ఎమ్మెల్యే పదవికి రాజీనామా బలవంతమా? ఈటల భయపడ్డారా?
posted on Jul 22, 2021 @ 9:51PM
తెలంగాణ రాజకీయాలకు ప్రస్తుతం కేంద్రంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజా దీవెన యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ రోజుకో సంచలన ప్రకటన చేస్తూ కాక రేపుతున్నారు. కొన్ని రోజులుగా కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ సర్కార్ పై ఘాటు విమర్శలు చేస్తున్న ఈటల రాజేందర్.. గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల్లో చర్చకు తావిచ్చారు.
ఈటలను తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు కేసీఆర్. ఆయన నుంచి కనీసం వివరణ కూడా తీసుకోలేదు. కేసీఆర్ తీరుతో రాజేందర్ వెంటనే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారని అంతా భావించారు. కాని ఈటల మాత్రం చాలా సమయం తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత టీఆర్ఎస్ కు , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాని పార్టీకి గుడ్ బై చెప్పారు కాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ప్రకటన చేసిన 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు. ఆ సమయంలో వివిధ పార్టీలు, సంఘాల నేతలతో సమావేశమయ్యారు. తన అనుచరులతోనూ చర్చించారు. ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఆలస్యం కావడంతో.. ఆయన రాజీనామా చేయడం లేదనే ప్రచారం కూడా జరిగింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఈటలకు ఇష్టం లేదన్న కథనాలు కూడా బయటికి వచ్చాయి. చివరకి మాత్రం ఈటల రాజీనామా సమర్పించారు.
అయితే తాజాగా ఎమ్మెల్యే పదవికి ఈటవ రాజీనామాకు సంబంధించి కీలక అంశాలు బయటికి వస్తున్నాయి. ఈటల రాజేందరే సంచలన విషయాలు చెప్పారు. ఇల్లంతకుంట మండలంలోని మర్రివానిపల్లె సీతంపేట ప్రజలతో మాట్లాడిన ఈటల.. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ప్రశ్నించే వాళ్లు ఉండొద్దనే తనపై నిందలు వేసి బయటకు పంపించారని అన్నారు. తనంతట తానుగా.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని ఈటల వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తేనే.. తాను చేసినట్టు చెప్పారు. అంతేకాదు.. టీఆర్ఎస్ పార్టీని తాను వదలలేదని వదిలేలా వాళ్లే చేశారని చెప్పారు. అయినవాళ్లకు ఆకుల్లో.. కానివాళ్లకు కంచాల్లో పెట్టే కేసీఆర్.. నిజాయితీగా ఉన్నందుకు ప్రశ్నించినందుకే తనను బయటకు పంపించారని అన్నారు.
తన రాజీనామాకు సంబంధించి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవద్దని ఈటల ఎందుకు అనుకున్నారన్నది చర్చగా మారింది. ఉప ఎన్నికలో కేసీఆర్ వ్యూహాలను తట్టుకోలేమని తెలుసు కాబట్టే వద్దనుకున్నారా లేక మరేదైనా వ్యూహం ఉందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే పదవికి తనతో బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పడం వల్ల ఈటలలో గెలుపుపై పూర్తి ధీమా లేదని తెలుస్తుందని మరికొందరు చెబుతున్నారు. మొత్తానికి తన రాజీనామాపై ఈటల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.