ప్రవీణ్ కుమార్ పార్టీ ఖాయమే? హుజురాబాద్ లో వాళ్లకు గండమే?
posted on Jul 23, 2021 @ 11:26AM
తనకు ఇంకా అరేండ్ల సర్వీస్ ఉండగానే ఐపీఎస్ కు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన ప్రవీణ్ కుమార్ భవిష్యత్ కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రవీణ్ కుమార్ ఏం చేయబోతున్నారన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. స్వచ్ఛంద పదవి విరమణ చేశాకా ఆయన వేస్తున్న అడుగులను బట్టి సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలోనూ పలు ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రవీణ్ కుమార్ రాజకీయ అరంగ్రేటం చేస్తారనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలను ప్రవీణ్ కుమార్ ఖండించకపోవడంతో.. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే తెలుస్తోంది.
రాజకీయాల్లోకి వస్తే కొత్త పార్టీ పెడతారా లేక ఇప్పుడున్న పార్టీల్లోనూ ఏదో ఒక దాంట్లో చేరతారా అన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఆదేశాలతోనే ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసాడని కొందరంటే చెబుతున్నారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగడానికే తన ఐపిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారనే ప్రచారం జరిగినా... ఈ వాదనను ప్రవీణ్ కుమార్ కొట్టిపారేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో ఇటీవలే ఆయన చర్చలు జరిపారని, రాష్ట్రంలో బీఎస్పీని ఆయన లీడ్ చేయబోతున్నారని కొందరు చెబుతున్నారు. తాను ఏర్పాటు చేస్తున్న స్వేరోను రాజకీయ పార్టీగా మార్చే యోచనలో ప్రవీణ్ కుమార్ ఉన్నారని కూడా చర్చ సాగుతోంది.
తన రాజకీయ ప్రవేశంపై రకరకాల చర్చలు జరుగుతున్న సమయంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కొంత క్లారిటీ ఇచ్చారు. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తన రాజకీయ ప్రస్థానంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రవీణ్ కుమార్. బహుజనులే కేంద్ర బిందువుగా ఒక నూతన రాజకీయ పార్టీ ఏర్పడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బహుజనులకు న్యాయం జరగలేదని బహుజనులకు న్యాయం చేసేందుకే తాను బయటకు వచ్చానని ప్రవీణ్ కుమార్ అన్నారు. . కేవలం 1 శాతం మంది దగ్గరే సంపద నిక్షిప్తమై ఉందని ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూస్తున్న మిగిలిన 99 శాతం మంది బహుజనుల కోసమే తాను ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రాదల్చుకున్నట్టు చెప్పారు.
తన పొలిటికల్ ఎంట్రీ గురించి మరింత క్లారిటీ ఇస్తూ తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమే అని కానీ అదెప్పుడు జరుగుతుందో మాత్రం ఇప్పుడే చెప్పలేనని ప్రవీణ్ కుమార్ చెప్పారు.తనకింకా ఆరేళ్ల సర్వీస్ మిగిలి ఉన్నప్పటికీ దాన్ని వదులుకొని తాను రాజీనామా చేసానని ఈ సమయాన్ని వృధా చేయదల్చుకోవడం లేదని తెలిపారు. దళితులకు మూడెకరాలు పేదలకు ఇండ్లు ఇవి కాదు చేయాల్సిందని వారిని జీవితంలో ఉన్నత స్థితికి తీసుకురావడమే తన ముందున్న తదుపరి లక్ష్యమని ఆయన అన్నారు. ఇప్పటివరకు ఒక అధికారిగా తనకున్న పరిమితులకు లోబడి మాత్రమే పనిచేశానని ఇక ఇప్పుడు బహుజనుల అభ్యున్నతి కోసం ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నట్టు ప్రకటించారు.
సాంఘీక సంక్షేమ గురుకులాల్లో అన్యాయానికి అక్రమాలకు తావు లేదని ఒకవేళ తానెక్కడైనా అక్రమాలకు పాల్పడినట్టు రుజువైతే ఉరికంబం ఎక్కేందుకు కూడా తాను సిద్ధమే అని తెలిపారు ప్రవీణ్ కుమార్. తనను ఒకే పోస్టులో ఏడేండ్లు కొనసాగించారంటూ కొందరు చేస్తున్న ఆరోపణలను ఖండించారు ప్రవీణ్ కుమార్. గతంలో చాలా మంది ఇంత కంటే ఎక్కువ కాలం ఒకే పదవిలో ఉన్నారని చెప్పారు. రిటైర్ అయిన వాళ్లు కూడా ఏండ్లకు ఏండ్లకు కీలక పదవులు నిర్వహిస్తున్నారని ప్రవీణ్ కుమార్ చెప్పారు.
ప్రవీణ్ కుమార్ తాజా వ్యాఖ్యలను బట్టి ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఖాయమని తెలుస్తోంది. బహుజనులే కేంద్ర బిందువుగా పార్టీ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు కాబట్టి.. బడుగుల లక్ష్యంగానే పార్టీ ఏర్పాటు చేయవచ్చని సమాచారం. తనకు మద్దతుగా ఉన్న స్వేరో సభ్యుల సహకారంతోనే ఆయన ముందుకు వెళ్లవచ్చని అంటున్నారు. ఇక ప్రవీణ్ కుమార్ భవిష్యత్ అడుగులు త్వరలో జరగనున్న హుజురాబాద్ నియోజకవర్గంలోనూ ప్రభావితం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. హుజురాబాద్ లో దాదాపు 45 వేల దళిత ఓటర్లున్నారు. ప్రవీణ్ కుమార్ ప్రభావం వాళ్లపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ తలపెట్టిన దళిత బంధు స్కీమ్ పైనా ప్రవీణ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ప్రవీణ్ కుమార్ రాజకీయ అడుగులు ఏ పార్టీకి నష్టం కలిగించబోతుందన్నది ఆసక్తిగా మారింది.