దళిత బంధు స్కీమా.. చాట్ల తవుడు స్కీమా..?
posted on Jul 23, 2021 @ 2:51PM
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో మాట్లాడుతున్నారా... లేక హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచి తీరాలన్న ఆరాటంలో తప్పులో కాలేస్తున్నారా.. అన్న అనుమానాలు టీఆర్ఎస్ నేతలను పట్టి పీడిస్తున్నాయి. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా భావిస్తున్న పాడి కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకున్న సందర్భంగా కేసీఆర్ మాట్లాడిన మాటలు ఆ పార్టీ నేతలను గందరగోళంలో పడేశాయి. ప్రజలే ఓట్లేస్తున్నరు.. మమ్మల్ని గెలిపిస్తున్నరు.. మేమేమన్న గుంజుకుంటున్నమా... అంటూ అమాయకంగా ప్రశ్నించిన కేసీఆర్... దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా చేపడతామని చెప్పడంతో.. వివిధ సామాజికవర్గాల తేనెతుట్టెను కదిలించినట్టయిందని ఆ పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారు. దళిత బంధు పథకం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంద మందిని ఎంపిక చేసి, ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయడం, వారి కుటుంబాల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటునందించడం ఈ పథకం లక్ష్యం. అయితే ఆ పథకానికి ఇంకా మార్గదర్శకాలు కూడా రూపొందించకముందే హుజూరాబాద్ లో దళితబంధు పైలట్ ప్రాజెక్టు చేపడతామని, అందుకు రూ. 2 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో వివిధ సామాజికవర్గాల మధ్య కుల పంచాయతీ మొదలయ్యే ప్రమాదం ఉందని టీఆర్ఎస్ నేతలంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
హుజూరాబాద్ లో సామాజికవర్గాలవారీ ఓటర్ల సంఖ్య సుమారుగా ఈ విధంగా ఉంది.
రెడ్లు - 22,600
మున్నూరు కాపు - 29,100
పద్మశాలి - 26,350
గౌడ - 24,200
ముదిరాజ్ - 23,220
యాదవ - - 22,150
మాల - 11,100
మాదిగ - 35,600
విశ్వబ్రాహ్మణులు - 10,500
ఎస్టీలు - 4,220
రజకులు - 7,600
మైనారిటీలు - 5,100
ఇతరులు - 1550
నాయీబ్రాహ్మణులు - 3,300
పైన పేర్కొన్న ప్రకారం దళితబంధును హుజూరాబాద్ లో తక్షణమే అమలు చేస్తే ఎస్సీల్లోని (మాలలు, మాదిగలు కలుపుకొని) 46 వేల పైబడ్డ ఓటర్లకు వర్తింపజేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి రూ. 10 లక్షల వంతున చూసుకుంటే రూ. 4,600 కోట్లు అవుతుంది. హుజూరాబాద్ నుంచే దళిత బంధు మొదలు పెడతానని కేసీఆర్ క్లారిటీ ఇవ్వడంతో ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కణ్నుంచి తెస్తారు.. మరోవైపు దళిత బంధు కింద హుజూరాబాద్ లో రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తామని కూడా చెప్పారు. అంటే దళితుల్లో కూడా అందరికీ ఇవ్వడం సాధ్యం కాదన్నమాట. ఒకవేళ ఆ రూ. 2 వేల కోట్లే అయినా కేవలం దళితులకే ఇస్తే మిగతావర్గాలవారు కేసీఆర్ కు ఎందుకు ఓటేస్తారు... ఒకే ఊళ్లో తమ పక్కనున్న వ్యక్తికి రూ. 10 లక్షలు ఇచ్చి తమకు మొండిచేయి చూపిస్తే మిగతా ప్రజలు కేసీఆర్ ను ఏవిధంగా తమవాడిగా చూస్తారని సొంతపార్టీ నేతలే లాజిక్ పాయింట్లు లాగుతున్నారు. ఈటల రాజేందర్ బీసీ కావడంతో పాటు ఈ మధ్య కాలంలో మన ఓటు మనకే అంటూ బీసీల నుంచి కొత్త నినాదం పుట్టుకొచ్చింది. ఆ విధంగా దళితుల్ని మినహాయిస్తే ఇతర బీసీ వర్గాల నుంచి 1,47,970 మంది ఓటర్లున్నారు. కాబట్టి ఒకేసారి ఇంత పెద్దఎత్తున జనాభా నుంచి వ్యతిరేకత వెల్లువెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ఒక్కరికి పెడితే మిగతావాళ్ల వ్యతిరేకతను ఏ విధంగా కేసీఆర్ ఎదుర్కొంటారని వారిలోవారే ప్రశ్నించుకుంటున్నారు.
మరోవైపు 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో దళితుల జనాభా 54 లక్షలకు పైగా నమోదైంది. అంటే సుమారు 10 లక్షల కుటుంబాలు ఉంటాయన్నమాట. దళిత బంధు పథకం కింద కుటుంబానికి 10 లక్షల చొప్పున వేసుకున్నా లక్ష కోట్లు అవుతుంది. అంటే దళితబందు పథకాన్ని దళితులందరికీ ఇవ్వడం కుదరదని కేసీఆర్ ప్రకటనే స్పష్టం చేస్తోంది. అందువల్ల ఈ పథకం కూడా దళిత కుటుంబాలకు 3 ఎకరాలు ఇస్తానన్న స్కీమ్ లాంటిదేనని టీఆర్ఎస్ దళిత నేతలే అంచనా వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కనీసం దళిత టీఆర్ఎస్ నేతలైనా హుజారాబాద్ ఓటర్లను ఏ విధంగా మెప్పిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.
మరో సమస్య ఏంటంటే... దళిత బంధు పథకాన్ని నియోజకవర్గానికి 100 కుటుంబాలకు ఇచ్చి మిగితా కుటుంబాలకు వర్తింపజేయకుంటే లబ్ధి పొందని దళిత కుటుంబాలతోపాటు మిగతా సామాజికవర్గాలు కూడా తీవ్రమైన టీఆర్ఎస్ వ్యతిరేక వర్గాలుగా మారిపోవడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ ఏటా వంద కుటుంబాలకు ఇచ్చుకుంటూ పోయినా వందేళ్ల సమయం పడుతుందంటున్నారు. మొత్తానికి కేసీఆర్ ఈ పథకాన్ని ఆపత్కాలంగా హుజూరాబాద్ ఎన్నికల్లో వాడుకొని ఆ తరువాత అటకెక్కించడం ఖాయమన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అందుకు ఉదాహరణగా గతేడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వరద బాధితులకు అందిస్తానన్న రూ. 10 వేల సాయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎన్నికలు అయ్యాక ఇప్పటికి కూడా ఆ రూ. 10 వేల సాయం అందకపోవడంపై గ్రేటర్ ప్రజల్లో టీఆర్ఎస్ మీద వ్యతిరేకత గూడు కట్టుకునే ఉందని.. హుజూరాబాద్ లో కూడా కేసీఆర్ సర్కారు అలాగే వ్యవహరిస్తుందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.