రవి శంకర్ ఉద్వాసనకు అదేనా అసలు కారణం?
posted on Jul 23, 2021 @ 12:47PM
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన మంత్రి వర్గ విస్తరణ వ్యవహరం మొత్తం ఒకెత్తు అయితే, మంత్రి మండలి నుంచి 12 మందికి ఉద్వాసన పలకడం, అందులో న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్, కూడా ఉండడం ఒక్కటీ ఒకెత్తుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నిజమే, రవిశంకర్’ ప్రసాద్’తో పాటుగా ప్రభుత్వంలో పార్టీలో అంతే ప్రాధాన్యత ఉన్న ప్రకాష్ జవదేకర్, హర్ష వర్ధన్’కు కూడా మోడీ షా జోడీ బయటకు దారి చూపించారు.
జవదేకర్, హర్ష వర్ధన్ ఉద్వాసనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కొవిడ్ సెకండ్ వేవ్ కొంత కారణమని అనుకున్నా, పార్టీలో సీనియర్, ప్రధాని మోడీకి అత్యంత సన్నహితుడు అయిన రవిశంకర్ ప్రసాద్ ను అది కూడా.. అంత అన్సెర్మొనియస్ గా అవమానకరంగా ఎందుకు బయటకు పంపారు, ఆయన చేసిన నేరమేమిటి? అంటే, ఎవరికీ సమాధానం చిక్కడం లేదు. అందుకే ఆ చర్చ ఇప్పటికీ, పార్టీ వర్గాల్లో వినవస్తూనే ఉంది. అంతేకాదు ఆరోజు నుంచి ఈ రోజు వరకు రవి శంకర్ ప్రసాద్ కు ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా అప్పాయింట్మెంట్ కూడ దొరకలేదు. అంటే ఆయన ఉద్వాసనకు ఎదో బలమైన కారణమే ఉండి ఉంటుందని పార్టీ వర్గాలు గుసగుసలు పోతున్నాయి. అయితే ఆ బలమైన కారణం ఏమిటో మాత్రం ఎవరు చెప్పలేకుండా ఉన్నారు. అందుకే ప్రసాద్ ఉద్వాసనకు ట్విట్టర్ వివాదం కారణమని, అదనీ, ఇదనీ కథనాలు వస్తున్నాయి.
అయితే అందులో ఏదీ నిజం కాదు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రవి శంకర్ ప్రసాద్ ఉద్వాసనకు సీబీఐ చీఫ్ నియామక ప్రక్రియలో న్యాయశాఖ పరంగా జరిగిన తప్పిదాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఐటీ శాఖకు ఇందులో ప్రమేయం లేదు. వివరాలలోకి వెళితే, సీబీఐ చీఫ్ ఎన్నిక ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ సెక్షన్ 4 ఏ (1) ప్రకారం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం, ప్రధాని, పతిపక్ష నాయకుడు,లేదా ప్రతిపక్ష పార్టీల ప్రతినిథి, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య కమిటీ సీబీఐ చీఫ్’ ని మెజారిటీ అభిప్రాయం మేరకు ఎంపిక చేస్తుంది. ఈ సాంకేతిక అంశాలను అలా ఉంచి, అసలు విషయంలోకి వస్తే, ఈ సారి సీబీఐ చీఫ్ ఎంపిక న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మెడకు చుట్టుకొంది.సీబీఐ చీఫ్ ఎంపిక కోసం చాలా పెద్ద జాబితానే సిద్దం చేశారు. ఆ జాబితాలో ఉన్న 109 పేర్ల నుంచి న్యాయ శాఖ పది మంది పేర్లతో షార్ట్ లిస్టు సిద్ధం చేసి మే 25 కమిటీ ముందుంచింది. ఈ జాబితాలో గుజరాత్ క్యాడర్ కు చెందిన వై.సి.మోడీ,లేదా రాకేష్ ఆస్థానా సీబీఐ చీఫ్ అవుతారని అనుకున్నారు.ప్రధాని మోఢీ కూడా గుజరాత్ అధికారి వైసి మోడీ ను సీబీఐ చీఫ్ గా తీసుకు రావాలని భావించారు.అయితే , ఇక్కడే రవి ప్రసాద్ పదవికి ఉచ్చు బిగిసింది.
మే 25 జరిగిన భేటీలో ప్రధాని మోడీ,ప్రధాన ప్రతిపక్షం తరపున అధిర్ రాజన్ చౌదరి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి.రమణ సుమారు 90 నిముషాల పాటు భేటీ అయ్యారు.ఈ భేటీలో 6 నెలలు మాత్రమే సర్వీస్ ఉన్న అధికారులు ఈ పదవి ఎంపికకు అర్హులు కాదంటూ ప్రధానన్యాయ మూర్తి ప్రస్తావన తీసుకు రావడం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అధిర్ రాజన్ చౌదరి దానిని సమర్దించడంతో సమావేశంలో ప్రధాని మోడీ ఒంటరి అయ్యారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మూర్తి మరో జాబితా కోరడంతో అప్పటికప్పుడు మరో జాబితా ప్రధాన మంత్రి కార్యాలయం రూపొందించాల్సి వచ్చింది.ఈ నేపధ్యంలోనే మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన సుబోధ్ కుమార్ జైస్వాల్ ఎంపికకు ప్రధాని అయిష్టంగా ఆమోదించవలసి వచ్చింది. ఈ నేపద్యంలో 6 నెలల రిటైర్మెంట్ రూల్ తన దృష్టికి ఎందుకు తీసుకు రాలేదని ప్రధాని, రవిశంకర్ ప్రసాద్ ని ప్రశ్నించారు. ఆయన సమాధానం చెప్పలేక ఇరుక్కు పోయారు. ఆ పరిణామ పర్యవసానంగానే రవిశంకర్ ప్రసాద్ ఉద్యోగం ఉదిందని,విశ్వసనీయ వర్గాల సమాచారం.
రవిశంకర్ ప్రసాద్ తో పాటుగా ప్రకాష్ జవదేకర్, హర్ష వర్ధన సహా మరి కొందరి ఉద్వాసనకు పార్టీ అవసరాలు కారణమని, త్వరలోనే వారికీ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. అయినా, రవిశంకర్ ఉదంతం.. ఓ చిన్న తప్పు ఎంత పెద్ద ఉపద్రవానికి దారితీస్తుందనేదానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది.