భవానీపుర్ లో లక్ష మెజారిటీ టార్గెట్! మమతకు పోటీగా బీజేపీ ప్రియాంక..
posted on Sep 11, 2021 @ 9:48AM
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ.. భవానీపుర్ శాసనసభ స్థానానికి నామినేషన్ వేశారు. సెప్టెంబర్ 30న ఈ నియోజక వర్గంలో ఉప ఎన్నిక జరగనుంది. ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ అఖండ విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీచేసిన మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్ధి, ప్రస్తుత శాసన సభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి చేతలో ఓడి పోయారు. అయినా ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భవానీపుర్ నుంచి ఎన్నికైన తృణమూల్ ఎమ్మెల్యే సోబన్దేవ్ ఛటోపాధ్యాయ, రాజీనామా చేసి మమత కోసం సీటును సిద్ధం చేశారు.
కరోనా పరిస్థితుల దృష్ట్యా, గడవులోగా ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహిస్తుందా లేదా, అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 3న ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల చేసింది. అనుమానాలకు తెరదించింది. ఈ నెల (సెప్టెంబర్) 30న భవానిపుర్ నియోజక వర్గంలో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడతాయి..భవానీపుర్ తో పాటుగానే మరో రెండు అసెంబ్లీ నియోజక వర్గాలలో కూడా అదే రోజున పోలింగ్ జరుగుతుంది. ఈ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ గెలుపుకు సంబంధించి ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఇదే స్థానం నుంచి ఆమె గతంలో రెండు మార్లు భారీ మెజారిటీతో గెలిచారు. గత ఏప్రిల్’ లో జరిగిన ఎన్నికల్లోనూ తృణమూల్ అభ్యర్ధి సోబన్దేవ్ ఛటోపాధ్యాయ 28 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో పోటీ చేస్తున్న ఆమె విజయం పల్లేరు మీద బండిలా సాగిపోతుందని పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే గత ఎన్నికల్లో, కాంగ్రెస్, వామపక్ష కూటమి పూర్తిగా తుడిచి పెట్టును పోయిన నేపధ్యంలో రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ కు ఏకైక ప్రత్యాన్మాయంగా మిగిలిన బీజీపీ,మమతకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఆ పార్టీ తరఫున న్యాయవాది ప్రియాంక తిబ్రీవాల్ పోటీకి దిగుతున్నారు. జాతీయ స్థాయిలో మారిన రాజకీయ సమీకరణల నేపధ్యంలో కాంగ్రెస్. పోటీకి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించింది. సిపిఎం తమ అభ్యర్ధిని నిలుపుతామని ప్రకటించింది. అయితే, ఈ ఉప ఎన్నికలో మమతా బెనర్జీ గెలుపు విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు, అయితే ఆమె ఎంత మెజారిటీతో గెలుస్తారు? తృణమూల్ నాయకులు చెపుతున్నట్లుగా లక్ష మెజారిటీ సాధ్యమా అన్నదే ప్రశ్న.
బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్ ప్రియాంకకు ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరుంది. దీంతో భవానీపూర్ లో మమత గెలుపును ఆపలేకపోయినా.. మెజార్టీ మాత్రం భారీగా ఉండకుండా బీజేపీ ఎత్తులు వేస్తుంది.