ఏపీ అప్పులపై కేంద్రం నజర్.. ఏజీ ఎంట్రీతో అధికారులు హడల్
posted on Aug 7, 2021 @ 10:11AM
పరిమితికి మించిన అప్పులతో పీకల్లోతు కష్టాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. జగన్ సర్కార్ ఆర్థిక విధానాలతో రాష్ట్ర భవిష్యతే ప్రమాదంలో పడిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలన్న ప్రతి నెలా అప్పులు తేవాల్సిన పరిస్థితి ఉంది. అయినా రుణం దొరికే అవకాశం లేకపోవడంతో దొడ్డిదారిన నిధులు తెస్తోంది జగన్ రెడ్డి సర్కార్. కార్పొరేషన్ల పేరుతో అడ్డగోలుగా అప్పులు చేస్తోంది. ప్రభుత్వ ఆస్తులను తనాఖా పెడుతోంది. ఇలా అయితే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి పోయే పరిస్థితి ఉందని ఎకనమిస్టులు చెబుతున్నారు. ఏపీ పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతుండటంతో కేంద్రం కూడా రంగంలోకి దిగింది.నిబంధనలను తుంగలో తొక్కి.. జగన్ సర్కారు అడ్డదారుల్లో సాగిస్తున్న ఆర్థిక అక్రమాలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. తన అనుమతి లేకుండా రాష్ట్రప్రభుత్వం తెచ్చిన అప్పుల వివరాలు తెలుసుకోవడానికి అకౌంటెంట్ జనరల్‌ను రంగంలోకి దించింది.
రాష్ట్రంలో కార్పొరేషన్ల పేరుతో జరుగుతున్న ఆర్థిక అక్రమాలను నిగ్గుతేల్చేందుకు కేంద్రం తవ్వకాలు ప్రారంభించింది. రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అప్పులపై ప్రాథమిక స్థాయిలో వివరాలు సమర్పించాలని అకౌంటెంట్ జనరల్(ఏజీ)కు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఏజీ కార్యాలయ అధికారులు రాష్ట్ర అధికారులను సంప్రదించారు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రుణాలు.. ద్రవ్య నియంత్రణ-బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం పరిమితిని దాటి చేసిన అప్పుల వివరాలు అడిగారు.కేంద్రం రంగంలోకి దిగడంతో ఏపీ ఆర్థికశాఖ అధికారులు హడలిపోతున్నారు. ఇది ఎటొచ్చి ఎటువైపు దారి తీస్తుందోమోనన్న ఆందోళన చెందుతున్నారు.
కేంద్రానికి, ఆర్‌బీఐకి, ఏజీకి తెలియకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.లక్ష కోట్ల అప్పులు తెచ్చింది.ఉద్యోగుల వేతనాల నుంచి కోత విధించే జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ నిధులను కూడా వదలకుండా వాడుకుంది. ఈ రెండేళ్లలో దాదాపు రూ.18 వేల కోట్లను అవసరాలకు ఖర్చుచేసింది.రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వం బ్యాంకుల నుంచి రూ.32 వేల కోట్ల అప్పు తెచ్చింది. ధాన్యం సేకరణ, కొనుగోలు పేరు చెప్పి ఈ అప్పును రాష్ట్రం దాచే అ వకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎ్‌ఫసీ) నుంచి కూడా సుమారు రూ.16 వేల కోట్ల రుణాలు సేకరించారు. ఏపీఎ్‌సడీసీ నుంచి దొడ్డిదారిన తెచ్చిన రూ.21,500 కోట్లు, 5 శాతం వడ్డీ ఆశ చూపి విద్యాసంస్థల నుంచి ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మళ్లించిన రూ.3,000 కోట్లు, ఇవి కాకుండా రోడ్లు బాగుచేస్తామంటూ రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ నుంచి రూ.1,100 కోట్ల అప్పులు తెచ్చారు.
అక్రమ అప్పుల సమాచార సేకరణ కోసం.. కేవలం ప్రభుత్వ యంత్రాంగంపైనే ఆధారపడితే అసలు అక్రమాలు ఎప్పటికీ వెలుగులోకి రావని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం ఎప్పుడూ తన తప్పుల తీవ్రతను తగ్గించి చూపుతూ సమాచారమిస్తుందని గుర్తుచేస్తున్నారు. అయితే అప్పుల వివరాల సేకరణలో ఏజీ కార్యాలయం కేవలం రాష్ట్రం తీసుకున్న రుణాలకే పరిమితమవుతుందా? రాష్ట్రం బకాయిపడిన అప్పులను సైతం పరిగణనలోకి తీసుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ రెండేళ్ల నుంచి పెండింగ్ బిల్లులు రూ.లక్ష కోట్లు దాటాయి. ఇవన్నీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు, సప్లయర్స్, వెండర్లకు ఇవ్వాల్సిన బకాయిలు. డీఏల రూపంలో ఉద్యోగులకు రూ.15 వేల కోట్లు బాకీ పడ్డారు. ఇవి కూడా ప్రభుత్వం చెల్లించాల్సినవే. ఇవన్ని సేకరిస్తే మాత్రం జగన్ సర్కార్ చిక్కుల్లో పడినట్లే. కేంద్ర కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. అదే జరిగితే ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వం.. చేతులెత్తేయాల్సిన పరిస్థితులు రావచ్చు.