ముఖ్యమంత్రిపై మర్డర్ అటెంప్ట్.. త్రిపుర షేక్.. బీజేపీ షాక్..
posted on Aug 7, 2021 @ 2:17PM
ఆయనో రాష్ట్ర ముఖ్యమంత్రి. చుట్టూ ఫుల్ సెక్యూరిటీ. నిత్యం మందీమార్బలం. రెప్ప వేయకుండా ఆయన్ను కాపు కాస్తుంటారు బాడీగార్డ్స్. అలాంటి సీఎంపైనే మర్డర్ అటెంప్ట్ జరగడం మామూలు విషయమా? ఆ ముఖ్యమంత్రి అలర్ట్‌గా ఉన్నారు కాబట్టి సరిపోయింది.. లేదంటే ఎంత ఘోరం జరిగిపోయి ఉండేది? అందుకే, త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్‌పై జరిగిన హత్యాయత్నంతో యావత్ దేశం ఉలిక్కిపడుతోంది. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్‌పై హత్యాయత్నం జరిగింది. ఆయనను కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించగా.. సీఎం అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. బిప్లవ్ దేవ్ గురువారం సాయంత్రం వాకింగ్ చేసేందుకు బయటకు వచ్చారు. అధికారిక నివాసానికి సమీపంలో సీఎం వాకింగ్ చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు కారు నడుపుకొంటూ భద్రతా వలయంలోకి దూసుకొచ్చారు. వాహనాన్ని గమనించిన ముఖ్యమంత్రి.. వెంటనే పక్కకు జరగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సీఎం భద్రతాసిబ్బంది ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. కారును ఆపేందుకు సెక్యూరిటీ ప్రయత్నించినప్పటికీ వారు పరారీ అయ్యారు.
సీఎం బిప్లవ్ దేవ్‌పై జరిగిన మర్డర్ అటెంప్ట్‌తో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే నాకాబంధీ నిర్వహించారు. అదేరోజు అర్ధరాత్రి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సీఎంపై దాడికి ఎందుకు ప్రయత్నించారనేది ఇంకా తెలియరాలేదు. దర్యాప్తు వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు త్రిపుర పోలీసులు.