అక్క‌డ గొడుగు.. ఇక్క‌డ బెదిరింపు.. జ‌గ‌న్ పాల‌న‌లో ఏపీ అథోగ‌తి!

రెండేళ్లుగా ఏపీకి పెట్టుబ‌డులే రావ‌ట్లేదు. రాష్ట్రంలో ఒక్క ప్ర‌ముఖ కంపెనీ కూడా ఏర్పాటు కావ‌ట్లేదు. ఏపీకి ఏమైంది? పెట్టుబ‌డిదారులు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఉన్న కంపెనీలే రాష్ట్ర ప్ర‌భుత్వానికి భ‌య‌ప‌డి ప‌రిపోయే దుస్థితి! ఇక కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏం ఆశిస్తాం! అదే స‌మ‌యంలో తెలంగాణ‌కు మాత్రం వ‌రుస‌బెట్టి కంపెనీలు క్యూ క‌డుతున్నాయి. వేల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చి ప‌డుతున్నాయి. రెండు తెలుగురాష్ట్రాల మ‌ధ్య తేడా ఏముంది? తెలంగాణ‌తో పోలిస్తే ఏపీ ఎందులో త‌క్కువ‌? ఇలా అనేక ప్ర‌శ్న‌లు. ఈ అనుమానాల‌న్నిటికీ జ‌స్ట్ ఓ ఫోటోతో క్లారిటీ వ‌చ్చేస్తుంది. పాల‌కులే ఏపీకి శాపంగా మారార‌ని.. అధికార పార్టీ నేత‌ల వ‌ల్లే రాష్ట్రం తిరోగ‌మ‌నం పాల‌వుతోంద‌ని తేలిపోతోంది. ఒక్క ఫోటోతో తెలంగాణ‌, ఏపీకి మ‌ధ్య ఉన్న తేడా సుస్ప‌ష్టం అవుతోంది. ఈ ఫోటో ఒక్క‌టి చాలు పారిశ్రామిక‌వేత్త‌ల‌కు తెలంగాణ స‌ర్కారు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో చెప్ప‌డానికి. ఇటీవ‌ల మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా కంపెనీ సీఈఓ సీపీ గుర్నానీ తెలంగాణ‌కు వ‌చ్చిన‌ప్పుడు మంత్రి కేటీఆర్ స్వ‌యంగా ఆయ‌న‌కు ఇలా గొడుగు ప‌ట్టారు. గ‌త వారం సీపీ గుర్నానీ హైద‌రాబాద్ వ‌చ్చారు. స‌న‌త్ న‌గ‌ర్ లోని సెయింట్ థెరిస్సా ఆసుప‌త్రితో పాటు ఏటూరు నాగారం ఆసుప‌త్రికీ మ‌హీంద్రా కంపెనీ అందించిన ఆక్సిజ‌న్ ప్లాంట్‌ల‌ను ఆయ‌న ప్రారంభించారు. ఆ స‌మ‌యంలో వ‌ర్షం ప‌డుతూ ఉంటే.. గుర్నానీకి కేటీఆర్ గొడుగు ప‌ట్టారు. ఓ మంత్రి, ముఖ్య‌మంత్రి త‌న‌యుడు.. త‌న‌కు గొడుగు ప‌ట్టడం చూసి గుర్నానీ అవాక్క‌య్యార‌ని అంటున్నారు. ఇంత మంచి న‌డ‌వ‌డిక చూపిస్తే.. ఇక తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్ట‌మంటే ఎందుకు నిరాక‌రిస్తారు చెప్పండి.  అలాగే ఇటీవ‌ల కేర‌ళ‌కు చెందిన కైటెక్స్ అనే ప్ర‌ముఖ‌ టెక్స్‌టైల్ కంపెనీ య‌జ‌మానికి సైతం స్పెష‌ల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి.. ఉద‌యం కేర‌ళ నుంచి తెలంగాణ ర‌ప్పించి.. మ‌ధ్యాహ్నం హెలికాప్ట‌ర్‌లో వ‌రంగ‌ల్‌కు తీసుకెళ్లి.. సాయంత్రం క‌ల్లా వెయ్యి కోట్లతో టెక్స్‌టైల్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న‌ట్టు ఆయ‌న‌ ప్ర‌క‌టించేలా చేశారు మంత్రి కేటీఆర్‌. ఇలాంటి రెడ్‌కార్పెట్ స్ట్రాట‌జీ వ‌ల్లే తెలంగాణ‌కు పెట్టుబ‌డులు వ‌స్తున్నాయి. ఇక ఏపీ గురించి ఎంత త‌క్కువ చెబితే అంత మంచిదేమో. ఓసారి ఈ ఫోటో చూడండి.. స‌ర్వం బోధ‌ప‌డుతుంది.... చూశారుగా.. వైసీపీకి చెందిన‌ హిందూపురం ఎంపీ గోరంట్ల‌ మాధ‌వ్‌.. కియా కంపెనీ ప్ర‌తినిధిని ఎలా బెదిరిస్తున్నారో. స్థానికుల‌కు ఉద్యోగాలు ఇవ్వ‌క‌పోతే ఖ‌బ‌డ్దార్ అన్న‌ట్టూ కియా ఉన్న‌తోద్యోగిని ఎంపీ మాధ‌వ్ ఓ స‌మావేశంలో ఇలా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన విజువ‌ల్స్ అప్ప‌ట్లో తెగ వైర‌ల్ అయ్యాయి. ఇలా బెదిరిస్తే పెట్టుబ‌డులు వ‌స్తాయా? ఉన్న కంపెనీలు వెళ్లిపోతాయా? వైసీపీ పాల‌కుల‌కే తెలియాలి. ఇటు కేటీఆర్‌, అటు మాధ‌వ్ ఫోటోల‌తో.. వైసీపీ పాల‌న‌ను సోష‌ల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు నెటిజ‌న్లు.  జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు ఒక్క కొత్త కంపెనీనైనా తీసుకురాలేదు.. క‌నీసం అప్ప‌టికే వ‌చ్చిన కంపెనీల‌నైనా కాపాడారా అంటే అదీ లేదు. వైసీపీ పాల‌నా తీరును చూసి ఉన్న సంస్థ‌లే ఏపీని విడిచి పారిపోతున్నాయి. గ‌తంలో విశాఖ‌లో భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్న లులూ గ్రూపు ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకుని మ‌రీ వెళ్లిపోయింది. అల్లానా కంపెనీ కూడా అదే దారిలో ఉంది. కియా త‌న కంపెనీ విస్త‌ర‌ణ‌ను ర‌ద్దు చేసుకుంది. చిత్తూరు నుంచి రిల‌యెన్స్ సంస్థ సైతం భూములు తిరిగిచ్చేసి మ‌రీ త‌ప్పించుకుపోయింది. ఇక‌, అమ‌ర‌రాజా విష‌యంలో జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భత్వ తీరు మ‌రింత దారుణంగా ఉంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ద‌శాబ్దాలుగా ఏపీకి త‌ల‌మానికంగా ఉంటూ.. వేలాది మందికి ఉపాధి చూపిస్తూ.. ప్ర‌భుత్వానికి వేల కోట్ల ప‌న్నులు చెల్లిస్తున్న అమ‌ర‌రాజా గ్రూపును పొల్యూష‌న్ సాకుతో ఏపీ నుంచి త‌రిమేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఓవైపు తెలంగాణ స‌ర్కారు అలా గొడుగు ప‌ట్టి.. విమానాలు పంపించి.. పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తుంటే.. వైసీపీ పాల‌కులు మాత్రం ఇలా బెదిరింపులతో ఏపీని పారిశ్రామికంగా అథోగ‌తి పాలు చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు ప్ర‌జ‌లు.   

సంక్రాంతి క‌ల్లా ఏపీకి కొత్త సీఎం.. జ‌గ‌న్‌కు షాకింగ్ న్యూస్‌..

సీఎం జ‌గ‌న్ మెడ‌పై సీబీఐ, ఈడీల‌తో పాటు ర‌ఘురామ బెయిల్ ర‌ద్దు కేసులు వేలాడుతున్నాయి. ఏ నిమిషానికి ఏమి జ‌రుగునో.. ఎవ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు. జ‌గ‌న్‌రెడ్డికి వ్య‌తిరేకంగా వేగంగా ప‌రిణామాలు మారిపోతుండ‌టంతో.. వైసీపీలో హైటెన్ష‌న్ నెల‌కొంది. తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ నివాసంలో నిశ్శ‌బ్దం ఆవ‌హించింది. అయితే, జ‌గ‌న్‌కు జైలా? బెయిలా? అనేది సీబీఐ కోర్టులో తేల‌నున్నా.. అటు, ఢిల్లీలో సైతం జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా పావులు క‌దులుతున్నాయ‌నే వార్త‌లు ఎప్ప‌టినుంచో వినిపిస్తున్నాయి. అయితే, హ‌స్తిన రాజ‌కీయాల్లో మంచి ప‌ట్టున్న ఓ సీనియ‌ర్ నేత తాజాగా చేసిన కామెంట్లు ఏపీ రాజ‌కీయాల‌ను షేక్ చేస్తున్నాయి. త్వ‌ర‌లోనే సీఎం జ‌గ‌న్ ప‌ద‌వి ఊడిపోనుంద‌ని.. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసి చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది.  మరీ ఎంతో దూరంలో లేద‌ట‌. భోగి పండుగ‌లోపు ఏపీకి కొత్త ముఖ్య‌మంత్రి రాబోతున్నార‌ట‌. అందుకే, సీఎం కుర్చీ పోతుందన్న దిగులుతోనే.. జగన్‌ బయటకు రావడం లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్‌ నేత చింతా మోహ‌న్ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు ఏపీలో చ‌ర్చ‌ణీయాంశ‌మైంది. వైసీపీలో టెన్ష‌న్ మొద‌లైంది. ఢిల్లీ నుంచి అందిన ప‌క్కా స‌మాచారంతోనే చింతా మోహ‌న్ ఇలాంటి ప్ర‌క‌ట‌న చేసుంటార‌ని అంటున్నారు. సంక్రాంతిక‌ల్లా ఏపీ ముఖ్య‌మంత్రి మారుతార‌ని అంత క‌చ్చితంగా చెబుతున్నారంటే.. ఆ మేర‌కు కీల‌క ఇన్ఫ‌ర్మేష‌న్ ఏదో ఆయ‌న ద‌గ్గ‌ర ఉండే ఉంటుంద‌ని చెబుతున్నారు. ఢిల్లీ లీకుల మేర‌కే ఆయ‌న‌లా అన్నార‌ని తెలుస్తోంది. సంక్రాంతి అంటే.. మ‌రో నాలుగు నెల‌లు మాత్ర‌మే జ‌గ‌న్ సీఎంగా ఉండేద‌న్న‌మాట‌.  మ‌రోవైపు, చింతా మోహ‌న్ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన స్టేట్‌మెంట్ కూడా చేశారు. దీపావ‌ళిలోపు ఏపీ కాంగ్రెస్‌కు అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన నాయ‌కుడు ప్ర‌తినిధిగా నియ‌మితుల‌వుతార‌ని అన్నారు. ఇటీవ‌ల రాహుల్‌గాంధీ ఏపీపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టార‌ని.. చిరంజీవిని ఏపీపీసీసీ చీఫ్ చేయాల‌ని ఇంట్రెస్టెడ్‌గా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి, చింతా మోహ‌న్ అన్న‌ట్టు ఆ అంద‌రికీ ఆమోద‌మైన నేత చిరంజీవినేనా? అనే చ‌ర్చ న‌డుస్తోంది. ఇలా చింతా మోహ‌న్ రాజేసిన ర‌చ్చ వైసీపీకి ముచ్చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తోంది.   

నా భర్తను ఆఫీసుకు రప్పించండి.. భార్య ట్వీట్ వైరల్

కొవిడ్ మహమ్మారితో ఐటీ కంపెనీలన్ని వర్క్ ఫ్రం హోం విధానం అమలు చేస్తున్నాయి. గత మార్చిలో మొదటి సారి లాక్ డౌన్ పెట్టినప్పుడు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చిన ఐటీ సంస్థలు.. ఇప్పటికే అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికలతో మరి కొంత కాలం ఇది అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వర్క్ ఫ్రం హోం విధానంపై భిన్న వాదనలు వస్తున్నాయి. కొందరు ఉద్యోగులు ఇదే బాగుందని చెబుతుండగా.. మరికొందరు ఉద్యోగులు మాత్రం ఆఫీసులో పని చేయడానికే ఇష్టపడుతున్నారు.   వర్క్ ఫ్రం హోంతో మొదట కొన్ని ఇబ్బందులు వచ్చినా.. తర్వాత ఉద్యోగులు దానికి అలవాటు పడ్డారు. టైం అన్న విధానం లేకుండా ఇంట్లోనే తమ కుటుంబంతో గడుపుతూ పనిచేస్తూ ఎంజాయ్ చేశారు.  కానీ వర్క్ ఫ్రం హోం వల్ల గృహిణులకు మాత్రం పెద్ద భారంగా మారింది. తన భర్త ఇంట్లో పనిచేయడం వల్ల తాను పడుతున్న బాధలను వివరిస్తూ ఓ వివాహిత 'నా భర్తను ఆఫీసుకు రమ్మనండి...' అంటూ లేఖ రాయడం ఆసక్తిగా మారింది. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ వ్యాపార వేత్త హర్ష్ గొయొంకా తన ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన పోస్టును పెట్టాడు. ఓ మహిళ తన భర్తను ఆఫీసుకు రమ్మని సదరు కంపెనీకి రాసిన లేఖను స్క్రీన్ షాట్ తీసి ఆ పోస్టుకు జోడించారు.  ఆ లేఖలో ఏముందంటే.. 'కంపెనీ యజమానులకు నమస్కరించి రాయునది ఏమనగా.. మీ సంస్థలో పనిచేసే మనోజ్ భార్యను నేను. మీకు సవినయంగా విన్నవించుకునేదేంటంటే.. నా భర్తకు ఆఫీసుకు వచ్చి పనిచేసే అవకాశం కల్పించండి.. మా ఆయన ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నాడు. కరోనా నిబంధనలు పాటిస్తున్నాడు. కొవిడ్ కు సంబంధించిన అన్నీ ప్రొటోకాల్స్ పాటిస్తున్నాడు. అందువల్ల ఇతనికి అవకాశం కల్పించండి' అని తెలిపింది. తన భర్త వర్క్ ఫ్రం హోం వల్ల తాను పడే ఇబ్బందులను ఆమె లేఖలో తెలిపింది. 'మనోజ్.. ఇంట్లో పనిచేసేటప్పుడు ఎన్నిసార్లు కాఫీ తాగుతాడో తెలియదు. ఒకే గదిలో కూర్చొని పనిచేయలేడు. ప్రతి గదిలో కూర్చుంటున్నాడు. లెక్కలేనన్ని సార్లు భోజనం చేస్తున్నాడు. పనిచేసేటప్పుడు కునికిపాట్లు పడుతున్నాడు.' అని పేర్కొంది. 'మాకు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. వారిని పోషించడమే గగనంగామారింది. ఇప్పుడు నా భర్తకు సపర్యలు చేయడం నావల్ల కావడం లేదు. దీంతో మా ఇద్దరి మధ్య తరుచూ గొడవలు అవుతున్నాయి. మరికొంత కాలం ఇలాగే సాగితే మేమిద్దరం విడిపోవడం ఖాయమని తెలుస్తుంది.. అందువల్ల తప్పనిసరిగా కార్యాలయంలో పనిచేయాలని నా భర్తను ఆదేశించండి..' అని మహిళ లేఖలో తెలిపింది. ఈ పోస్టుకు ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు అంటూ హర్ష్ గొయొంకా  కామెంట్ చేశాడు. తన భర్త మరికొంత కాలం ఇంట్లో పనిచేస్తే మేమిద్దరం విడిపోవడం ఖాయం అని పేర్కొనడం షాకింగ్ కు గురి చేస్తుందని తెలిపాడు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గొయొంకా పోస్టుపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ మహిళ బాధలు అర్ధం చేసుకోవాల్సిందేనని కొందరు కామెంట్ చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం వల్ల ఇళ్లల్లో ఎన్ని సమస్యలు వస్తున్నాయో అంటూ మరికొందరు పోస్టు చేశారు.

సీమ ద్రోహి జ‌గ‌న్‌.. కేసీఆర్‌తో కుమ్మ‌క్కు.. రాయ‌ల ఆగ్ర‌హం..

రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై సీమ నేతల సదస్సు జ‌రిగింది. ఆ నాలుగు జిల్లాల‌కు చెందిన ప్ర‌ముఖ ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌రై.. సీఎం జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా మండిప‌డ్డారు. సీఎంలు జగన్, కేసీఆర్‌ల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయా? అని టీడీపీ నేత ప‌య్యావుల కేశ‌వ్ ప్రశ్నించారు. హంద్రీనీవా కాలువ వెడల్పు పెంచకపోతే సీమ ద్రోహిగా జగన్ మిగిలిపోతారంటూ హెచ్చరించారు. సీమ సీఎంలు ఎప్పుడూ రాయలసీమ జలాలు గురించి పట్టించుకోలేదన్నారు. రాయలసీమ మిటిగేషన్ ప్రాజెక్ట్ కాదు రాయలసీమ లిటిగేషన్ ప్రాజెక్టని అన్నారు ప‌య్యావుల‌. సీఎం తీరు వల్లే కేఆర్‌ఎంబీ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  అటు, సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై జేసీ పవన్‌రెడ్డి సైతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత చెల్లెలికి ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఇవ్వలేవు కానీ నీటి హక్కులపై కేఆర్ఎంబీకి సర్వహక్కులు ఇచ్చేసావు అంటూ సీఎం జ‌గ‌న్‌పై మండిప‌డ్డారు జేసీ ప‌వ‌న్‌. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సమస్య పరిష్కరించేందుకు ముందుకు వచ్చినా.. ముఖ్యమంత్రి ముందుకు రాలేద‌ని త‌ప్పుబ‌ట్టారు. కర్ణాటక నుంచి వచ్చే నీటిపై కూడా కేఆర్‌ఎంబీ జోక్యం చేసుకుంటుందని తెలిపారు.  ఇక‌, అనంతపురం జిల్లాలోని కరువు పరిస్థితుల గురించి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలియదా.. అని మాజీ మంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న కేసీఆర్‌కు.. ఇక్కడి సమస్యలు అన్నీ తెలుసని గుర్తుచేశారు. రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. రాయలసీమ బిడ్డగా చెప్పుకొనే సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప‌రిటాల సునీత నిల‌దీశారు.  అటు.. హైదరాబాద్‌‌లోని ఆస్తుల పరిరక్షణ కోసమే జగన్ ఇలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు. జాతీయ జల విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుంటే.. సీఎం జగన్‌ నోరు మెదపడం లేదని విమర్శించారు. హంద్రీనీవా కంటే సాక్షి పేపర్ ప్రకటనల కోసమే.. రూ.300 కోట్లు ఖర్చుపెట్టార‌న్నారు. హంద్రీనీవా పూర్తి చేయకపోతే.. సీఎం జగన్‌మోహన్ రెడ్డికి రాయలసీమ వాసులు తగిన రీతిలో బుద్ధి చెబుతారని పల్లె రఘునాథరెడ్డి హెచ్చ‌రించారు.  సాగునీటి కోసం సీమ నేతలు సమైక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి అమ‌ర్నాథ్‌రెడ్డి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మిగులు జలాలపై హక్కును వదులుకుంటున్నామని  చెప్పడంతోనే రాయలసీమకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గడిచిన రెండు సంవత్సరాల నుంచి చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రులు స్టేట్మెంట్లు ఇవ్వడం మినహా ఏమీ చేయడం లేదని విమర్శించారు. కాంట్రాక్టు పనుల కోసమే వైసీపీ నేతలు పనులు చేస్తున్నారన్నారు. దీనిపై కుప్పం నియోజకవర్గం నుంచే పాదయాత్ర చేపడుతున్నామన్నారు అమ‌ర్నాథ్‌రెడ్డి.   

మెడిసిన్‌ ఫ్రం స్కై.. డ్రోన్ల‌తో మందుల పంపిణీ.. తెలంగాణ సంచ‌ల‌నం..

జ‌బ్బు చేసింది. మెడిసిన్ కావాలి. ఏం చేస్తాం? ఏ మెడిక‌ల్ షాపున‌కో వెళ్లి కొనుక్కుంటాం. లేదంటే ఆన్‌లైన్లో ఆర్డ‌ర్ పెట్టి ఇంటికే తెప్పించుకుంటాం. ఇప్ప‌టి వ‌ర‌కైతే ఇండియాలో ఇంతే. కానీ, ఇక‌పై మ‌రో ఆప్ష‌న్ కూడా వ‌చ్చి చేరుతోంది. ఏకంగా డ్రోన్ల‌తో ఇంటికే మందులు స‌ర‌ఫ‌రా చేసే రోజులు త్వ‌ర‌లోనే రానున్నాయి. అయితే, ఈ అవ‌కాశం ప్ర‌స్తుతానికి ఒక్క తెలంగాణ‌లో మాత్ర‌మే అందుబాటులోకి రానుంది. అమెరికాలాంటి కొన్ని అతిత‌క్కువ దేశాల్లో మాత్ర‌మే ఉన్న ఈ స‌దుపాయం.. తాజాగా వికారాబాద్‌లో ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించారు. దేశంలోనే తొలిసారి డ్రోన్‌ల సాయంతో ఔషధాల పంపిణీ చేప‌ట్టి తెలంగాణ రాష్ట్రం సంచ‌ల‌నం సృష్టించింది.  ‘మెడిసిన్‌ ఫ్రం స్కై’ పేరుతో వికారాబాద్‌లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు చేపట్టారు. రవాణా సౌకర్యం లేని అటవీ ప్రాంతాలకు దీని ద్వారా మందులు సరఫరా చేయనున్నారు. వికారాబాద్‌లో జ‌రిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హాజ‌ర‌య్యారు. మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో డ్రోన్‌లో మెడిసిన్‌ బాక్సులను పెట్టి.. జ్యోతిరాదిత్య సిందియా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. 3 డ్రోన్లలో ప్రయోగాత్మకంగా మందులు, టీకాలు పంపించారు. ఔషధాలను వికారాబాద్‌ ప్రాంతీయ ఆస్పత్రిలో డ్రోన్లు డెలివరీ చేసి రికార్డు నెల‌కొల్పాయి. ఈ డ్రోన్ల‌లో అనేక ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. 15 కిలోల బ‌రువైన మెడిసిన్‌ను 40 కి.మీ. దూరం వ‌ర‌కూ మోసుకెళ్ల‌గ‌ల‌వు. అంత దూరం ప్ర‌యాణించ‌డానికి ఆ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తి మేర‌కు కేంద్రం ప్ర‌త్యేక అనుమ‌తి ఇచ్చింది. మొద‌టి ద‌శ‌లో ఈ డ్రోన్ల‌తో మందులు, టీకాలు, ర‌క్తం లాంటివి స‌ర‌ఫ‌రా చేసినా.. త‌దుప‌రి ద‌శ‌ల్లో వివిధ సున్నితమైన అంశాల్లోనూ డ్రోన్లను వాడేందుకు సిద్ద‌మ‌వుతోంది తెలంగాణ స‌ర్కారు. తెలంగాణ‌లో ఎమర్జింగ్‌ టెక్నాలజీని ఎంతో ప్రోత్సహిస్తున్నామ‌న్నారు మంత్రి కేటీఆర్‌. అధునాతన టెక్నాలజీతో మందులు సరఫరా చేస్తున్నామ‌ని.. అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా మందులు, రక్తం సరఫరా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆరోగ్య రంగంలోనే కాదు.. అనేక రంగాల్లో డ్రోన్లు వాడొచ్చు. మహిళల భద్రత కోసం కూడా డ్రోన్లు వాడుతున్నాం. అమ్మాయిలను వేధించే వాళ్లు డ్రోన్‌ చప్పుళ్లకే భయపడతారు. మైనింగ్‌ లాంటి అక్రమాలకు పాల్పడే ప్రాంతాలను గుర్తించి డ్రోన్ల ద్వారా కట్టడి చేయొచ్చు.. అని మంత్రి కేటీఆర్‌ వివరించారు. ‘మెడిసిన్‌ ఫ్రం స్కై’ విజ‌య‌వంతం తెలంగాణ‌కే గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు మంత్రి కేటీఆర్‌.   

సొంత ఇంటిని చ‌క్క‌బెట్టుకోలేని మోదీ.. న‌లుగురు సీఎంలు రాజీనామా..

ఒక‌ప్పుడు కాంగ్రెస్‌లో ఓ బ్యాడ్ క‌ల్చ‌ర్ ఉండేది. ప‌దే ప‌దే ముఖ్య‌మంత్రుల‌ను మారుస్తార‌నే ముద్ర ఉండేది. అప్ప‌ట్లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తీ రెండేళ్లకు ఓ సీఎం మారేవారు. ఒక్క వైఎస్సార్ మాత్ర‌మే గ‌ట్టిగా నిల‌దొక్కుకున్నారు. కాంగ్రెస్‌లాంటి కుసంస్కృతి ఇప్పుడు బీజేపీకి సోకిన‌ట్టుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను ప‌దే ప‌దే మారుస్తూ.. క‌మ‌ల‌నాథులు సైతం హ‌స్తం నేత‌ల అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్నారు. రాజ‌కీయాల్లో అంతా ఆ తానుముక్క‌లేన‌ని చెప్ప‌క‌నే చెబుతున్నారు.  ముఖ్య‌మంత్రుల‌ను అధిష్టానం మార్చ‌డం వేరు.. ముఖ్య‌మంత్రే స్వ‌యంగా ప‌ద‌విని వీడ‌టం వేరు. గుజ‌రాత్ సీఎం విజ‌య్ రూపానీ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌ధాని మోదీ సొంత రాష్ట్ర‌మైన గుజ‌రాత్‌లోనే ఇలా ఏకంగా ముఖ్య‌మంత్రే స‌డెన్‌గా ప‌ద‌విని వీడ‌టం ఆ పార్టీలో ఉన్న అంత‌ర్గ‌త విభేదాల‌ను ఎత్తి చూపుతోంది. పైకి మాత్రం ఇదీ కార‌ణం అని చెప్ప‌కుండా.. గుజ‌రాత్ బీజేపీలో లుక‌లుక‌లు, మోదీతో విభేదాలే సీఎం విజ‌య్ రూపానీ రాజీనామాకు దారి తీసింద‌ని అంటున్నారు.  గుజ‌రాత్‌ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్‌కు అందజేశారు. గాంధీనగర్‌లో జరిగిన సమావేశంలో చోటుచేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో విజయ్ రూపానీ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజీనామా అనంత‌రం విజ‌య్ రూపానీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా సేవలందించేందుకు తనకు అవకాశం కల్పించిన బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నాయకత్వంలో తాను సేవలు కొనసాగిస్తున్నానని తెలిపారు.  బీజేపీ ముఖ్యమంత్రులు వరుసగా రాజీనామా చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌ల‌ ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, తీరత్ సింగ్‌లు రాజీనామా చేశారు, ఆ త‌ర్వాత‌ కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో బ‌ల‌వంతంగా రాజీనామా చేయించారు. తాజాగా గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రిజైన్‌ చేశారు. అసెంబ్లీ పదవీ కాలం మరో ఏడాది ఉండగానే ఆయ‌న ప‌దవి నుంచి వైదొల‌గ‌డం సంచ‌ల‌నంగా మారింది. మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న విజయ్ రూపానీ రాజీనామా చేయడం పార్టీపై న‌రేంద్ర మోదీకి ప‌ట్టు చేజారిపోతోంద‌నే దానికి నిద‌ర్శ‌ణం అంటున్నారు. బీజేపీలో సైతం కాంగ్రెస్ త‌ర‌హా ముఖ్య‌మంత్రుల‌ను మార్చే క‌ల్చ‌ర్‌తో పాటు.. అధిష్టానాన్ని ధిక్కరించే నైజం పెరిగిపోతోంద‌ని విశ్లేషిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షులు న‌డ్డానే అయినా.. విజ‌య్ రూపానీ గుజ‌రాత్ సీఎం కాబ‌ట్టి.. తాజా ప‌రిణామం ప్ర‌ధాని మోదీ ఇమేజ్‌కు తీవ్ర డ్యామేజ్ చేయ‌డం ఖాయం.   

న‌వ ర‌త్నాలు కాదు.. న‌వ రంధ్రాలు.. కేంద్రానికి ర‌ఘురామ ఫిర్యాదు..

సీఎం జ‌గ‌న్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలన్నీ త్వరలోనే నవ రంధ్రాలవుతాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. నవరత్నాలలో ఎప్పుడు.. ఏ రత్నం ఊడుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. పింఛన్లను ఎలా తొలగించాలా అని చూస్తున్నారని ఆరోపించారు. పింఛన్లకు ఏదో ఒక విధానం పెట్టాలి తప్ప ఎలా ఎగ్గొట్టాలా అనే ఆలోచనను మానుకోవాలన్నారు. గ్రామ వాలంటీర్ల తల్లిదండ్రులకు సైతం పింఛను రద్దు చేయడం సరికాదన్నారు. గ్రామాల్లో పనిచేసే వాలంటీర్లు ఉద్యోగులు కాదు.. సేవకులని మనమే అంటున్నామని.. అలాంటి సేవకుల కుటుంబాలను ‘షేవ్‌’ (SHAVE) చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు అడుగుతున్నారని ర‌ఘురామ ప్ర‌భుత్వాన్ని త‌ప్పుబ‌ట్టారు.  విద్యుత్‌ బిల్లులు రూ.300 దాటితే డయాలసిస్‌ రోగులకు పింఛన్లలో కోత విధించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కరెంటు యూనిట్లకు కిడ్నీ రోగులకు ఇచ్చే పింఛనుకు సంబంధం ఏమిటని నిల‌దీశారు. కిడ్నీ రోగులను నాలుగు కాలాల పాటు బతకనివ్వండంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆటో డైవర్స్‌కు వాహన మిత్ర కింద వాహనాలు ఇస్తున్నారే గానీ.. చమురు ధరలపై  టాక్స్‌లు, దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిపై పట్టించుకోవడం లేదని ర‌ఘురామ మండిప‌డ్డారు.  తెలంగాణలో వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకొన్నారని.. ఉత్సవాలలో తెలంగాణ గవర్నర్ సైతం పాల్గొన్నారని.. అయితే ఏపీలో జరిగిన ఉత్సవాల్లో గవర్నర్ కనిపించకపోవడం దురదృష్టకరమని తెలిపారు. ఆదివారం చర్చిల్లో ప్రార్థనలపై ఎలాంటి నియంత్రణా లేదన్నారు. చవితి వేడుకల్లో ఐదుగురికి మించి ఉండకూడదన్న నిబంధన.. చర్చిలకు కుడా అమలు చేస్తారా.. అని ప్రశ్నించారు. చర్చిల్లో ఏ నిబంధనలూ లేనట్లే.. హిందువులు కూడా పూజలు చేసుకునేలా చూడాలని సూచించారు. ధూపదీప నైవేద్యాలకు రూ.234 కోట్లు ఇస్తామని.. ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. హిందూ ఆలయాల మీద పడి నాశనం చేయొద్దని ర‌ఘురామ విజ్ఞ‌ప్తి చేశారు.  ఇక, ఏపీ ఫైబర్‌గ్రిడ్ లిమిటెడ్ ఎంఎస్‌వో లైసెన్స్‌ను అనధికారికంగా, అక్రమంగా ఉపయోగించడంపై కేంద్ర ఐటీ శాఖకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు ఎంపీ ర‌ఘురామ‌.  

ఆరు నెలల్లో నలుగురు సీఎంల రాజీనామా.. బీజేపీలో ఏం జరుగుతోంది? 

ముఖ్యమంత్రులను తరుచూ మార్చడం.. ఎమ్మెల్యేలను సంప్రదించకుండానే సీఎంలను నిర్ణయించడం..  కేంద్రం నుంచి నేతలను రాష్ట్రాలకు పంపించడం.. ఇవీ గతంలో కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రధాన ఆరోపణలు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తరుచూ ముఖ్యమంత్రులను మారుస్తూ ఉండేవారు. అప్పట్లో ఇది వివాదాస్పదమైంది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ ను విమర్శించాల్సి వచ్చినప్పుడు విపక్షాలు.. ముఖ్యమంత్రుల మార్పు అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలోనే పయనిస్తుందని అనిపిస్తోంది. గత ఆరు నెలల్లోనే నలుగురు బీజేపీ ముఖ్యమంత్రులు రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నా ముఖ్యమంత్రులను మార్చేసింది బీజేపీ  హైకమాండ్. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని రాజీనామా చేశారు. పార్టీ ఆదేశాలతో ఆయన తన రాజీనామా లేఖను  గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు అందజేశారు. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, సడెన్ గా విజయ్ రూపానీ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. విజయ్ రూపానీ సీఎం పదవి నుంచి తప్పుకోవడానికి దారితీసిన కారణాలు ఏంటన్నది తెలియరాలేదు.ఇటీవల కాలంలో రాజీనామా చేసిన నాలుగో బీజేపీ సీఎంగా నిలిచారు విజయ్ రూపానీ. గత జులైలో కర్ణాటక సీఎం పదవికి బీఎస్ యడియూరప్ప రాజీనామా చేశారు. యడ్డీ స్థానంలో బసవరాజ్ బొమ్మైని కర్ణాటక ముఖ్యమంత్రిగా నియమించింది బీజేపీ.  2021 మార్చిలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేశారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలతో ఆయన పదవి నుంచి వైదొలిగారు. త్రివేంద్ర సింగ్ రావత్ స్థానంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా మార్చి 10న తీర్థ సింగ్ రావత్ ప్రమాణం చేశారు. అయితే కేవలం నాలుగు నెలల్లోనే మరోసారి ముఖ్యమంత్రిని మార్చేసింది బీజేపీ. పార్టీ పెద్దల ఆదేశాలతో జూలై 3న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు తీర్థ సింగ్ రావత్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులను బీజేపీ హైకమాండ్ వెంట వెంటనే మార్చడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. 

బ్రేకింగ్... గుజరాత్ ముఖ్యమంత్రి రాజీనామా

గుజరాత్‌లో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్‌కు అందజేశారు. గాంధీనగర్‌లో జరిగిన సమావేశంలో చోటుచేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో విజయ్ రూపానీ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  రాజీనామా సమర్పణ తర్వాత మీడియాతో రూపానీ.. ముఖ్యమంత్రిగా సేవలందించేందుకు తనకు అవకాశం కల్పించిన బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాజీనామా నిర్ణయంపై అడిగిన పలు ప్రశ్నలకు... ఐదేళ్ల సుదీర్ఘ కాలం సేవలందించానని చెప్పారు. నాయకత్వ మార్పు బీజేపీలో సాధారణ ప్రక్రియేనని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నాయకత్వంలో తాను సేవలు కొనసాగిస్తున్నానని తెలిపారు. గత ఐదేళ్లుగా బీజేపీపై ప్రజలు తమ విశ్వాసాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని రూపానీ చెప్పారు. 

కేసీఆర్ పాలనపై శంఖారావమేనా? అమిత్ షా సభతో సంకేతమా?

సెప్టెంబర్ 17... ఈ తేదీకి ఉన్న ప్రత్యేకత గురించి తెలంగాణ ప్రజలకు  ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అది తెలంగాణకు స్వాతంత్రం ప్రసాదించిన తెలంగాణ విమోచన దినం. దేశానికి 1947 ఆగస్ట్ 15న స్వాతంత్ర్యం వచ్చింది. అది మనదరికీ తెలుసు. అదే రోజున దేశమంతా మువన్నెల జెండా రెపరెప లాడింది. అయితే నిజాం సంస్థానం, హైదరాబాద్ స్టేట్ (ప్రస్తుత తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు)కు మాత్రం ఆరోజున నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించలేదు. ఆ తర్వాత సుమారు 13నెలలకు, 1948 సెప్టెంబర్ 17 వ తేదీన ఉక్కు మనిషి, సర్దార్ వల్లభభాయ్ పటేల్ సైనిక చర్యతో నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించింది. నిజాం సంస్థానం భారత దేశంలో విలీనమైంది. అందుకే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన/ విలీన దినంగా చరిత్రలో మిగిలిపోయింది.నిజానికి అదే తెలంగాణ స్వాతంత్ర దినం.   ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు, రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం,  సెప్టెంబర్ 17 తేదీని తెలంగాణ విమోచన/ విలీన దినంగా అధికారికంగా గుర్తించేందుకు అంగీకరించ లేదు. నిజానికి, రాష్ట్ర విభజనకు ముందు, తెరాస సెప్టెంబర్ 17 తేదీని, మహా రాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాలలో నిర్వహిస్తున్న విధంగా  తెలంగాణలోనూ అధికారికంగా, స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో సమానంగా  నిర్వహిస్తామని మాటిచ్చింది. అయితే, రాష్ట్ర విభజన జరిగి, తెరాస అధికారంలోకి వచ్చి ఏడేళ్ళు పూర్తయినా, తెరాస ప్రభుత్వం ఆ మాటే మరిచి పోయింది. అయితే బీజేపీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినంగా జరుపుకుంటోంది. అలాగే, తెరాస సహా ఇతర పార్టీలు కూడా అదే రోజును పార్టీ కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగరేసి, తెలంగాణ విలీన దినంగా జరుపుకుంటున్నాయి.   తెలంగాణ పై రాజకీయంగా పట్టు సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీ, ఈసంవత్సరం ముందున్న హుజూరాబాద్ ఉప ఎన్నికను, అలాగే, 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 17 తేదీన తెలంగాణ విమోచన దినాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ విమోచనోద్యమంలో ప్రఖ్యాతిగాంచిన  నిర్మల్‌లోని వెయ్యి ఉరులమర్రి వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వస్తున్నారు. వెయ్యి ఉరుల మర్రిని వేదికగా ఎంపిక చేసుకోవడంలో బీజీపీ తెలంగాణ సెంటిమెంట్ ను అస్త్రం చేసుకుందని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ విమోచనోద్యమం మొదట నిర్మల్‌లోనే ప్రారంభమైనది. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి మట్టి కరిపించిన ఘనతను ఈ పట్టణం సొంతంచేసుకుంది  ఉద్యమాలే ఊపిరిగా దూసుకువెళ్ళి ఒకేసారి వెయ్యిమంది ఉరికంబం ఎక్కిన ఘనత ఈ ప్రాంతానిదే. ఇదే వెయ్యి ఉరుల మర్రి సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది, ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను, నిజాం నిరంకుశ పాలనతో పోలుస్తున్న బీజేపీ, కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి కల్పించేందుకే, ఈ సెప్టెంబర్ 17 న అమిత్ షా నిర్మల్‌ వెయ్యి ఉరులమర్రి నుంచి శంఖారావం పూరిస్తున్నారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ నెల 17న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో తరుణ్ చుగ్ పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి కల్పించేందుకే అమిత్ షా నిర్మల్‌కు వస్తున్నారని తెలిపారు. చారిత్రాత్మక ప్రాశస్త్యం గల నిర్మల్ గడ్డ కొత్త చరిత్రకు నాంది పలకబోతోందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రతో కేసీఆర్ గుండెల్లో దడ మొదలయ్యిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ నేతృత్వంలో రామరాజ్యం స్థాపనకు అమిత్ షా శంఖారావం పూరించబోతున్నారని తరుణ్ చుగ్ అన్నారు. 

కడప జిల్లాలో సీఎం బంధువు భూకబ్జాలు? వైసీపీ కార్యకర్త సెల్ఫీ వీడియోతో కలకలం..

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు ఆగడాలు మితిమీరి పోతున్నాయి.  ఎన్ని విమర్శలు వస్తున్నా డోంట్ కేర్ అంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు వైసీపీ నేతలు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ కడప జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు.  అధికారం అండతో అరాచకాలు చేస్తున్న స్థానిక నేతలకు వైసీపీ పెద్దలు వంత పాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కొందరు నేతలు సొంత పార్టీ కార్యకర్తలను కూడా వదలి పెట్టడం లేదని తెలుస్తోంది. మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలంలో ఓ మైనారిటీ కుటుంబం సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. వైసీపీ కార్యకర్త అయిన ముస్లిం వ్యక్తి.. తన భూమిని వైసీపీ నేత కబ్జా చేశాడని వాపోతూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. సీఎం జగన్  బంధువు తన భూమిని కబ్జా చేశాడని, ఇదేంటిని అడిగితే తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు అక్భర్ బాషా. ఆయన చెబుతున్న వివరాల ప్రకారం ఎర్రబల్లికి చెందిన అక్బర్ బాషా భార్యకు వారి పుట్టింటి వారు.. ఎకరం యాభై సెంట్ల భూమి ఇచ్చారు. ఇప్పుడు ఆ భూమిని వైసీపీ నేత ఇరగం రెడ్డి తిరుపాల్ రెడ్డి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాషా వాపోతున్నారు. తిరుపాల్ రెడ్డికి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, సీఐ కొండారెడ్డి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. సీఐ నుంచి తమకు ప్రాణహాని ఉందని సెల్ఫీ వీడియో ద్వారా తమ కష్టాన్ని చెప్పుకొన్నారు. తమకు న్యాయం చేయకపోతే అంతా ఆత్మహత్య చేసుకుంటామని వాపోయారు.  నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన మరువక ముందే.. అక్బర్ బాషా కుటంబంపై వేధింపులు బయటపడడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మైదుకూరులో ముఖ్యమంత్రి జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి ముస్లిం మైనారిటీ అయిన అక్బర్ బాషా భూమిని కబ్జా చేసినట్టు తెలిసిందని అన్నారు. తిరుపాల్ రెడ్డి వర్గానికి చెందిన సీఐ ఒకరు... అక్బర్ ను స్టేషన్లో కూర్చోబెట్టి, అతని పొలంలో దౌర్జన్యంగా నాట్లు వేయించారని చంద్రబాబు తెలిపారు. పైగా ఎన్ కౌంటర్ చేస్తానని బాధితుడిని బెదిరించడం ఇంకా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితుడిపై దౌర్జన్యానికి దిగితే సామాన్యుడికి ఇంకెవరు దిక్కు? అని ప్రశ్నించారు.గతంలో నంద్యాలలో సలీం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని... ఇప్పుడు అక్బర్ కుటుంబం కూడా తమకు అదే దిక్కంటోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలంటూ అక్బర్ కు సూచించారు. అక్బర్ కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్‌రెడ్డి బంధువులు, పార్టీ నేత‌ల‌కు.. అధికార‌ం ఆయుధ‌ంగా, చట్టం చుట్టంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. వారి క‌న్నుప‌డితే క‌బ్జా, ఆశ‌ప‌డితే ఆక్ర‌మ‌ణ.. అన్నట్టుగా తయారైందని విమర్శించారు. కబ్జాలు, ఆక్రమణలపై నిలదీస్తే.. నిర్బంధం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసు వ్య‌వ‌స్థని జ‌గ‌న్‌రెడ్డి.. ఫ్యాక్ష‌న్ సైన్యంగా మార్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో రాక్ష‌స రాజ్యం సాగుతోందన్నారు. కబ్జాలపై స్వయంగా వైసీపీ కార్యకర్తలే బహిరంగా చెప్పే పరిస్థితి వచ్చిందని తెలిపారు. కడప జిల్లా మైదుకూరులో వైసీపీ నాయకుడు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి.. తమ పార్టీకి చెందిన కార్యకర్త పొలాన్నే క‌బ్జా చేశార‌న్నారు. ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్య‌క‌ర్త‌ అక్బర్ బాషా దీనిపై నిలదీసినందుకు..ఎన్‌కౌంట‌ర్ చేస్తామ‌ని మైదుకూరు సీఐ కొండారెడ్డి బెదిరించే పరిస్థితికి వచ్చిందని తెలిపారు. సీఎం సొంత జిల్లా, సొంత పార్టీ కార్య‌క‌ర్త బాషాయే వైసీపీ నేత‌ల అరాచ‌కాల‌కు తాళ‌లేక కుటుంబంతో స‌హా ఆత్మ‌హ‌త్య చేసుకుంటామ‌ని రోధిస్తున్నారన్నారు లోకేష్.  

మాయావతి మారి పోయారా? యూపీలో పాచిక పారేనా? 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు, కొత్త కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త వాగ్దానాలతో ఊరిస్తున్నాయి. ప్రజలలోకి వెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఉత్తర ప్రదేశ్’పై దృష్టిని కేంద్రీకరించాయి.దేశ భవిష్యత్ రాజకీయాలను నిర్ణయించే, యూపీ ఆసెంబ్లీ ఎన్నికలను, అధికార బీజేపీ సహా  అన్ని పార్టీలు అగ్ని పరీక్షగానే భావిస్తున్నాయి. మరో వంక,ఈ సారి ఎన్నికల్లో, కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలు అన్నీ ఒంటరి పోరాటానికి సిద్ద మవుతున్నాయి. ఈ పరిణామలు యూపీ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ప్రస్తుతానికి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, ఎస్పీల మధ్యనే ఉంటుందని అంటున్నారు. అయితే, ఎన్నికల నాటికి, పరిస్థితి మారినా మారవచ్చును, త్రిముఖ, చతుర్ముఖ పోటీ జరిగినా జరగ వచ్చును అంటున్నారు, రాజకీయ పండితులు.గత అసెంబ్లీ, ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఘోరంగా ఓడి పోయిన కాంగ్రెస్ పార్టీ, ఈ సారి పూర్వ వైభవం దిశగా అడుగులు వేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా ఎన్నికలకు పార్టీని సిద్దం చేసే పనిలో నిమగ్న మయ్యారు. ఇందులో భాగంగా, పల్లె పల్లెకు పార్టీని తీసుకు పోయే లక్ష్యంతో , ‘కాంగ్రెస్ ప్రతిజ్ఞ యాత్ర’ పేరిట  12 వేల కిలో మీటర్ల పాద యాత్రను ప్లాన్ చేశారు. అలాగే, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రియాంక నాడు బిగించారు.  అయితే బీఎస్పీ అధినాయకురాలు, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఇతర పార్టీలకు కొంచెం భిన్నంగా గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయనని, ప్రజలకు వాగ్దానం చేస్తున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నారో, అక్కడే వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఆమె అధికారంలో ఉన్న రోజులో ఊరూర నిర్మించిన ఏనుగు (పార్టీ చిహ్నం) బొమ్మలు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షీ రామ్ విగ్రహాలతో పాటుగా మాయావతి సొంత విగ్రహాల రాజకీయ దుమారం సృష్టించాయి. చివరకు ఆ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. సుప్రీం కోర్టు న్యాయవాది ఒకరు, విగ్రహాల నిర్మాణానికి ఖర్చు చేసిన ప్రజా ధనాన్ని, ఆమె నుంచి తిరిగి రాబట్టాలని పిటీషన్ దాఖలు చేశారు. అయితే మాయావతి తమ ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగానే సమర్ధించుకున్నారు. అయోధ్యలో ప్రభుత్వం 221 మీటర్ల రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోందని, అందులో లేని తప్పు, తన  విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పుగా ఎలా మారిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. అలాగే,గుజరాత్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా  పేర్కొంటున్న, సర్దార్ పటేల్ విగ్రహ నిర్మాణానికి రూ.3000 కోట్లు ఖర్చు అయ్యిందని, అయోధ్యలో ఏర్పాటు నిర్మించే రాముడి ప్రతిమకు రూ.200కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. అలాగే జయలలిత, ఎన్టీఆర్, వాజ్‌పేయ్, వైఎస్ఆర్ విగ్రహాలును ప్రజల నిధులతో ఏర్పాటు చేశారని మాయావతి పేర్కొన్నారు. ఆమె వాదన కోర్టులో నిలబడింది కానీ, ప్రజా కోర్టులో ఓడి పోయింది. అందుకే ఇప్పుడు ఆమె, బీఎస్పీ అధికారంలోకి వస్తే, గతంలోలాగా విగ్రహా నిర్మాణం చేపట్టదని, అందు కోసంగా ప్రజాధనం దుర్వినియోగం చేయనని ప్రజలకు వాగ్దానం చేశారు. అలాగే మయావతి గతంలో చేసిన మరో తప్పును కూడా మళ్ళీ చేయనని ప్రజలకు మాటిచ్చారు. గతంలోలాగా, బహుబలులు,గూండాలు, మాఫియా నేతలకు తమ పార్టీ ఈసారి టికెట్ ఇవ్వదని పేర్కొన్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్, తరతమ బేధం లేకుండా బహుబలులను ఏరి వేస్తున్నారు. దీంతో, ప్రజల్లో ఆయన ఇమజ్ పెరిగింది. అందుకే, ఈసారి బహుబలులకు ‘నో టికెట్’ అని మాయావతి ముందుగానే బోర్డు పెట్టేశారు. అందుకే ఇతర పార్టీల విషయం ఎలా ఉన్నా. మాయావతి గత తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుని, చేసిన తప్పులు దిద్దుకోవడం రాజకీయాలలో ఒక మంచి పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, ఆమె ఎంతవరకు  మాట మీద నిలబడతారు .. ఏ మేరకు ప్రజలు ఆమెను విశ్వసిస్తారు అనేది వేరే చర్చ.

సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రత్యేకతలు ఇవే.. 

స్పోర్ట్స్ బైక్ పై వెళుతూ ప్రమాదానికి గురైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు అపోలో హాస్పిటల్ లో చికత్స కొనసాగుతోంది. వైద్యులు ఔట్ ఆఫ్ డేంజర్ అని చెబుతున్నప్పటికి.. ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు. 48 గంటల పాటు సాయి ధరమ్ తేజ్ అబ్జర్వేషన్ అవసరమని వైద్యులు చెప్పారు. సాయిధరమ్ తేజ పై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు అపోలో వైద్యులు. సాయిధరమ్ తేజ ఆరోగ్యం నిలకడగా ఉందని, అన్నీ అవయవాలు సరిగా పని చేస్తున్నాయని చెప్పారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు అక్కడే ఉన్నారు.  హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు గురికావడంతో ఆయన రైడ్ చేసిన వాహనంపై జనాల్లో చర్చ జరుగుతోంది. Sai Dharam Tej యాక్సిడెంట్ కాగానే వెంటనే ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చేశాయి. ఆయన నడిపిన బైక్  విజువల్స్ కూడా వచ్చాయి. తర్వాత సాయి ధరమ్ కేజ్ ప్రమాద విజువల్స్ కూడా బయటికి వచ్చాయి. దీంతో చాలామంది ఆ బైక్ ఏమిటి? ఆ Bike Cost ఎంత ఉంటుంది, ఎంత speedగా వెళ్తుంది, ఎంత పవర్‌ ఉంటుంది, దాని ప్రత్యేకతలు ఏమిటి వంటి వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ వివరాలు మీకోసం.. Sai Dharam Tej నడిపిన బైక్ కంపెనీ పేరు ట్రయంఫ్ (Triumph). సాయి ధరమ్ తేజ్ వాడుతున్న ట్రయంఫ్ బైక్ మోడల్ పేరు స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ (Street Triple RS). Triumph Street Triple RS ధర రూ. 11,61,000 నుంచి మొదలవుతుంది. ఇది ఎక్స్ షో రూం ప్రైస్. యాక్సెసరీస్, రిజిస్ట్రేషన్ ఖర్చులు అన్నీ కలిపితే ధర ఇంకా పెరుగుతుంది.ఇది 765 సీసీ కెపాసిటీ బైక్. 6 గేర్లు ఉంటాయి. ఈ బైక్ బరువు 166 కేజీలు. ఆయిల్ ట్యాంక్ కెపాసిటీ 17.4 లీటర్లు. ఇది లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 13 నుంచి 15 కిలోమీటర్లు వస్తుందని వాడేవారు చెబుతారు. ట్రయంప్ మోటార్ సైకిల్స్ అనేది బ్రిటన్ కంపెనీ. బ్రిటన్‌లో మోటార్ సైకిళ్ల కంపెనీలలో ఇదే టాప్.ఇంగ్లాండ్‌లో కంటే థాయిలాండ్‌లో వీళ్లకు పెద్ద ప్రొడక్షన్ యూనిట్ ఉంది. ఇది సెలబ్రిటీ బైక్. ట్రయంఫ్ మోటార్ సైకిళ్లకు మాంచి క్రేజ్ ఉంది. చాలామంది సెలబ్రిటీల గ్యారేజ్‌లలో ఈ బైక్ కనిపిస్తుంది. అడ్వంచరిస్ట్ Bear Grylls, హాలీవుడ్ యాక్టర్లు David Beckham, Tom Cruise, George Clooney దగ్గర ట్రయంఫ్ బైక్‌లున్నాయి. బాలీవుడ్ యాక్టర్లు విద్యుత్ జామ్‌వాల్, జాన్ అబ్రహం టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ ధోనీ వద్ద కూడా ఈ బైక్ ఉంది.

పీకేతో రేవంత్ రెడ్డి మంత్రాంగం.. గులాబీ బాస్ లో కలవరం!

అసెంబ్లీ ఎన్నికలకు రెండేండ్లకు పైగా సమయం ఉన్నా తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. జనంలో ఎక్కువగా ఉండేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో సత్తా చాటి.. అధికారం దిశగా అడుగులు వేయాలని విపక్షాలు భావిస్తున్నాయి. అదే సమయంలో విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా కొత్త పథకాలు తీసుకొస్తున్నారు సీఎం కేసీఆర్. హుజురాబాద్ లో ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి... ఆ వర్గం ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవాలనే ప్లాన్ చేస్తున్నారు గులాబీ బాస్.  తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలన్ని దళిత బంధు కేంద్రంగానే సాగుతున్నాయి. దళిత బంధుకు తమకు అస్త్రంగా పనికొస్తుందని టీఆర్ఎస్ భావిస్తుండగా... అదే పథకం ద్వారా అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి విపక్షాలు. నిజానికి దళిత ఓటు బ్యాంక్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కొంత టీఆర్ఎస్ కు మెజార్టీ వచ్చినా... ఇప్పటికి ఆ వర్గంలో కాంగ్రెస్ పార్టీకి పట్టుంది. దళిత బంధుతో ఆ వర్గాన్ని తమనుచి పూర్తిగా లాగేయాలని కేసీఆర్ ప్లాన్ చేశారని భావిస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. మరో దారిలో నరుక్కొస్తున్నారు. ఆయన కూడా దళితుల లక్ష్యంగానే తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే దళిత గిరిజన దండోరాలతో జనంలోకి వెళుతున్న రేవంత్ రెడ్డి... కేసీఆర్ కు కలవరం పుట్టించేలా ఎత్తులు వేస్తున్నారని తెలుస్తోంది. దళిత సామాజిక వర్గంలో మంచి పట్టున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవలే ఐఏఎస్ కు గుడ్ బై చెప్పి బీఎస్పీలో చేరారు. బహుజనవాదంతో బీఎస్పీ బలోపేతం కోసం జిల్లాలు చుట్టేస్తున్నారు.  ప్రవీణ్ కుమార్ కు దళితులు, బీసీ వర్గాల నుంచి మంది స్చందనే వస్తోంది. ఉద్యోగులు, విద్యావంతులు ఆయనకు మద్దతుగా ఉంటున్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన దళితు బంధుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు పీకే.  దీంతో పీకే కేంద్రంగా రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు రేవంత్ రెడ్డి. దళిత వర్గంలో మంచి పట్టున్న పీకేతో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పీకే సారథ్యంలోని బీఎస్పీతో కాంగ్రెస్ పొత్తు ఉండేలా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రవీణ్ కుమార్ తో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారని అంటున్నారు. పీకే నుంచి సానుకూలత వచ్చిందని అంటున్నారు. ఇటీవలే పీసీసీ ముఖ్య నేతలంతా ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన భేటీలో తెలంగాణ ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారట. రాహుల్ సమావేశంలోనే పీకే అంశం ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు. దళిత వర్గంలో పట్టున ప్రవీణ్ కుమార్ తో కలిసి పోతే లాభం ఉంటుందనే అభిప్రాయమే వ్యక్తమైందట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మహా కూటమి ఏర్పాటు చేసింది. సో వచ్చే ఎన్నికల్లోనూ బీఎస్పీతో పొత్తుకు పెద్దగా ఇబ్బంది ఉండదని నేతలు చెప్పారట. దీంతో తెలంగాణలో బీఎస్పీతో పొత్తుకు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. రాహుల్ నుంచి సిగ్నల్స్ రావడంతోనే.. రేవంత్ రెడ్డి దూతగా  కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్.. ప్రవీణ్ కుమార్ ను కలిసి చర్చించారని అంటున్నారు.  ప్రవీణ్ కుమార్ తో సమావేశం తర్వాత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యల్లోనూ  రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయనే సంకేతమే ఇచ్చారు.  కాంగ్రెస్, బీస్పీల మధ్య తేడా లేదని.. భవిష్యత్ లో తామిద్దరూ కలిసి పనిచేయవచ్చని దయాకర్ అన్నారు. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు ప్రవీణ్ కుమార్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ పరిణామాలతో టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన నెలకొందని చెబుతున్నారు. బీఎస్పీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే.. తమకు భారీగా నష్టం జరుగుతుందనే అంచనాలో గులాబీ బాస్ ఉన్నారట. పీకే కాంగ్రెస్ తో కలిసి పోతే దళిత బంధు వంటి పథకాలతోనూ తమకు ప్రయోజనం కల్గదనే కలవరంలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు.

భవానీపుర్ లో లక్ష మెజారిటీ టార్గెట్! మమతకు పోటీగా బీజేపీ ప్రియాంక..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ.. భవానీపుర్‌ శాసనసభ స్థానానికి నామినేషన్‌ వేశారు. సెప్టెంబర్ 30న ఈ నియోజక వర్గంలో ఉప ఎన్నిక జరగనుంది. ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ అఖండ విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికల్లో  నందిగ్రామ్ నుంచి పోటీచేసిన మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్ధి, ప్రస్తుత శాసన సభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి చేతలో ఓడి పోయారు. అయినా ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భవానీపుర్ నుంచి ఎన్నికైన తృణమూల్ ఎమ్మెల్యే సోబన్దేవ్ ఛటోపాధ్యాయ, రాజీనామా చేసి మమత కోసం  సీటును సిద్ధం చేశారు.  కరోనా పరిస్థితుల దృష్ట్యా, గడవులోగా ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహిస్తుందా లేదా, అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 3న ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల చేసింది. అనుమానాలకు తెరదించింది. ఈ నెల (సెప్టెంబర్) 30న భవానిపుర్ నియోజక వర్గంలో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడతాయి..భవానీపుర్ తో పాటుగానే మరో రెండు అసెంబ్లీ నియోజక వర్గాలలో కూడా అదే రోజున పోలింగ్ జరుగుతుంది.  ఈ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ గెలుపుకు సంబంధించి ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఇదే స్థానం నుంచి ఆమె గతంలో రెండు మార్లు భారీ మెజారిటీతో గెలిచారు. గత ఏప్రిల్’ లో జరిగిన ఎన్నికల్లోనూ తృణమూల్ అభ్యర్ధి సోబన్దేవ్ ఛటోపాధ్యాయ 28 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో పోటీ చేస్తున్న ఆమె  విజయం పల్లేరు మీద బండిలా సాగిపోతుందని పరిశీలకులు భావిస్తున్నారు.  అయితే గత ఎన్నికల్లో, కాంగ్రెస్, వామపక్ష కూటమి పూర్తిగా తుడిచి పెట్టును పోయిన నేపధ్యంలో  రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ కు ఏకైక ప్రత్యాన్మాయంగా మిగిలిన బీజీపీ,మమతకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఆ పార్టీ  తరఫున న్యాయవాది ప్రియాంక తిబ్రీవాల్ పోటీకి దిగుతున్నారు. జాతీయ స్థాయిలో మారిన రాజకీయ సమీకరణల నేపధ్యంలో కాంగ్రెస్. పోటీకి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించింది. సిపిఎం తమ అభ్యర్ధిని నిలుపుతామని ప్రకటించింది. అయితే, ఈ ఉప ఎన్నికలో మమతా బెనర్జీ గెలుపు విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు, అయితే ఆమె ఎంత మెజారిటీతో గెలుస్తారు? తృణమూల్ నాయకులు  చెపుతున్నట్లుగా లక్ష మెజారిటీ సాధ్యమా అన్నదే ప్రశ్న.  బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్ ప్రియాంకకు ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరుంది. దీంతో భవానీపూర్ లో మమత గెలుపును ఆపలేకపోయినా.. మెజార్టీ మాత్రం భారీగా ఉండకుండా బీజేపీ ఎత్తులు వేస్తుంది. 

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌కు సీరియస్ 

మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.  స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్‌ తేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలో వెళ్లారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం సాయిధరమ్‌ తేజ్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. చికిత్స తర్వాత సాయి ధరమ్ తేజ్ సృహలోకి వచ్చారని, ప్రమాదం ఏమి లేదని డాకర్టు చెప్పినట్లు తెలుస్తోంది.  జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి గచ్చిబౌలి వైపు వెళుతుండగా సాయి ధరమ్ తేజ్ బైక్.. కేబుల్ బ్రిడ్జి తర్వాత కోహినూర్ హోటల్ వద్ద స్కిడ్ అయింది. ప్రమాదం సమయంలో బైక్ అతి వేగంగా ఉండటంతో సాయి ధరమ్ తేజ్ కడుపు, ఛాతీ, కుడికన్నుపై గాయాలయ్యాయి.  బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు మాదాపూర్‌ సీఐ తెలిపారు. అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా?అన్న అనుమానంతో సాయిధరమ్‌ తేజ్‌కు వైద్యులు స్కాన్‌ చేస్తున్నారని, ప్రమాద వార్తను కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు సీఐ వివరించారు.

పక్కా ప్రణాళికతో ప్రవీణ్ అడుగులు.. బహుజనవాదులంతా ఏకమయ్యేనా? 

తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు, హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే, ఈ ఎన్నికల్లో ఓడితే  రాజకీయ మహాప్రళయం తప్పదన్న విధంగా, హుజూరాబాద్ ఉప ఎన్నికను సవాలుగా స్వీకరించారు. చావో రేవో అన్న రీతిలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరో వంక మాజీ మంత్రి,ఈటల రాజేందర్, అవమానభారంతో రగిలి పోతున్నారు. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ మధ్య  సాగుతున్న పోరు రోజురోజుకు  రాష్ట్ర రాజకీయాలలో  వేడిని పెంచుతోంది. ఉప ఎన్నిక ఇప్పట్లో జరగదని స్పష్టమైనప్పటికీ, తెరాస, బీజీపీ వ్యూహ, ప్రతి వ్యూహాలతో ఉదృతంగా ప్రచారం సాగిస్తున్నాయి.  అయితే బహుజన వాదంతో ఇటీవల రాజకీయ తీర్ధం పుచ్చుకున్న మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ కుమార్, 2023 శాసన సభ ఎన్నికలు లక్ష్యంగా సామాజిక సమీకరణాల కూర్పులో నిమగ్న మయ్యారు. రాజకీయ అనుబంధాలను పక్కన పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యమ నాయకులను కలుస్తున్నారు. బహుజనులను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలలో  భాగంగా ఇప్పటికే ఎమార్పీస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగాను, అదే విధంగా, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షడు, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యను కలిసిన ప్రవీణ్ కుమార్, గురువారం మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తో సమావేశ మయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం  మీడియాతో మాట్లాడిన సమయంలో అయన ఎక్కడా కూడా పెద్దగా రాజకీయాల ప్రస్తావన తీసుకురాలేదు.  బహుజన ఐక్యత గురించి, ఆధిపత్య కులాల రాజకీయ కుట్రల గురించి మాత్రమే ప్రస్తావించారు. బహుజన సమాజం, ఎస్సీఎస్టీ, బీసీలు ఇతర  బడుగు, బలహీన వర్గాలు, పేదలు  ఏకం కాకుండా చేసేందుకు ఆధిపత్య కులాలు సాగిస్తున్న దళిత బంధు వంటి కుట్రల గురించి మాత్రమే ప్రస్తావించారు. అలాగే, మాల మాదిగల మధ్యగల వర్గీకరణ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, బహుజనుల విస్తృత ప్రయోజనాలను దృషిలో ఉంచుకుని, సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ దిశగా ఆయన ఇంతవరకు ఇటు దయాకర్,అటు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కృష్ణ మాదిగా, ఇతర నేతలు  సాగించిన ప్రయత్నాలను కొనియాడారు. అలాగే, బహుజన ఐక్యత,  బహుజన రాజ్య స్థాపన లక్ష్యంగా ఇంకా ముందుకు తీసుకువెళ్ల వలసిన అవసరాన్ని ప్రస్తావించారు.  ప్రవీణ కుమార్ బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య, మాదిగ నేత కృష్ణ మాదిగను కలవడం, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా అయిన, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్’ను కలవడం ఒకటిగా చూడలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రవీణ కుమార్, అద్దంకి దయాకర్ రెండు వేర్వేరు రాజకీయ పార్టీలకు ప్రతినిధులు కూడా కావడంతో, వీరి భేటీకి మరింత ప్రాధాన్యత ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. అదలా, ఉంటే ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. భవిష్యత్’లో తామిద్దరూ కలిసి పనిచేయవచ్చని దయాకర్ అన్నారు. అలాగే,కాంగ్రెస్మ బీస్పీల మధ్య తేడా లేదని అన్నారు.అంటే, దయాకర్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినా, ఈ వ్యాఖ్యలకు రాజకీయ  ప్రాధాన్యత ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, దయాకర్ బీఎస్పీలో చేరతారా లేక కాంగ్రెస్, బీఎస్పీల మధ్య పొట్టు కుడురుతుందా అనేడి స్పష్టం కాకపోయినా, ప్రవీణ్ కుమార్ సామాజిక సమీకరణాలతో కొత్త ప్రయత్నం చేస్తున్నారని మాత్రం స్పష్టమవుతోంది.

పండుగ పూట పస్తులుండటమే బంగారు తెలంగాణ! జీతాలు రాని జీహెచ్ఎంసీ ఉద్యోగుల ఆవేదన.. 

తెలంగాణ ధనిక రాష్ట్రం.. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణనే టాప్... ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ చెప్పే మాటలు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చారని విపక్షాలు ఆరోపణలు చేస్తుండగా.. తెలంగాణ ఖచ్చితంగా ధనిక రాష్ట్రమేనని బల్లగుద్ది మరీ చెబుతున్నారు కేసీఆర్. ఇటీవలే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారు. హుజురాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. హుజురాబాద్ లో ఓట్ల కోసమే దళిత బంధు తెచ్చారని విపక్షాలు ఆరోపిస్తుండగా.. ఓట్ల కోసం కాదు రాష్ట్రమంతా అమలు చేస్తామని చెప్పారు, అంతేకాదు రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇచ్చినా లక్షా 70 వేల కోట్ల రూపాయలు అవుతాయని... అది పెద్ద లెక్క కాదని స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే ఒక్క పథకానికి లక్షా 70 వేల కోట్ల ఖర్చు చేస్తామని చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వంలో.. ఒకటో తారీఖు దాటి 10 రోజులైనా కొందరు ఉద్యోగులకు వేతనాలు రాని పరిస్థితి నెలకొంది.  జీహెచ్ఎంసీ ఉద్యోగులకు పదో తారిఖీ వచ్చినా జీతాలు అందలేదు. నిజానికి పండుగల వేళ ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు.. ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సాధారణ రోజుల కంటే ముందుగా వేతనాలు చెల్లిస్తాయి. కానీ రూ.6 వేల కోట్ల పైచిలుకు బడ్జెట్‌.. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర విస్తరించిన ఉన్న జీహెచ్‌ఎంసీ మాత్రం సాధారణ చెల్లింపు తేదీ దాటి పది రోజులైనా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేదు. తక్కువ వేతనాలుండే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకూ ఇప్పటికీ జీతాలు జమ కాలేదు. దీంతో చిరు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వినాయక పండుగ పూట తమ కుటుంబాలు పస్తులుండాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  గ్రేటర్‌ హైదరాబాద్ లోని  ప్రధాన, జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల పరిధిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్లు, ఇతర విధుల్లో 3,500మంది వరకు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులున్నారు. అనుభవం, చేసే పనిని బట్టి రూ.15 వేల నుంచి 17 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. పారిశుధ్య, ఎంటమాలజీ అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు 20 వేల మంది వీరికి అదనం. తక్కువ వేతనాలు ఉండే అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి మొదటి దఫాలో వేతనాలు చెల్లించాలని గతంలో కమిషనర్‌ డీఎస్‌ లోకే‌షకుమార్‌ ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కొన్ని నెలలుగా కేడర్‌ ప్రాతిపదికన వేతనాల చెల్లింపు జరుగుతోంది. ఈ నెల మాత్రం 10వ తేదీ వచ్చినా.. ఇప్పటికీ కొందరు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు అందలేదు. దాదాపు 30 శాతం మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు రాలేదని చెబుతున్నారు.  శుక్రవారం వినాయక చవితి, తర్వాత రెండో శనివారం,  ఆదివారం కావడంతో.. 13 లేదా 14 తేదీల్లోనే వారికి వేతనాలు అందే అవకాశముంది. ‘పండుగ వేళ జీతం ఇవ్వకుంటే ఎలా..? ఇంట్లో పూజ కోసం వస్తువులు కొనాలని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రతి నెలా రెగ్యులర్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు కలిపి రూ.118 కోట్లు చెల్లించాల్సి ఉంది. పీఆర్‌సీ ఈ నెల నుంచి చెల్లిస్తుండడంతో ఆ మొత్తం రూ.145 కోట్లకు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పీఆర్‌సీ చెల్లింపుపై జీహెచ్‌ఎంసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కొత్త పీఆర్సీ లేదు.. పాత వేతనాలైనా సరిగ్గా ఇవ్వడం లేదు. ప్రతి నెలా జాప్యం జరుగుతుందని, వినాయక చవితి పండుగ ఉన్నా అధికారులు జీతాలు ఇవ్వడంలో విఫలమయ్యారని ఉద్యోగులు భగ్గుమంటున్నారు. పది రోజులైనా జీతాలు ఇవ్వకపోవడం, పండుగ పూట ఉద్యోగులకు పస్తులుంచడమే బంగారు తెలంగాణ అవుతుందా కేసీఆర్ అంటూ కొందరు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. 

వాడవాడలా వినాయక చవితి వేడుకలు.. 

దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. వినాయక ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. విఘ్నేశ్వరుడికి పూజలు చేసి.. తమకున్న విఘ్నాలన్ని తొలగిపోవాలని మొక్కుకున్నారు.  వాడవాడలా వెలిసిన మండపాల్లో గణనాథులను ప్రతిష్టించి ప్రజలు పూజలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఎక్కడ చూసిన గణేష్ పండుగ సందడే కనిపిస్తోంది. గల్లిగల్లీలోనూ విగ్రహాలను ఏర్పాటు చేశారు. మండపాలను ప్రత్యేక అలంకరించి పూజలు చేస్తున్నారు. ఇండ్లలోనూ వినాయక ప్రతిమలకు ప్రజలు పూజలు చేస్తున్నారు. వినాయక చవితి పండుల వచ్చిందంటే పిల్లలకు సంబరమే. అందుకే చిన్నారులు తమకిష్టమైన పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు.  వినాయక చవితి వేడుకలు అనగానే గుర్తుకు వచ్చే ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర తొలిరోజే మహా సందడి కనిపించింది. ఈసారి 40 అడుగులఎత్తుతో గణేష్‌కు కుడిమైపున కాల నాగేశ్వరీ, ఎడమవైపు కృష్ణకాళీ అమ్మవారు ఉన్న విగ్రహాని రూపొందించారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై  తొలి పూజ నిర్వహించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజల్లో పాల్గొన్నారు. మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.  ఏపీలోని కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా ఏకాంతంగా అర్చకులు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. శనివారం ధ్వజారోహణం, రాత్రి హంస వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ నెల 19న ఏకాంత సేవతో వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.  ఏపీలో ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో బహిరంగ ప్రదేశాల్లో  మండపాలను ఏర్పాటు చేయలేదు. ఇండ్లలోనే పూజలు చేసుకుంటున్నారు.  గణేష్‌ ఉత్సవాల దృష్ట్యా ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. భక్తులు సొంత వాహనాల్లో రావద్దని ట్రాఫిక్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు. మెట్రో, ఎంఎంటీఎస్‌, బస్సుల్లో రావాలని పోలీసులు వినతి చేశారు. హెచ్‌ఎండీఏ పార్కింగ్‌ స్థలంలో వాహనాల పార్కింగ్‌కు అనుమతినిచ్చారు. వృద్ధులు, నడవలేని వారికి మింట్‌ కాంపౌండ్‌లో పార్కింగ్‌కు అనుమతి ఇచ్చారు. ఖైరతాబాద్‌ ప్రధాన మార్గంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌లో ఈనెల 19 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు