పండుగ పూట పస్తులుండటమే బంగారు తెలంగాణ! జీతాలు రాని జీహెచ్ఎంసీ ఉద్యోగుల ఆవేదన..
posted on Sep 10, 2021 @ 12:57PM
తెలంగాణ ధనిక రాష్ట్రం.. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణనే టాప్... ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ చెప్పే మాటలు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చారని విపక్షాలు ఆరోపణలు చేస్తుండగా.. తెలంగాణ ఖచ్చితంగా ధనిక రాష్ట్రమేనని బల్లగుద్ది మరీ చెబుతున్నారు కేసీఆర్. ఇటీవలే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారు. హుజురాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. హుజురాబాద్ లో ఓట్ల కోసమే దళిత బంధు తెచ్చారని విపక్షాలు ఆరోపిస్తుండగా.. ఓట్ల కోసం కాదు రాష్ట్రమంతా అమలు చేస్తామని చెప్పారు, అంతేకాదు రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇచ్చినా లక్షా 70 వేల కోట్ల రూపాయలు అవుతాయని... అది పెద్ద లెక్క కాదని స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే ఒక్క పథకానికి లక్షా 70 వేల కోట్ల ఖర్చు చేస్తామని చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వంలో.. ఒకటో తారీఖు దాటి 10 రోజులైనా కొందరు ఉద్యోగులకు వేతనాలు రాని పరిస్థితి నెలకొంది.
జీహెచ్ఎంసీ ఉద్యోగులకు పదో తారిఖీ వచ్చినా జీతాలు అందలేదు. నిజానికి పండుగల వేళ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు.. ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సాధారణ రోజుల కంటే ముందుగా వేతనాలు చెల్లిస్తాయి. కానీ రూ.6 వేల కోట్ల పైచిలుకు బడ్జెట్.. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర విస్తరించిన ఉన్న జీహెచ్‌ఎంసీ మాత్రం సాధారణ చెల్లింపు తేదీ దాటి పది రోజులైనా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేదు. తక్కువ వేతనాలుండే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ఇప్పటికీ జీతాలు జమ కాలేదు. దీంతో చిరు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వినాయక పండుగ పూట తమ కుటుంబాలు పస్తులుండాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రధాన, జోనల్, సర్కిల్ కార్యాలయాల పరిధిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్లు, ఇతర విధుల్లో 3,500మంది వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. అనుభవం, చేసే పనిని బట్టి రూ.15 వేల నుంచి 17 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. పారిశుధ్య, ఎంటమాలజీ అవుట్ సోర్సింగ్ కార్మికులు 20 వేల మంది వీరికి అదనం. తక్కువ వేతనాలు ఉండే అవుట్ సోర్సింగ్ సిబ్బందికి మొదటి దఫాలో వేతనాలు చెల్లించాలని గతంలో కమిషనర్ డీఎస్ లోకేషకుమార్ ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కొన్ని నెలలుగా కేడర్ ప్రాతిపదికన వేతనాల చెల్లింపు జరుగుతోంది. ఈ నెల మాత్రం 10వ తేదీ వచ్చినా.. ఇప్పటికీ కొందరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందలేదు. దాదాపు 30 శాతం మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు రాలేదని చెబుతున్నారు.
శుక్రవారం వినాయక చవితి, తర్వాత రెండో శనివారం, ఆదివారం కావడంతో.. 13 లేదా 14 తేదీల్లోనే వారికి వేతనాలు అందే అవకాశముంది. ‘పండుగ వేళ జీతం ఇవ్వకుంటే ఎలా..? ఇంట్లో పూజ కోసం వస్తువులు కొనాలని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రతి నెలా రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు కలిపి రూ.118 కోట్లు చెల్లించాల్సి ఉంది. పీఆర్‌సీ ఈ నెల నుంచి చెల్లిస్తుండడంతో ఆ మొత్తం రూ.145 కోట్లకు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్‌సీ చెల్లింపుపై జీహెచ్‌ఎంసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కొత్త పీఆర్సీ లేదు.. పాత వేతనాలైనా సరిగ్గా ఇవ్వడం లేదు. ప్రతి నెలా జాప్యం జరుగుతుందని, వినాయక చవితి పండుగ ఉన్నా అధికారులు జీతాలు ఇవ్వడంలో విఫలమయ్యారని ఉద్యోగులు భగ్గుమంటున్నారు. పది రోజులైనా జీతాలు ఇవ్వకపోవడం, పండుగ పూట ఉద్యోగులకు పస్తులుంచడమే బంగారు తెలంగాణ అవుతుందా కేసీఆర్ అంటూ కొందరు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.