కేసీఆర్ పాలనపై శంఖారావమేనా? అమిత్ షా సభతో సంకేతమా?
posted on Sep 11, 2021 @ 2:59PM
సెప్టెంబర్ 17... ఈ తేదీకి ఉన్న ప్రత్యేకత గురించి తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అది తెలంగాణకు స్వాతంత్రం ప్రసాదించిన తెలంగాణ విమోచన దినం. దేశానికి 1947 ఆగస్ట్ 15న స్వాతంత్ర్యం వచ్చింది. అది మనదరికీ తెలుసు. అదే రోజున దేశమంతా మువన్నెల జెండా రెపరెప లాడింది. అయితే నిజాం సంస్థానం, హైదరాబాద్ స్టేట్ (ప్రస్తుత తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు)కు మాత్రం ఆరోజున నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించలేదు. ఆ తర్వాత సుమారు 13నెలలకు, 1948 సెప్టెంబర్ 17 వ తేదీన ఉక్కు మనిషి, సర్దార్ వల్లభభాయ్ పటేల్ సైనిక చర్యతో నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించింది. నిజాం సంస్థానం భారత దేశంలో విలీనమైంది. అందుకే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన/ విలీన దినంగా చరిత్రలో మిగిలిపోయింది.నిజానికి అదే తెలంగాణ స్వాతంత్ర దినం.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు, రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం, సెప్టెంబర్ 17 తేదీని తెలంగాణ విమోచన/ విలీన దినంగా అధికారికంగా గుర్తించేందుకు అంగీకరించ లేదు. నిజానికి, రాష్ట్ర విభజనకు ముందు, తెరాస సెప్టెంబర్ 17 తేదీని, మహా రాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాలలో నిర్వహిస్తున్న విధంగా తెలంగాణలోనూ అధికారికంగా, స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో సమానంగా నిర్వహిస్తామని మాటిచ్చింది. అయితే, రాష్ట్ర విభజన జరిగి, తెరాస అధికారంలోకి వచ్చి ఏడేళ్ళు పూర్తయినా, తెరాస ప్రభుత్వం ఆ మాటే మరిచి పోయింది. అయితే బీజేపీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినంగా జరుపుకుంటోంది. అలాగే, తెరాస సహా ఇతర పార్టీలు కూడా అదే రోజును పార్టీ కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగరేసి, తెలంగాణ విలీన దినంగా జరుపుకుంటున్నాయి.
తెలంగాణ పై రాజకీయంగా పట్టు సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీ, ఈసంవత్సరం ముందున్న హుజూరాబాద్ ఉప ఎన్నికను, అలాగే, 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 17 తేదీన తెలంగాణ విమోచన దినాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ విమోచనోద్యమంలో ప్రఖ్యాతిగాంచిన నిర్మల్‌లోని వెయ్యి ఉరులమర్రి వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వస్తున్నారు. వెయ్యి ఉరుల మర్రిని వేదికగా ఎంపిక చేసుకోవడంలో బీజీపీ తెలంగాణ సెంటిమెంట్ ను అస్త్రం చేసుకుందని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ విమోచనోద్యమం మొదట నిర్మల్‌లోనే ప్రారంభమైనది. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి మట్టి కరిపించిన ఘనతను ఈ పట్టణం సొంతంచేసుకుంది ఉద్యమాలే ఊపిరిగా దూసుకువెళ్ళి ఒకేసారి వెయ్యిమంది ఉరికంబం ఎక్కిన ఘనత ఈ ప్రాంతానిదే. ఇదే వెయ్యి ఉరుల మర్రి సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది,
ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను, నిజాం నిరంకుశ పాలనతో పోలుస్తున్న బీజేపీ, కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి కల్పించేందుకే, ఈ సెప్టెంబర్ 17 న అమిత్ షా నిర్మల్ వెయ్యి ఉరులమర్రి నుంచి శంఖారావం పూరిస్తున్నారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ నెల 17న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో తరుణ్ చుగ్ పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి కల్పించేందుకే అమిత్ షా నిర్మల్‌కు వస్తున్నారని తెలిపారు. చారిత్రాత్మక ప్రాశస్త్యం గల నిర్మల్ గడ్డ కొత్త చరిత్రకు నాంది పలకబోతోందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రతో కేసీఆర్ గుండెల్లో దడ మొదలయ్యిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ నేతృత్వంలో రామరాజ్యం స్థాపనకు అమిత్ షా శంఖారావం పూరించబోతున్నారని తరుణ్ చుగ్ అన్నారు.