సొంత ఇంటిని చక్కబెట్టుకోలేని మోదీ.. నలుగురు సీఎంలు రాజీనామా..
posted on Sep 11, 2021 @ 4:29PM
ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఓ బ్యాడ్ కల్చర్ ఉండేది. పదే పదే ముఖ్యమంత్రులను మారుస్తారనే ముద్ర ఉండేది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ రెండేళ్లకు ఓ సీఎం మారేవారు. ఒక్క వైఎస్సార్ మాత్రమే గట్టిగా నిలదొక్కుకున్నారు. కాంగ్రెస్‌లాంటి కుసంస్కృతి ఇప్పుడు బీజేపీకి సోకినట్టుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను పదే పదే మారుస్తూ.. కమలనాథులు సైతం హస్తం నేతల అడుగుజాడల్లో నడుస్తున్నారు. రాజకీయాల్లో అంతా ఆ తానుముక్కలేనని చెప్పకనే చెబుతున్నారు.
ముఖ్యమంత్రులను అధిష్టానం మార్చడం వేరు.. ముఖ్యమంత్రే స్వయంగా పదవిని వీడటం వేరు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సీఎం పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనే ఇలా ఏకంగా ముఖ్యమంత్రే సడెన్‌గా పదవిని వీడటం ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను ఎత్తి చూపుతోంది. పైకి మాత్రం ఇదీ కారణం అని చెప్పకుండా.. గుజరాత్ బీజేపీలో లుకలుకలు, మోదీతో విభేదాలే సీఎం విజయ్ రూపానీ రాజీనామాకు దారి తీసిందని అంటున్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్‌కు అందజేశారు. గాంధీనగర్‌లో జరిగిన సమావేశంలో చోటుచేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో విజయ్ రూపానీ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజీనామా అనంతరం విజయ్ రూపానీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా సేవలందించేందుకు తనకు అవకాశం కల్పించిన బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నాయకత్వంలో తాను సేవలు కొనసాగిస్తున్నానని తెలిపారు.
బీజేపీ ముఖ్యమంత్రులు వరుసగా రాజీనామా చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, తీరత్ సింగ్‌లు రాజీనామా చేశారు, ఆ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో బలవంతంగా రాజీనామా చేయించారు. తాజాగా గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రిజైన్ చేశారు. అసెంబ్లీ పదవీ కాలం మరో ఏడాది ఉండగానే ఆయన పదవి నుంచి వైదొలగడం సంచలనంగా మారింది. మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న విజయ్ రూపానీ రాజీనామా చేయడం పార్టీపై నరేంద్ర మోదీకి పట్టు చేజారిపోతోందనే దానికి నిదర్శణం అంటున్నారు. బీజేపీలో సైతం కాంగ్రెస్ తరహా ముఖ్యమంత్రులను మార్చే కల్చర్‌తో పాటు.. అధిష్టానాన్ని ధిక్కరించే నైజం పెరిగిపోతోందని విశ్లేషిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డానే అయినా.. విజయ్ రూపానీ గుజరాత్ సీఎం కాబట్టి.. తాజా పరిణామం ప్రధాని మోదీ ఇమేజ్‌కు తీవ్ర డ్యామేజ్ చేయడం ఖాయం.