అధికార పార్టీ ఎమ్మెల్యేకు షాక్.. వర్షంలో 2 గంటల పాటు ఘోరావ్..
posted on Jul 23, 2021 @ 1:53PM
రాక రాక వచ్చిండు ఆ ఎమ్మెల్యే. రండి బాబు రండి.. అంటూ ఘన స్వాగతం పలకలేదు ఆ గ్రామ ప్రజలు. ఇన్నేళ్లకి ఇప్పుడు గుర్తొచ్చామా అంటూ నిలదీశారు. మా సమస్యలు ఇప్పటికిప్పుడే తీర్చాలంటూ పట్టుబట్టారు. ఓ వైపు జోరున వర్షం పడుతోంది.. అయినా, వదల్లేదు జనాలు. మా ఊరు సంగతి తేల్చాల్సిందేనంటూ దాదాపు 2 గంటల పాటు ఆ ఎమ్మెల్యేను చుట్టుముట్టి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.
భైంసా మండలంలో నీట మునిగిన గుండేగాం గ్రామాన్ని సందర్శించిన ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గత పదేళ్లుగా తమ గ్రామానికి శాశ్వత పరిష్కారం ఎందుకు చూపడం లేదంటూ ఎమ్మెల్యేపై గ్రామస్తులు విరుచుకుపడ్డారు. ఆర్ఆర్ ప్యాకేజీ ప్రకటించే వరకు ఊరు విడిచి వెళ్ళొద్దంటూ చుట్టుముట్టారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దంటూ వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో గుండేగాం నీట మునిగింది. ఈ ఘటనలో సుమారు 300 ఇళ్లు నీట మునిగాయి. గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు. పాపం.. ప్రజలను పరామర్శించి.. పరిస్థితిని పర్యవేక్షిద్దామని వెళ్లిన ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి ఇలాంటి చేదు అనుభవం ఎదురవడంతో.. వెనుదిరిగి వచ్చేశారు.