పీకేతో రేవంత్ రెడ్డి మంత్రాంగం.. గులాబీ బాస్ లో కలవరం!
posted on Sep 11, 2021 @ 10:54AM
అసెంబ్లీ ఎన్నికలకు రెండేండ్లకు పైగా సమయం ఉన్నా తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. జనంలో ఎక్కువగా ఉండేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో సత్తా చాటి.. అధికారం దిశగా అడుగులు వేయాలని విపక్షాలు భావిస్తున్నాయి. అదే సమయంలో విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా కొత్త పథకాలు తీసుకొస్తున్నారు సీఎం కేసీఆర్. హుజురాబాద్ లో ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి... ఆ వర్గం ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవాలనే ప్లాన్ చేస్తున్నారు గులాబీ బాస్.
తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలన్ని దళిత బంధు కేంద్రంగానే సాగుతున్నాయి. దళిత బంధుకు తమకు అస్త్రంగా పనికొస్తుందని టీఆర్ఎస్ భావిస్తుండగా... అదే పథకం ద్వారా అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి విపక్షాలు. నిజానికి దళిత ఓటు బ్యాంక్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కొంత టీఆర్ఎస్ కు మెజార్టీ వచ్చినా... ఇప్పటికి ఆ వర్గంలో కాంగ్రెస్ పార్టీకి పట్టుంది. దళిత బంధుతో ఆ వర్గాన్ని తమనుచి పూర్తిగా లాగేయాలని కేసీఆర్ ప్లాన్ చేశారని భావిస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. మరో దారిలో నరుక్కొస్తున్నారు. ఆయన కూడా దళితుల లక్ష్యంగానే తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే దళిత గిరిజన దండోరాలతో జనంలోకి వెళుతున్న రేవంత్ రెడ్డి... కేసీఆర్ కు కలవరం పుట్టించేలా ఎత్తులు వేస్తున్నారని తెలుస్తోంది.
దళిత సామాజిక వర్గంలో మంచి పట్టున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవలే ఐఏఎస్ కు గుడ్ బై చెప్పి బీఎస్పీలో చేరారు. బహుజనవాదంతో బీఎస్పీ బలోపేతం కోసం జిల్లాలు చుట్టేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ కు దళితులు, బీసీ వర్గాల నుంచి మంది స్చందనే వస్తోంది. ఉద్యోగులు, విద్యావంతులు ఆయనకు మద్దతుగా ఉంటున్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన దళితు బంధుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు పీకే. దీంతో పీకే కేంద్రంగా రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు రేవంత్ రెడ్డి. దళిత వర్గంలో మంచి పట్టున్న పీకేతో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పీకే సారథ్యంలోని బీఎస్పీతో కాంగ్రెస్ పొత్తు ఉండేలా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రవీణ్ కుమార్ తో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారని అంటున్నారు. పీకే నుంచి సానుకూలత వచ్చిందని అంటున్నారు.
ఇటీవలే పీసీసీ ముఖ్య నేతలంతా ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన భేటీలో తెలంగాణ ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారట. రాహుల్ సమావేశంలోనే పీకే అంశం ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు. దళిత వర్గంలో పట్టున ప్రవీణ్ కుమార్ తో కలిసి పోతే లాభం ఉంటుందనే అభిప్రాయమే వ్యక్తమైందట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మహా కూటమి ఏర్పాటు చేసింది. సో వచ్చే ఎన్నికల్లోనూ బీఎస్పీతో పొత్తుకు పెద్దగా ఇబ్బంది ఉండదని నేతలు చెప్పారట. దీంతో తెలంగాణలో బీఎస్పీతో పొత్తుకు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. రాహుల్ నుంచి సిగ్నల్స్ రావడంతోనే.. రేవంత్ రెడ్డి దూతగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్.. ప్రవీణ్ కుమార్ ను కలిసి చర్చించారని అంటున్నారు.
ప్రవీణ్ కుమార్ తో సమావేశం తర్వాత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యల్లోనూ రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయనే సంకేతమే ఇచ్చారు. కాంగ్రెస్, బీస్పీల మధ్య తేడా లేదని.. భవిష్యత్ లో తామిద్దరూ కలిసి పనిచేయవచ్చని దయాకర్ అన్నారు. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు ప్రవీణ్ కుమార్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ పరిణామాలతో టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన నెలకొందని చెబుతున్నారు. బీఎస్పీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే.. తమకు భారీగా నష్టం జరుగుతుందనే అంచనాలో గులాబీ బాస్ ఉన్నారట. పీకే కాంగ్రెస్ తో కలిసి పోతే దళిత బంధు వంటి పథకాలతోనూ తమకు ప్రయోజనం కల్గదనే కలవరంలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు.