వరదల్లో ఎమ్మెల్యే రెస్క్యూ ఆపరేషన్.. ఏం జరిగిందంటే...
posted on Jul 23, 2021 @ 3:01PM
తెలుగురాష్ట్రాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు. మరో రెండు రోజులూ వానలు ఇలానే కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు. ఎగువ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కుమ్మేస్తున్నాయి. పైనుంచి వదర వెల్లువెత్తుతోంది. ఇక్కడ కురిసిన వాన, పైనుంచి వస్తున్న వరద.. రెండూ కలిసి అనేక జిల్లాలను నిండా ముంచేశాయి. ఏపీకంటే తెలంగాణలో వాన, వరద ఉధృతి మరింత ఎక్కువగా ఉంది. తెలంగాణలో 16 జిల్లాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. పలు చోట్ల రెడ్, ఆరేంజ్ హెచ్చరికలు జారీ చేశారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం నిర్విరామంగా పని చేస్తోంది.
వరద సహాయక చర్యల్లో నేనుసైతమంటూ నీళ్లలో దిగారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఎల్లంపల్లి గేట్లు ఎత్తడం, సుందిళ్ల బ్యారేజ్ వల్ల నీరు ఒత్తిడిగి గురవడంతో.. గోదావరిఖని సమీపంలోని గంగానగర్‌కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. వరద చుట్టుముట్టడంతో లారీ యార్డులో ఉన్నలారీలు నీటిలో చిక్కుకపోయాయి. స్థానికులు కూడా వరద నీటిలోని ఉండిపోవడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సహాయక చర్యల్లో రామగుండం ఎమ్మెల్యే చందర్ పాల్గొన్నారు. వరదలో చిక్కుకుపోయిన ఓ చిన్నారిని భుజాన ఎత్తుకొని బయటకు తీసుకొచ్చారు.
ఎమ్మెల్యే సైతం సహాయక చర్యల్లో పాల్గొనడాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. అయితే, పక్కనే అంతమంది సిబ్బంది ఉండగా, ఆ పిల్లాడిని తానే భుజాన ఎత్తుకొని రావడం.. మీడియా కవరేజ్ కోసమేనని కొందరు పెదవి విరుస్తున్నారు. చేతనైతే వరద బాధితులకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.