దళిత బంధు అమలు అనుమానమే?
posted on Aug 6, 2021 @ 7:22PM
అనుకున్నదొకటి .. అయినది ఇంకొకటి,, అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, దళిత బంధు పథకాన్ని ముందుగా అనుకున్నట్లుగా హుజురాబాద్ లో కాకుండా, తమ దత్తత గ్రామం వాసాలమర్రి నుంచి ప్రారంభించారు. ఆగష్టు 16 న హుజురాబాద్ లో ఘనంగా పథకం ప్రారంభించి ఉపఎన్నికలో కీలక దళిత ఓటును, గంపగుత్తగా కారు డిక్కీలోకి ఎక్కించేందుకు పక్కా ప్లాన్ సిద్దం చేసుకున్నారు. అయినా తానొకటి తలిస్తే ఈసీ ఇంకొకటి తలవడంతో కథ అడ్డం తిరిగింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆగష్టు 15 కంటే ముందే ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తుందనే ఉప్పందడంతో, ముఖ్యమంత్రి కేసీఆర్, మూడు రోజుల క్రితం (ఆగష్టు 4న) వాసాలమర్రిలో వాలిపోయారు. దళితులకు ప్రత్యేకం అన్నట్లుగా సుమారు మూడు గంటలకు పైగా, దళితుల ఇళ్లు వాకిళ్లు చుట్టేశారు. అదే సమయంలో అక్కడికక్కడే, నోటిమాట గానే గ్రామమలోని 76 దళిత కుటుంబాలకు, కుటుంబానికి రూ.10 లక్షల వంతున దళిత బంధు పథకం మంజూరు చేశారు. అక్కడితో పథకం ప్రారంభమై పోయినట్లే అని ప్రకటించారు. ఆ తర్వాతనే ఉత్తర్వులు, కలెక్టర్ ఎకౌంటులోకి క్యాష్ ట్రాన్స్ఫర్ వంటి ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. ముఖ్యమంతి నిజంగానే, కేంద్ర ఎన్నికల సంఘం రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుందనే అనుకుంటున్నారా, అందుకే పథకం ప్రారంభానికి ఎన్నికల కోడ్ అడ్డం రాకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి ఆగమేఘాల మీద పథకాన్ని వాసాలమర్రి నుంచి లాంచనంగా ప్రారంభించారా? లేక ఇందులోనూ ఏదైనా మతలబు ఉందా అంటే ఉందనే అంటున్నారు.
నిజానికి, ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించి కసరత్తు అయితే ప్రారంభించింది కానీ, ఫలానా తేదీ లోగా ప్రక్రియ పూర్తి చేయాలనే ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్న సమాచారం అయితే లేదు. ఉప ఎన్నికలు అంటే ఎదో ఒకటి అరా నియోజక వర్గాలకు కాదు, దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరప వలసి వుంది. మరో వంక కరోనా పరిస్థితి ఒక్కొక రాష్ట్రంలో ఒక్కొక విధంగా వుంది. థర్డ్ వేవ్ తలుపు తడుతోంది, ఇలాంటి పరిస్థితిలో, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం, నో’ చెప్పిన తర్వాత కేంద్ర ఎన్నిక సంఘం ఉప ఎన్నిక ముహూర్తం ఖరారు చేస్తుందా అనే అనుమానం అందరిలోనూ ఉంది. అలాగే, నేడో రేపో నోటిఫికేషన్ విడుదల చేస్తుందనే విషయంలోనూస్పష్టత లేదు. అదీ గాక ఆగష్టు 13 వరకు పార్లమెంట్ సమావేశాలున్నాయి. ఆతర్వాత ఆగష్టు 16 నుంచి, పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ప్రవర్తించిన తీరును ఎండ గట్టేందుకు కేంద్ర మంత్రులు దేశ వ్యాప్త రాజకీయ పర్యటనలకు బయులు దేరుతున్నారు. ఈ పరిస్థితులలో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుందని అనుకోలేమని అంటున్నారు.
దళిత బంధు పథకానికి విపక్షాలు మోకాలు అడ్డుతాయని ముఖ్యమంత్రి ఆశ పడ్డారు. అయితే విపక్షాలు అడ్డు పడలేదు సరి కాదా ఏరా తివాసీ స్వాగతం పలుకుతున్నాయి. ఒక్క హుజురాబాద్ లో మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం ఒకేసారి పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. దీంతో ఈరోజు కాకపోయినా రేపైనా ఇది తలకు చుట్టుకునే వ్యవహారంగా కనిపించడంతో ఎదో ఒక వంకన పథకానికి బ్రేక్ వేసే ఆలోచనతోనే కేసీఆర్ కొత్త ఎత్తు వేసారని అంటున్నారు. కేసీఆర్ మనస్సులో ఏముందో ఏమో గానీ, హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబందించినంతవరకు అధికార పార్టీ వేస్తున్న పిల్లి మొగ్గలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయనేది మాత్రం నిజం. అందుకే సామాన్య ప్రజలకు, ముఖ్యంగా దళితులకు దళిత బంధు పథకం అమలవుతుందన్న విశ్వాసం ఏర్పడలేదు. ఏదో విధంగా ఉప ఎన్నికల పబ్బం గడుపుకుని, ఆ తర్వాత మూడు ఎకరాల భూమి ఖాతాలో కలిపెస్తారన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల మొదలు ఇదిగో అదిగో అంటూ ఉద్యోగ నియమకాల, నిరుద్యోగ భ్రుతి దస్త్రాలను పక్కకు పెట్టిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అలాగే, అనేక సందర్భాలలో ఇచ్చిన హమీలను ఇంచక్కా మడత పెట్టిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. దళిత బంధు కూడా అదే జాబితాలో చేరుతుందనే అనుమానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.