ఆరు నెలల్లో నలుగురు సీఎంల రాజీనామా.. బీజేపీలో ఏం జరుగుతోంది?
posted on Sep 11, 2021 @ 4:12PM
ముఖ్యమంత్రులను తరుచూ మార్చడం.. ఎమ్మెల్యేలను సంప్రదించకుండానే సీఎంలను నిర్ణయించడం.. కేంద్రం నుంచి నేతలను రాష్ట్రాలకు పంపించడం.. ఇవీ గతంలో కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రధాన ఆరోపణలు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తరుచూ ముఖ్యమంత్రులను మారుస్తూ ఉండేవారు. అప్పట్లో ఇది వివాదాస్పదమైంది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ ను విమర్శించాల్సి వచ్చినప్పుడు విపక్షాలు.. ముఖ్యమంత్రుల మార్పు అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటాయి.
అయితే ప్రస్తుతం బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలోనే పయనిస్తుందని అనిపిస్తోంది. గత ఆరు నెలల్లోనే నలుగురు బీజేపీ ముఖ్యమంత్రులు రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నా ముఖ్యమంత్రులను మార్చేసింది బీజేపీ హైకమాండ్. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని రాజీనామా చేశారు. పార్టీ ఆదేశాలతో ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు అందజేశారు.
వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, సడెన్ గా విజయ్ రూపానీ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. విజయ్ రూపానీ సీఎం పదవి నుంచి తప్పుకోవడానికి దారితీసిన కారణాలు ఏంటన్నది తెలియరాలేదు.ఇటీవల కాలంలో రాజీనామా చేసిన నాలుగో బీజేపీ సీఎంగా నిలిచారు విజయ్ రూపానీ. గత జులైలో కర్ణాటక సీఎం పదవికి బీఎస్ యడియూరప్ప రాజీనామా చేశారు. యడ్డీ స్థానంలో బసవరాజ్ బొమ్మైని కర్ణాటక ముఖ్యమంత్రిగా నియమించింది బీజేపీ.
2021 మార్చిలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేశారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలతో ఆయన పదవి నుంచి వైదొలిగారు. త్రివేంద్ర సింగ్ రావత్ స్థానంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా మార్చి 10న తీర్థ సింగ్ రావత్ ప్రమాణం చేశారు. అయితే కేవలం నాలుగు నెలల్లోనే మరోసారి ముఖ్యమంత్రిని మార్చేసింది బీజేపీ. పార్టీ పెద్దల ఆదేశాలతో జూలై 3న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు తీర్థ సింగ్ రావత్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులను బీజేపీ హైకమాండ్ వెంట వెంటనే మార్చడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.