కేరళలో కరోనా కరాళ నృత్యం.. ఎందుకలా ?
posted on Aug 6, 2021 @ 2:47PM
కరోనా ఫస్ట్ వేవ్ దేశంలోని అన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. కానీ కేరళలో మాత్రం కరోనా మహమ్మారి ఆటలు సాగలేదు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం కరోనా కట్టడిలో గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. శభాష్ అనిపించుకుంది. దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేరళలో వామపక్ష కూటమి అనుసరించిన మోడల్ రోల్ మోడల్ గా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.
కానీ, అదే కేరళలో కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తోంది. పగపట్టిన పాములా బుస కొడుతోంది. దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసులలో సగానికి దగ్గరగా కేసులు ఒక్క కేరళ నుంచే రిపోర్ట్ అవుతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది, ఇంతలోనే ఇంత మార్పుకు కారణం ఏమిటి? అప్పుడున్న వామ వామపక్ష కూటమి ప్రభుత్వమే ఇప్పుడు కూడా ఉంది, అప్పుడు ఇప్పుడు కూడా పినరయి విజయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిజానికి గత మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో, ఆనవాయితీకి భిన్నగా లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం వరసగా రెండవ సారి అధికారంలోకి రావడంలో, కరోనా కట్టడి చప్పట్లు కూడా ఒక కారణమని,లెఫ్ట్ మేథావులు విశ్లేషించారు.
అలాంటిది ఇప్పుడు అదే రాష్ట్రంలో, అదే ప్రభుత్వం కరోనాను ఎందుకు కట్టడి చేయలేక పోతోంది? మిగిలిన దేశమంతా కలిపి ఎన్ని కేసులు నమోదవుతునన్నాయో, ఇంచుమించుగా అందుకు సమాన సఖ్యలో కరోనా కేసులు ఒక్క కేరళలోనే ఎందుకు నమోదవుతున్నాయి? అయితే, చిత్రంగా కేరళలో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా మహా ఉదృతికి, పినరయి ప్రభుత్వమే కారణమని అంటున్నారు. ఫస్ట్ వేవ్ సందర్భంగా ఆయన్ని ప్రశంసలలో ముంచెత్తిన మీడియానే ఇప్పుడ ఆయన ప్రభుత్వ నిర్వాకాన్ని తప్పు పడుతోంది. తాజాగా రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం కూడా అదే తేల్చింది.
కేరళలో ప్రస్తుతం కరోనా తీవత్రకు ప్రధాన కారణం కాంటాక్ట్-ట్రేసింగ్ లో వైఫ్యలమేనని కేంద్ర బృందం తేల్చింది. ఇళ్లల్లో ఐసోలేషన్ ఉంటున్న రోగులను ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షించడం లేదని తెలిపింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ఎవరైనా కరోనా బారిన పడితే 20 కాంటాక్ట్‌లను గుర్తించాలని కేంద్రం సూచించింది. కానీ కేరళలో కరోనా విజృంభిస్తున్నా.. ఒక్క రోగికి సంబంధించిన కనీసం అతడితో కాంటాక్ట్ ఉన్న ఇద్దరు వ్యక్తులను కూడా గుర్తించడం లేదని కేంద్ర బృందం తమ నివేదికలో అభిప్రాయపడింది.
మరోవైపు కేరళలో ప్రతి కరోనా మరణాన్ని లెక్కిస్తున్నప్పటికీ.. కొన్ని కేసుల్లో చనిపోయిన తర్వాతే కరోనా ఉందని గుర్తిస్తున్నారని తెలిపింది. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కి లేఖ రాశారు.కేరళ అనుభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వాలు, ప్రజలు అందరూ కూడా మహమ్మారి విషయంలో జాగ్రతగా ఉండాలని, ఏమాత్రం ఏమరపాటుకు గురయినా, కేరళ కథే అంతటా పునరావృతం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.