శరీరంలో యాంటీబాడీలు ఎన్ని నెలలు ఉంటాయో తెలుసా?
posted on Aug 7, 2021 @ 12:06PM
ఒకసారి కరోనా వస్తే మళ్లీ రాదనుకోవడం అపోహే. రెండుసార్లు కొవిడ్ బారిన పడిన కేసులు చాలానే చూస్తున్నాం. అయితే, ఒకసారి కరోనా వచ్చి తగ్గిపోయాక.. శరీరంలో యాంటీబాడీలు జనరేట్ అవుతాయి. అవి రెండోసారి కొవిడ్ సోకకుండా ఫైట్ చేస్తుంటాయి. వైరస్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ.. కొత్త వేరియంట్స్ పుట్టుకువస్తుండటమే సెకండ్ టైమ్ కరోనా రావడానికి కారణంగా కనిపిస్తోంది. అయితే, కరోనా వచ్చి పోయిన వారిలో యాంటీబాడీలు ఎంత కాలం పాటు ఉంటాయనే పరిశోధన జరిగింది. అందులో ఆసక్తికర విషయాలు తెలిశాయి.
కొవిడ్-19 నుంచి కోలుకున్నవారిలో యాంటీబాడీలు 7 నెలల తర్వాత కూడా స్థిరంగా కొనసాగుతున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. కొద్దిమందిలో క్రమక్రమంగా యాంటీబాడీలు తగ్గుతుంటే.. మరికొందరిలో మాత్రం నెలలు గడుస్తున్నా కొద్దీ అవి పెరుగుతుండటం మరింత ఆసక్తికరం. స్పెయిన్‌లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
గతేడాది మార్చి నుంచి అక్టోబరు మధ్య 578 మంది ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది నుంచి నాలుగు భిన్న సమయాల్లో రక్త నమూనాలు సేకరించి, పరిశీలించారు. కరోనాలోని ఆరు భిన్న భాగాలపై పనిచేసే ఐజీఏ, ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీల స్థాయిని కొలిచారు. కరోనాలోని న్యూక్లియోక్యాప్సిడ్‌ను లక్ష్యంగా చేసుకునే ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీలు మినహా.. మిగతా ఐజీజీ యాంటీబాడీలు స్థిరంగా కొన్ని నెలల పాటు కొనసాగినట్లు తేల్చారు. మరోవైపు.. జలుబు మూలంగా శరీరంలో ఏర్పడిన యాంటీబాడీలు సైతం కరోనాపై పోరాడుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. సో.. ఒక్కసారి కరోనా సోకిని వారు.. కొన్ని నెలల పాటు బిందాస్‌గా ఉండొచ్చన్న మాట.