ఏపీ కొంప ముంచుతున్న జగన్! అంతా ఆయన వల్లేనా?
posted on Aug 6, 2021 @ 2:47PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత మామూలుగా పెరగడం లేదు. ఓ రేంజ్ లో పెరుగుతోంది. ప్రముఖ జర్నలిస్టులు సైతం వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ వంటి ప్రాధాన్యత గల ప్రభుత్వ అవార్డులను తిరస్కరించారంటే వ్యతిరేకత ఏ రేంజ్ లో పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రజా సంక్షేమ పథకాల అమలు కోసం పలు శాఖల ఉద్యోగులను ఆకలితో చంపుతున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫస్టుకు పడాల్సిన వేతనాలు 15 వరకు వెళ్తున్నాయి. జగన్ పాలనతో ఏపీ భవిష్యత్ ఆగమ్యగోచరంగా తయారైందనే ఆవేదన కొన్ని వర్గాల నుంచి వస్తోంది.
ఏపీకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ పీకే (ప్రశాంత్ కిషోర్) మాటలు జగన్ వినడం వల్లేనన్న వ్యాఖ్యానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు ముందు నవరత్నాలు అనే కాన్సెప్టును ప్రొజెక్ట్ చేసి జగన్ ను విపరీతంగా ఆకాశానికెత్తిన పీకే మార్కు వ్యూహం కారణంగా ఇప్పుడు ఏపీ ఎన్నడూ లేనన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ధనిక రాష్ట్రమైన తెలంగాణే నిండా అప్పుల్లో మునుగుతుంటే అసలే కొత్త రాష్ట్రమైన ఏపీ పరిస్థితి అంతకన్నా దారుణంగా తయారై.. భవిష్యత్తేంటో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్లిపోయిందంటున్నారు. గత ఎన్నికలకు ముందే పీకే ప్రజల్ని ఆకర్షించే నవరత్నాలు అనే కాన్సెప్టును వైసీపీ శ్రేణుల ద్వారా ఎక్కించాడు. తాహతుకు మించిన ఉచిత హామీలతో ఓట్లనైతే రాబట్టారు గానీ.. కుండకు చిల్లు పడ్డట్టు ఖజానా మాత్రం ఖాళీ అయిపోయింది. ఎంతో ప్రెస్టీజ్ గా భావించిన ప్రవేశపెట్టిన ఆ నవరత్నాలే.. ఆంధ్రా ప్రజల నవనాడుల్లోని జవసత్వాలనూ లాగేస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
1) వైఎస్సార్ రైతు భరోసా, 2) ఫీ రీయింబర్స్ మెంట్, 3) ఆరోగ్యశ్రీ, 4) జలయజ్ఞం, 5) మద్యపాన నిషేధం, 6) అమ్మ ఒడి, 7) వైఎస్సార్ ఆసరా, 8) పేదలందరికీ ఇళ్లు, 9) పెన్షన్ల పెంపు. జగనన్న పథకాల్లో చాలావరకు కూడా ప్రజలకు అందించే ఉచిత వరాలే. వాటి ద్వారా ప్రభుత్వానికి అధికారమైతే వచ్చింది కానీ.. రాష్ట్ర నిర్వహణ మాత్రం అసాధ్యంగా మారింది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రెండో సంవత్సరం నుంచి ఏటా రూ. 12,500 చొప్పున మొత్తం రూ. 50 వేలు అందిస్తున్నారు. ఉచిత బోర్ వెల్స్, వడ్డీ లేని రుణాలు, కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు.. ఇలా అనేక హామీలు ఇచ్చారు. ఈ హామీ నిలుపుకోవాలంటే అప్పులు చేయడం తప్ప వేరే మార్గమే లేదు. వెయ్యి రూపాయలకు పైబడ్డ జబ్బులను ఆరోగ్య శ్రీలో చేర్చడం ప్రజాసంక్షేమ చర్యే అయినా... దాని నిర్వహణ గురించి ఏమాత్రం ఆలోచించకపోవడంతో అదే ఇప్పుడు గుదిబండలా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ మేధావీ వర్గాన్ని ఆకర్షించినా.. దాన్ని అమలు చేయలేక చేతులెత్తేస్తున్న వైనం కళ్లకు కడుతోంది. పలు బ్రాండ్ల లిక్కర్ ధరలు పెంచి మద్యపానాన్ని నిరుత్సాహపరచేందుకు చేసిన చర్యలేవీ సత్ఫలితాలివ్వలేదు. ఇతర రాష్ట్రాల నుంచి అడ్డదారుల్లో మద్యం ప్రవహించింది. దీంతో ఖజానాను దృష్టిలో ఉంచుకొని మళ్లీ ధరలు సవరించాల్సి వచ్చింది. వైఎస్సార్ ఆసరా, పేదలకు ఇళ్లు, పెన్షన్లు.. ఇలా ఏ పథకం తీసుకున్నా కూడా తాహతుకు మించిన వ్యయాన్ని డిమాండ్ చేస్తోంది.
ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు పథకాల అమలు కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ఫలితంగా అది కాస్తా వేతనాల మీద ప్రభావం చూపుతోంది. రాష్ట్రం ఇప్పుడు పదుల వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోతున్న దృశ్యం ఏపీ మేధావులను, ప్రజల్ని కలవరపరుస్తోంది. ఎన్నికల్లో గెలిచేందుకు పీకే ఐడియాలు తు.చ. తప్పకుండా పాటించిన జగన్.. మరి ఖజానా కళకళలాడాలంటే కనీసం ఒక్క ఐడియా కూడా ఎందుకని తీసుకోలేకపోయాడన్న సెటైర్లు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరి ఖజానా కోసం జగన్.. ఇప్పుడేం చేస్తారు... మరి జగన్... ఈ వైఫల్యాన్ని ఎలా సరిదిద్దుకుంటారో చూడాలి..