జగన్ సర్కార్ కు ఎన్జీటీ షాక్.. ఏపీ రైతులకు గండమేనా?
posted on Jul 23, 2021 @ 2:04PM
కృష్ణా జలాల వివాదంలో ఆంధ్రప్రదేశ్ జగన్ రెడ్డి ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో మరోసారి చుక్కెదురయ్యింది. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రాజెక్టు పనులను పరిశీలించి రావాల్సిందిగా కృష్ణా బోర్డును ఎన్జీటీ ఆదేశించింది. ఆ తర్వాత దానిపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గవినోళ్ల శ్రీనివాస్ అనే రైతు, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్లను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం విచారించింది. జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ఎన్జీటీ బెంచ్‌లో ఈ విచారణ జరిగింది. ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం పనులు చేస్తోందని పిటిషనర్ వాదించారు. ప్రాజెక్టును సందర్శించి పనులను పరిశీలించి రావాలన్న ఎన్జీటీ ఆదేశాలపై కృష్ణా బోర్డు అఫిడవిట్ వేసింది. ప్రాజెక్టు సందర్శన కోసం ఏపీ తమకు సహకరించడం లేదని అందులో పేర్కొంది. కేంద్ర పర్యావరణ శాఖ నుంచి మాత్రం స్పందన రాలేదు.
ఇక తాము ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించనేలేదంటూ ధిక్కరణ పిటిషన్లకు ఏపీ సమాధానమిచ్చింది. ప్రాజెక్టు సమగ్ర నివేదికకు సంబంధించిన అధ్యయనాల పనులను మాత్రమే చేస్తున్నామని స్పష్టం చేసింది.
ప్రాజెక్టు సందర్శనకు పంపించాల్సిన అవసరం లేదని చెప్పిన ఏపీ ప్రభుత్వం.. తామే అక్కడి పరిస్థితులను వివరిస్తూ సమాధానం ఇస్తామని స్పష్టం చేసింది. అంతేకాదు డీపీఆర్ తయారీకి అధ్యయనం మాత్రమే చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం వివరించింది. కేంద్ర పర్యవరణ శాఖ, జలసంఘం అడిగిన అంశాలపై అధ్యయనం చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించడం లేదని, కాబట్టి ఎన్జీటీనే స్వయంగా వచ్చి ప్రాజెక్టును పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అందుకు హెలికాప్టర్ సహా అన్ని సదుపాయాలనూ తామే కల్పిస్తామని తెలిపింది. అన్ని పక్షాల వాదనలను విన్న ట్రైబ్యునల్.. ఏపీతో సంబంధం లేకుండా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కేఆర్‌ఎంబీకి ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా బోర్డు నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయని.. నిబంధనలు ఉల్లంఘించి పనులు జరుపుతారని భావించట్లేదని ఎన్జీటీ తెలిపింది. ఏపీ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్జీటీ హెచ్చరించింది. రాయలసీమ ఎత్తిపోతలపై తదుపరి విచారణను ఆగస్టు9కి ఎన్జీటీ వాయిదా వేసింది.