తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు.. సీఎం కేసీఆర్ కు సవాలే? 

తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ పాలనపై తన యూ ట్యూబ్ చానెల్ తో పాటు రాజకీయంగా పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఇంకా జైలులోనే ఉన్నారు. ఆయనపై దాదాపు 32 కేసులు నమోదు చేశారని తెలుస్తోంది. ఆ కేసుల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లోని కోర్టుల్లో మల్లన్నను హాజరు పరుస్తున్నారు పోలీసులు. బుధవారం నల్గొండ జిల్లా కోర్టుకు తీసుకువచ్చారు. మల్లన్న దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 26న అడ్డగూడూరుకు చెందిన మహిళ అక్కడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తును చేపట్టిన పోలీసులు.. మల్లన్నను ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. మల్లన్నకు న్యాయమూర్తి ఈ నెల 21 వరకు రిమాండ్ విధించారు.ఈ సందర్భంగా ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేండ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఘటన ప్రస్తుతం తెలంగాణను షేక్ చేస్తోంది. వారం రోజులవుతున్నా నిందితుడిని పోలీసులు పట్టుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ సర్కార్ ను నిలదీశారు తీన్మార్ మల్లన్న. సైదాబాద్ హత్యాచార ఘటనలో నిందితుడ్ని పట్టుకోలేని పోలీసులు తనపై కక్ష సాధిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆరోపించారు.  తన భార్య, అత్తమామలు కూడా దళితులేనని, తాను తన కుటుంబ సభ్యులను ఎలా కించపరుస్తానని ప్రశ్నించారు. ఇదంతా తనపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కుట్ర తప్ప మరోటి కాదన్నారు. తనపై ఇప్పటికే 35 కేసులు బనాయించారని మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోలీసులు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి ప్రభుత్వానికి తమ వంతు సహకరిస్తున్నారని మల్లన్న ఆరోపించారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిపై కక్ష సాధింపు చర్యలకు కాకుండా ప్రజలకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని మల్లన్న అన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే గిరిజన బాలిక దారుణ హత్యకు గురైందని మండిపడ్డారు.

సోనూసూద్ కంపెనీల్లో ఐటీ సోదాలు.. కారణం అదేనా? 

సినీ నటుడు, పేద పాలిట పెన్నిధిగా పేరు గాంచిన సోనూసూద్‌ కు సంబంధించిన వాటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోనూసూద్ నివాసాలు, ఆఫీసులు, కంపెనీల్లో తనిఖీలు జరుపుతున్నారు. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. సోనూసూద్ ఇల్లు, కంపెనీల్లో ఐటీ సోదాలు జరగడం కలకలం రేపుతోంది. రాజకీయ కోణంలోనే దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.  ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.అంతకు ముందు పంజాబ్ ప్రభుత్వంలో కూడా కరోనా వైరస్ మీద అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్ నియమితులయ్యారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవే. ఇలాంటి సమయంలో సోనూ సూద్‌కు సంబంధించిన ప్రాంతాల్లో ఐటీ అధికారులు ‘సర్వే’ చేశారనే వార్త సంచలనంగా మారింది. లాక్ డౌన్‌లో వలస కార్మికుల పాలిట ఆపద్భాందవుడిలా సోనూసూద్ నిలిచాడు. ప్రభుత్వాలు కూడా చేయని పని సోనూ చేశాడు. సొంత ఖర్చులతో వందల బస్సులు ఏర్పాటు చేసి వలస కూలీలను వారి ఇళ్లకు చేర్చాడు. దీంతో దేశం మొత్తం సోనూని రియల్ హీరోగా కొనియాడింది. కరోనా బాధితులకు ఖరీదైన మందులు ఉచితంగా సమకూర్చాడు. సెకండ్ వేవ్ సమయంలోనూ ఎంతో మంది రోగులకు ప్రాణం పోశాడు సోనుసూద్. సకాలంలో ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశాడు. సాయం పొందిన వాళ్లు సోనూని దేవుడిలా చూస్తున్నారు. అలాంటి సోనుసూద్ టార్గెట్ గా ఐటీ సోదాలు జరుగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. రాజకీయ కారణాలతోనే ఇలా జరుగుతుందనే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. 

టీటీడీ పాలకమండలి జాబితా విడుదల.. మైహోం, హెటిరో సారధులకు మళ్లీ చోటు.. 

తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త పాలకమండలిని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 25 మంది బోర్డు మెంబర్ల జాబితాను విడుదల చేసింది. టీటీడీ  పాలకమండలిలో ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఒకరు స్థానం దక్కించుకున్నారు. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు.  టీటీడీ పాలకమండలిలో తెలంగాణకు చెందిన ప్రముఖ  పారిశ్రామిక వేత్త మైహోం రామేశ్వరరావు, హేటిరో పార్దసారధి రెడ్డి, మురంశెట్టి రాములు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ముంబాయికి చెందిన రాజేశ్ శర్మ, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ రెండోవసారి సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. వ్యాపారవేత్త మారుతి, ఆడిటర్ సనత్, యంయస్‌యన్ ల్యాబ్స్ జీవన్‌రెడ్డి, కోల్‌కతాకు చెందిన సౌరభ్ కు పాలకమండలిలో చోటు దక్కింది. మహారాష్ట్ర నుంచి శివసేనా కార్యదర్శి మిలింద్‍కు అవకాశం కల్పించారు. టీటీడీ పాలక మండలి జాబితా.. ఏపీ నుంచి పోకల అశోక్ కుమార్, మల్లాడి క్రిష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, గొర్ల బాబూరావు తెలంగాణ నుంచి జూపల్లి రామేశ్వరావు, రాజే శర్మ, పార్థసారధి రెడ్డి, కల్వకుర్తి విద్యాసాగర్  తమిళనాడు నుంచి శ్రీనివాసన్, ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్య కర్ణాటక నుంచి ఎమ్మెల్యే విశ్వనాధ్‌రెడ్డి, శశిధర్  మహారాష్ట్ర నుంచి శివసేనా కార్యదర్శి మిలింద్‍కు అవకాశం  

ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. జ‌గ‌న్ తీరుతో అధికారుల్లో ఆందోళ‌న‌..

జ‌గ‌న్‌కు, అధికారుల‌కు, జైలుకు ఏదో అవినాభావ సంబంధం ఉండే ఉంటుంది. జ‌గ‌న్‌తో సంబంధం ఉన్న ప‌లువురు ఐఏఎస్‌లు ఎప్ప‌టిక‌ప్పుడు, ఏదో ర‌కంగా ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. వైఎస్ హ‌యాంలో జ‌గ‌న్‌తో అంట‌కాగినందుకు అక్ర‌మాస్తుల కేసులో అప్ప‌ట్లో ప‌లువురు అధికారులు జైలుకెళ్లాల్సి వ‌చ్చింది. అనేక‌మంది ఐఏఎస్‌లు సీబీఐ విచార‌ణ ఫేస్ చేశారు. ఇదంతా గ‌తం. ఆ గ‌తం నుంచి అధికారులు సరైన గుణ‌పాఠం నేర్వ‌న‌ట్టున్నారు. మ‌ళ్లీ అన్ని విష‌యాల్లో జ‌గ‌న్‌కు వంత పాడుతున్నారు. దీంతో, కోర్టు నుంచి మొట్టికాయ‌లతో పాటు శిక్ష‌లూ ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఏపీ ఐఏఎస్ అధికారులను కోర్టు ధిక్కరణ కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలను కోర్టు ధిక్కరణ కేసులో నిందితులుగా నిర్ధారించింది. 29వ తేదీన శిక్షను ఖరారు చేయనుంది. ప్రస్తుతం వ్యవసాయశాఖ, సెరీకల్చర్ విభాగాలకు వీరు ఉన్నతాధికారులుగా ఉన్నారు.  పూనం మాలకొండయ్య వ్యక్తిగతంగా కోర్టుకు హాజురు కాకపోవడంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది హైకోర్టు. విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు పాటించలేదు. దీంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ప్రభుత్వం అభ్యర్థుల‌కు న్యాయంచేయాలని ఆదేశించింది. కానీ కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదు అధికారులు. దీంతో కోర్టు ధిక్క‌ర‌ణ కింద‌.. హర్టీకల్చర్, సెరీకల్చర్ కమిషనర్‌ చిరంజీవి చౌదరి.. వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం మాలకొండయ్యలుగా గుర్తించి శిక్ష విధించింది హైకోర్టు. 29న శిక్ష ఖరారు చేయనుంద‌ది.   హైకోర్టు చేతిలో శిక్ష‌కు గురికావ‌డం ఇదే మొద‌టిసారి కాదు. ఇటీవ‌ల ముత్యాల‌రాజు త‌దిత‌ర ఐఏఎస్‌లపై ఇలానే కోర్టు క‌న్నెర్ర జేసింది. ఇప్పుడు వీరి వంతు వ‌చ్చింది. కోర్టు ఆదేశించినా.. ప్రభుత్వం అంగీకరించకపోతే తాము ఎలా ఉత్తర్వులు ఇస్తామనేది ఐఎఎస్ అధికారులు వాద‌న‌. త‌మ మాట‌లు స‌ర్కారు చెవికి సోక‌క‌పోవ‌డం వ‌ల్లే ఇలాంటి ప‌రిణామాల‌ని అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పటికే ప‌లువురు అధికారులు కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయ‌స్థానాల చుట్టూ తిరుగుతున్నారు. అవి శిక్షలకూ దారి తీస్తుండ‌టంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ప‌ని చేయ‌డం క‌ష్ట‌మంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. సిన్సియ‌ర్ అధికారిణిగా పేరొందిన పూనం మాల‌కొండ‌య్య లాంటి ఐఏఎస్‌లు సైతం జ‌గ‌న్ తీరుతో ఇలా జైలు శిక్ష ముంగిట నిల‌బ‌డ‌టం అవ‌మాన‌క‌ర విష‌య‌మే.   

మోడీ పైసలవి.. వెనక్కి ఇచ్చేది లేదు! రైతు ఆన్సర్ తో బ్యాంకర్లకు షాక్..

ఆ రైతు బ్యాంక్ ఖాతాలో ఐదున్నర లక్షల రూపాయలు జమ అయ్యాయి.. తన ఖాతాలో డబ్బులు జమ కావడంతో వాటిని విత్ డ్రా చేసుకుని ఖర్చు పెట్టేశాడు ఆ రైతు. అయితే ఆ డబ్బులు రైతుకు సంబంధించినవి కావు.. బ్యాంకు ఉద్యోగి పొరపాటున ఆయన ఖాతాలోకి వచ్చినవి. తనవి కావని తెలిసినా ఆ రైతు వాటిని ఖర్చు పెట్టేశాడు. తర్వాత తప్పును గ్రహించిన బ్యాంకర్లు... రైతు దగ్గరకు వచ్చి డబ్బులు గురించి ఆరా తీయగా వాళ్లకు షాకిచ్చాడు రైతు.  బిహార్‌లోని ఖగారియా జిల్లాలో ఈ ఘటన జరిగింది. రైతు రంజిత్ దాస్‌కు స్థానిక గ్రామీణ్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. ఈ ఏడాది మార్చిలో దాస్ ఖాతాలో రూ.5.5 లక్షలు జమయ్యాయి. అయితే అది బ్యాంకు తప్పిదం వల్ల జరిగింది. తన ఖాతాలో డబ్బులు జమ కావడంతో వాటిని తన అవసరాలకు ఖర్చు పెట్టుకున్నాడు రైతు రంజిత్ దాస్. కొన్ని రోజుల తర్వాత తప్పును గ్రహించారు బ్యాంకు ఉద్యోగులు. రైతు దగ్గరకు వెళ్లి.. ఆ మొత్తాన్ని తిరిగి బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిందిగా కోరారు. కానీ దీనికి దాస్ తిరస్కరించాడు.  ఆ డబ్బులు తనకు ప్రధాని మోడీ పంపారని, తిరిగి ఇవ్వనని మొండికేశాడు.  ‘ఈ ఏడాది మార్చిలో నా బ్యాంకు అకౌంట్‌లో లక్షల మొత్తంలో డబ్బులు జమవ్వగానే చాలా సంతోషించా. అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. దీంట్లో భాగంగానే తొలి విడతగా ఆ డబ్బులు నాకు పంపారేమోనని భావించా. అలా ఆ డబ్బును ఖర్చు చేసేశా. ఇప్పుడు నా దగ్గర డబ్బుల్లేవు’ అని చెప్పాడు.  రైతు చెప్పిన సమాధానంలో షాకయ్యారు బ్యాంక్ అధికారులు. అతన్ని ఏమి చేయలేక పోలీసులకు బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంజిత్ దాస్ ను అరెస్ట్ చేశారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు రంజిత్ దాస్‌ను అరెస్ట్ చేశామని, తదుపరి విచారణ కొనసాగుతుందని మాన్సి స్టేషన్ హౌస్ ఆఫీసర్ దీపక్ కుమార్ పేర్కొన్నారు.  

వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా? 

దేశంలో ప్రస్తుతం అన్ని అతి పెద్ద సమస్యల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఒకటి. గత కొన్ని రోజులుగా పెరిగిపోతున్న ధరలతో పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యులకు గుది బండగా మారింది. కేంద్ర ప్రభుత్వానికి ఇది ఇబ్బందులు కల్గిస్తోంది. ఇటీవల కొన్ని సంస్థలు నిర్విహించిన సర్వేల్లో గతంలో కంటే ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ భారీగా తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణం పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలేనని చెబుతున్నారు. బీజేపీ నేతలు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. చమురు ధరల పెరుగుదలపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే ప్రస్తుతం కేంద్రం వైఖరిలో మార్పు వచ్చిందని తెలుస్తోంది. పెట్రోల్, డీజల్ ధరలు తగ్గేలా కేంద్ర సర్కార్ చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ కూడా ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రభావం.. 2024 సార్వత్రిక ఎన్నికలపై ఉండబోతోంది. ఇప్పటికే కేంద్ర సర్కార్ గ్రాఫ్ పెరిగింది. గతంలో మోడీ ప్రభుత్వానికి దన్నుగా ఉన్న వారు.. బలంగా వాదనలు వినిపించిన వారు సైతం పెట్రోల్.. డీజిల్ ధరల విషయంలో మాత్రం ప్రభుత్వం తీరును తప్ప పట్టే పరిస్థితి. ఈ సెగ కేంద్రానికి తాకినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు గండంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు దిశగా మోడీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని తెలుస్తోంది. చమురును జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచనలో మోడీ సర్కార్ ఉందని సమాచారం. ఈనెల 17న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పెట్రోల్, డీజిల్ పై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.  ఒకే దేశం.. ఒకే పన్నుల విధానం పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీలోకి మద్యం.. పెట్రోల్.. డీజిల్.. విమాన ఇంధనం లాంటి కొన్నింటిని జాబితాలో చేర్చలేదు.  అయితే.. పన్ను ఎక్కువగా ఉండే లిక్కర్.. పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ జాబితాలోకి తీసుకురావాలన్న డిమాండ్ ఉంది. అయితే.. దీనిపై ప్రభుత్వాలు ఆసక్తి చూపించలేదు. జీఎస్టీలోకి చేరిస్తే.. పన్ను ఆదాయం భారీగా తగ్గిపోవటమే దీనికి కారణం. జీఎస్టీలో గరిష్ఠంగా 28 శాతం మాత్రమే పన్ను విధించే వీలుంది. ఒకవేళ.. దీన్ని తీసుకొస్తే.. రాష్ట్రాలతో పాటు.. కేంద్రం కూడా భారీగా పన్ను ఆదాయాన్ని కోల్పోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాల్ని నడిపిస్తోంది లిక్కర్.. పెట్రోల్.. డీజిల్ మీద పన్ను ఆదాయమే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై రూ.32.80 డీజిల్ మీద రూ.31.80 ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తోంది. దీనికి అదనంగా రాష్ట్రాలు సైతం పన్ను వసూళ్లను చేపడుతున్నాయి. ఒకవేళ.. వీటిని జీఎస్టీలోకి తీసుకెళితే.. పన్ను 28 శాతానికి మించి వేసే అవకాశం ఉండదు. రాష్ట్రాలు కూడా అదనంగా పన్ను విధింపులకు అవకాశం ఉండదు. అదే జరిగితే.. పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా తగ్గటం ఖాయం. మరి.. కీలకమైన పన్ను ఆదాయాన్ని కోల్పోయి మరీ ధరలు తగ్గేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా? అన్నదిప్పుడు ప్రశ్న. ఈ నెల 17న జరిగే జీఎస్టీ మండలి భేటీలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారన్న మాట వినిపిస్తోంది.. చూడాలి మరీ.. పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపునకు కేంద్రం ఏం చేయబోతుందో... 

సజ్జలకు కేబినెట్ బెర్త్? తెలుగు పన్నీర్ సెల్వం అవుతారా? 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతీసి అడుగేయాలంటే, అయన అనుమతి అవసరం. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలే అయినా, ఆయన ఓకే చేస్తేనే  ఫైల్ ముందుకు కదులుతుంది. ముందు అయన దర్శనం చేసుకుంటేనే, ముఖ్యమంత్రి దర్శనం లభిస్తుంది. అలాగని ఆయన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమీప బంధువో, క్లాస్మేట్, రూమ్మేట్టో కాదు, చివరకు జైల్మేట్ కూడా కాదు. ఎంపీ, ఎమ్మెల్యే అసలే కాదు. నిజానికి ప్రత్యక్ష రాజకీయాలలో ఆయన పాత్ర ఇంచుమించుగా జీరో. అయినా ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు ఆయన నోటి నుంచే మీడియాకు చేరతాయి. ప్రభుత్వ నిర్ణయాలే కాదు, ఫ్యామిలీ పాలిటిక్స్ విషయంలోనూ ఆయనే మాటే. ‘బైబిల్’ వాక్కు.  వైసీపీలో ఆయన కీలక బాధ్యతలే నిర్వహించారు. పార్టీ జనరల్ సెక్రటరీగానూ పనిచేశారు. అయినా, నెంబర్ 2 షాడో తొలిగే వరకు ఆయన చాలావరకు తెర చాటునే ఉండి పోయారు. నెంబర్ 2 ను మేఘాలు కప్పేయడంతో, అయన వెలుగులోకి వచ్చారు.   ఆయన ఎవరో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అవును,ఆయన మరెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, అయిన వారిని, కానీ వారిని అనేక మందిని సలహాదారులుగా నియమించారు. అలా నియమించిన ‘మంద’ లో ఆయన కూడా ఒకరు. అయితే, కలిసొచ్చె కాలమొస్తే నడిచొచ్చే కొడుకు పుడతారన్నట్లు, ఆయనకు కాలం కలిసొచ్చింది. కారణాలు ఏవైనా ఆయన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి దగ్గరయ్యారు. అత్యంత సన్నిహితునిగా ముద్ర పడింది. ప్రభుత్వ నిర్ణయాలు మొదలు రాజకీయ వివివాదాలు, పరిష్కారాల వరకు అన్నిటికీ ఆయనే కేంద్ర బిందువు. ఇన్ని మాటలెందుకు కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వానికి, కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే  అంటారు.    అదే సమయంలో అయన  సలహాదారుగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ రాజకీయ వ్యవహారాల్లో ఎలా వేలు పెడతారనే విమర్శలు వినవచ్చాయి. విమర్శలు మాత్రమె కాదు, ఏకంగా ప్రభుత్వంలో ఆయన పోషిస్తున్న పాత్రపై న్యాయస్థానంలో పిటీషన్ కూడా దాఖలైంది. అయితే ‘మరకా మంచిదే’ అన్నట్లుగా, ఈ మరక కూడా ఆయనకు మరో అదృష్ట రేఖగా మారింది. ఈ గొడవంతా ఎందుకని అనుకున్నారో ఏమో, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో ఇదే చర్చ జోరుగా సాగుతోంది. అదే జరిగితే తంతే వెళ్లి గారెల బుట్టలో పడినట్లు సజ్జల అదృష్టమే అదృష్టం. అలాగే రేపు ఏదైనా జరగరానిది జరిగి మళ్ళీ జైలుకు వెళితే, తెలుగు పన్నీర్ సెల్వం అయ్యే అదృష్తం కూడా దక్కవచ్చని అంచున్నారు.  ఎటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫస్ట్ కాబినెట్ కూర్పు సమయంలోనే మంత్రి పదవి అంటే ఐదేళ్ళు అనుకునేరు, రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రి వర్గం పూర్తిగా మారిపోతుంది, మీరంతా మాజీలు అయిపోతారు. కొత్త వారికి అవకాశం ఇస్తామని ముందుగానే చెప్పారు. ఇప్పుడు ఆ ఆగడువు ముగింపు దశకు చేరుకుంది.  కాబట్టి మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ముహూర్తం రానే వచ్చింది ఈ నేపధ్యంలో కొత్త మంత్రివర్గం కూర్పు పై జరుగతున్న చర్చల్లో సజ్జల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సజ్జలకు కాబినెట్ బెర్త్ ఖాయమని అంటున్నారు. అయితే, ఆయన శాసన సభ సభ్యుడు కాదు.. కాబట్టి ఆరు నెలలలో అయన ఎమ్మెల్యే,/ ఎమ్మెల్సీగా ఎన్నిక కావల్సి ఉంటుంది. అదెంత పని  రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా.. 

మోడీ బాటలో దీదీ.. పీఎం పీఠంపైనే గురి!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. ప్రధానమంత్రి పదవి మీద ఆశలున్నాయి. ఇదేమీ రహస్యం కాదు, ఉండకూడని కోరిక కూడా కాదు. నిజానికి, ఉన్న మెట్టు మీద నుంచి పై మెట్టుకు చేరాలనే కోరిక మమతకు మాత్రమే కాదు, రాజకీయ నాయకులు అందరికీ ఉంటుంది. అయితే అందరి కోరికలు తీరవు. అందుకే రాజకీయ నాయకులలో అసంత్రుప్తులే అధికంగా ఉంటారు.  మూడు నెలల స్వల్ప వ్యవధిలో గుజరాత్ సహా నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల మార్పు నేపధ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి.. రాజకీయ నాయకుల అసంతృప్తి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజమే ఆయన అన్నట్లుగా రాజకీయ నాయకులు ఎవరూ ఆనందంగా ఉండరు. ఎమ్మెల్యేలకు మంత్రి కావాలనే కోరిక ఉంటుంది, కాలేదనే అసంతృప్తి ఉంటుంది. మంత్రులు అయిన వారికి మంచి శాఖ రావాలనే కోరిక ఉంటుంది. రాలేదనే అసంతృప్తి ఉంటుంది. మంచి శాఖల దక్కిన మంత్రులకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంటుంది. కాలేదనే అసంతృప్తి ఉంటుంది. ముఖ్యమంత్రులకు కూడా తమ పదవి ఎంతకాలం ఉంటుందో, ఎప్పుడు ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందో అన్న  ఆందోళన ఉంటుంద. కాదంటే ఇదిగో ఒక మమతా బెనర్జీ, ఒక నితీష్ కుమార్ లేదా ఇంకొకరిలాగా ప్రధాని కావాలనే కోరిక ఉంటుంది.అసంతృప్తి ఉంటుంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంతటి ఆయనే ప్రధాని పదవి తమ తీరని కోరికగా జీవిత చరిత్రలో రాసుకున్నారు.  ఇలా రాజకీయాలలో పై మెట్టుకు చేరుకోవాలనే కోరిక ఆదరికీ ఉంటుంది. అందరి విషయం ఎలా ఉన్నా, ప్రస్తుత కాంటెస్ట్ లోమమతా బెనేర్జీకి మాత్రం  పీఎం అయిపోవాలనే కోరిక చాలా బలంగా ఉంది. జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలని ఆమె ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో అది సాధ్యమా అంటే, రాజకీయాలలో ఏదైనా సాధ్యమే అని అనుకోవచ్చును. అవసరం అనుకుంటే, మోడీ ముఖ్యమంత్రి పదవి నుంచి ప్రధాని పీఠం చేరుకోలేదా అని సమాధానం కూడా చెప్పుకోవచ్చును. అయితే మమతా, మోడీ  ఒకే స్థాయి నాయకులు అయితే కావచ్చును కానీ, మోడీ వెనక భావజాల (జాతీయ వాదం) బలముంది. దేశం అంతటా విస్తరించిన పార్టీ, సంస్థాగత నిర్మాణం ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కు బెంగాల్ మినహా మరో రాష్ట్రంలో పెద్దగా బలం లేదు. ఉందంటే, ఉందన్నట్లుగా, అక్కడా, ఇక్కడా ఒకటీ ఆరా సీట్లోలో గెలిచినా, జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యాన్మాయం కాలేదు. నిజానికి, ఈరోజు జాతీయ స్థయిలో కాంగ్రెస్ సహా బీజేపీకి ప్రత్యాన్మాయ పార్టీ ఏదీ లేదు.   ఒక విధంగా చూస్తే కాంగ్రెస్ సహా అన్ని  పార్టీలదీ అదే పరిస్థితి కావడం వల్లనే మమతా బెనర్జీ కానీ, మరొకరు కానీ, ప్రధాని పదవిని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ సహా ఎన్డీఎ యేతర పార్టీలకు 2024 ఎన్నికల్లో మెజారిటీలభిస్తే. సంకీర్ణ కల సాకారం అయితే  అప్పుడు మాత్రమే మమత కానీ మరొకరికి కానీ ప్రధాని పదవి దక్కే అవకాశం వస్తుంది. అది ఎంత వరకు సాధ్యం, అప్పుడు ఏమి  జరుగుతుంది? అనేది పక్కన పెడితే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన మమత ముందు ఇప్పుదు మరో సవాలుంది. ఈనెల 30న జరిగే భవానీపుర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగే  ఉప ఎన్నికలో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని నిలుపుకుంటేనే.. ఆమె ఢిల్లీ కలలు సజీవంగా ఉంటాయి. సో, భవానీపూర్ విజయం ఆమె ఢిల్లి యాత్రకు తొలిమెట్టు అవుతుంది. నిజానికి మమతా బెనర్జీ భవానీపూర్ లో విజయం సాధించడం పెద్ద విషయం కాదు. అసాధ్యం అసలే కాదు. అయితే నందిగ్రామ్ లో అనూహ్యంగా ఓటమి చవిచూసిన నేపధ్యంలో కావచ్చు ‘దెబ్బతిన్న పులి’ని అని చెప్పుకొంటున్న మమత చిన్న పామును అయినా పెద్ద కర్రతో కొట్టాలనే జాగ్రత్తతో అడుగులు వేస్తున్నారు. ఉప ఎన్నికలలో  పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌ కానీ, సీపీఎం అభ్యర్థి శ్రీజీవ్‌ బిశ్వాస్‌ కానీ దీదీకి ఏవిధంగా చూసినా దీటైనవారు ప్రత్యర్ధులు కాదు. బీజేపీ అభ్యర్థి ఇంతవరకు కనీసం కార్పొరేటర్ కూడా గెలవలేదు. అయితే మమత బెనర్జీలోని నిర్భయత్వం, ప్రియాంకలోనూ పుష్కలంగా ఉన్నాయని అంటారు. అదే మే ప్రధాన బలంగా పేర్కొంటారు. మమతా బెనర్జీ సుదీర్ఘ కాలం పాటు కమ్యూస్ట్ కూటమితో పోరాటం చేశారు. భౌతిక దాడులను ఎదుర్కున్నారు. అలాగే, ఇప్పుడు బీజేపీ అభ్యర్ధి ప్రియాంక మమత బెనర్జీ ప్రభుత్వం సాగిస్తున్న హింస కాండను అంతే ధైర్యంగా ఎదుర్కుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండలో బాధితుల పక్షాన ఆమె ఒక లాయరుగా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు.అందుకు బెదిరింపులు వస్తున్నా నిర్భయంగా  న్యాయపోరాటం చేస్తున్నారు. అదలా ఉంటే హస్తం పార్టీ (కాంగ్రెస్) చేతు లెత్తేసింది. పోటీనే చేయడం లేదు. సీపీఎం అభ్యర్థి బిశ్వాస్‌ ఎన్నికలకు కొత్త. 34 ఏళ్లపాటు బెంగాల్‌ను పాలించిన సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ఫ్రంట్‌ , కాంగ్రెస్ తో కలిసి పోటీచేసినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది.ఇక మమత విషయం చెప్పనే అక్కరలేదు. ఆమె ముఖ్యమంత్రిగా బరిలో దిగుతున్నారు. అంతే కాదు, ఆమె భవానీపుర ఆడ బిడ్డ. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ. ముస్లింల అండతోనే ఆమె  2011, 2016లలో ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. సో, ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలుపు ఖరారైనట్లే అనుకోవచ్చును. అయితే అసలు కథ ఆ తర్వాతనే మొదలవుతుందని అంటున్నారు. ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ విస్తరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చే సంవత్సరం అరంభంలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో పోటీకి ఉత్సాహం చూపుతోంది. అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీతో పొత్తుకు మమత ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే ఇతర రాష్ట్రాలలో కూడా ఎన్నికల బరిలో కాలుపెట్టే ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే మమత ఢిల్లీ పీఠం చేరుకుంటారా ... కోల్ కత్తాకే పరిమితం అవుతారా? అనేది తెలియాలంటే, ఇంకొంత కాలం ఆగక తప్పదు. 

సాక్షి క‌థ‌నంలానే సీబీఐ కోర్టు తీర్పు!.. సుప్రీంకోర్టుకు వెళ్తాన‌న్న ర‌ఘురామ‌..

ర‌ఘురామ అనుమానించిన‌ట్టే  జ‌రిగింది. సీబీఐ కోర్టు జ‌గ‌న్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. ర‌ఘురామ దాఖ‌లు చేసిన జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో సీఎం జ‌గ‌న్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిల‌ బెయిల్‌ రద్దుకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించింది.  అక్రమాస్తుల కేసుపై సీబీఐ న్యాయస్థానంలో రెండు మూడు నెలలుగా సుదీర్ఘ విచారణ జరిగింది. బెయిల్‌ మంజూరు చేసిన సందర్భంలో సీబీఐ కోర్టు విధించిన షరతులను జగన్, విజయసాయిరెడ్డి ఉల్లంఘించారని.. అందువల్ల వారి బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. వెంట‌నే ఆ ఇద్ద‌రి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని పిటిష‌న‌ర్ కోరారు.  అయితే తాము ఎలాంటి షరతులు ఉల్లంఘించలేదని.. కేవలం రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్‌ దాఖలు చేశారని జగన్‌ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రఘురామరాజు పిటిషన్‌ను కొట్టేసింది.  సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. అప్ప‌ట్లో సాక్షిలో క‌థ‌నం వ‌చ్చిన‌ట్టుగానే.. సీబీఐ కోర్టు తీర్పు ఉంద‌ని అన్నారు. జ‌డ్జిమెంట్‌పై హైకోర్టులో రివ్యూ పిటిష‌న్ వేస్తాన‌ని.. అక్క‌డ కూడా వ్య‌తిరేకంగా తీర్పు వ‌స్తే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాన‌ని ఎంపీ ర‌ఘురామ తేల్చిచెప్పారు.   

నియామకాలు చేపడితే అందరికీ మంచిది.. కేంద్రానికి సీజేఐ స్ట్రాంగ్ వార్నింగ్!

కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీ వ్యవహారంపై  విచారణ సందర్భంగా సీజేఏ జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వం తీరు సంతృప్తికరంగా లేదని సీజేఐ స్పష్టం చేశారు. ఖాళీల భర్తీ, సభ్యుల ఎంపిక విధానం కూడా అర్థం కావడంలేదని, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.  ట్రైబ్యునళ్లలో ఖాళీలు భర్తీ చేయడం కోసం రెండేళ్లు సమయం తీసుకున్నారని, ఆలస్యానికి కరోనా సహా అనేక కారణాలు చెబుతున్నారని సీజేఏ జస్టిస్ రమణ అన్నారు. రూల్‌ ఆఫ్‌ లా, రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. ఒక ఏడాది పనిచేయడానికి జ్యుడీషియరీ నుంచి ఎవరైనా వస్తారా? అని ప్రశ్నించారు. ట్రైబ్యునళ్లలో భర్తీ ఆలస్యంతో ఖాళీల సంఖ్య పెరుగుతుందన్నారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.  ట్రైబ్యునళ్ల ఖాళీల భర్తీలో ప్రతిసారీ ఇలాగే ప్రవర్తిస్తున్నారని సీజేఐ అన్నారు. దిక్కరణ పిటిషన్‌ విచారణ వేళ ఏదో ఒకటి చెప్పడం అలవాటైందన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వారంలో కౌంటర్‌ వేస్తామని ఏజీ చెప్పగా..  కౌంటర్‌ దాఖలు సమస్యకు పరిష్కారం కాదని జస్టిస్ ఎన్‌వి రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నియామకాలు చేపట్టడం ఒక్కటే పరిష్కారమన్నారు. సమస్యలు అందరికీ తెలుసునని, కావాల్సింది పరిష్కారమన్నారు. ఇప్పటికే చాలా ఓపికతో ఉన్నామని, మరికొంత ఓపిక పట్టగలమని అన్నారు. కోర్టు ఉత్తర్వులు రాకముందే నియామకాలు చేపడితే అందరికీ మంచిదన్నారు. రెండువారాల్లో స్పష్టత ఇవ్వకపోతే తగిన ఆదేశాలు జారీ చేస్తామని సీజేఐ జస్టిస్ ఎన్‌వి రమణ హెచ్చరించారు.  జాతీయ గిరిజన కమిషన్‌ నియామకంలో ఇలాగే వ్యవహరించారని జస్టిస్ ఎన్‌వి రమణ అన్నారు. డిఆర్‌టిలో కేసుల విషయంలో ఏపీ, తెలంగాణ కోల్‌కతా వెళ్లాల్సి వస్తోందని, కోల్‌కతాలో కూడా శాశ్వత సభ్యులు లేరని అన్నారు. జబల్‌పూర్‌ నుంచి ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇలాగే చేస్తే.. సమస్యల పరిష్కారం ఎప్పటికి సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. అటార్నీ జనరల్ కోరిన విధంగా విచారణను రెండు వారాలు వాయిదా వేస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వం నియామకాలు చేపట్టడం ఒక్కటే పరిష్కారమని జస్టిస్ ఎన్‌వి రమణ తేల్చి చెప్పారు.

నేరాంధ్రప్రదేశ్.. జ‌గ‌న్ పాల‌న‌లో 63% పెరిగిన నేరాలు..

అవును, ఆంధ్ర‌ప్ర‌దేశ్ నేరాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మారుతోంది. ఏపీలో క్రైమ్ రేట్ దారుణంగా పెరుగుతోంది. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో నేరాలు-ఘోరాలు విప‌రీతంగా జ‌రుగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు క‌రువ‌వుతున్నాయి. ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ది ఏ ప్ర‌తిప‌క్ష‌మో కాదు. ఇవ‌న్నీ తాజా అధికారిక‌ లెక్కల ప్ర‌కారం.. నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్ల‌డించిన నిజాలు.  ఆంధ్రప్రదేశ్‌లో నేరాల సంఖ్య పెరుగుతూ పోతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2019తో పోలిస్తే 2020లో నేరాల సంఖ్య భారీగా పెరిగింది. ఏకంగా 63శాతం మేర క్రైమ్ రేట్‌ పెరిగిందంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. జాతీయ స్థాయితో పోలిస్తే.. ఏపీ క్రైమ్ రేట్‌లో 23 శాతం పెరిగింద‌ని లెక్క‌లు చెబుతున్నాయి.  2019లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,45, 751 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఐపీసీతో పాటు స్థానిక చట్టాల కింద నమోదైన కేసులు ఉన్నాయి. 2020లో కేసుల సంఖ్య 2,38,105కి చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే సుమారు లక్ష కేసులు అదనంగా నమోదైన‌ట్టు. స్థానిక చట్టాలపై నమోదైన కేసులను తీసేసి.. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులను చూసినా 58 శాతానికిపైగా కేసులు పెరిగాయి. ఇది దేశంలోకే అత్యధిక వృద్ధి. భార‌త్‌లో అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో 2019లో ఏపీ 12వ స్థానంలో ఉండేది. 2020 నాటిక‌ల్లా మ‌రో మూడు స్థానాలు పెరిగి 9వ స్థానానికి చేరింద‌ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్ల‌డించింది. తాజా నివేదిక‌తో.. ఏపీ నేరాల‌కు అడ్డాగా మారింద‌నే విష‌యం మ‌రోసారి స్ప‌ష్ట‌మ‌వుతోంది. పోలీసులంతా ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్ చేసే ప‌నిలో బిజీగా ఉంటే.. ఇదే ఛాన్స్ అంటూ క్రిమిన‌ల్స్ రెచ్చిపోతున్నార‌ని మండిప‌డుతున్నారు. ఇక‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌హిళ‌లు, చిన్న‌పిల్ల‌లు, ద‌ళితులపై దాడులు విప‌రీతంగా పెరిగిపోయాయ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. నేరం చేసినా వెంట‌నే శిక్ష ప‌డ‌ద‌నే ధైర్యంతోనే కేటుగాళ్లు రెచ్చిపోతున్నార‌ని అంటున్నారు. తాడేప‌ల్లి రే-ప్ కేస్ ఘ‌ట‌న‌లో నిందితుల‌ను వెంట‌నే ప‌ట్టుకోక‌పోవ‌డం.. ప‌లు అత్యా-చార ఘ‌ట‌న‌ల్లో నిందితుల‌ను ప‌ట్టుకున్నా.. వెంట‌నే శిక్షించ‌లేక‌పోవ‌డం.. త‌దిత‌ర కార‌ణాల‌తో క్రిమినల్స్‌లో భ‌యం లేకుండా పోతోంది. శాంతిభ‌ద్ర‌త‌ల సంర‌క్ష‌ణ‌లో ప్రభుత్వం, పోలీసుల వైఫ‌ల్యాన్ని తాజా నివేదిక ఎత్తి చూపింద‌ని అంటున్నారు. ఇప్ప‌టికైనా పోలీసులు ప్ర‌తిప‌క్షాల‌పై ఫోక‌స్ కాస్త త‌గ్గించి.. క్రిమిన‌ల్స్‌పై దృష్టి పెడితే బాగుంటుంద‌ని.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్‌తోనైనా ఖాకీలు ప‌ద్ద‌తి మార్చుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.   

స్కూల్ బుక్స్‌లోనూ మ‌త ప్ర‌చారం!.. జ‌గ‌న్ స‌ర్కారు నిర్వాకం..

స్లో పాయిజ‌న్ అంటే తెలుసుగా. కొద్ది కొద్ది మోతాదులో.. ఎవ‌రికీ అనుమానం రాకుండా.. క్ర‌మ క్ర‌మంగా విషాన్ని ఎక్కించ‌డం. కొంత కాలం త‌ర్వాత అది త‌న ప్ర‌భావం చూపించ‌డం స్టార్ట్ చేస్తుంది. గుట్టుచ‌ప్పుడు కాకుండా ప‌ని పూర్త‌వుతుంది. మ‌త మార్పిడిలు, మ‌త ప్ర‌చార‌మూ ఇలానే సాగుతుంద‌ని అంటారు. ప్ర‌త్యేకించి ఓ మ‌తం గురించే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తుంటారు. చిన్న పిల్ల‌ల‌ను పోగేసి.. వారికి చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు ఆశ చూపించి.. ఆదివారం ప్ర‌త్యేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంటారు. బాల్యం నుంచే వారికి ఓ మ‌తం గురించి బోధిస్తూ.. వారిని త‌మ మ‌తంలో క‌లిపేసుకుంటార‌నే ఆరోప‌ణ ఉంది. అదంతా ప్రైవేటు వ్య‌వ‌హారం. అది వేరే విష‌యం అనుకోండి. కానీ, అలాంటి భావజాల‌మున్న కార్య‌క్ర‌మాన్నే ఏకంగా ప్ర‌భుత్వమే చేప‌డితే..? నేరుగా చిన్నపిల్ల‌ల పాఠ్య‌పుస్త‌కాల్లోనే మ‌త పోక‌డ‌లు చొప్పిస్తే..? ఏమ‌నాలి? దానిని ఎలా అర్థం చేసుకోవాలి? అందుకే ఏపీ విద్యాశాఖ‌ తీరుపై స‌ర్వ‌త్ర విమర్శ‌లు వ‌స్తున్నాయి.. అది మ‌త ప్ర‌చార‌మే అంటూ మండిప‌డుతున్నారు. ఐదో త‌ర‌గ‌తికి చెందిన తెలుగు వాచ‌కంలోని ఓ అంశం ఇప్పుడు వివాదాల‌కు కేంద్రమైంది. ఒక మ‌తానికి చెందిన అంశాన్ని కావాల‌నే చేర్చాల‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విద్యార్థుల ఆలోచనాశక్తిని పెంపొందించేందుకు.. ఉద్దేశించిన అభ్యాసంలో.. ఒక మతానికి సంబంధించిన అంశం చేర్చారు. ఓ పేరాగ్రాఫ్‌ ఇచ్చి.. దానిలోని అంశాల ఆధారంగా కొన్ని ప్రశ్నలు తయారు చేయాలనేది ఆ అభ్యాసం. అయితే, ఆ పేరాగ్రాఫే ఇప్పుడు కాంట్ర‌వ‌ర్సీగా మారింది. ఇంత‌కీ అందులో ఏముందంటే.... ‘‘గుణదల మేరీమాత చర్చికి వెళ్లాం. చర్చి దగ్గర భక్తులతో చాలా రద్దీగా ఉంది. భక్తులంతా కొండపైకి నడిచివెళ్తున్నారు. మేమందరం కొండపైకి నడిచివెళ్లాం. ప్రార్థనలో పాల్గొన్నాం. మేరీమాతను దర్శించుకున్నాం’’ అంటూ సాగింది. ఇదంతా ఓ మ‌తానికి సంబంధించిన అంశం కావ‌డంతో.. ఆ మ‌త ప్ర‌చారం కోస‌మే ఇలాంటి పేరాగ్రాఫ్ ఇచ్చార‌నేది విమ‌ర్శ‌. అందుకు మ‌రింత బ‌లం చేకూర్చేలా.. గ‌తంలో ఓ జూ గురించి పేరాగ్రాఫ్ ఉండ‌గా.. ఇటీవ‌ల ఆ జంతు ప్ర‌ద‌ర్శ‌నశాల గురించి తీసేసి.. ఇలా గుణ‌ద‌ల మేరీమాత చ‌ర్చిని చొప్పించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పిల్ల‌ల‌కు చ‌ర్చిని.. మేరీమాత‌ను, ప్రార్థ‌న‌ల‌ను పరిచ‌యం చేయ‌డానికే ఇలాంటి పేరాగ్రాఫ్ ఇచ్చార‌ని మండిప‌డుతున్నారు. ఆ పేరాగ్రాఫ్‌కు చ‌ర్చి ఫోటోను కూడా చేర్చడం.. పిల్ల‌లను అటువైపు అట్రాక్ట్ చేసే ప్ర‌య‌త్నమ‌ని త‌ప్పుబ‌డుతున్నారు. మామూలుగానైతే ఇలాంటి అభ్యాసాల కోసం.. ఏదైనా ప్రసిద్ధ ప్రదేశం గురించి కానీ, ప్ర‌ముఖ వ్య‌క్తుల గురించి కానీ, ప‌ర్యాట‌క కేంద్రాల గురించి కానీ పేరాగ్రాఫ్ ఇస్తుంటారు. కానీ, కావాల‌నే ఒక మతానికి సంబంధించిన ప్రదేశం గురించి చెప్పడం వెనుక దురుద్దేశ్యం ఉంద‌ని ఆరోపిస్తున్నారు. ఐదో త‌ర‌గ‌తి స్థాయి పిల్ల‌లకు ఇలాంటి అభ్యాసాలు పెట్టడం వల్ల అది వారి మనసుల్లో మతపరమైన బలమైన ముద్ర వేసేందుకు ఛాన్స్ ఉంటుంద‌ని విద్యావేత్తలు అంటున్నారు. ఏపీ విద్యాశాఖ ఇలాంటి అభ్యాసాన్ని పాఠ్యపుస్తకంలో ముద్రించడం సమర్ధనీయం కాదంటున్నారు. వెంట‌నే ఆ టాపిక్ తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

హైకోర్టులో ర‌ఘురామ‌కి ఎదురుదెబ్బ‌.. సీబీఐ కోర్టు తీర్పుపై ఉత్కంఠ‌..

ర‌ఘురామ ఆశించిన‌ట్టు జ‌ర‌గ‌లేదు. అయినా, సీఎం జ‌గ‌న్‌కు బెయిల్ ర‌ద్దు ముప్పు వీడ‌లేదు. జ‌గ‌న్ కేసును సీబీఐ కోర్టు నుంచి మ‌రో కోర్టుకు బ‌దిలీ చేయాలంటూ ఎంపీ ర‌ఘురామ వేసిన పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో.. సీబీఐ కోర్టు తీర్పుపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.  సీఎం జ‌గ‌న్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దుపై సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించకుండా స్టే ఇవ్వడంతో పాటు.. బెయిల్‌ రద్దు పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ మంగళవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి కేసు బదిలీ చేయాలంటే సహేతుకమైన కారణాలు ఉండాలని, ఇక్కడ అలాంటివేవీ లేకుండా ఊహాజనిత కారణాలతో బదిలీ కోరుతున్నారని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిపై వాదనలను విన్న హైకోర్టు.. బుధ‌వారం ర‌ఘురామ పిటిష‌న్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక‌, సీబీఐ కోర్టు తీర్పు ఎలా ఉంటుందోన‌నే ఆస‌క్తి పెరిగిపోయింది. జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని రఘురామ వేసిన పిటిషన్‌లపై సీబీఐ కోర్టులో జులై 30న వాదనలు ముగిశాయి. గత నెల 24నే తీర్పు వెల్లడించాల్సి ఉండ‌గా.. విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ మరో పిటిషన్ దాఖలు చేశారు. రెండు పిటిషన్లలోనూ వాదనలు దాదాపు ఒకే తీరుగా జరిగాయి. గత నెల 24న విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై వాదనలు విన్న సీబీఐ కోర్టు.. రెండు పిటిషన్లపై ఒకే రోజు తీర్పు వెల్లడిస్తామంటూ తీర్పును సెప్టెంబ‌ర్ 15కి వాయిదా వేసింది. దీంతో.. జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దుపై సీబీఐ కోర్టు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందోన‌నే టెన్ష‌న్ నెల‌కొంది.  మరోవైపు జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేశారంటూ ట్వీట్ చేసిన సాక్షి మీడియాపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలన్న రఘురామ పిటిషన్‌పైనా సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేయనుంది.  

మెట్ గాలాలో మెరిసిన మెఘా సుధారెడ్డి.. ఆమె గౌన్ వెరీ స్పెషల్

అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదిక మెట్ గాలాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్‌ లో  జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వేడుక ‘మెట్‌ గాలా-2021’లో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన గౌనులో  ఆమె మెరిశారు. ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్‌ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఇషా అంబానీ తదితరులు పాల్గొన్నారు.సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాకపోయినా.. మెట్ గాలాలో పాల్గొని సంథింగ్ స్పెషల్ గా నిలిచారు మెఘా సుధారెడ్డి.  మెట్ గాలా. మెట్ గాలాను ‘మెట్ బాల్’ అని కూడా పిలుస్తుంటారు. కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ గాలా, కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ బెనిఫిట్ అని కూడా అంటారు. గ్లామరస్ గా సాగే ఈ గాలాను ఏదో అవార్డుల కోసమో లేదంటే వినోదం కోసమో నిర్వహించరు. ఇదో ఫండ్ రైజింగ్ ఈవెంట్. సెల‌బ్రిటీలు డిజైన‌ర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ క‌నిపించే మెగా ఈవెంట్ ‘మెట్ గాలా’‌.2021కు గాను  అమెరికాలోని న్యూయార్క్ న‌గ‌రంలో జరిగింది.  ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ లోనే మెఘా  సుధారెడ్డి మెరిశారు.  సెల‌బ్రిటీలు డిజైన‌ర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ క‌నిపించే మెగా ఈవెంట్‌ ‘మెట్ గాలా’ రెడ్ కార్పెట్‌పై ప్ర‌పంచం న‌లుమూలల నుంచీ సెల‌బ్రిటీలు హొయ‌లు పోతూ ఫొటోల‌కు ఫోజులిస్తారు. వారి అందాలను..సొగసుల్ని కెమెరాల్లో బంధిస్తారు ఫోటో గ్రాఫర్లు. అలాంటి ఈవెంట్‌లో ఈసారి ఇండియా నుంచి  సుధారెడ్డి ఒక్కరే  పాల్గొన్నారు. మెట్‌ గాలాలో సుధారెడ్డి పాల్గొనడం ఇదే తొలిసారి. ఈమె మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్ డైరెక్ట‌ర్ కూడా. ఈ ఏడాది థీమ్‌ ‘అమెరికన్‌ ఇండిపెండెన్స్‌’కు తగ్గట్లు అమెరికా జెండాలోని రంగులను తలపించేలా భారతీయ ఫ్యాషన్‌ డిజైనర్లు ఫల్గుని, షేన్‌ పీకాక్‌ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గౌనును ఆమె ధరించారు. ఆ గౌన్ సుధారెడ్డి చూపరుల్ని ఆకట్టుకున్నారు. దీని తయారీకి 250 గంటలు పట్టినట్లు డిజైనర్లు తెలిపారు.   

కేటీఆర్ రిజైన్ చేయాల్సిందే... హోరెత్తుతున్న సోషల్ మీడియా!  

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజా సమస్యలపై వేగంగా స్పందిస్తారనే పేరున్న తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అడ్డంగా బుక్కయ్యారు. సోషల్ మీడియాలోనే ఇప్పుడు ఆయన టార్గెట్ అయ్యారు. నెటిజన్లు కేటీఆర్ ను ఆటాడుకుంటున్నారు. మంత్రి హోదాలో ఉండి... తప్పుడు ట్వీట్ చేసినందుకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం సంచలనంగా మారిన గిరిజన బాలిక దారుణ హత్యాచారం ఘటనకు సంబంధించిన విషయం కావడంతో విపక్షాలు కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.  వినాయక చవితి ముందు రోజు సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో దారుణం జరిగింది. ఆరేండ్ల చిన్నారిపై లైగింక దాడికి పాల్పడి దారుణంగా చంపేశాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. అయితే చిన్నారి హత్యపై స్పందిస్తూ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. ఘటన అత్యంత బాధాకరమంటూ ఈనెల 12న ట్వీట్ చేశారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే  పోలీసులు నిందితుడిని పట్టుకున్నారని అందులో పేర్కొన్నారు. ఇదే ఇప్పుడు రచ్చ రచ్చవుతోంది.  ఆరేండ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు ఇంకా పోలీసులకు దొరకలేదు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా ఫలితం దక్కడం లేదు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులే ప్రకటించారు. అంతేకాదు నిందితుడిని పట్టిస్తే 10 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. దీంతో కేటీఆర్ ట్వీట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ‘నిందితుడు ఎక్కడ మంత్రిగారూ? అతడిని ఎప్పుడు అరెస్ట్‌ చేశారు?’’ అంటూ నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించిన కేటీఆర్‌కు మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శిస్తున్నారు.  టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కూడా కేటీఆర్‌ ట్వీట్‌ను తప్పుబట్టారు. నిందితుణ్ని గంటల్లో పట్టుకున్నామని కేటీఆర్‌ ట్వీట్‌ చేస్తే.. ఆచూకీ తెలిపినవారికి రూ.10 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారని.. ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు.  తనపై వస్తున్న విమర్శలపై కేటీఆర్‌ మంగళవారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. నిందితుడి అరెస్టుపై తనకు తప్పుడు సమాచారం వచ్చిందని, దాని ఆధారంగా ట్వీట్‌ చేశానని విచారం వ్యక్తం చేశారు. అతడు ఇంకా పరారీలో ఉన్నాడని, పట్టుకునేందుకు పోలీసులు పెద్దఎత్తున గాలిస్తున్నారని తెలిపారు. నిందితుణ్ని త్వరగా పట్టుకుని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అందరం కృషి చేద్దామని పేర్కొన్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్... నెటిజన్లకు టార్గెట్ కావడం ఆసక్తిగా మారింది. అసలు పోలీసుల నుంచి సమాచారం లేకుండానే నిందితుడిని పట్టుకున్నామని కేటీఆర్ ట్వీట్ చేయడం ఏంటనే  ప్రశ్న వస్తోంది. ఈ అంశంలోనే కేటీఆర్ ను మరింత ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ పరిణామాలతో కేటీఆర్ అనుచరులతో పాటు టీఆర్ఎస్ కేడర్ లో మాత్రం నిస్తేజం అలుముకుంది.   

ట్రబుల్ షూటరా.. క్రియేటరా?.. హరీష్ పై టీఆర్ఎస్ లో రచ్చ... 

‘ఇంకా రెండున్నరేళ్లు మేమే ఉంటాం.. ఎండమావిలాంటి బీజేపీ వైపు వెళ్లేబదులు. అధికారంలో ఉన్న మాకు మద్ధతునీయండి’ హుజూరాబాద్ ఉప ఎన్నిక పద్మవ్యూహంలో చిక్కుకున్న మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్య ఇది. ఆయన ఏ ఉద్దేశంతో, ఎలాంటి మూడ్’లో ఉండి ఈ వ్యాఖ్య చేశారో ఏమో గానీ,  రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా తెరాస వర్గాల్లో హరీష్ వ్యాఖ్యపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో జోరుగా తిరుగుతున్న హరీష్ రావు.. ఒక కులసమావేశంలో చేసిన ఈ వ్యాఖ్య ఏమి సూచిస్తోంది? ఆయన మాటల అర్థం ఏమిటి? పార్టీనాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.   ఇది అభ్యర్ధన, ప్రార్ధన, కాళ్ళ బేరమా లేక బెదిరింపా? అని పార్టీ క్యాడరే విస్మయాన్ని వ్యక్తపరుస్తోంది. ఇదొకటే కాదు, హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో హరీష్ రావు మాటల తీరు, చేస్తున్న వ్యాఖ్యలు వింటుంటే, చదవేస్తే ఉన్నమతి పోయింద్నన సామెత గుర్తుకోస్తోందని, కారు పార్టీలోనే కొందరు నేతలు గుసగుసలు పోతున్నారు. అంతే కాదు, ప్రచారం పేరుతో పార్టీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా, అన్న సందేహలు కూడా అక్కడక్కడ మొదలయ్యాయి. ముఖ్యంగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,  మంత్రి కేటీఆర్, ఉప ఎన్నికని లైట్ గా తెస్సుకోవాలని, అనవసర ప్రాధాన్యత వద్దని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా హరీష్ రావు, స్థాయి మరిచి చేస్తున్న వ్యాఖ్యలతో పార్టీని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారనే మాట కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది.  ప్రతిపక్ష పార్టీలకు ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందని, హరీష్ చెప్పదలచుకున్నారా? ఇంతకాలంగా విపక్షాలు చేస్తున్న విమర్శను హరీష్ రావు నిజం చేయాలనుకుంటున్నారా లేక మాజీ దోస్తుకు మేలు చేసేందుకు ఉద్దేసపుర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, అని గులాబీ గూటిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.  అదే నిజం అయితే, లోక్ సభ ఎన్నికల్లో, తెరాసకు ఓటేయమని ఎలా అడుగుతాం... కేంద్రంలో ఎప్పటికైనా జాతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయి తప్ప ప్రాంతీయ పార్టీలు రావు కదా, మరి అలాంటప్పుడు లోక్ సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు పోటీ చేయడం ఎందుకు,  అవసరం లేదంటే... అంటూ ప్రశ్నిస్తున్నారు.  హరీష్ రావు, ప్రతి ఊర్లో, ప్రతి ఉపన్యాసంలో ఈటల రాజేందర్ నియోజక వర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, అభివృద్ధిని పట్టించుకోలేదని చేస్తున్న ఆరోపణల విషయంలో కూడా ఇదే విధమైనా సందేహలు వ్యక్తమవుతున్నాయి. నియోజక వర్గానిక, ముఖ్యమంత్రి డబల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసినా, ఈటల ఒక్క ఇల్లు కూడా కట్టలేదని అనడం హాస్యాస్పదంగా ఉన్నదని, అధికార పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారు.  నిధులు విడుదల చేయకుండా ఇళ్లు మంజూరు చేసి ప్రయోజనం  ఏముంటుందని, రాష్ట్రంలో వీఐపీ, వీవీఐపీ నియోజక వవర్గాలు తప్పించి చాలా వరకు నియోజక వర్గాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ దుస్థితి ఒకేలా ఉందని, అంటున్నారు. అందుకే అభివృద్ధి, డబుల్ బెడ రూమ్ హౌసెస్ విషయంలో హరీష్ రావు ఈటల పై చేస్తున్న విమర్శ కూడా బ్రూమ్రాంగ్ అవుతుందని తెరాస నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. ఒక వేలు అటు చూపిస్తే నాలుగు వేళ్ళు మన వైపు చూపుతాయని అంటున్నారు. ఈటల నిన్నటిదాకా తెరాసలోనే ఉన్నారని, తెరాస ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారని మరిచిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తెరాస ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల ఏమీ చేయక పోతే అది ప్రభుత్వ వైఫల్యం, ముఖ్యమంత్రి వైఫల్యం కాదా, అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు హరీష్ రావు ట్రబుల్ షూటరా? ట్రబుల్ క్రియేటారా? అన్న సందేహలు కూడా వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.

75 మందితో టీటీడీ కొత్త పాలక మండలి! 

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి ఖరారైందని తెలుస్తోంది. మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే టీటీడీ పాలకమండలిని ఖరారు చేశారని సమాచారం. ఈసారి 75 మందితో పాలకమండలి కొలువు దీరబోతోందని తెలుస్తోంది. ఇందులో 25 మంది టీటీడీ బోర్డు మెంబర్లు కాగా.. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 50 మందిని నియమించనున్నారు. టీటీడీ కొత్త పాలక మండలిపై ఒకటి, రెండు రోజుల్లోనే జీవో వచ్చే అవకాశం ఉంది. టీటీడీ నిబంధనల మేరకు ఛైర్మన్ తో సహా 25 మంది సభ్యులతో పాలక మండలి ఉండాలి. అయితే కేంద్రంలోని పెద్దల మొదలు పలు పార్టీలు..అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రలు మొదలు అనేక మంది ప్రముఖులు తమ వారిని ఈ బోర్డులో అవకాశం కల్పించాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు సిఫార్సు చేశారు.  వారిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలు..తమిళనాడు సీఎం వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఊహించని స్థాయిలో వచ్చిన సిఫార్సులు.. ఒత్తిడి కారణంగా భారీ స్థాయిలో ఆశావాహులు ఉండటంతో ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. అందులో భాగంగా నిబంధనల ప్రకారం 25 మందితో బోర్డు సభ్యులు..మరో 50 మందిని టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించాలని నిర్ణయం తీసుకుంది.  25 మంది టీటీడీ బోర్డు మెంబర్లలో సుమారు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. ప్రతి బోర్డులోనూ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అవకాశం కల్పిస్తారు. ఈసారి తెలంగాణ రాష్ట్రం నుంచి ఐదుగురికి అవకాశం దక్కిందని అంటున్నారు. తమిళనాడు, కర్ణాటక నుండి కూడ ముగ్గురు చొప్పున.. ఢిల్లి నుండి ఒక మంత్రి గారి భార్యకు చోటు దక్కిందని సమాచారం. ఇక కేంద్రం పెద్దలు చెప్పిన మరొక నలుగురికి టీటీడీ బోర్డులో స్థానం దక్కిందని తెలుస్తోంది. గుజరాత్ రాష్ట్రం నుంచి ఒకరికి ఛాన్స్ దక్కిందనే ప్రచారం జరుగుతోంది. శారద పీఠం స్వామి చెప్పిన ఇద్దరు ఉండనున్నారు.  గత పాలక మండలిలో సభ్యులుగా ఉన్న సుధా నారయణ మూర్తి, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్, జూపల్లి రామేశ్వరరావు, తెలంగాణ నుంచి ప్రతాప రెడ్డి కి అవకాశం ఖాయమని తెలుస్తోంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం నుంచి ఒకరికి ఈ పాలక మండలిలో స్థానం ఖాయం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సారి గుజరాత్ కు చెందిన ఒకరికి సైతం బోర్డు సభ్యుడుగా నియమితులు అవ్వనున్నట్లుగా తెలుస్తోంది. పలువురు కేంద్ర మంత్రులు ఒక్కక్కరూ పలువురి పేర్లు సిఫార్సు చేసారు. సినీ పరిశ్రమ నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా విశ్వసనీయ సమాచారం.  గత పాలక మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు భూమన కరుణాకర రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఈ సారి సైతం అదే హోదాలో కొనసాగనున్నారు. తిరుపతి స్థానిక ఎమ్మెల్యేగా భూమన..తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డికి ఈ అవకాశం దక్కనుంది. అదే విధంగా బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉన్న విశాఖకు చెందిన సుధాకర్ సైతం ఈ సారి ఎక్స్ అఫీషియో కోటాలో బోర్డు సభ్యుడుగా ఉండనున్నారు. 

67 ఎకరాల్లో ప్రపంచస్థాయి ప్రాంగణ నిర్మాణం.. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం మరో అద్భుతం 

అమెరికాలో ప్రవాస భారతీయులకు గర్వకారణంగా నిలుస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కీర్తి పతాకలో మరో కలికితురాయి చేరబోతోంది. ప్రవాస భారతీయుల చరిత్రలో తొలిసారిగా భారతీయులచే 2016లో స్థాపించబడిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం  (University of Silicon Andhra) శాన్ వాకిన్ జిల్లా పరిధిలోని ట్రేసీ పట్టణ సమీపంలో ప్రపంచస్థాయి విద్యాప్రాంగణ నిర్మాణానికి తలపెట్టింది. ఈ ప్రాంగణ నిర్మాణానికి ఎంతో విలువైన 67 ఎకరాల భూమిని ఇవ్వటానికి సంధు కుటుంబం ముందుకొచ్చింది. ప్రపంచ ప్రసిద్ధిపొందిన సిలికాన్ వ్యాలీకి సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణం రూపుదిద్దుకోనుంది.  రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రపంచ ప్రాంగణ నిర్మాణం పూర్తిచేయాలన్న ప్రణాళికలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఉంది. ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణ నిర్మాణానికి సుమారుగా 450 మిలియన్ డాలర్ల (రూ.3300 కోట్లు) ఖర్చు అవుతుందని అంచనా. దాతల సహకారంతో ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణం రూపుదిద్దుకోనుంది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా శాన్ వాకిన్ జిల్లా యువత అనేక రకాలుగా లబ్ధి పొందుతారని సంధు కుటుంబసభ్యులు మైక్ సంధు, మణి సంధు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  అందరి మన్నలను, సహకారాన్ని పొందిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం స్థానికంగా, దేశవ్యాప్తంగా విభిన్న రంగాల అభివృద్ధికై సముచితమైన విద్యాబోధనను అందిస్తుందన్న విశ్వాసాన్ని విశ్వవిద్యాలయ అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండే అట్టడుగు వర్గాల అభివృద్ధికి తోడ్పడుతూ స్పష్టమైన ప్రణాళికతో ఉన్నతస్థాయిలో పరిశోధనాత్మకమైన విద్యను అందించే దిశగా విశ్వవిద్యాలయం పథకాలను అవలంబిస్తుందని అన్నారు. శాన్ వాకిన్ జిల్లా సామాజిక, ఆర్థిక అభివృద్ధికై సహయపడే విద్యాప్రణాళికను రూపొందిస్తామని ప్రొవోస్ట్ చమర్తి రాజు అన్నారు. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, భాషాశాస్త్రాలు, యోగ, ఆయుర్వేద, సంగీత నృత్య కళలలో BS/MS/MA మరియు Ph.D. డిగ్రీలను అందించే అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయంగా రూపొందబోతోందని తెలిపారు. ఉన్నతవిద్యను అందించే సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం శాన్ వాకిన్ జిల్లా ప్రాంతానికి రావటం పట్ల ప్రభుత్వ అధికారులు, స్థానిక పాలకులు హర్షం వ్యక్తం చేశారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు https:www.uofsa.edu వెబ్ సైటులో చూడవచ్చు.. 

మరో బీజేపీ ముఖ్యమంత్రికి ఉద్వాసన? 

మూడు నెలల వ్యవధిలో మూడు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను మార్చిన బీజేపీ జాతీయ నాయకత్వం మరో ముఖ్యమంత్రి ఉద్వాసనకు ముహూర్తం ఖరారు చేసిందా అంటే, అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ముఖ్యమంత్రి మార్పు గెలుపు  మంత్రంగా బీజేపీ భావిస్తోందా, అంటే అందుకూ అవుననే సమాధానమే వస్తోంది. కొద్ది నెలల క్రితం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థ సింగ్ రావత్ కు పదవిని చేపట్టి నాలుగు నెలలు అయినా కాకముందే బీజేపీ అధిష్ఠానం ఉద్వాసన పలికింది. ఆవెంటనే (జూలైలో) కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పని ఇంటికి సాగనంపింది. ఇక నిన్న మొన్న ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షాల స్వరాష్ట్రం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపనీని తొలిగించి భూపేంద్ర ‘పటేల్’కు పట్టం కట్టింది. ఈనేపధ్యంలో  నెక్ట్స్ ఎవరు? అన్న ప్రశ్న ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.   అయితే అందుకు పెద్దగా తలలు బద్దలు కొట్టుకో వలసిన అవసరం లేకుండా, బీజేపీ అధిష్ఠానం అవసరమైన సంకేతాలను ఇచ్చేసింది. హిమాచల్ ముఖ్యమంత్రికి జైరాం ఠాకూర్..కు ఢిల్లీ  నుంచి పిలుపు వచ్చింది. అయన హడావుడిగా ఢిల్ల్లీ వెళ్లారు. ఇలా  అధిష్ఠానం నుంచి పిలుపు అందుకుని ఆయన  ఢిల్లీకి పరుగులు తీయడం వారం రోజుల్లో ఇది రెండో సారి.. ఈ నెల 8న దేశ రాజధానికి వెళ్లిన ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. మళ్ళీ ఇంతలోనే ఢిల్లీ పిలిచిందంటే జైరాం.. కు రామ్ రామ్ .. ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఉత్తరాఖండ్, కర్ణాటక విషయంలోనూ బీజేపీ అధిష్ఠానం ఇలాగే, ముందు ఒకటికి  రెండుసార్లు ముఖ్య మంత్రులను చర్చలకు పిలిచి, ఆ తర్వాత, ఇదీ సంగతి ... అంటూ అసలు సంగతి బయట పెట్టిందని ఈసందర్భంగా గుర్తు చేస్తున్నారు.   ఇప్పుడు హిమాచల్ ముఖ్యమంత్రికి వారం రోజల్లో ఢిల్లీ నుంచి  సెకండ్ కాల్ వచ్చింది. అంతే కాదు, బీజేపీ అధిష్ఠానం ఒక్క ముఖ్యమంత్రిని మాత్రమే కాదు, ముఖ్యమంత్రి ఠాకూర్ సహా హిమాచల్ప్రదేశ్ బీజేపీ కీలక నేతలు అందరినీ ఢిల్లీకి  పిలిపించింది. ఈ పర్యటనలో.. ఠాకూర్ బీజేపీ హైకమాండ్తో మారోమారు చర్చించనున్నట్టు సమాచారం. ఈ భేటీలో పార్టీ హిమాచల్ప్రదేశ్ ఇంఛార్జ్ అవినాశ్ రాయ్ ఖన్నా, సహ ఇన్ఛార్జ్ సంజయ్ టాండన్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సురేశ్ కశ్యప్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి పవన్ రాణా పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలు, రానున్న ఉపఎన్నికలపై సుదీర్ఘ మంతనాలు జరగనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.  రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మాత్రం ముఖ్యమంత్రి మార్పు తప్పక పోవచ్చన్న మాట బలంగా వినిపిస్తోంది. మరో వంక కాంగ్రెస్ పార్టీ, ఇదే అదనుగా విమర్శలకు దిగింది.  ఠాకూర్ను తొలగించేందుకే ఢిల్లీకి పిలిపించారని ఎద్దేవా చేసింది. ఈ విషయాన్ని బీజేపీ  చేపట్టిన 'జన్ ఆశీర్వాద్ యాత్ర'లో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఇప్పటికే సూచనప్రాయంగా చెప్పేశారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రులను మారిస్తే విజయం వరిస్తుంది అనేందుకు పెద్దగా  ఆధారాలు లేవంటున్నారు రాజకీయ పరిశీలకులు. అదీ గాక  తరచూ ముఖ్యమంత్రులను మార్చడం వలన గతంలో కాంగ్రెస్ పార్టీ గట్టి ముల్యాన్నే చెల్లించిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో నందమూరి తారక రామా రావు సారధ్యంలో  తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి, కాంగ్రెస్ ఓటమికి ఇతర కారణాలతో పాటుగా  ముఖ్యమంత్రుల మార్పు కూడాఒక ఒక మూల కారణం అనేది ఒక చారిత్రిక సత్యంగా చరిత్రలో నిలిచి పోయింది.  ఇంచుమించుగా పాతికేళ్ళ క్రితం ఢిల్లీలో బీజేపీ వరసగా ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చి, చివరకు ఎన్నికలకు ఆరు నెలల ముందు సుష్మా స్వరాజ్   కు బాధ్యతలు అప్పగించింది. అయినా, ఆ ఎన్నికలలో బీజేపీ ఓడి పోయింది. ఇక అప్పటి నుంచి వరసగా మూడు మార్లు కాంగ్రెస్, (షీలా దీక్షిత్), ఆ తర్వాత ఇప్పుడు వరుసగా రెండవ సారి ఆప్ (అరవింద్ కేజ్రివాల్) విజయం సాధించాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీనిలోని ఏడూ లోక్ సభ స్థానాలను బీజేపీ స్వీప్ చేసినా, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం  ‘చీపురు’ (ఆప్ సింబల్) బీజీపీని స్వీప్ చేసింది. సో.. ముఖ్య మంత్రులను మార్చినంత మాత్రాన ఎన్నికల్లో గెలుస్తామని అనుకోవడం అయితే రాజకీయ అజ్ఞానం అవుతుంది, కాదంటే రాజకీయ అమాయకత్వం అనిపించుకుంటుంది.