మెడిసిన్ ఫ్రం స్కై.. డ్రోన్లతో మందుల పంపిణీ.. తెలంగాణ సంచలనం..
posted on Sep 11, 2021 @ 4:59PM
జబ్బు చేసింది. మెడిసిన్ కావాలి. ఏం చేస్తాం? ఏ మెడికల్ షాపునకో వెళ్లి కొనుక్కుంటాం. లేదంటే ఆన్‌లైన్లో ఆర్డర్ పెట్టి ఇంటికే తెప్పించుకుంటాం. ఇప్పటి వరకైతే ఇండియాలో ఇంతే. కానీ, ఇకపై మరో ఆప్షన్ కూడా వచ్చి చేరుతోంది. ఏకంగా డ్రోన్లతో ఇంటికే మందులు సరఫరా చేసే రోజులు త్వరలోనే రానున్నాయి. అయితే, ఈ అవకాశం ప్రస్తుతానికి ఒక్క తెలంగాణలో మాత్రమే అందుబాటులోకి రానుంది. అమెరికాలాంటి కొన్ని అతితక్కువ దేశాల్లో మాత్రమే ఉన్న ఈ సదుపాయం.. తాజాగా వికారాబాద్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. దేశంలోనే తొలిసారి డ్రోన్‌ల సాయంతో ఔషధాల పంపిణీ చేపట్టి తెలంగాణ రాష్ట్రం సంచలనం సృష్టించింది.
‘మెడిసిన్ ఫ్రం స్కై’ పేరుతో వికారాబాద్‌లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు చేపట్టారు. రవాణా సౌకర్యం లేని అటవీ ప్రాంతాలకు దీని ద్వారా మందులు సరఫరా చేయనున్నారు. వికారాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో డ్రోన్‌లో మెడిసిన్ బాక్సులను పెట్టి.. జ్యోతిరాదిత్య సిందియా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. 3 డ్రోన్లలో ప్రయోగాత్మకంగా మందులు, టీకాలు పంపించారు. ఔషధాలను వికారాబాద్ ప్రాంతీయ ఆస్పత్రిలో డ్రోన్లు డెలివరీ చేసి రికార్డు నెలకొల్పాయి.
ఈ డ్రోన్లలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 15 కిలోల బరువైన మెడిసిన్‌ను 40 కి.మీ. దూరం వరకూ మోసుకెళ్లగలవు. అంత దూరం ప్రయాణించడానికి ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. మొదటి దశలో ఈ డ్రోన్లతో మందులు, టీకాలు, రక్తం లాంటివి సరఫరా చేసినా.. తదుపరి దశల్లో వివిధ సున్నితమైన అంశాల్లోనూ డ్రోన్లను వాడేందుకు సిద్దమవుతోంది తెలంగాణ సర్కారు.
తెలంగాణలో ఎమర్జింగ్ టెక్నాలజీని ఎంతో ప్రోత్సహిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. అధునాతన టెక్నాలజీతో మందులు సరఫరా చేస్తున్నామని.. అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా మందులు, రక్తం సరఫరా చేస్తామని ప్రకటించారు. ఆరోగ్య రంగంలోనే కాదు.. అనేక రంగాల్లో డ్రోన్లు వాడొచ్చు. మహిళల భద్రత కోసం కూడా డ్రోన్లు వాడుతున్నాం. అమ్మాయిలను వేధించే వాళ్లు డ్రోన్ చప్పుళ్లకే భయపడతారు. మైనింగ్ లాంటి అక్రమాలకు పాల్పడే ప్రాంతాలను గుర్తించి డ్రోన్ల ద్వారా కట్టడి చేయొచ్చు.. అని మంత్రి కేటీఆర్ వివరించారు. ‘మెడిసిన్ ఫ్రం స్కై’ విజయవంతం తెలంగాణకే గర్వకారణమన్నారు మంత్రి కేటీఆర్.