ఇంద్రవెల్లి వేదికగా రేవంత్ స్కెచ్ ? కారు, కమలం పార్టీల్లో టెన్షన్..
posted on Aug 7, 2021 @ 2:08PM
తెలంగాణ రాజకీయాలను హుజూరాబాద్ ఉపఎన్నిక ఎంతగా ఆకర్షిస్తుందో.. అంతకన్నా ఎక్కువే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆకర్షిస్తున్నారు. రేవంత్ పేలుస్తున్న మాటల తూటాలకు కేసీఆర్ పరివారం బిక్కచచ్చిపోతోందంటే అతిశయోక్తి లేదు. రేవంత్ ఏ రోజు ఏం మాట్లాడతాడు... ఏ శిబిరం నుంచి ఎవర్ని లాగుతాడు.. ఏ ఈక్వేషన్స్ లో బ్యాలెన్స్ ను తప్పిస్తాడు.. అనే సస్పెన్స్ దాదాపు ప్రతిరోజూ తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటోంది. ఇప్పుడు 9వ తేదీ కూడా ఆ కోవలోనే రాజకీయ నాయకుల్ని, పరిశీలకుల్ని ఆకర్షిస్తోంది.
ఈ నెల 9న రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో సభకు హాజరవుతున్నారు. గిరిజనులు, గిరిజన నాయకులతో భేటీ అవుతున్నారు. ఇదివరకే గత ఏప్రిల్ 20న అక్కడికి సమీపంలోని హీరాపూర్ సందర్శించి వచ్చిన రేవంత్... అక్కడ గూడెంలో హనుమాన్ టెంపుల్ నిర్మాణం కోసం రూ. 50 వేలు విరాళం ఇచ్చారు. ఆదివాసీ నాయకులు, యువకులతో రేవంత్ అప్పట్నుంచే టచ్ లోకి వెళ్లారు. ఆ సంబంధాలు మరింత పటిష్టం చేసుకోవడం మీద రేవంత్ కన్నేసారు. హుజూరాబాద్ ఎన్నిక దృష్ట్యా అమల్లోకి వచ్చిన దళితబంధు స్కీముకు సమాంతరంగా గిరిజన బంధు కోసం డిమాండ్ వినిపిస్తున్న తరుణంలో రేవంత్ 9వ తేదీన ఇంద్రవెల్లిలో పర్యటించడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిగ్గా మారింది.
దళితబంధుతో ఎస్సీలకు దగ్గరై హుజూరాబాద్ ఎన్నికను ఏకపక్షం చేయాలనుకున్న కేసీఆర్ ఎత్తుగడను చిత్తు చేసేందుకు రేవంత్ ఇంద్రవెల్లి నుంచి నరుక్కొచ్చేందుకు భారీ స్కెచ్ వేసినట్టు విశ్వసనీయ సమాచారం. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న కేసీఆర్ హామీ పట్టాలకెక్కలేదు. 50 శాతానికి మించరాదని సుప్రీం కోర్టు నిబంధన విధించింది. అయితే కులాలు, మతాలవారీ రిజర్వేషన్ లను ఎన్నికల వాగ్దానంగా మార్చుకున్న కేసీఆర్ కు.. తాజా ఉపఎన్నికల దరిమిలా... అదే వాగ్దానాన్ని రివర్స్ అయ్యేలా చూడాలని రేవంత్ ఆలోచిస్తున్నట్టు పక్కా సమాచారం. అందుకే ఇంద్రవెల్లి పర్యటనను టీఆర్ఎస్ నేతలు నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
అటు బీజేపీ నేతలు కూడా రేవంత్ కదలికలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆదిలాబాద్ జిల్లా నుంచి గత టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన రమేశ్ రాథోడ్... ఆ తరువాత బీజేపీలో చేరిపోయారు. అయితే రేవంత్ కు పీసీసీ పోస్టు అప్పుడే ఇచ్చి ఉంటే ఆయన కాంగ్రెస్ లోనే ఉండేవారన్న అభిప్రాయాలున్నాయి. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నా ఆయన క్రియాశీలంగా ఏమీ లేరన్నది లోకల్ టాక్. మరోవైపు సోయం బాపూరావుతో ఆయనకు పొసగడం లేదు. అందుకే ఆయన కాంగ్రెస్ కు జంప్ చేయడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అటు టీఆర్ఎస్ అధిష్టానం కూడా ఎవరెవరు రేవంత్ తో టచ్ లో ఉన్నారో ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా ఆరా తీస్తోంది. ఈ క్రమంలో రేవంత్ పర్యటన రోజు ఏయే నేతలు ఆ సభకు హాజరవుతారు.. కీలకమైన నేతల వెంట ఎవరుంటారు.. అసలు ఆ సమావేశానికి లోపాయికారీగా సహకరిస్తున్న స్థానిక నేతలెవరూ.. అనే విషయంలో ఇప్పటికే నిఘా పెట్టినట్లు సమాచారం.
అందుకే ఎలాంటి అభిప్రాయాలకు తావు లేకుండా.. ఇంద్రవెల్లికి ఎవరూ రావొద్దని, ఒకవేళ వస్తే తన అంచనాలు, వ్యూహాలు లీకై.. ఫలించకుండా పోతాయని రేవంత్.. ఆయా నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. మరి ఈ క్రమంలో రేవంత్ వెంట బీజేపీ నేతలు ఎవరు వెళ్తారు.. టీఆర్ఎస్ నేతలు ఎవరుంటారు.. అనేది బయట పడాలంటే కొద్ది గంటలు వేచి చూడక తప్పదు.