ఉండేది రెండు రోజులు.. మరెందుకీ హంగామా! విశాఖ నుంచి పాలన ఉత్తదేనా?
posted on Jul 23, 2021 9:21AM
అమరావతి ఒక అవినీతి కథ అన్నాడు. విశాఖపట్నం రెడీమేడ్ రాజధాని అన్నాడు. హైదరాబాద్ ఎలాగో మనకు విశాఖ అలాగా అన్నాడు. హైకోర్టు బ్రేకులతో ఆగాడే తప్ప.. లేదంటే అక్కడికి వెళ్లడం కోసం క్షణక్షణం తహతహలాడుతున్నాడు. ముహూర్తాలు పెట్టుకోవడం.. మళ్లీ కుదరక వాయిదా వేసుకోవడం కామన్ అయిపోయింది. ఎంపీగా ఉన్న ఆయన సహచరుడు అయితే విశాఖకు ఆయన వచ్చి తీరతాడు.. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసి తీరతామంటూ తొడగొట్టి చెప్పినట్లే ఇప్పటికి పదిసార్లు చెప్పాడు. క్యాంప్ ఆఫీసు పేరుతోనైనా వచ్చి కూర్చుంటాడని.. అధికార పార్టీ నేతలే చెప్పారు.
మరి ఎన్నికల ముందు ఇక్కడే ఉంటానంటూ ఇల్లు కొనుక్కుని తాడేపల్లిలో సెటిల్ అయిన జగన్మోహన్ రెడ్డి.. దానినే ఆఫీసుగా నడిపిస్తున్నారు. ఏ మీటింగు అయినా దాదాపు అన్నీ అక్కడే జరుగుతున్నాయి. ఏ అధికారి కలవాలన్నా, ఏ ఎమ్మెల్యే, నేతలు కలవాలన్నా అక్కడే కలవడం. అటు వైసీపీ సెంట్రల్ ఆఫీసులోకి జగన్ అడుగు పెట్టరు.. ఇటు సచివాలయంలోని సీఎం ఆఫీసులోకి చాలా రేర్ గానే అడుగు పెడుతున్నారు. అంతా తాడేపల్లి నుంచే నడిపిస్తున్నారు. మరి రేపు విశాఖకు వెళ్లిపోతే ఇది కేవలం ఒక క్యాంప్ ఆఫీసుగానే మిగిలిపోతుంది. అలాంటి క్యాంప్ ఆఫీసు కోసం కాలవగట్టు మీద ... సార్ కోట పక్కనే ఉన్న పేదల వందలాది గుడిసెలను పీకేయడం దేనికి? ఇదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నారు కొందరు.
ఒక బాధితురాలు తనకు పరిహారం అందలేదంటూ పవన్ కల్యాణ్ ని కలవడంతోనే.. అరెస్టు చేసి స్టేషన్ లో పెట్టారు. ఆమెను అలా స్టేషన్ నుంచి వదిలిపెట్టి..అర్ధరాత్రి ఆమె ఇల్లు కూల్చేశారు. అలా మొత్తం క్లియర్ చేసేసుకుంటున్నారు. మరి సీఎం గారు విశాఖకు వెళ్లి పాలన చేసేటట్లయితే.. ఇక్కడ కేవలం క్యాంప్ ఆఫీసు మాత్రమే నడిచేటట్లయితే... ఇంత హంగామా దేనికి... ఆ కోట పరిధిని పెంచుకోవడం దేనికి? అక్కడుండే వారి ఉసురు పోసుకోవడడం దేనికి? ఇదే ఎవరికీ అర్ధం కావడం లేదు. మధ్యలో కొన్నాళ్లు స్లో అయిన ఆ పనులు ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకున్నాయి.
అంటే ఇప్పుడప్పుడే విశాఖకు వెళ్లడం కుదరదని ఫిక్స్ అయిపోయారా? లేక ఉండేది నెలకు రెండురోజులైనా సరే.. మన బెంగళూరు ప్రాసాదంలాగా.. ఇక్కడ కూడా అంతా మన చేతిలోనే ఉండాలి... ఉండేది నలుగురు మనుషులైనా సరే.. కోట లెక్క ఉండాలనే కోరికను తీర్చుకుంటున్నారా? లేక కాబోయే సీఎం అని చెప్పబడుతున్న భారతి మేడమ్ ఇక్కడే ఉండదల్చుకున్నారా? ఇలా రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి.
బహుశా మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇదే క్యాంప్ ఆఫీసును కట్టించి ఉంటే.. ఇక్కడ అడుగు కూడా పెట్టేవారు కాదేమో జగన్మోహన్ రెడ్డి. అప్పుడు కట్ట మీద ఉన్న పేదలకు ఈ ముప్పు కూడా వచ్చి ఉండేది కాదు. ఆయన కట్టాడని ప్రజావేదికను కూల్చేశారు... సెక్రటేరియట్ వాడటానికి ఇష్టపడటం లేదు..అసలు అమరావతిలోనే ఉండటానికే ఇబ్బంది పడుతున్నారు. పాతకాలం రాజుల కథల్లో ఇలాంటి మనస్తత్వాలను మనం చూశాం.. మళ్లీ ఇప్పుడే చూస్తున్నామని కొందరు కామెంట్ చేస్తున్నారు.