నా భర్తను ఆఫీసుకు రప్పించండి.. భార్య ట్వీట్ వైరల్
posted on Sep 11, 2021 @ 5:59PM
కొవిడ్ మహమ్మారితో ఐటీ కంపెనీలన్ని వర్క్ ఫ్రం హోం విధానం అమలు చేస్తున్నాయి. గత మార్చిలో మొదటి సారి లాక్ డౌన్ పెట్టినప్పుడు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చిన ఐటీ సంస్థలు.. ఇప్పటికే అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికలతో మరి కొంత కాలం ఇది అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వర్క్ ఫ్రం హోం విధానంపై భిన్న వాదనలు వస్తున్నాయి. కొందరు ఉద్యోగులు ఇదే బాగుందని చెబుతుండగా.. మరికొందరు ఉద్యోగులు మాత్రం ఆఫీసులో పని చేయడానికే ఇష్టపడుతున్నారు.
వర్క్ ఫ్రం హోంతో మొదట కొన్ని ఇబ్బందులు వచ్చినా.. తర్వాత ఉద్యోగులు దానికి అలవాటు పడ్డారు. టైం అన్న విధానం లేకుండా ఇంట్లోనే తమ కుటుంబంతో గడుపుతూ పనిచేస్తూ ఎంజాయ్ చేశారు. కానీ వర్క్ ఫ్రం హోం వల్ల గృహిణులకు మాత్రం పెద్ద భారంగా మారింది. తన భర్త ఇంట్లో పనిచేయడం వల్ల తాను పడుతున్న బాధలను వివరిస్తూ ఓ వివాహిత 'నా భర్తను ఆఫీసుకు రమ్మనండి...' అంటూ లేఖ రాయడం ఆసక్తిగా మారింది. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ వ్యాపార వేత్త హర్ష్ గొయొంకా తన ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన పోస్టును పెట్టాడు. ఓ మహిళ తన భర్తను ఆఫీసుకు రమ్మని సదరు కంపెనీకి రాసిన లేఖను స్క్రీన్ షాట్ తీసి ఆ పోస్టుకు జోడించారు.
ఆ లేఖలో ఏముందంటే.. 'కంపెనీ యజమానులకు నమస్కరించి రాయునది ఏమనగా.. మీ సంస్థలో పనిచేసే మనోజ్ భార్యను నేను. మీకు సవినయంగా విన్నవించుకునేదేంటంటే.. నా భర్తకు ఆఫీసుకు వచ్చి పనిచేసే అవకాశం కల్పించండి.. మా ఆయన ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నాడు. కరోనా నిబంధనలు పాటిస్తున్నాడు. కొవిడ్ కు సంబంధించిన అన్నీ ప్రొటోకాల్స్ పాటిస్తున్నాడు. అందువల్ల ఇతనికి అవకాశం కల్పించండి' అని తెలిపింది.
తన భర్త వర్క్ ఫ్రం హోం వల్ల తాను పడే ఇబ్బందులను ఆమె లేఖలో తెలిపింది. 'మనోజ్.. ఇంట్లో పనిచేసేటప్పుడు ఎన్నిసార్లు కాఫీ తాగుతాడో తెలియదు. ఒకే గదిలో కూర్చొని పనిచేయలేడు. ప్రతి గదిలో కూర్చుంటున్నాడు. లెక్కలేనన్ని సార్లు భోజనం చేస్తున్నాడు. పనిచేసేటప్పుడు కునికిపాట్లు పడుతున్నాడు.' అని పేర్కొంది. 'మాకు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. వారిని పోషించడమే గగనంగామారింది. ఇప్పుడు నా భర్తకు సపర్యలు చేయడం నావల్ల కావడం లేదు. దీంతో మా ఇద్దరి మధ్య తరుచూ గొడవలు అవుతున్నాయి. మరికొంత కాలం ఇలాగే సాగితే మేమిద్దరం విడిపోవడం ఖాయమని తెలుస్తుంది.. అందువల్ల తప్పనిసరిగా కార్యాలయంలో పనిచేయాలని నా భర్తను ఆదేశించండి..' అని మహిళ లేఖలో తెలిపింది.
ఈ పోస్టుకు ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు అంటూ హర్ష్ గొయొంకా కామెంట్ చేశాడు. తన భర్త మరికొంత కాలం ఇంట్లో పనిచేస్తే మేమిద్దరం విడిపోవడం ఖాయం అని పేర్కొనడం షాకింగ్ కు గురి చేస్తుందని తెలిపాడు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గొయొంకా పోస్టుపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ మహిళ బాధలు అర్ధం చేసుకోవాల్సిందేనని కొందరు కామెంట్ చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం వల్ల ఇళ్లల్లో ఎన్ని సమస్యలు వస్తున్నాయో అంటూ మరికొందరు పోస్టు చేశారు.