పక్కా ప్రణాళికతో ప్రవీణ్ అడుగులు.. బహుజనవాదులంతా ఏకమయ్యేనా?
posted on Sep 10, 2021 @ 12:57PM
తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు, హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే, ఈ ఎన్నికల్లో ఓడితే రాజకీయ మహాప్రళయం తప్పదన్న విధంగా, హుజూరాబాద్ ఉప ఎన్నికను సవాలుగా స్వీకరించారు. చావో రేవో అన్న రీతిలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరో వంక మాజీ మంత్రి,ఈటల రాజేందర్, అవమానభారంతో రగిలి పోతున్నారు. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ మధ్య సాగుతున్న పోరు రోజురోజుకు రాష్ట్ర రాజకీయాలలో వేడిని పెంచుతోంది. ఉప ఎన్నిక ఇప్పట్లో జరగదని స్పష్టమైనప్పటికీ, తెరాస, బీజీపీ వ్యూహ, ప్రతి వ్యూహాలతో ఉదృతంగా ప్రచారం సాగిస్తున్నాయి.
అయితే బహుజన వాదంతో ఇటీవల రాజకీయ తీర్ధం పుచ్చుకున్న మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ కుమార్, 2023 శాసన సభ ఎన్నికలు లక్ష్యంగా సామాజిక సమీకరణాల కూర్పులో నిమగ్న మయ్యారు. రాజకీయ అనుబంధాలను పక్కన పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యమ నాయకులను కలుస్తున్నారు. బహుజనులను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలలో భాగంగా ఇప్పటికే ఎమార్పీస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగాను, అదే విధంగా, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షడు, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యను కలిసిన ప్రవీణ్ కుమార్, గురువారం మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తో సమావేశ మయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సమయంలో అయన ఎక్కడా కూడా పెద్దగా రాజకీయాల ప్రస్తావన తీసుకురాలేదు.
బహుజన ఐక్యత గురించి, ఆధిపత్య కులాల రాజకీయ కుట్రల గురించి మాత్రమే ప్రస్తావించారు. బహుజన సమాజం, ఎస్సీఎస్టీ, బీసీలు ఇతర బడుగు, బలహీన వర్గాలు, పేదలు ఏకం కాకుండా చేసేందుకు ఆధిపత్య కులాలు సాగిస్తున్న దళిత బంధు వంటి కుట్రల గురించి మాత్రమే ప్రస్తావించారు. అలాగే, మాల మాదిగల మధ్యగల వర్గీకరణ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, బహుజనుల విస్తృత ప్రయోజనాలను దృషిలో ఉంచుకుని, సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ దిశగా ఆయన ఇంతవరకు ఇటు దయాకర్,అటు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కృష్ణ మాదిగా, ఇతర నేతలు సాగించిన ప్రయత్నాలను కొనియాడారు. అలాగే, బహుజన ఐక్యత, బహుజన రాజ్య స్థాపన లక్ష్యంగా ఇంకా ముందుకు తీసుకువెళ్ల వలసిన అవసరాన్ని ప్రస్తావించారు.
ప్రవీణ కుమార్ బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య, మాదిగ నేత కృష్ణ మాదిగను కలవడం, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా అయిన, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్’ను కలవడం ఒకటిగా చూడలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రవీణ కుమార్, అద్దంకి దయాకర్ రెండు వేర్వేరు రాజకీయ పార్టీలకు ప్రతినిధులు కూడా కావడంతో, వీరి భేటీకి మరింత ప్రాధాన్యత ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. అదలా, ఉంటే ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. భవిష్యత్’లో తామిద్దరూ కలిసి పనిచేయవచ్చని దయాకర్ అన్నారు. అలాగే,కాంగ్రెస్మ బీస్పీల మధ్య తేడా లేదని అన్నారు.అంటే, దయాకర్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినా, ఈ వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యత ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, దయాకర్ బీఎస్పీలో చేరతారా లేక కాంగ్రెస్, బీఎస్పీల మధ్య పొట్టు కుడురుతుందా అనేడి స్పష్టం కాకపోయినా, ప్రవీణ్ కుమార్ సామాజిక సమీకరణాలతో కొత్త ప్రయత్నం చేస్తున్నారని మాత్రం స్పష్టమవుతోంది.