జగన్ ప్రభుత్వం కూలిపోనుందా? వైసీపీలో కలవరం అందుకేనా?
posted on Aug 6, 2021 @ 9:52PM
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయా? వైసీపీ సర్కార్ త్వరలో కూలిపోబోతోందా? బీజేపీతో జగన్ రెడ్డికి లింక్ కటైందా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. కొన్ని రోజులుగా ఢిల్లీలో, ఏపీలో జరుగుతున్న పరిణామాలు అందుకు బలాన్నిస్తున్నాయి. నర్సాపురం ఎంపీ రఘురామ రాజు ఎపిసోడ్, జగన్ బెయిల్ రద్దు కేసు అన్నింటిల్లోనూ కీలక పరిణామాలు జరుగుతున్నాయి. జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ వైఖరిలో సడెన్ గా మార్పు రావడం, ఆగస్టు 25న తీర్పు రానుండటం ఉత్కంఠగా మారింది. ఆరెస్సెస్ పత్రిక ఆర్గనైజన్ లో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కథనాలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వ విధానాలపై అందులో తూర్పారాబట్టారు.
ఏపీ బీజేపీ నేతల తీరు కూడా గతంలో కంటే మారింది. జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు కమలం నేతలు. ముఖ్యంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు సిద్ధమవడం బీజేపీ ఆగ్రహానికి కారణమైంది. విగ్రహం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రస్తుతానికి వివాదం ముగిసింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతల స్వరంలోనే మార్పు కనిపిస్తోంది. ఇంతకాలం బీజేపీ జోలికి వెళ్లని వైసీపీ నేతలు.. ఇప్పుడు మాత్రం కమలనాధులను కార్నర్ చేస్తున్నారు. బీజేపీ నేతలపై మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చాలని, కాషాయ కండువా కప్పుకున్న వాళ్ళు సీఎం కావాలని అనుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై కేంద్రం ఎలా మాట్లాడుతుందని నాని నిలదీశారు. కేంద్రం అప్పులు చేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలోనూ బీజేపీ టార్గెట్ గా సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. కొంత మంది మంత్రుల వ్యవహరశైలిపై జగన్ సీరియస్‌గా అయ్యారని చెబుతున్నారు. టీడీపీ, బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అని ప్రశ్నించారని చెబుతున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని సీఎం నిలదీసినట్లు సమాచారం.
కేబినెట్ సమావేశంలో ఇద్దరు బీజేపీ నేతల పేర్లను సీఎం జగన్ ప్రస్తావించారని తెలుస్తోంది. బీజేపీ నేతల మాటలకు కౌంటర్ ఇవ్వాలని మంత్రులకు జగన్ ఆదేశించారని సమాచారం. పులిచింతల ప్రాజెక్ట్ గేటు విరిగిపోతే ప్రతిపక్షం విమర్శలు చేస్తోందని, దాని మంత్రులు ఎందుకు కౌంటర్ వ్యాఖ్యలు చేయడం లేదని, ఇలా అయితే టీడీపీ నేతల తప్పుడు వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్తాయని, కౌంటర్‌గా మంత్రులు ఎందుకు స్పందించలేకపోతున్నారని సీఎం మంత్రులను నిలదీశారని చెబుతున్నారు. పద్దతి మార్చుకోవాలని మంత్రులుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ముగ్గురు మంత్రులను జగన్ అడిగారని, ఇక నుంచి ప్రతి అంశాన్ని పరిశీలిస్తానని మంత్రులతో జగన్ అన్నారని చెబుతున్నారు.
కేబినెట్ సమావేశంలో బీజేపీని టార్గెట్ చేయాలని మంత్రులను జగన్ ఆదేశించడం, వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని పేర్ని నాని ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారాయి. అదే సమయంలో ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ సర్కార్ కు కొరకరాని కొయ్యగా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఢిల్లీలో శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ రాజు వేసిన పిటిషన్ పైనే ఆగస్టు 25న తీర్పు రాబోతోంది. వరుసగా జరుగుతున్న ఘటనలతో బీజేపీతో వైసీపీకి సంబంధాలు తెగిపోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో ఏదో జరుగబోతుందన్న సంకేతాలు వస్తున్నాయి. జగన్ రెడ్డి సర్కార్ కు గండం ఉందనే చర్చే రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది.