వాడవాడలా వినాయక చవితి వేడుకలు..
posted on Sep 10, 2021 @ 12:39PM
దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. వినాయక ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. విఘ్నేశ్వరుడికి పూజలు చేసి.. తమకున్న విఘ్నాలన్ని తొలగిపోవాలని మొక్కుకున్నారు. వాడవాడలా వెలిసిన మండపాల్లో గణనాథులను ప్రతిష్టించి ప్రజలు పూజలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఎక్కడ చూసిన గణేష్ పండుగ సందడే కనిపిస్తోంది. గల్లిగల్లీలోనూ విగ్రహాలను ఏర్పాటు చేశారు. మండపాలను ప్రత్యేక అలంకరించి పూజలు చేస్తున్నారు. ఇండ్లలోనూ వినాయక ప్రతిమలకు ప్రజలు పూజలు చేస్తున్నారు. వినాయక చవితి పండుల వచ్చిందంటే పిల్లలకు సంబరమే. అందుకే చిన్నారులు తమకిష్టమైన పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు.
వినాయక చవితి వేడుకలు అనగానే గుర్తుకు వచ్చే ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర తొలిరోజే మహా సందడి కనిపించింది. ఈసారి 40 అడుగులఎత్తుతో గణేష్‌కు కుడిమైపున కాల నాగేశ్వరీ, ఎడమవైపు కృష్ణకాళీ అమ్మవారు ఉన్న విగ్రహాని రూపొందించారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై తొలి పూజ నిర్వహించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజల్లో పాల్గొన్నారు. మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఏపీలోని కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా ఏకాంతంగా అర్చకులు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. శనివారం ధ్వజారోహణం, రాత్రి హంస వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ నెల 19న ఏకాంత సేవతో వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఏపీలో ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో బహిరంగ ప్రదేశాల్లో మండపాలను ఏర్పాటు చేయలేదు. ఇండ్లలోనే పూజలు చేసుకుంటున్నారు.
గణేష్ ఉత్సవాల దృష్ట్యా ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తులు సొంత వాహనాల్లో రావద్దని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. మెట్రో, ఎంఎంటీఎస్, బస్సుల్లో రావాలని పోలీసులు వినతి చేశారు. హెచ్‌ఎండీఏ పార్కింగ్ స్థలంలో వాహనాల పార్కింగ్‌కు అనుమతినిచ్చారు. వృద్ధులు, నడవలేని వారికి మింట్ కాంపౌండ్‌లో పార్కింగ్‌కు అనుమతి ఇచ్చారు. ఖైరతాబాద్ ప్రధాన మార్గంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌లో ఈనెల 19 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు