కేంద్ర మంత్రికి కేసీఆర్ విందు.. ఫెవికాల్ బంధం నిజమేనా?
రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శతృవులూ ఉండరు. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. అయితే అదేదో బహిరంగంగా ఉంటే అదో రకం.. కానీ, చాటుమాటు సంబందాలే కొంచెం చికాకు పరుస్తాయి. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ వ్యవహారాలు అనుమానాలకు ఆస్కారం కలిపిస్తాయి. బీజేపీ, తెరాస సంబంధాల విషయంలో అదే జరుగుతోంది. అందులోనూ ఒకరికి అలాంటి పుకార్లు రాజకీయంగా అవసరం కూడా అయినప్పుడు మీడియా లీకులకు కొదవుండదు. అందుకే ఇప్పడు తెలంగాణాలో తెరాస, బీజేపీల మధ్య ఉందో లేదో తెలియని పుకార్ల ప్రేమ హాట్ హాట్ గా మారింది. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసినా, కేంద్ర మంత్రులు హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రిని కలిసినా, అదే జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో తెరాస, బీజేపీల మధ్య యుద్ధమే నడుస్తోంది. రాష్టంలో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ పాదయాత్ర సాగిస్తున్నారు. పాదయాత్ర పొడుగునా ఆయన కేసీఆర్ ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతున్నారు. విరుచుకు పడుతున్నారు. ముఖ్యమంత్రి అవినీతిని ప్రస్తావిస్తూ ఆయనకు జైలు ఖాయమని హెచ్చరిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో మాజీ మంత్రి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కత్తులు దూస్తున్నారు. ఇటు కేసీఆర్ కు అటు అధికార పార్టీ ప్రచార బాధ్యతలు చేపట్టి, చెలరిగి పోతున్న మంత్రి హరీష్ రావుకు సవాళ్ళు విసురుతున్నారు. వాళ్ళూ వీళ్ళూ ఎందుకు ఫేస్ టూ ఫేస్ చూసుకుందాం రా అని తొడలు చరుస్తున్నారు. ఇలాంటి వేడి వాతావరణంలో హైదరాబాద్ వచ్చిన బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు ప్రగతి భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ తో విందు వినోదాల్లో పాల్గొనడం, మంతనాలు జరపడం రాష్ట్ర నాయకత్వాన్ని ఇరకాటంలోకి నెట్టివేస్తోంది. పలు అనుమానాలకు తావిస్తోంది.
నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ బీజేపీ, తెరాస మద్య రహస్య బంధం ఉందని, ఆరోపించేందుకు ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చక్కని అవకాశం చిక్కుతోంది. ఇటీవలనే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీ,తెరాస బంధం ఎప్పటికీ విడిపోని ఫెవికాల్ బంధం అని సైటైర్లు వేశారు. మీడియా కూడా అదే తరహాలో కథనాలు వండుతోంది. దీంతో సహజంగానే ప్రజల్లో, పార్టీ క్యాడర్ లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసినా, రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసినా, ఎన్నిగంటలు చర్చలు జరిపినా అవి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చలుగానే చూడాలి, కానీ, రెండు రాజకీయ పార్టీల మధ్య జరిగిన రాజకీయ చర్చలుగా చూడరాదు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో, ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి, వెళ్ళిన పని ముగించుకుని చక్కా వెనక్కి రాకుండా, అక్కడే తిష్ట వేసినా, రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రితో లంచ్ చేసినా అనుమానాలు వస్తాయి. ఇప్పుడు అదే జరిగింది.
ఒక అధికార కార్యక్రమాలో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతీరాధిత్య సింథియా ఆ తర్వాత ముఖ్యమంత్రిని ప్రగతి భవన్ లో కలిశారు. సహజంగా మరే ఇతర రాష్ట్రంలో అయినా ఇలాంటి సమావేశాలు సచివాలయంలో జరుగుతాయి. కానీ,తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించినంత వరకు ఇల్లే సచివాలయం, సచివాలయమే ఇల్లు. అన్నీ ప్రగతి భవనే.. కాబట్టి ఎలాంటి సమావేశాలు అయినా, అక్కడే జరుగుతాయి. జ్యోతీరాధిత్య సింథియా కూడా అక్కడే ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.దీంతో మళ్ళీ మరోమారు ఫెవికాల్ బంధం చర్చకు వచ్చింది.
కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉన్నాయని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌తో బీజేపీ రాజకీయ పోరాటం కొనసాగుతోందన్నారు. తెలంగాణలో అధికారమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేయడంతో పాటుగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలవటమే రాష్ట్రంలో బీజేపీ బల పడుతోంది అనేందుకు నిదర్శనమని చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే స్థానానికి పరిమితమైనప్పటకీ మూడేళ్ళల్లో బీజేపీ బలపడిందన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సైతం అధికార టీఆర్ఎస్ కంటే బీజేపీ అత్యధిక స్థానాలు సాధించిందన్నారు.
అయితే ఎన్ని చెప్పినా, ఎంత చేసినా, అధికార, రాజకీయ సంబంధాల మధ్య ఉండే సన్నని గీత విషయంలో బీజేపే నాయకులు, కేంద్ర మంత్రులు జాగ్రత్త పడక పోతే. ప్రజలు అదే నిజమని నమ్మే ప్రమాదం నుంచి తప్పించుకోలేరని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ, అధికార తెరాస 20 ఏళ్ల ప్రస్థానంలో కాంగ్రెస్, తెలుగు దేం, సహా అన్ని పార్టీలతో పొట్టు పెట్టుకుంది కానే, ఇంతవరకు బీజేపీతో ఏ ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకోలేదు. భవిష్యత్ లో కూడా పెట్టుకోదు. కానీ అవసరం అనుకుంటే పుకార్లకు మాత్రం స్వాగతం పలుకుతుంది. ఇప్పడు జరుగుతుంది కూడా అదే..