హరీష్ దూకుడు.. కేటీఆర్ సైలెంట్! కేసీఆర్ ప్లాన్ ఎందుకు మారింది?
posted on Aug 6, 2021 @ 4:51PM
తెలంగాణ రాజకీయాలన్ని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగానే సాగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం ప్రభావం చూపుతుందని భావిస్తున్న ప్రధాన పార్టీలన్నీ ఎలాగైనా గెలవాలని ప్లాన్ చేస్తున్నాయి. హుజురాబాద్ లో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి కూడా హుజురాబాద్ ఉప ఎన్నిక చావో రేవో అన్నట్లుగా తయారైంది. ఈటలను ఓడించేందుకు అన్ని అస్త్రాలు బయటికి తీస్తున్నారు గులాబీ బాస్.
హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ దూకుడు పెంచినా.. ఓ విషయం మాత్రం రాజకీయ వర్గాలు, జనాల్లో చర్చగా మారింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ .. హుజురాబాద్ పై మాట్లాడకపోవడం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కేటీఆర్.. హుజురాబాద్ పై ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాని అందుకు భిన్నంగా ఆయన సైలెంటుగా ఉంటున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటుగా ఉన్నా .. ఆ నియోజకవర్గం వైపు కేటీఆర్ కన్నెత్తి చూడకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా అక్కడికి వెళ్లి గెలుపు బాధ్యతలు తీసుకోవాల్సిన మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కీలకమైన హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం అడుగుపెట్టకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
మెదక్ జిల్లా మంత్రి అయిన హరీష్ రావుకు హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పారు సీఎం కేసీఆర్.కొన్ని రోజులుగా ఆయన హుజురాబాద్ రాజకీయాలను నడిపిస్తున్నారు. నియోజకవర్గానికి వెళ్లకుండానే.. సిద్ధిపేట నుంచే కథ నడిపిస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన వివిధ వర్గాలతో సిద్ధిపేటలో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నాయి. తాయిలాలు ప్రకటిస్తున్నారు. అభివృద్ది పనుల కోసం నిధులు కేటాయిస్తున్నారు. హరీష్ రావు సమక్షంలోనే వివిఝ పార్టీల నుంచి కారు పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయి. ఈటల రాజేందర్ పైనా ఘాటు విమర్శలు చేస్తున్నారు హరీష్ రావు. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ మోడీ ఫొటోను ఎందుకు దాచిపెడుతున్నారంటూ ప్రశ్నించి కమలనాధులను డిఫెన్స్ లోకి నెట్టేశారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వం నుంచి అనేక ప్రయోజనాలు ఉంటాయంటూ వివిధ వర్గాలు వల వేస్తున్నారు హరీష్ రావు.
హరీష్ రావు దూకుడుగా వెళుతుండటం.. కేటీఆర్ అసలు మాట్లాడకపోవడం టీఆర్ఎస్ లోనూ చర్చనీయాంశమైంది. హుజూరాబాద్ లో గెలుపు అంత సులువు కాదు కాబట్టి ముందు జాగ్రత్తగా ట్రబుల్ షూటర్ అయిన హరీష్ రావును రంగంలోకి దించారని అంటున్నారు.హుజూరాబాద్ లో గెలిచే చాన్స్ లేదని..అందుకే హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారని.. ఓడిపోయినా నెపాన్ని హరీష్ రావు మీద నెట్టి కేటీఆర్ ను సేఫ్ చేసేలా రాజకీయాన్ని కేసీఆర్ చేస్తున్నారని అంటున్నారు. దుబ్బాక విషయంలోనూ ఇదే చర్చ జరిగింది. దుబ్బాక ఉప ఎన్నికలోనూ అంతా తానే వ్యవహరించారు హరీష్ రావు. బీజేపీ నుంచి గట్టి పోటీ ఉన్నా.. కేటీఆర్ అటు వైపు వెళ్లలేదు. బీజేపీ ప్రచారం కోసం కేంద్రమంత్రులు వచ్చినా... ఒక్క హరీష్ రావుపైనే భారం వేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీనే విజయం సాధించింది. ఆ ఫలితాన్ని ముందుగానే ఊహించిన కేటీఆర్.. అక్కడికి వెళ్లకుండా దూరంగా ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. దుబ్బాక ఓటమిని హరీష్ రావు ఖాతాలో వేసేందుకు అలా చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి.
ఇప్పుడు హుజారాబాద్ లోనూ దుబ్బాక సీనే రిపీట్ అవుతుందని అంటున్నారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గట్టి పట్టుంది. మంత్రివర్గం నుంచి తొలగించారనే సానుభూతి కూడా ఆయనపై జనాల నుంచి కన్పిస్తోంది. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ప్రజల నుంచి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ గెలవడం ఈజీ కాదనే నిర్ణయానికి వచ్చిన కేటీఆర్.. అక్కడికి వెళ్లకుండా తప్పించుకుంటున్నారనే విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. టీఆర్ఎస్ నేతలు కూడా అంతర్గత సంభాషణల్లో ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రగతిభవన్ వర్గాలు మాత్రం ఈటల వ్యవహారాల్నని తెలుసు కాబట్టే.. హరీష్ రావును కేసీఆర్ రంగంలోకి దింపారని అంటున్నారు. ఈటలను దెబ్బతీసే బాధ్యతలను హరీష్ సమర్థవంతంగా నిర్వహిస్తాడని ఈ స్కెచ్ గీశారని చెబుతున్నారు.