అక్కడ గొడుగు.. ఇక్కడ బెదిరింపు.. జగన్ పాలనలో ఏపీ అథోగతి!
posted on Sep 11, 2021 @ 8:21PM
రెండేళ్లుగా ఏపీకి పెట్టుబడులే రావట్లేదు. రాష్ట్రంలో ఒక్క ప్రముఖ కంపెనీ కూడా ఏర్పాటు కావట్లేదు. ఏపీకి ఏమైంది? పెట్టుబడిదారులు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఉన్న కంపెనీలే రాష్ట్ర ప్రభుత్వానికి భయపడి పరిపోయే దుస్థితి! ఇక కొత్త పరిశ్రమలను ఏం ఆశిస్తాం! అదే సమయంలో తెలంగాణకు మాత్రం వరుసబెట్టి కంపెనీలు క్యూ కడుతున్నాయి. వేల కోట్ల పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి. రెండు తెలుగురాష్ట్రాల మధ్య తేడా ఏముంది? తెలంగాణతో పోలిస్తే ఏపీ ఎందులో తక్కువ? ఇలా అనేక ప్రశ్నలు. ఈ అనుమానాలన్నిటికీ జస్ట్ ఓ ఫోటోతో క్లారిటీ వచ్చేస్తుంది. పాలకులే ఏపీకి శాపంగా మారారని.. అధికార పార్టీ నేతల వల్లే రాష్ట్రం తిరోగమనం పాలవుతోందని తేలిపోతోంది. ఒక్క ఫోటోతో తెలంగాణ, ఏపీకి మధ్య ఉన్న తేడా సుస్పష్టం అవుతోంది.
ఈ ఫోటో ఒక్కటి చాలు పారిశ్రామికవేత్తలకు తెలంగాణ సర్కారు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో చెప్పడానికి. ఇటీవల మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ సీఈఓ సీపీ గుర్నానీ తెలంగాణకు వచ్చినప్పుడు మంత్రి కేటీఆర్ స్వయంగా ఆయనకు ఇలా గొడుగు పట్టారు. గత వారం సీపీ గుర్నానీ హైదరాబాద్ వచ్చారు. సనత్ నగర్ లోని సెయింట్ థెరిస్సా ఆసుపత్రితో పాటు ఏటూరు నాగారం ఆసుపత్రికీ మహీంద్రా కంపెనీ అందించిన ఆక్సిజన్ ప్లాంట్‌లను ఆయన ప్రారంభించారు. ఆ సమయంలో వర్షం పడుతూ ఉంటే.. గుర్నానీకి కేటీఆర్ గొడుగు పట్టారు. ఓ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు.. తనకు గొడుగు పట్టడం చూసి గుర్నానీ అవాక్కయ్యారని అంటున్నారు. ఇంత మంచి నడవడిక చూపిస్తే.. ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టమంటే ఎందుకు నిరాకరిస్తారు చెప్పండి.
అలాగే ఇటీవల కేరళకు చెందిన కైటెక్స్ అనే ప్రముఖ టెక్స్‌టైల్ కంపెనీ యజమానికి సైతం స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి.. ఉదయం కేరళ నుంచి తెలంగాణ రప్పించి.. మధ్యాహ్నం హెలికాప్టర్‌లో వరంగల్‌కు తీసుకెళ్లి.. సాయంత్రం కల్లా వెయ్యి కోట్లతో టెక్స్‌టైల్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించేలా చేశారు మంత్రి కేటీఆర్. ఇలాంటి రెడ్‌కార్పెట్ స్ట్రాటజీ వల్లే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి. ఇక ఏపీ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిదేమో. ఓసారి ఈ ఫోటో చూడండి.. సర్వం బోధపడుతుంది....
చూశారుగా.. వైసీపీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. కియా కంపెనీ ప్రతినిధిని ఎలా బెదిరిస్తున్నారో. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఖబడ్దార్ అన్నట్టూ కియా ఉన్నతోద్యోగిని ఎంపీ మాధవ్ ఓ సమావేశంలో ఇలా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన విజువల్స్ అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇలా బెదిరిస్తే పెట్టుబడులు వస్తాయా? ఉన్న కంపెనీలు వెళ్లిపోతాయా? వైసీపీ పాలకులకే తెలియాలి. ఇటు కేటీఆర్, అటు మాధవ్ ఫోటోలతో.. వైసీపీ పాలనను సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు నెటిజన్లు.
జగన్‌రెడ్డి సర్కారు ఒక్క కొత్త కంపెనీనైనా తీసుకురాలేదు.. కనీసం అప్పటికే వచ్చిన కంపెనీలనైనా కాపాడారా అంటే అదీ లేదు. వైసీపీ పాలనా తీరును చూసి ఉన్న సంస్థలే ఏపీని విడిచి పారిపోతున్నాయి. గతంలో విశాఖలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్న లులూ గ్రూపు ఒప్పందాన్ని రద్దు చేసుకుని మరీ వెళ్లిపోయింది. అల్లానా కంపెనీ కూడా అదే దారిలో ఉంది. కియా తన కంపెనీ విస్తరణను రద్దు చేసుకుంది. చిత్తూరు నుంచి రిలయెన్స్ సంస్థ సైతం భూములు తిరిగిచ్చేసి మరీ తప్పించుకుపోయింది. ఇక, అమరరాజా విషయంలో జగన్‌రెడ్డి ప్రభత్వ తీరు మరింత దారుణంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. దశాబ్దాలుగా ఏపీకి తలమానికంగా ఉంటూ.. వేలాది మందికి ఉపాధి చూపిస్తూ.. ప్రభుత్వానికి వేల కోట్ల పన్నులు చెల్లిస్తున్న అమరరాజా గ్రూపును పొల్యూషన్ సాకుతో ఏపీ నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓవైపు తెలంగాణ సర్కారు అలా గొడుగు పట్టి.. విమానాలు పంపించి.. పెట్టుబడులను ఆకర్షిస్తుంటే.. వైసీపీ పాలకులు మాత్రం ఇలా బెదిరింపులతో ఏపీని పారిశ్రామికంగా అథోగతి పాలు చేస్తున్నారని మండిపడుతున్నారు ప్రజలు.