పులిచింతల పాపం ఎవరిది? జగన్ రెడ్డి మౌనానికి అర్ధమేంటీ?
posted on Aug 7, 2021 @ 11:46AM
అసలు సంగతి చూడమంటే.. కొసరు సంగతులు చెప్పమన్నాడంట వెనకటికి ఒకడు. గేటు ఎలా విరిగిపోయింది.. పెట్టినోడు ఎవడు.. అప్రూవ్ చేసినోడు ఎవడో చూడవయ్యా బాబూ అంటే.. అసలు చంద్రబాబు ఉన్నప్పుడు అంటూ చరిత్ర చెప్పుకొస్తున్నారు వైసీపీ నేతలు.. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి. ఏదొచ్చినా చంద్రబాబేనా.. అంటూ కౌంటర్లు పడుతున్నా సరే.. వైసీపీ నేతలు పాడిందే పాడుతున్నారు.
పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు వరద నీరు వదలగానే కొట్టుకుపోయింది. గేటును డ్యామ్ పిల్లర్ కు కనెక్ట్ చేసే గడ్డర్ విరిగిపోవడం వలనే గేటు ఊడిపోయింది. ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో గుంటూరు జిల్లాలో ఉన్న పులిచింతల ప్రాజెక్టు 16వ నంబర్ గేటు కొట్టుకుపోయిన ఘటన కృష్ణా, గుంటుూరు జిల్లాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇది విజయవాడ పై నీటి బాంబు గా నిపుణులు చెప్తున్నారు. గేట్ విషయం, ప్రాజెక్ట్ నాణ్యతపైనే సందేహాలు కలిగేలా చేస్తోంది. గేటు ఎలా విరిగింది, కొత్త గేటు ఎలా బిగించాలన్న దానిపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం.. ఆ పని వదిలేసి బాబును ఎలా ఇరికించాలా అన్న ప్రయత్నాలు చేస్తోంది. పనులు ఎప్పుడు మొదలయ్యాయే చెప్పకుండా.. కాంట్రాక్టర్ పేరుతో కొత్త డ్రామాలు ఆడుతోంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఢంలో భాగంగా 2004-05లో ఈ ప్రాజెక్టుకు బీజాలు వేశారు. అయితే నిధుల కొరత, భూసేకరణ వంటి సమస్యల కారణంగా దీని నిర్మాణం ఆలస్యంగా ప్రారంభమైంది. కృష్ణా, గుంటూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం 2013లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండగా పూర్తయ్యాయి. కాంట్రాక్ట్ ఇచ్చిన వైఎస్ హయాంలో.. క్వాలిటీ చెకింగ్ జరగలేదనుకోవాలి.. అలాగే ఓపెనింగ్ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి టైములోనైనా చెక్ చేసుకోవాలి. వీళ్లెవరూ సరిగా చెక్ చేయకపోబట్టే ఆ గేటు అలాగే కొనసాగింది.
పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1850 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. 2013 లోనే రికార్డ్ సమయం లో, కేవలం మూడు ఏళ్లలో పూర్తి అయిన పులిచింతల ప్రాజెక్టును అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరగడం, ఈ ప్రాజెక్టులో భారీగా నీటి నిల్వ చేస్తే తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలు మునుగుతాయన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అందుకే ఏపీలో అప్పటి టీడీపీ ప్రభుత్వం మాత్రం కేవలం 45 టీఎంసీల నీటి నిల్వకే ప్రాధాన్యమిచ్చింది.
చంద్రబాబునాయుడు హాయాంలో క్వాలిటీ లేదని రిపోర్టు వస్తే.. బిల్లులు ఆపితే.. కాంట్రాక్టర్ కోర్టుకు కూడా వెళ్లారు. దీంతో కోర్టు రూ.400 కోట్లు ఆ సంస్థ కు పరిహారంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు ప్రభుత్వం గాని.. రెండేళ్ల క్రితం వచ్చిన జగన్ ప్రభుత్వం గాని.. వాటిని సరి చేసే ప్రయత్నం చేయకపోవడం తప్పే. అది వదిలేసి.. చంద్రబాబు టైములోనే నివేదిక వచ్చింది.. చర్య తీసుకోలేదనడం.. మరి ఆ విషయం తెలిసిన మీరెందుకు చర్యలు తీసుకోలేదంటే సమాధానం లేదు. ఇప్పుడు చంద్రబాబు పేరెత్తకపోతే..టీడీపీ వాళ్లు రాజశేఖర్ రెడ్డి పేరు ఎత్తుతారు. అందుకే ముందే చంద్రబాబుపై ఎదురుదాడి చేస్తే..వారు డిఫెన్స్ లో పడి వివరణలు ఇఛ్చుకుంటూ ఉంటారు. ఈ లోపు గేటు పెట్టేయొచ్చు.. మన పని అయిపోతుంది.. ఇలా నడుస్తుంది వైసీపీ వ్యూహం. వరద ప్రవాహం ఎక్కువున్నట్లయితే.. దిగువన లోతట్టు ప్రాంతాలు మునిగిపోయేవి.. అప్పుడు ప్రాణనష్టం జరిగి ఉండేది.. అప్పుడు కూడా ఇలాగే సాకులు వెతుకుతూ ఉంటారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
పంటకు నీరు అందాలంటే ..కాంట్రాక్టర్ ఇంట పంట పండాలి..అలాగే కాంట్రాక్టు ఇచ్చినవారి ఇంటనూ పంట పండాల్సిందే.. ఈ కాన్సెప్ట్ నడిచినంత కాలం.. ఈ క్వాలిటీ కాకరకాయ అన్నీ గాలికి కొట్టుకుపోతూనే ఉంటాయి.. ఏదైనా జరిగితే .. ఈ అవినీతిని పట్టించుకోని జనం కూడా కొట్టుకుపోతారు.అంతర్ రాష్ట్ర సరిహద్దు కలిగిన పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపడిన నేపథ్యంలో ఇప్పుడు జగన్ సర్కార్ తీసుకోబోయే నిర్ణయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏ తప్పు జరిగినా చంద్రబాబు ఖాతా లో వేసి, మంచి మాత్రమే, తన ఖాతాలో మాత్రమే వేసుకునే జగన్ రెడ్డి ఈ ఒక్క విషయం పై మౌనం ఏలనో..