కడప జిల్లాలో సీఎం బంధువు భూకబ్జాలు? వైసీపీ కార్యకర్త సెల్ఫీ వీడియోతో కలకలం..
posted on Sep 11, 2021 @ 1:15PM
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు ఆగడాలు మితిమీరి పోతున్నాయి. ఎన్ని విమర్శలు వస్తున్నా డోంట్ కేర్ అంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు వైసీపీ నేతలు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ కడప జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. అధికారం అండతో అరాచకాలు చేస్తున్న స్థానిక నేతలకు వైసీపీ పెద్దలు వంత పాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కొందరు నేతలు సొంత పార్టీ కార్యకర్తలను కూడా వదలి పెట్టడం లేదని తెలుస్తోంది. మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలంలో ఓ మైనారిటీ కుటుంబం సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. వైసీపీ కార్యకర్త అయిన ముస్లిం వ్యక్తి.. తన భూమిని వైసీపీ నేత కబ్జా చేశాడని వాపోతూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.
సీఎం జగన్ బంధువు తన భూమిని కబ్జా చేశాడని, ఇదేంటిని అడిగితే తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు అక్భర్ బాషా. ఆయన చెబుతున్న వివరాల ప్రకారం ఎర్రబల్లికి చెందిన అక్బర్ బాషా భార్యకు వారి పుట్టింటి వారు.. ఎకరం యాభై సెంట్ల భూమి ఇచ్చారు. ఇప్పుడు ఆ భూమిని వైసీపీ నేత ఇరగం రెడ్డి తిరుపాల్ రెడ్డి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాషా వాపోతున్నారు. తిరుపాల్ రెడ్డికి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, సీఐ కొండారెడ్డి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. సీఐ నుంచి తమకు ప్రాణహాని ఉందని సెల్ఫీ వీడియో ద్వారా తమ కష్టాన్ని చెప్పుకొన్నారు. తమకు న్యాయం చేయకపోతే అంతా ఆత్మహత్య చేసుకుంటామని వాపోయారు.
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన మరువక ముందే.. అక్బర్ బాషా కుటంబంపై వేధింపులు బయటపడడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మైదుకూరులో ముఖ్యమంత్రి జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి ముస్లిం మైనారిటీ అయిన అక్బర్ బాషా భూమిని కబ్జా చేసినట్టు తెలిసిందని అన్నారు. తిరుపాల్ రెడ్డి వర్గానికి చెందిన సీఐ ఒకరు... అక్బర్ ను స్టేషన్లో కూర్చోబెట్టి, అతని పొలంలో దౌర్జన్యంగా నాట్లు వేయించారని చంద్రబాబు తెలిపారు. పైగా ఎన్ కౌంటర్ చేస్తానని బాధితుడిని బెదిరించడం ఇంకా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితుడిపై దౌర్జన్యానికి దిగితే సామాన్యుడికి ఇంకెవరు దిక్కు? అని ప్రశ్నించారు.గతంలో నంద్యాలలో సలీం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని... ఇప్పుడు అక్బర్ కుటుంబం కూడా తమకు అదే దిక్కంటోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలంటూ అక్బర్ కు సూచించారు. అక్బర్ కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్‌రెడ్డి బంధువులు, పార్టీ నేతలకు.. అధికారం ఆయుధంగా, చట్టం చుట్టంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. వారి కన్నుపడితే కబ్జా, ఆశపడితే ఆక్రమణ.. అన్నట్టుగా తయారైందని విమర్శించారు. కబ్జాలు, ఆక్రమణలపై నిలదీస్తే.. నిర్బంధం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థని జగన్‌రెడ్డి.. ఫ్యాక్షన్ సైన్యంగా మార్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో రాక్షస రాజ్యం సాగుతోందన్నారు. కబ్జాలపై స్వయంగా వైసీపీ కార్యకర్తలే బహిరంగా చెప్పే పరిస్థితి వచ్చిందని తెలిపారు. కడప జిల్లా మైదుకూరులో వైసీపీ నాయకుడు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి.. తమ పార్టీకి చెందిన కార్యకర్త పొలాన్నే కబ్జా చేశారన్నారు. ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా దీనిపై నిలదీసినందుకు..ఎన్‌కౌంటర్ చేస్తామని మైదుకూరు సీఐ కొండారెడ్డి బెదిరించే పరిస్థితికి వచ్చిందని తెలిపారు. సీఎం సొంత జిల్లా, సొంత పార్టీ కార్యకర్త బాషాయే వైసీపీ నేతల అరాచకాలకు తాళలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని రోధిస్తున్నారన్నారు లోకేష్.