తెలంగాణపై రాహుల్ ట్వీట్.. రేవంత్‌కి ఫుల్ సపోర్ట్.. టచ్‌లో ఉంటా..!
posted on Jul 23, 2021 @ 2:04PM
తెలంగాణలో అతిభారీ వర్షాలు. నీట మునిగిన 16 జిల్లాలు. పలుచోట్ల రెడ్, ఆరేంజ్ హెచ్చరికలు. ఇంత వరద బీభత్సం కొనసాగుతున్నా.. ప్రధాని మోదీ ఇంకా స్పందించనే లేదు, ఆలోగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ మాత్రం తెలంగాణ ప్రజలు సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపిచ్చారు. రాహుల్‌గాంధీ ట్వీట్‌తో కాంగ్రెస్ కేడర్ రెస్క్యూ ఆపరేషన్స్‌లో తమవంతు సాయం చేస్తున్నారు.
పైపైన చూస్తే ఇది జస్ట్ వరద న్యూస్‌లానే ఉన్నా.. లోతుగా విశ్లేషిస్తే ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో భీకర వర్షాలు కురిసిన రోజే.. కేంద్ర ప్రభుత్వానికంటే వేగంగా రాహుల్‌గాంధీ స్పందించడాన్ని మామూలు విషయంగా చూడలేమంటున్నారు. ఆయన నుంచి ఇలాంటి ఇమ్మిడియేట్ రెస్పాన్స్ ఇంతకుముందెప్పుడూ చూడలేదు. పోనీ, ఆయనేమీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడూ కాదు. జస్ట్, కేరళ నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీ మాత్రమే. అయినా, తెలంగాణపై అంత ఫోకస్డ్‌గా ఉండటానికి కారణం.. రేవంత్‌రెడ్డే అంటున్నారు. రేవంత్ నాయకత్వం వల్లే రాహుల్ గాంధీకి తెలంగాణపై ఇంట్రెస్ట్ పెరిగిందని చెబుతున్నారు.
ప్రస్తుతం రాహుల్ కేవలం ఎంపీ మాత్రమే అయినా.. కాంగ్రెస్‌కు కాబోయే ప్రధాని అభ్యర్థి అనే విషయం అందరికీ తెలిసిందే. అధ్యక్షుడిగా లేకున్నా.. ఆయన కనుసన్నల్లోనే పార్టీ నడుస్తుందని అంటారు. ఉత్తరాది విషయం పక్కనపెడితే.. దక్షిణ భారతంలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రాగల అవకాశం అధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణనే అనేది రాహుల్ అంచనా. అందుకే, తెలంగాణను మరోసారి ఎలాగైనా చేజిక్కించుకోడానికి.. స్వయంగా రాహులే రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ పదవి కేటాయింపులోనూ రాహుల్ జోక్యం వల్లే రేవంత్‌రెడ్డికి పగ్గాలు దక్కాయని అంటారు. పీసీసీ కోసం పలువురు సీనియర్లు ఢిల్లీలో బాగా ఫైట్ చేశారు. సోనియా చెవిలో రేవంత్‌కు వ్యతిరేకంగా చాడీలు నూరిపోశారు. ఓ దశలో.. రేవంత్‌ను పీసీసీ చీఫ్ చేస్తే తమ దారి తాము చూసుకుంటామంటూ బ్లాక్ మెయిల్ కూడా చేశారంటారు. అందుకే, సోనియా కాస్త సందిగ్థంలో పడగా.. రాహుల్‌గాంధీ మాత్రం రేవంత్‌రెడ్డికి ఫుల్ సపోర్ట్‌గా నిలిచారని చెబుతారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించానని.. ప్రజల్లో రేవంత్‌రెడ్డికి ఉన్న ఇమేజ్‌ను కళ్లారా చూశానని.. ఆయన నాయకత్వ లక్షణాలు తనకు తెలుసని.. రేవంత్‌కు పీసీసీ పగ్గాలు అప్పగిస్తేనే.. తెలంగాణలో కాంగ్రెస్‌కు మనుగడ సాధ్యమంటూ రాహుల్‌గాంధీ సోనియాకు గట్టిగా చెప్పారట. దీంతో, రాహుల్ పర్సనల్ ఇంట్రెస్ట్ మేరకే.. సీనియర్లను కాదని మరీ, రేవంత్‌రెడ్డికి పీసీసీ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారని అంటారు.
ఇక, రేవంత్‌రెడ్డి ఎంట్రీతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం సాధ్యమని రాహుల్‌గాంధీ బలంగా నమ్ముతున్నారు. అందుకే, ఈ రాష్ట్రంపై ఆయన ప్రత్యేక దృష్టి సాధించారు. కాస్త గట్టిగా ట్రై చేస్తే.. ఈజీగా అధికారంలోకి రాగలమని విశ్వసిస్తున్నారు. అందుకే, తెలంగాణ విషయాల్లో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలని రాహుల్‌గాంధీ భావిస్తున్నారు. అందులో భాగంగానే, తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు కురవడంతో.. 16 జిల్లాలు నీట మునగాయనే న్యూస్ తెలిసి.. వెంటనే స్పందించారు. కేంద్ర ప్రభుత్వం కంటే ముందే రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ శ్రేణులను సహాయక చర్యల్లో పాల్గొనాలని మెసేజ్ ఇచ్చారు. తన వంతు ఎంకరేజ్ ఇస్తే.. ఇక మిగతా వ్యవహారమంతా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చూసుకుంటారని.. కాంగ్రెస్ ప్రాభవాన్ని మరింత పెంచుతారనే నమ్మకం రాహుల్‌గాంధీలో స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇక మీదటా తెలంగాణ విషయాలపై రాహుల్ స్పందన కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నారు.