వామ్మో... ఇయర్‌ఫోన్స్ పేలి యువకుడు దుర్మరణం..
posted on Aug 7, 2021 @ 11:23AM
ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్ జమానా. రోజంతా ఫోన్‌తో ఏదో ఒక పని. మల్టీ టాస్కింగ్ పెరిగింది. గతంలోలా చెవి దగ్గర ఫోన్ పెట్టుకొని మాట్లాడుతుంటే మిగతా పనులకు ఇబ్బంది. గంటల తరబడి అలా మాట్లాడితే చేతి నొప్పి.. మెదడుపై రేడియేషన్ ప్రభావం అంటూ వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. అందుకే, ఇయర్‌ఫోన్స్‌ను విరివిగా వాడుతున్నారు. చెవిలో బడ్స్ పెట్టేసుకొని మాట్లాడుతున్నా, పాటలు వింటున్నా.. స్టైల్‌కు స్టైట్.. కంఫర్ట్‌కు కంఫర్ట్.
ఓ యువకుడు సైతం అప్పటి వరకూ అలానే చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఏమైందో ఏమోగాని సడెన్‌గా ఆ ఇయర్‌ఫోన్స్ పేలిపోయాయి. వెంటనే అతను స్పృహ తప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాకేశ్ చనిపోవడం కలకలం రేపుతోంది.
చెవిలో ఇయర్‌ఫోన్స్ పేలడంతో ఆ సౌండ్‌కు షాక్‌కు గురై.. బాధితుడికి గుండెపోటు వచ్చి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. ఇయర్‌ఫోన్స్ పేలడం.. వ్యక్తి చనిపోవడం.. దేశంలో దాదాపు ఇదే తొలిసారని అంటున్నారు. ఫోన్ పేలడం చూశాం కానీ, ఇయర్‌ఫోన్స్ పేలడానికి కారణమేంటో తెలీదంటున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపుర్ జిల్లా చౌమూలో జరిగింది. మృతుడు ఉదయ్‌పుర గ్రామానికి చెందిన రాకేశ్ నాగర్.