లోకేశ్ అరెస్ట్‌కు జగన్ స్కెచ్ వేశారా? అదే జరిగితే పతనమేనా?
posted on Aug 6, 2021 @ 8:57PM
వరుసగా టీడీపీ వికెట్లను పడగొడుతున్నారు. అచ్చెన్నాయుడు నుంచి దేవినేని వరకు.. అరెస్టులతో బెంబేలెత్తిస్తున్నారు. జగన్‌కు వ్యతిరేకంగా వినిపించే ప్రతీ గొంతునూ జైల్లో వేసేస్తున్నారు. సొంతపార్టీ ఎంపీ రఘురమనూ వదలి పెట్టలేదు. ఓ లిస్టు రాసి పెట్టుకొని మరీ.. టేబుల్ మీద ఉంచుకున్నారట సీఎం జగన్. ప్రతీరోజూ చెక్ చేసుకుంటున్నారట. ఇంకా ఎవరు మిగిలారు? నెక్ట్స్ అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? ఇలా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చెక్ చేస్తున్నారని అంటున్నారు. ఆ లిస్ట్‌లో దేవినేని తర్వాత నెక్ట్స్ టార్గెట్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశా? టీడీపీ యువరాజును మూసేసేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నారా? మాజీ మంత్రి వ్యక్తం చేసిన ఆరోపణల్లో నిజమెంత? లోకేశ్‌ను అరెస్ట్ చేసేంత సాహసానికి సర్కారు తెగిస్తుందా? ఇలా అనేక ప్రశ్నలు. ఏపీలో రాజకీయ ప్రకంపణలు.
వేల కోట్ల అక్రమ సంపాదన కేసుల్లో ఏ1గా దాదాపు రెండేళ్ల పాటు జైల్లో ఉన్నారు జగన్. టీడీపీ వారంతా సచ్చీలురుగా సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతుండటాన్ని చూసి సహించలేకపోతున్నారని అంటున్నారు. అందుకే, ఒక్క రోజు.. కనీసం ఒకే ఒక్క రోజైనా తన రాజకీయ ప్రత్యర్థులను జైల్లో ఉంచాలనే పట్టుదలకు జగన్ పోతున్నారని అనుమానిస్తున్నారు. వరుసబెట్టి నోరున్న టీడీపీ నేతలను ఏదో ఒక కేసులో ఇరికించి.. బలవంతంగా బనాయించి.. కోర్టుల్లో ఆ కేసులు నిలబడవని తెలిసినా.. అరెస్టులకు తెగబడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ రాజకీయ కక్ష్య సాధింపులపై అంతా మండిపడుతున్నారు.
తనకు వ్యతిరేకంగా గొంతు వినిపిస్తే చాలు.. వారిని జైల్లో వేయకుంటే జగన్‌కు నిద్ర పట్టడం లేదంటున్నారు. అవసరం లేకున్నా.. అవకాశం చిక్కించుకుని మరీ.. కటకటాల వెనక్కి నెట్టి రాజకీయంగా కసి తీర్చుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్ వ్యవహారం ఇందుకు పరాకాష్ట. అక్రమ మైనింగ్‌ను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఉమాపై ఓవరాక్షన్ చేశారు వైసీపీ నాయకులు. బాధితుడైన ఉమాపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు మోపి.. జైల్లో మూసేయాలని చూశారు. హైకోర్టు తీర్పుతో బెయిల్‌పై వచ్చారు. విడుదల తర్వాత దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. "ప్రభుత్వం.. నారా లోకేశ్‌ను వచ్చే నెలలో అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు నేను అనుమానిస్తున్నాను" అంటూ దేవినేని సంచలన కామెంట్లు చేశారు. మాజీ మంత్రి ఉమా చేసిన ఆరోపణలు రాజకీయంగా ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. నిజమేనా? ఉమా అన్నట్టు నారా లోకేశ్ అరెస్ట్‌కు కుట్ర చేస్తున్నారా? వచ్చే నెలలోనే అరెస్ట్‌కు డేట్ ఫిక్స్ చేశారా? అంటూ చర్చ.. రచ్చ జరుగుతోంది.
జగన్ సర్కారు వైఫల్యాలు, అడ్డగోలు విధానాలపై దాదాపు ప్రతీరోజూ పోరాడే ఇద్దరు నేతల్లో ఒకరు నారా లోకేశ్. ఇంకొకరు ఎంపీ రఘురామ. నారా వారి మాటలు, ట్వీట్లు జగన్ ప్రభుత్వాన్ని కుళ్లబొడిచేలా ఉంటాయి. తూటాల్లాంటి మాటలు, పిడుగుల్లాంటి పంచ్‌లు, ఘాటు విమర్శలు, తొడపాశం పెట్టేలా సెటైర్లతో జగన్ పాలనను ప్రజాక్షేత్రంలో నిప్పులతో కడిగేస్తుంటారు నారా లోకేశ్. ఇంకా చెప్పాలంటే.. చంద్రబాబుకంటే నారా లోకేశే జగన్‌కు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతుంటారు. అందుకే, నారా లోకేశ్ నోరు మూయడానికి వైసీపీ పెద్దలు ఎప్పటి నుంచో స్కెచ్ వేస్తున్నారని అనుమానిస్తున్నారు. లోకేష్ టార్గెట్ గానే ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయనే వాదన పైకి తెచ్చారంటున్నారు. పైబర్ నెట్ లో స్కాం జరిగిందంటూ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఇప్పుడు ఆ కేసులోనే లోకేష్ ను అరెస్ట్ చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
నారా లోకేశ్ పై జగన్ రెడ్డి సర్కార్ చేస్తున్న కుట్రలకు సంబంధించి టీడీపీ దగ్గర పక్కా సమాచారం ఉందని.. ఆ విషయాన్నే దేవినేని ఉమా తాజాగా బయటపెట్టారని అంటున్నారు. అదే జరిగితే.. వచ్చే నెలలో లోకేశ్‌ను అరెస్ట్ చేస్తే..? ఇక ఏపీలో పెను ఉప్పనే.. ప్రజా ఉద్యమమే... ఆ సునామీలో జగన్ సర్కారు కొట్టుకుపోక తప్పదు...అంటున్నారు. ముందుముందు ఏం జరుగుతుందో చూడాలి...