తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. సీనియర్ నేత జంప్
posted on Jul 23, 2021 @ 1:07PM
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులుగా నేతల వలసలతో రాజకీయాలు వేడెక్కగా.. అత్యంత కీలకంగా మారిన హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ముందు బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సీనియర్ నేత కమలం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. రాజీనామా చేయడమే కాదు తెలంగాణ బీజేపీ పెద్దలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆ సీనియర్ నేత.
తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేశారు. ఏడాది క్రితమే ఆయన కమలం పార్టీలో చేరారు. కొన్ని రోజులుగా బీజేపీ కార్యక్రమాల్లో అంతగా పాల్గొనడం లేదు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన తన అసమ్మతిని బహిరంగంగానే చెబుతూ వస్తున్నారు. ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు కూడా చేశారు. తర్వాత ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన దళిత నేతల సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశాన్ని బీజేపీ బాయ్ కాట్ చేసినా.. పార్టీ ఆదేశాలను పట్టించుకోకుండా హాజరై షాకిచ్చారు మోత్కుపల్లి. అప్పటి నుంచే ఆయన పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా శుక్రవారం అధికారికంగా మోత్కుపల్లి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
రాజీనామా ప్రకటిస్తూ బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు నర్సింహులు. తన అనుభవానికి బీజేపీ లో గుర్తింపు లేదన్నారు. ఈటెల ను పార్టీలో చేర్చుకునే విషయం లో తనకు ఒక్క మాట కూడా చెప్పలేదని విమర్శించారు. ఈటెలకు వేల కోట్ల ఆస్తులు ఎక్కడివని మోత్కుపల్లి ప్రశ్నించారు. చూస్తే చాలా అమాయకంగా ఉంటాడు కాని రాజేందర్ అతిపెద్ద అవినీతి పరుడున్నారు దళిత భూములు వాపస్ ఇవ్వాలని బీజేపీ నేతలకు తాను గతంలోనే స్పష్టం చేశానని చెప్పారు. హుజురాబాద్ లో పోటీ చేసే అర్హత ఈటలకు లేదన్నారు మోత్కుపల్లి. తన ఆస్తులు పెంచుకోవడం తప్ప పేదలకు ఆయన చేసిందేమి లేదన్నారు.
బీజేపీని టార్గెట్ చేస్తూనే సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు మోత్కుపల్లి నర్సింహులు. దళిత సాధికారత గొప్ప నిర్ణయమన్నారు. కేసీఆర్ స్వయంగా నాకు ఫోన్ చేసి తనతో చర్చించారన్నారు. ఎన్టీఆర్ హయాంలో లో ప్రజలు ఎంత సంతోష పడ్డారో ఇప్పుడు.. ఈ దళిత సాధికారత వల్ల కూడా అంతే హ్యాపీగా ఉంటారని తెలిపారు. సీఎం కెసిఆర్ దళితులు తల ఎత్తుకునేలా చేస్తున్నారని చెప్పారు. ఒక్కో కుటుంబానికి 10 లక్షలు అంటే చాలా గొప్ప నిర్ణయమన్నారు మోత్కుపల్లి. ఏ సీఎం కు ఇంత దమ్ము లేదన్నారు. దళిత బంధును దళిత జాతి తరుపున స్వాగతిస్తున్నానని చెప్పారు. 2 వేల కోట్లు దళిత జాతి అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారని.. ఆర్థికంగా భారం అయినా కూడా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని మోత్కుపల్లి తెలిపారు. మొత్తం 70 లక్షల దళిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్నారు మోత్కుపల్లి.
బీజేపీకి రాజీనామా చేసిన మోత్కుపల్లి నర్సింహులు.. సీఎం కేసీఆర్ ను ఆకాశానికెత్తడంతో ఆయన అధికార పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. త్వరలోనే ఆయన కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో మోత్కుపల్లిని ఉపయోగించుకునేలా కేసీఆర్ స్కెచ్ వేస్తారని అంటున్నారు. మోత్కుపల్లికి కీలక పదవి ఇచ్చే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని అంటున్నారు.