మాయావతి మారి పోయారా? యూపీలో పాచిక పారేనా?
posted on Sep 11, 2021 @ 12:48PM
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు, కొత్త కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త వాగ్దానాలతో ఊరిస్తున్నాయి. ప్రజలలోకి వెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఉత్తర ప్రదేశ్’పై దృష్టిని కేంద్రీకరించాయి.దేశ భవిష్యత్ రాజకీయాలను నిర్ణయించే, యూపీ ఆసెంబ్లీ ఎన్నికలను, అధికార బీజేపీ సహా అన్ని పార్టీలు అగ్ని పరీక్షగానే భావిస్తున్నాయి. మరో వంక,ఈ సారి ఎన్నికల్లో, కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలు అన్నీ ఒంటరి పోరాటానికి సిద్ద మవుతున్నాయి. ఈ పరిణామలు యూపీ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ప్రస్తుతానికి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, ఎస్పీల మధ్యనే ఉంటుందని అంటున్నారు. అయితే, ఎన్నికల నాటికి, పరిస్థితి మారినా మారవచ్చును, త్రిముఖ, చతుర్ముఖ పోటీ జరిగినా జరగ వచ్చును అంటున్నారు, రాజకీయ పండితులు.గత అసెంబ్లీ, ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఘోరంగా ఓడి పోయిన కాంగ్రెస్ పార్టీ, ఈ సారి పూర్వ వైభవం దిశగా అడుగులు వేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా ఎన్నికలకు పార్టీని సిద్దం చేసే పనిలో నిమగ్న మయ్యారు. ఇందులో భాగంగా, పల్లె పల్లెకు పార్టీని తీసుకు పోయే లక్ష్యంతో , ‘కాంగ్రెస్ ప్రతిజ్ఞ యాత్ర’ పేరిట 12 వేల కిలో మీటర్ల పాద యాత్రను ప్లాన్ చేశారు. అలాగే, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రియాంక నాడు బిగించారు.
అయితే బీఎస్పీ అధినాయకురాలు, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఇతర పార్టీలకు కొంచెం భిన్నంగా గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయనని, ప్రజలకు వాగ్దానం చేస్తున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నారో, అక్కడే వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఆమె అధికారంలో ఉన్న రోజులో ఊరూర నిర్మించిన ఏనుగు (పార్టీ చిహ్నం) బొమ్మలు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షీ రామ్ విగ్రహాలతో పాటుగా మాయావతి సొంత విగ్రహాల రాజకీయ దుమారం సృష్టించాయి. చివరకు ఆ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. సుప్రీం కోర్టు న్యాయవాది ఒకరు, విగ్రహాల నిర్మాణానికి ఖర్చు చేసిన ప్రజా ధనాన్ని, ఆమె నుంచి తిరిగి రాబట్టాలని పిటీషన్ దాఖలు చేశారు. అయితే మాయావతి తమ ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగానే సమర్ధించుకున్నారు.
అయోధ్యలో ప్రభుత్వం 221 మీటర్ల రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోందని, అందులో లేని తప్పు, తన విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పుగా ఎలా మారిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. అలాగే,గుజరాత్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా పేర్కొంటున్న, సర్దార్ పటేల్ విగ్రహ నిర్మాణానికి రూ.3000 కోట్లు ఖర్చు అయ్యిందని, అయోధ్యలో ఏర్పాటు నిర్మించే రాముడి ప్రతిమకు రూ.200కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. అలాగే జయలలిత, ఎన్టీఆర్, వాజ్‌పేయ్, వైఎస్ఆర్ విగ్రహాలును ప్రజల నిధులతో ఏర్పాటు చేశారని మాయావతి పేర్కొన్నారు. ఆమె వాదన కోర్టులో నిలబడింది కానీ, ప్రజా కోర్టులో ఓడి పోయింది.
అందుకే ఇప్పుడు ఆమె, బీఎస్పీ అధికారంలోకి వస్తే, గతంలోలాగా విగ్రహా నిర్మాణం చేపట్టదని, అందు కోసంగా ప్రజాధనం దుర్వినియోగం చేయనని ప్రజలకు వాగ్దానం చేశారు. అలాగే మయావతి గతంలో చేసిన మరో తప్పును కూడా మళ్ళీ చేయనని ప్రజలకు మాటిచ్చారు. గతంలోలాగా, బహుబలులు,గూండాలు, మాఫియా నేతలకు తమ పార్టీ ఈసారి టికెట్ ఇవ్వదని పేర్కొన్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్, తరతమ బేధం లేకుండా బహుబలులను ఏరి వేస్తున్నారు. దీంతో, ప్రజల్లో ఆయన ఇమజ్ పెరిగింది. అందుకే, ఈసారి బహుబలులకు ‘నో టికెట్’ అని మాయావతి ముందుగానే బోర్డు పెట్టేశారు. అందుకే ఇతర పార్టీల విషయం ఎలా ఉన్నా. మాయావతి గత తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుని, చేసిన తప్పులు దిద్దుకోవడం రాజకీయాలలో ఒక మంచి పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, ఆమె ఎంతవరకు మాట మీద నిలబడతారు .. ఏ మేరకు ప్రజలు ఆమెను విశ్వసిస్తారు అనేది వేరే చర్చ.