జగన్ కు బెయిల్ టెన్షన్! బీజేపీ జాతీయ నేత సంచలనం..
posted on Aug 7, 2021 @ 10:40AM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకాలం దోస్తులుగా ఉన్న బీజేపీ, వైసీపీ నేతల మధ్య ఒక్కసారిగా వార్ మొదలైంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. బీజేపీ గురించి మాట్లాడాలంటేనే భయపడిపోయిన వైసీపీ నేతలు.. తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తుందంటూ కాక రాజేస్తున్నారు. సీఎం జగన్ కూడా బీజేపీని టార్గెట్ చేయాలని మంత్రులను ఆదేశించడం ఆసక్తిగా మారింది. అసలు వైసీపీ, బీజేపీ మధ్య ఏం జరిగింది, ఏం జరగబోతోందనే చర్చ సాగుతోంది. బీజేపీ నేతల దూకుడు, వైసీపీ నేతల కలవరం చూస్తే.. సీఎం జగన్ సర్కార్ కు గండం పొంచి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్ జగన్ సర్కారుని కూల్చే కుట్రలు బీజేపీ చేస్తోందంటూ ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు కమలనాధులు సీరియస్ గా కౌంటర్లు ఇచ్చారు. దీనికి సంబంధించి ఓ దినపత్రికలో వచ్చిన వార్తను పోస్ట్ చేస్తూ.. ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ తీవ్రంగా మండిపడ్డారు. 'పేర్ని నాని గారు.. మీ ప్రభుత్వాన్ని మేం కూల్చనవసరం లేదు, ఆ ఆలోచన కూడా మాకులేదు. ఏ క్షణాన బెయిల్ రద్దవుతుందో తెలియక, రోజు గడవడానికి అప్పు పుట్టక, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి, అది చాలదన్నట్టు వేలకోట్ల రూపాయల అవినీతి చేసి మీ ప్రభుత్వానికి మీరే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారు' అని సునీల్ దేవధర్ ట్వీట్ చేశారు.
'కేంద్రం అప్పులు చేసినా కోట్ల మందికి ఉచితంగా రేషన్, వ్యాక్సిన్ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో మీకు పోలికేంటి? కేంద్రానికున్న ఆర్థిక స్తోమత, వెసులుబాటు మీ ప్రభుత్వానికున్నాయా? మీలా పప్పు బెల్లాలు పంచడానికి అప్పులు చేయడం లేదు. మేం దేశ ప్రతిష్ఠ పెంచుతుంటే మీరు రాష్ట్రాన్ని ముంచుతున్నారు' అని సునీల్ దేవధర్ తన ట్వీట్ లో ఘాటు విమర్శించారు.
ఆడలేక మద్దెల మీద పడి ఏడ్చినట్లుంది' మీ వ్యవహారం సీఎం గారు. అప్పులతో రాష్ట్రాన్ని ఈదలేక, కేంద్రంపై నిందలుమోపి ప్రజల దృష్టి మరల్చాలనుకుంటున్నారు. ఫెయిల్ అయిన టీడీపీ డ్రామా స్క్రిప్టును ఫాలో అవుతున్నారంటే ఫ్రస్ట్రేషన్ పీక్ లో ఉందని అర్ధమవుతోంది అంటూ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు ట్వీట్ చేశారు. తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఏపీ ప్రభుత్వానికి సంబంధించి కీలక పరిణామాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.