సీమ ద్రోహి జగన్.. కేసీఆర్‌తో కుమ్మక్కు.. రాయల ఆగ్రహం..
posted on Sep 11, 2021 @ 5:40PM
రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై సీమ నేతల సదస్సు జరిగింది. ఆ నాలుగు జిల్లాలకు చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధులు హాజరై.. సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా మండిపడ్డారు. సీఎంలు జగన్, కేసీఆర్‌ల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయా? అని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. హంద్రీనీవా కాలువ వెడల్పు పెంచకపోతే సీమ ద్రోహిగా జగన్ మిగిలిపోతారంటూ హెచ్చరించారు. సీమ సీఎంలు ఎప్పుడూ రాయలసీమ జలాలు గురించి పట్టించుకోలేదన్నారు. రాయలసీమ మిటిగేషన్ ప్రాజెక్ట్ కాదు రాయలసీమ లిటిగేషన్ ప్రాజెక్టని అన్నారు పయ్యావుల. సీఎం తీరు వల్లే కేఆర్‌ఎంబీ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు, సీఎం జగన్‌రెడ్డిపై జేసీ పవన్‌రెడ్డి సైతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత చెల్లెలికి ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఇవ్వలేవు కానీ నీటి హక్కులపై కేఆర్ఎంబీకి సర్వహక్కులు ఇచ్చేసావు అంటూ సీఎం జగన్‌పై మండిపడ్డారు జేసీ పవన్. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సమస్య పరిష్కరించేందుకు ముందుకు వచ్చినా.. ముఖ్యమంత్రి ముందుకు రాలేదని తప్పుబట్టారు. కర్ణాటక నుంచి వచ్చే నీటిపై కూడా కేఆర్‌ఎంబీ జోక్యం చేసుకుంటుందని తెలిపారు.
ఇక, అనంతపురం జిల్లాలోని కరువు పరిస్థితుల గురించి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలియదా.. అని మాజీ మంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న కేసీఆర్‌కు.. ఇక్కడి సమస్యలు అన్నీ తెలుసని గుర్తుచేశారు. రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. రాయలసీమ బిడ్డగా చెప్పుకొనే సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని పరిటాల సునీత నిలదీశారు.
అటు.. హైదరాబాద్‌లోని ఆస్తుల పరిరక్షణ కోసమే జగన్ ఇలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు. జాతీయ జల విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుంటే.. సీఎం జగన్ నోరు మెదపడం లేదని విమర్శించారు. హంద్రీనీవా కంటే సాక్షి పేపర్ ప్రకటనల కోసమే.. రూ.300 కోట్లు ఖర్చుపెట్టారన్నారు. హంద్రీనీవా పూర్తి చేయకపోతే.. సీఎం జగన్‌మోహన్ రెడ్డికి రాయలసీమ వాసులు తగిన రీతిలో బుద్ధి చెబుతారని పల్లె రఘునాథరెడ్డి హెచ్చరించారు.
సాగునీటి కోసం సీమ నేతలు సమైక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మిగులు జలాలపై హక్కును వదులుకుంటున్నామని చెప్పడంతోనే రాయలసీమకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గడిచిన రెండు సంవత్సరాల నుంచి చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రులు స్టేట్మెంట్లు ఇవ్వడం మినహా ఏమీ చేయడం లేదని విమర్శించారు. కాంట్రాక్టు పనుల కోసమే వైసీపీ నేతలు పనులు చేస్తున్నారన్నారు. దీనిపై కుప్పం నియోజకవర్గం నుంచే పాదయాత్ర చేపడుతున్నామన్నారు అమర్నాథ్‌రెడ్డి.