సోముకు సెండాఫ్! కన్నాకు కిరీటం!
posted on Aug 7, 2021 @ 1:35PM
సోము వీర్రాజు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు. పేరుకు బీజేపీనే అయినా.. ఫక్తు వైసీపీ నాయకుడిగా వ్యవహరిస్తారనే విమర్శ. పాలక వర్గానికి కొమ్ముకాస్తారనే ఆరోపణ. వైసీపీని వదిలేసి.. టీడీపీనే తప్పుబడతారనే ప్రచారం. జగనే.. సోమును ఆ స్థానంలో కూర్చోబెట్టారనే అనుమానం. వీర్రాజు అధ్యక్షతన జరిగిన తిరుపతి ఎంపీ ఉప ఉన్నికల్లో ఘోర పరాజయం. జనసేనతో జట్టుకట్టినా.. కనీసం డిపాజిట్ కూడా రాకపోవడం ఆయన అసమర్థతకు నిదర్శనమని అధిష్టానం ఆగ్రహం.
ఏపీలో ఆలయాలపై దాడులు జరుగుతున్నా.. మతమార్పిడులు జోరుగా సాగుతున్నా.. బీజేపీ తరఫు పోరాటం అంతంత మాత్రమేనంటున్నారు. అమరావతి విషయంలోనూ హ్యాండ్సప్ అన్నారు. ప్రభుత్వ అప్పులు, అడ్డగోలు నిర్ణయాలపైనా చేష్టలుడిగి చూస్తున్నారు. అందుకే, పార్టీ బలోపేతానికి సోము చేసిందేమీ లేదంటూ హైకమాండ్‌కు నివేదికలు వెళ్లాయని తెలుస్తోంది. వైసీపీతో ఆయన అంతలా అంటకాగుతుంటే.. ఏపీలో ఇక బీజేపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారనుందనే ఆందోళన పార్టీలో వ్యక్తం అవుతోందట.
ఇటీవల ఆర్ఎస్ఎస్ ఆదేశాలతో ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు కమలనాథులు. అందులో భాగంగా సోము వీర్రాజును అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. ఇందుకు ఎంతో కాలం పట్టదని.. వారం రోజుల్లోనే అధ్యక్ష మార్పు ఉంటుందని ఢిల్లీ నుంచి సమాచారం అందుతోంది. సోము ప్లేస్‌లో మళ్లీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణకే కిరీటం కట్టబెడతారని అంటున్నారు. ఏపీ వ్యూహంపై బీజేపీ పెద్దల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని అంటున్నారు. ఇటీవల ఆర్ఎస్ఎస్ పత్రి ది ఆర్గనైజర్‌లో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా పదునైన కథనం రావడం.. రఘురామకు సపోర్ట్ చేయడం.. చంద్రబాబుపై సాఫ్ట్‌కార్నర్ చూపించడం తెలిసిందే. ఏపీని క్రైస్తవ రాష్ట్రంగా మారుస్తున్న జగన్ ప్రభుత్వ తీరుపై సంఘ్ పరివార్ ఆగ్రహంగా ఉందని.. ఆ మేరకు జగన్‌కు యాంటీగా బీజేపీపై ఒత్తిడి పెంచిందని ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అక్కడ ఢిల్లీలో స్విచ్ వేస్తే.. ఇక్కడ సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌లో వేగంగా పరిణామాలు మారిపోతున్నాయని అంటున్నారు.
ఆర్ఎస్ఎస్ కన్నెర్రతో.. వైసీపీతో బీజేపీ చేస్తున్న రహస్య స్నేహానికి రాం రాం పలకనుందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబుతో జతకట్టేలా.. సంఘ్ పెద్దలు కమలనాథులపై ప్రెజర్ పెడుతున్నారని తెలుస్తోంది. అందుకే.. టీడీపీతో స్నేహానికి అడ్డుగా ఉన్న.. వైసీపీ శ్రేయోభిలాషి అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పక్కన పెట్టేస్తున్నారని అంటున్నారు. ఆ ప్లేస్‌లో ఒకప్పుడు టీడీపీ-బీజేపీ సఖ్యతకు చోదకుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను మళ్లీ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారని.. మరో వారం రోజుల్లో ఆ మేరకు కీలక రాజకీయ మార్పు జరగనుందని ఢిల్లీ వర్గాల సమాచారం.