల్లోనూ అన్ని రాష్ట్రాలు ఒకలా వ్యవహరిస్తే ఏపీ సర్కార్ మరోలా ముందుకు వెళ్లింది. జగన్ ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. న్యాయ స్థానాలు ఎన్నో సార్లు మొట్టికాయలు వేశాయి.
ఎన్నోసారు అభాసుపాలైనా జగన్ రెడ్డి సర్కార్ తీరు మాత్రం మారడం లేదు. తాజాగా మరో వింత చర్యతో విమర్శల పాలైంది. అసలే రాష్ట్రం అప్పులో ఉంటే.. అది చాలదన్నట్లు అడ్డగోలుగా ఖర్చు చేస్తోంది. ఎవరైనా కోటి రూపాయలు పెట్టి పరిశ్రమ పెడితే దానికి ప్రచార బడ్జెట్ మహా అయితే ఓ పది లక్షలు పెట్టుకుంటారు. అది కూడా చాలా ఎక్కువే. కానీ ఏపీ సర్కారు మాత్రం అసలు యాప్ తయారీ ఖర్చు కంటే యాడ్స్ ఖర్చే ఎక్కువ పెట్టింది. మామూలుగా ఓ మంచి మొబైల్ యాప్ తయారీకి ఐదు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. కానీ ఏపీ సర్కారు తీసుకొచ్చిన దిశ యాప్ అద్భుతమైన ఫీచర్లతో..హై ఎండ్ యాప్ అనుకున్నా.. ఈ యాప్ ఖర్చు 50 లక్షల రూపాయలు దాటదని ఐటి నిపుణుల మాట. కానీ ఏపీ సర్కారు ఈ యాప్ ప్రచారం కోసం కోట్ల రూపాయల్లో ఖర్చు పెట్టింది.
తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో దిశ యాప్ పేరుతో జాకెట్ యాడ్స్ పండగ చేసింది జగన్ రెడ్డి సర్కార్. ఈ యాడ్స్ ఖర్చు తక్కువలో తక్కువ ఐదారు కోట్ల రూపాయల వరకూ ఉంటుందని చెబుతున్నారు. అంటే 50 లక్షల నుంచి కోటి రూపాయలతో తయారు చేసిన యాప్ ప్రచారం కోసం ఏకంగా ఐదారు కోట్ల రూపాయలు వ్యయం చేశారన్నమాట. బహుశా ఇలాంటి వింత సంఘటనలు ఏపీలో మాత్రమే సాధ్యమవుతాయనే విమర్శలు వస్తున్నాయి. దిశ యాప్ అనేది మహిళలకు రక్షణ కోసం ఉద్దేశించింది. ఇది ప్రజలకు..మహిళలకు పనికొచ్చేది కాబట్టి మీడియా కూడా సహజంగా ప్రచారం కల్పిస్తుంది. యాప్ కు విధిగా కవరేజ్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం చెప్పొచ్చు. కానీ ఏపీ సర్కార్ మాత్రం అడ్డగోలుగా యాడ్స్ ఇచ్చి ఖజానాను దుబారా చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.
గత కొన్ని నెలల తీరు చూస్తుంటే ఇలా నెలకు ఓ రెండు యాడ్స్ అయినా ఉండేలా పక్కాగా ప్లాన్ చేసినట్లే కన్పిస్తోంది. ఏదో ఒక కార్యక్రమం విడతల వారీగా నిర్వహించటం..విడత విడతకూ యాడ్స్ ఇవ్వటం ఏపీ సర్కారుకు నిత్య కార్యక్రమంగామారిందనే విమర్శలు వస్తు్ననాయి. మరో వైపు లక్షల రూపాయల దగ్గర నుంచి కోట్ల రూపాయల వరకూ సర్కారు పనులు చేసిన వారు బిల్లులు రాక నానా అవస్థలు పడుతున్నారు. స్వయంగా ఈ మధ్యే సర్కారు బిల్లులు చెల్లించేందుకు డబ్బులు లేవని కోర్టుకు తెలిపింది. అయినా సరే యాడ్స్ మాత్రం ఆపటం లేదు జగన్ రెడ్డి సర్కార్.
సీఎం జగన్, దిశ యాప్ యాడ్స్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మభ్యపెట్టేలా జగన్ చర్యలు ఉన్నాయని, మహిళలకు ఏపీలో రక్షణ లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. 'శవాలపై పేలాలు ఏరుకునేవారిని తలదన్నుతూ అత్యాచారాలపైనా కోట్లు దండుకుంటున్నారు జగన్‌రెడ్డి. తన ఇంటి పక్కనే గ్యాంగ్ రేప్ జరిగి 10 రోజులవుతున్నా నిందితుల్ని పట్టుకోని వైఎస్ జగన్ ప్రభుత్వం.. దిశ యాప్ డౌన్‌లోడ్ నెపంతో సొంతపత్రికకు కోట్ల రూపాయల ప్రకటనలిచ్చారు' అని లోకేశ్ విమర్శలు గుప్పించారు.
సొంత అక్కాచెల్లెళ్లు షర్మిల, సునీతలకే భద్రతలేక ఒకరు తెలంగాణలో, ఇంకొకరు పోలీసుల చుట్టూ తిరుగుతుంటే.. `అక్కచెల్లెమ్మల భద్రత-జగనన్న ప్రభుత్వ బాధ్యత` అంటూ ఎందుకీ కపట ప్రకటనలు జగన్‌రెడ్డీ? అని లోకేశ్ ప్రశ్నించారు.
'మీ ఇంటి పక్కనే గ్యాంగ్ రేప్ జరిగితే, నిందితుడూ మీ ఇంటిచుట్టూ తిరుగుతుంటే పట్టుకోలేని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రీ.. కరోనా బాధితుల డిమాండ్ల సాధనకు చంద్రబాబు చేపట్టిన దీక్షని పక్కదారి పట్టించేందుకు, 2020లో ఆమోదం పొందని దిశ చట్టం కోసం అప్పుడే ఆరంభించిన యాప్‌కే మరోసారి డౌన్ లోడ్ కార్యక్రమమా?' అని లోకేశ్ ప్రశ్నించారు.