ముందు విలీనం.. తర్వాత ఆస్తుల వేలం! ఆర్టీసీపై జగన్ బాటలోనే కేసీఆర్ స్కెచ్?
posted on Jul 23, 2021 @ 2:19PM
ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆర్థిక వ్యవహారాలు వింత విచిత్రంగా సాగుతున్నాయి. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకుంటున్నాయి. అందులో కొంత నిజముంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేసి మరీ ఉచిత పందారాలు సాగిస్తోంది. ఎంతవరకు నిజముందో ఏమో గానీ, ఏపీలో ఐదు ఓట్లున్న ప్రతి ఫ్యామిలీకి సంవత్సరానికి లక్ష రూపాయలకు తక్కువలేకుండా ఉచిత వరాల రూపంలో వచ్చి పడుతున్నాయని అంటున్నారు. తెలంగాణలోనూ అదే పరిస్థితి. అదలా ఉంటే ఉభయ రాష్ట్రాలు అందిన కాడికి అప్పులు చేసేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు. అప్పుల ఉబిలో కురుకు పోయాయి. ప్రతి తెలుగు వాడి నెత్తిన లక్ష నుంచి లక్షన్నర వరకు అప్పుందని ఆర్ధిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రభుత్వ భూములు, ఇతర ఆస్తులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. అదేమంటే కబ్జాల నుంచి కాపాడలేక పోతున్నామని సాకులు చుపుతున్నారు. అందుకే భూములు అమ్మేసి అలా వచ్చిన సొమ్ములను ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామని సమర్ధించుకోవడం జరుగుతోంది.ఇటీవలనే, తెలంగాణ ప్రభుత్వం కోకాపేట భూములను, బిట్లు బిట్లుగావేలం వేసి, కోట్లలో సొమ్ము చేసుకుంది. చిత్రం ఏమంటే అప్పులు, ఆస్తుల అమ్మకాలను తెలుగు ప్రభుత్వాలు ప్రధాన ఆదాయ వనరుగా చూస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు, ఆర్టీసీఆస్తుల మీద కన్నేసిందని తెలుస్తోంది. ఆర్టీసీ ఆస్తులను, భూములను అమ్మేసేందుకు పావులు కడుపుతోందని సమాచారం. ఇందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చూపిన మార్గంలో ముందుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకునే ప్రణాళిక సిద్దమవుతోందని అంటున్నారు. ఒక సారి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే.. భూములు, ఇతర ఆస్తుల విక్రయానికి యూనియన్ల నుంచి, ఉద్యోగుల నుంచి ఎలాంటి వ్యతిరేకత అడ్డంకులు రావని ప్రభుత్వం భావిస్తోందని బస్ భవన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి రూ.56 వేల కోట్లకు పైగా విలువచేసే ఆస్తులు, భూములు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రైమ్ ఏరియాల్లోనే పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. ఇప్పటికే సంస్థ ఆస్తుల లిస్ట్, ఇతర వివరాలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అందజేశారని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ ఆర్టీసీకి చాలా విలువైన భూములు, డిపోలు, రీజియన్, డివిజన్ కార్యాలయాలు. జోనల్ వర్క్ షాపులు , బస్ బాడీ యూనిట్, ఇంకా ఇతర కార్యాలయాలు,ఆసుపత్రులు, ప్రింటింగ్ ప్రెస్ ఇలా ప్రతి ఉమ్మడి జల్లాలో తక్కువలో తక్కువ వంద ఎకరాలకుపైనే భూములున్నాయి.అత్యధికంగా రంగారెడ్డిలో 250 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 194 ఎకరాల భూమి ఉంది. ఈ మొత్తం ఆస్తులు, భూముల విలువ సుమారు రూ.50 వేల కోట్లకు పైగా ఉంటుందని ప్రభుత్వఅంచనా. ఈ భుములు,ఆస్తులను అమ్మేసే, ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది
ఇటీవల వివిధ డిపార్ట్‌మెంట్ల ఆస్తుల వివరాలను సేకరించిన ప్రభుత్వం.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను, ఆస్తులను అమ్మేస్తోంది. ఇదే క్రమంలో ఆర్టీసీలోని ఆస్తులను అమ్మేందుకు స్పీడ్ బ్రేకర్ల అడ్డును తొలిగించే పని ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రైమ్ ఏరియాల్లో ఖాళీగా ఉన్న, అంతగా ఉపయోగం లేని భూములను ముందుగ అమ్మాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 29 డిపోలు ఉన్నాయి. వీటిలో తక్కువ బస్సులున్న డిపోలను మెర్జ్ చేస్తున్నారు. ఇటీవల పికెట్ డిపోను ఖాళీ చేసి, అందులోని బస్సులను దగ్గరలోని కంటోన్మెంట్, మియాపూర్, యాదగిరిగుట్ట డిపోలకు తరలించారు. భవిష్యత్‌లో మరికొన్నిడిపోలను కూడా మెర్జ్ చేసే చాన్స్ ఉంది. ఇలా డిపోల పరిధిలోని భూములను అమ్మడం లేదా లీజ్‌కు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల్లో ఆర్టీసీ పరిధిలో ఉన్న వందల ఎకరాల భూములను కూడా అమ్మేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఆస్తులకు ఎక్కాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.