రైతు గెటప్‌లో సబ్ కలెక్టర్.. ఆ తర్వాత సీన్ సితార్..
posted on Aug 7, 2021 @ 2:08PM
ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి మామూలోడు కాదు. గళ్ల లుంగీ.. పాత చొక్కా వేసుకుని ఎరువుల దుకాణాలకు వెళ్లాడు. ఎవరో రైతు వచ్చాడనుకుని లైట్ తీసుకున్నారు షాపువాళ్లు. ఆ.. ఏం కావాలి? అంటూ అడిగారు. మనోడు తనకు కావాల్సిన లిస్ట్ చెప్పాడు. ఆ షాపు వాళ్లు.. వాళ్ల వాళ్ల రెగ్యులర్ స్టైల్‌లో ఆ రైతును డీల్ చేశారు. ఇక అంతే. కట్ చేస్తే.. సీన్ సితార. వచ్చినోడు రైతు కాదని.. రైతు గెటప్‌లో ఉన్న సబ్ కలెక్టర్ అని తెలిసి అంతా నోరెళ్ల బెట్టారు. శ్రీమంతుడు సినిమాలో మహేశ్‌బాబులా లుంగీ మీద వచ్చిన ఆయన.. యువ ఐఏఎస్.. విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్‌చంద్. ఈ సినిమాటిక్ సీన్ కృష్ణాజిల్లా కైకలూరు, ముదినేపల్లిలో జరిగింది.
విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్.. రైతు వేషంలో ఎంట్రీ ఇచ్చి అక్రమాలకు పాల్పడుతున్న ఎరువుల షాపు యాజమాన్యానికి చుక్కలు చూపించారు. మారు వేషంలో తిరిగి.. ఎరువుల దుకాణాల్లో జరుగుతున్న మోసాన్ని రట్టు చేశారు. మొదట కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లారు. అక్కడ ఓ దుకాణానికి వెళ్లి ఎరువులు కావాలని అడగ్గా.. స్టాక్ ఉన్నా లేవని చెప్పాడు యజమాని. అక్కడి నుంచి మరో షాప్‌కి వెళ్లారు. ఎరువులు కావాలని అడిగారు. ఎరువులైతే ఇచ్చాడు కానీ, ఎంఆర్‌పి ధర కన్నా ఎక్కువగా వసూలు చేశాడు. వసూలు చేసిన సొమ్ముకు బిల్లు కూడా ఇవ్వలేదు.
ఎరువుల షాపుల తీరుతో ఆగ్రహానికి గురైన సబ్ కలెక్టర్.. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి షాపు దగ్గరకు పిలిపించారు. స్టాక్ ఉన్నా లేదని చెప్పిన షాపుతో పాటు, అధిక ధర వసూలు చేసిన షాపునూ సీజ్ చేయించారు.
ఆ తర్వాత లొకేషన్ ఛేంజ్. కైకలూరు నుంచి అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపుల తనిఖీకి వెళ్లారు. అయితే, ముదినేపల్లిలో ఎరువుల షాపు మూసివేసి ఉంది. అక్కడే ఉన్న రైతులను ఎంక్వైరీ చేస్తే.. ఆ షాపు వాడు ఎంఆర్‌పి కన్నా అధిక ధరకు ఎరువులు అమ్ముతున్నాడని సబ్ కలెక్టర్‌కి రైతులు తెలిపారు. దీంతో.. యజమానిని పిలిపించి.. ఎరువుల షాపుపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్. అఫీసర్ అంటే ఇలా ఉండాలి కదా.. సినిమాల్లో మాత్రమే ఇలాంటి సీన్స్ చూస్తుంటాం.. రియల్ లైఫ్‌లోనూ హీరోలా యాక్షన్‌కు దిగిన విజయవాడ సబ్ కలెక్టర్‌ను అంతా అభినందిస్తున్నారు. శభాష్.. సూర్యసాయి ప్రవీణ్ చంద్.