తాడేపల్లిలోనే 72 వేల కోట్ల హెరాయిన్ బిగ్ బాస్! 

ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి విజయవాడకు అక్రమంగా రవాణా అవుతూ గుజరాత్‌ లో పట్టుబడిన హెరాయిన్ వ్యవహారం ఏపీలో రాజకీయ రచ్చగా మారింది. పెద్దఎత్తున పట్టుబడిన హెరాయిన్ కు విజయవాడ లింకులు బయటపడటంతో డ్రగ్స్ దందాకు.. ఏపీ అడ్డాగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో క్రైమ్ రేట్ పెరిగిపోయిది. మహిళలపై దాడులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ లింకులు వెలుగులోనికి రావడంతో అధికార పార్టీలో అలజడి రేగుతోంది. దీంతో మంత్రులు, వైసీపీ నేతలు సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి పేర్నినాని డ్రగ్స్ అంశంపై మాట్లాడకుండా... టీడీపీపై ఆరోపణలు చేశారు. బెజవాడలో భూకబ్జాలు చేసే వాళ్లు గుజరాత్ లో పట్టుబడిన హెరాయిన్ గురించి మాట్లాడుతున్నారు. హెరిటేజ్ వ్యాన్లలో ఎర్రచందనం దుంగలు జపాన్ తరలించింది నిజం కాదా అంటూ పేర్ని నాని కామెంట్ చేశారు. మంత్రి పేర్నినాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. వైసీపీ రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నేరస్థుల అడ్డాగా మార్చిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. పట్టుబడిన రూ.72 వేల కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్ బిగ్ బాస్ ఎవరంటే వైసీపీ భుజాలు తడుముకుంటోందన్నారు. డ్రగ్స్ కేసులో వైసీపీ ఎందుకు ఉలిక్కి పడుతోందని ప్రశ్నించారు. ఏపీ పోలీసులు ఈ డ్రగ్స్‌పై ఎందుకు విచారణ చేయటంలేదని నిలదీశారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియాలా డ్రగ్స్ సిండికేట్ అయిందన్నారు. డైరెక్టర్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు వైసీపీ తాట తీస్తారని తెలిపారు. తాడేపల్లి నుంచి ఢిల్లీలో డీఆర్ఐ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. ట్రాన్స్ ఫర్స్, ప్రమోషన్స్ కోసం పోలీసులు తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పట్టుబడిన 72 వేల కోట్ల హెరాయిన్ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారని దుయ్యబట్టారు. నిర్వాహక బిగ్‌బాస్ తాడేపల్లిలో ఎక్కడున్నాడో త్వరలో తేలుతుందన్నారు.  ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఏపీ డ్రగ్స్ వ్యవహారమంతా తెలుసని చెప్పారు. టీడీపీ తరపున ఢిల్లీ వెళ్లి ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి సంబంధిత అధికారులకు తెలుపుతామని బోండా ఉమా చెప్పారు. 

తాలిబాన్ అగ్ర నేత చనిపోయాడా? బారాదరి పాక్ బందీగా ఉన్నాడా? 21 వేల హెరాయిన్ కథేంటీ? 

అఫ్ఘనిస్థాన్‌ నుంచి విజయవాడకు అక్రమంగా రవాణా అవుతూ గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో  21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడటం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. అధికారుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని తెలుస్తోంది. ఆప్ఘనీస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్న పాకిస్తాన్.. అక్కడ భారీగా ఉన్న హెరాయిన్ ఇతర దేశాలకు రవాణా చేస్తోందని తెలుస్తోంది.  ఆప్ఘనీస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే తాలిబన్ పాలనంతా పాకిస్తాన్ కనుసన్నలోనే సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. తాలిబాన్ అగ్ర నాయకుడు హైబతుల్లా అఖున్జాద చనిపోయారని,కాందహార్ లోని ఒక ఇంట్లో బారాదరీని బందీగా ఉంచి పాకిస్థాన్ అతి పెద్ద డ్రామా ఆడుతున్నదని తెలుస్తోంది.   హైబతుల్లా తాలిబన్లలో అగ్ర నేత కాగా.. ముల్లా బరాదరీమ్ నంబర్ 2 గా పరిగణిస్తారు. అధికారం కోసం రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో  అగ్రనేత హైబతుల్లా చనిపోగా.. ముల్లా బారాదరీని కాందహార్ లో బందీగా ఉంచినట్లు తెలుస్తోంది.  లండన్ నుండి వెలువడే వెబ్ న్యూస్ పోర్టల్ 'ది స్పెక్టేటర్' కధనం ప్రకారం గత ఆగస్ట్ లో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్ష భవనం లో తాలిబన్ లు, హక్కానీ నెట్ వర్క్ నాయకులు సమావేశం అయ్యారు. బరాదరీ తో పాటు అతని అనుచరులు, హక్కాని నెట్వర్క్ నాయకుడు ఖలీల్ –ఉర్ –రహమాన్ హక్కాని తో పాటు అతని అనుచరులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మొదట బారాదరీ ఎవరెవరికి ఏ ఏ పదవులు ఇవ్వదల్చుకున్నారో పేర్లు చదవడం మొదలుపెట్టిన కొద్ది క్షణాలలోనే హక్కానీ ఆగ్రహంగా తన కుర్చీ లోనుండి లేచి మొదట అక్కడ ఉన్న వేడి గ్రీన్ టీ ఉన్న పెద్ద థెర్మోస్ ఫ్లాస్క్ ని బారాదరీ మీద విసిరి కొట్టాడు అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న కుర్చీ తో బారాదరీ ని కొట్టాడు. అదే సమయంలో బారాదరీ అనుచరులు హక్కానీ అనుచరులతో బాహా బాహీ తలపడ్డారు. పరస్పరం తుపాకీలతో కాల్పులు జరుపుకున్నారు. సంఖ్య తెలియరాలేదు కానీ ఇరు వైపులా చాలామంది కాల్పులలో చనిపోయారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.  తీవ్రంగా గాయపడ్డ బారాదరీ ని అక్కడ నుండి నేరుగా హాస్పిటల్ కి తీసుకెళ్ళి ప్రాధమిక చికిత్స చేసి అక్కడ నుండి కాందహార్ లోని గుర్తు తెలియని ప్రదేశం లో బందీగా ఉంచారు హక్కాని అనుచరులు. ఇదంతా పాకిస్థాన్ ISI చీఫ్ అక్కడ ఉండగానే జరిగింది. తజక్ మైనారిటీ షియాలకి, అలాగే హజారా షియాల కి తన మంత్రి వర్గంలో స్థానం ఇవ్వడాన్ని హక్కానీ జీర్ణించుకోలేక పోయారు.  పాకిస్థాన్ కి షియాలకి మంత్రి పదవులు ఇవ్వడం అసలు ఇష్టం లేదు. కానీ దోహా లో చేసుకున్న ఒప్పందం ప్రకారం బారాదరీ తజక్ షియా మైనారిటీలకి మంత్రి పదవులు ఇవ్వాలనే పట్టుదలగా ఉన్నాడు. తాలిబన్ల జెండా తో పాటు ఆఫ్ఘన్ జాతీయ జెండాలని రెండిటినీ అధ్యక్ష భవనం మీద, ఇతర ప్రభుత్వ కార్యాలయాల మీద ఎగుర వేయాలని బరాదరీ కోరిక. కానీ తాలిబాన్లు బలపడడం అస్సలు ఇష్టం లేని పాకిస్థాన్ తన పెంపుడు కుక్క హక్కానీ చేత దాడి చేయించింది.  ఇక గత మూడు వారాలుగా బరాదరీ  కానీ తాలిబాన్ అగ్ర నాయకుడు హైబతుల్లా అఖున్జాద కానీ మీడియా ముందుకి రావడం కానీ ఇతర సమావేశాలకి కానీ హాజరవ్వలేదు. ఖతార్ విదేశాంగ మంత్రి కాబూల్ వచ్చినప్పుడు కూడా తాలిబాన్ అగ్ర నాయకులు సమావేశానికి రాలేదు. కానీ  వారం రోజుల క్రిందట బరాదరీ చనిపోయాడు అని కాబూల్ లోకల్ న్యూస్ ఛానెల్స్ లో ప్రసారం అయిన తరువాత బారాదరీ మాట్లాడుతున్నట్లు ఒక వీడియొ మెసేజ్ ఆఫ్ఘన్ టెలివిజన్ ప్రసారం చేసింది. ఆ వీడియొ లో బరాదరీ నేను క్షేమంగానే ఉన్నాను అని సందేశం ఇచ్చాడు కానీ చుట్టూ ట్రైబల్ నాయకులు కూర్చొని ఉన్నారు.  బరాదరీ ఏదో తప్పనిసరి అన్నట్లుగా కెమెరా ముందు మాట్లాడినట్లు ఉందని అది చూసిన వారికి అర్ధమైంది. బారాదరీ బందీగా ఉండి మాట్లాడుతున్నట్లుగా కనిపించింది.  ఇక గత మూడు వారాలుగా 'హైబతుల్లా అఖున్జాద' మాత్రం ఎక్కడా కనపడలేదు. నిజంగా హైబతుల్లా అఖున్జాద బ్రతికే ఉంటే బారాదరీ చేత వీడియొ తీసి చెప్పించినట్లు 'హైబతుల్లా అఖున్జాద' తో కూడా ఒక వీడియొ మెసేజ్ ప్రసారం చేసేవారు కదా ?..  కానీ చనిపోయిన వాడి చేత ఎలా మాట్లాడిస్తారు ?. దీంతో అధ్యక్ష భవనంలో జరిగిన కాల్పులలో 'హైబతుల్లా అఖున్జాద' మరణించాడని భావిస్తున్నారు. ఇప్పుడు తాలిబన్ల కి నాయకుడు అంటూ ఎవరూ లేరు. అంతా హక్కానీ నెట్వర్క్ అధికారం నడుస్తున్నది.  గత వారం అంటే సెప్టెంబర్ 13 న కాందహార్ నుండి రెండు కంటైనర్లు ఇరాన్ లోని బందర్ అబ్బాస్ పోర్ట్ ద్వారా గుజరాత్ ముంద్రా పోర్ట్ కి వచ్చినవి కేవలం హక్కానీ నెట్వర్క్ వాళ్ళవే అయినా తాలిబాన్ అని ప్రచారం జరుగుతున్నది.  21 వేల కోట్ల రూపాయల విలువచేసే కంసైన్మెంట్ బహుశా వెయ్యి కోట్లకి బేరం చేసి సరఫరా చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే 21 వేల కోట్లు ఖరీదు అనేది అంతర్జాతీయ మార్కెట్ రేట్ కానీ భారత్ లో ఉగ్రవాదులకి డబ్బు ఇచ్చే నెపం తో ఉచితంగానే పాకిస్తాన్ పంపించి ఉంటుందని అంటున్నారు.  ఆదేమన్నా పాకిస్థాన్ డబ్బా ? గత 2015 నుండి టన్నుల కొద్దీ శుద్ధి చేసిన హై క్వాలిటీ హెరాయిన్ ఆఫ్ఘనిస్తాన్ లో గుట్టలు గుట్టలుగా పేరుకొని పోయి ఉన్నాయి. అధికారం హక్కానీ చేతిలో ఉంది కాబట్టి డబ్బు గురుంచి ఆలోచన ఉండదు. కేవలం భారత్ లోని తమ స్లీపర్ సెల్స్ కి హెరాయిన్ చేరితే చాలు డబ్బు అదంతట అదే వస్తుంది. ఇంతకీ కంసైన్మెంట్ కి ముందుగానే డబ్బులు ఎవరు చెల్లించారు ? ఎవరూ ఇచ్చి ఉండరు.  పాకిస్తాన్ కంటైనర్ రవాణా ఖర్చులు పెట్టుకొని ఉంటుంది. ఇక్కడ దానిని విడిపించుకోవడానికి పెద్దగా డబ్బు అవసరం ఉండదు ఎందుకంటే టాల్కమ్ పౌడర్ అదీ సెమీ ఫినిష్ చేసింది టన్నుకి 8 డాలర్లు చెల్లిస్తే చాలు. గుజరాత్ నుండి కంటైనర్లు రవాణా చేయడానికి ఒక లక్ష రూపాయలు చాలు అది ఇక్కడి ఉగ్ర గ్రూపులు ఇచ్చేస్తాయి.  ఇక నుండి ఏది జరిగినా అది హక్కానీ నెట్వర్క్ కె చెందుతుంది తప్పితే తాలిబన్ల కి కాదు.  మీడియా ప్రచారం చేస్తున్నట్లు తాలిబాన్లు 1995 లో ఉన్నంత బలవంతులు కాదు ఇప్పుడు కేవలం రోజుకూలి తీసుకొని పని చేసే పనివాళ్ళు మాత్రమే. అసలు వాళ్ళకి నాయకుడు అనే వాడు లేడు ఉన్న ఒక్క బరాదరీ పాకిస్థాన్ చేతిలో బందీగా ఉన్నాడు.తాలిబాన్ పేరు ఉంటుంది కానీ హక్కాని చేస్తుంది లేదా చేయిస్తుంది. హక్కానీ అంటే పాకిస్థాన్. పట్టుబడ్డ 21 వేల కోట్ల రూపాయల హెరాయిన్ ని చాలా మీడియా సంస్థలు 2 వేల కోట్ల రూపాయలు అంటూ దుష్ప్రచారం చేస్తున్నాయి. దొరికింది హై క్వాలిటీ హెరాయిన్ అని ఫోరెన్సిక్ లాబ్ టెస్ట్ లో తెలిసింది. కిలో 7 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. ధనవంతులు 1 గ్రాము హై క్వాలిటీ హెరాయిన్ ని 7 లక్షలకి కొంటారు. చెడ్డ పేరు తాలిబన్లకి ఇచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నది పాకిస్థాన్.  

విజయవాడ డ్రగ్స్ కేసులో సంచలనాలు! పట్టుబడిన హెరాయిన్ విలువ 21 వేల కోట్లు.. 

దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విజయవాడ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది డీఆర్‌ఐ. గతంలో ఇటువంటి కన్సైన్మెంట్‌లు వచ్చాయా అనే కోణంలో ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు.  సెంట్రల్ విజిలెన్స్, నార్కోటిక్ బ్యూరో, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, నేవీ ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. డ్రగ్స్ విలువ రూ. 21 వేల కోట్లుగా అంచనా వేశారు. సుధాకర్ దంపతులను చెన్నైలో అదుపులోకి తీసుకున్న అధికారులు గుజరాత్‌కు తరలించి.. కోర్టులో హాజరు పర్చగా సుధాకర్‌ దంపతులను పదిరోజుల డీఆర్‌ఐ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. మనీలాండరింగ్ కోణంపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక పాత ఇంటికి తెల్లపేపర్‌పై ఏజెన్సీ పేరు ప్రింట్‌ తీసి గుమ్మానికి బోర్డులా అతికించిన ఒక ఏజెన్సీ పేరు అంతర్జాతీయ డ్రగ్‌ రాకెట్‌లో బయటపడటంపై కేంద్ర సంస్థలు లోతుగా ఆరా తీస్తున్నాయి. అఫ్ఘన్‌లో తయారైన హెరాయిన్‌తోపాటు ఐదు రకాల డ్రగ్స్‌ అక్రమంగా ఇరాన్‌ మీదుగా మన దేశంలోకి వస్తున్న విషయం ఇటీవలే బయట పడింది. విజయవాడ సత్యనారాయణపురంలో ఒక సాధారణ గృహిణి పేరుతో రిజిస్టరైన ఆశి ట్రేడింగ్‌ కంపెనీ రూ.వేల కోట్ల హెరాయిన్‌ దిగుమతి కోసం కన్‌సైన్‌మెంట్‌ ఇవ్వడం వెనకున్న రహస్యాన్ని కేంద్రసంస్థలు వెలికితీస్తున్నాయి. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి కోసం అనుమతి తీసుకున్న ఆశి ట్రేడింగ్‌ కంపెనీ దిగుమతిలో మాత్రం టాల్కమ్‌ పౌడర్‌ పేరుతో హెరాయిన్‌ తెప్పించడంపై నిఘా సంస్థలు సీరియ్‌సగా దృష్టి పెట్టాయి.  విజయవాడ అడ్ర్‌సతో ఉన్న ఆశి ట్రేడింగ్‌ కంపెనీ ఎటువంటి ఎగుమతులు చేయక పోయినా, అన్ని అనుమతులూ తీసుకుంది. ఏడాది తిరక్కుండానే అంతర్జాతీయ డ్రగ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారంలో వెలుగులోకి వచ్చింది. అయుతే ఈ ఏజెన్సీ నిర్వాహకులు తెలిసే నిషేధిత మత్తు పదార్థాలను దిగుమతి చేసుకోవడానికి కన్‌సైన్‌మెంట్లు ఇచ్చినట్టు సమాచారం. ప్రతి కన్‌సైన్‌మెంట్‌కు డ్రగ్స్‌ ముఠా లక్షల రూపాయల్లో డబ్బులు ఇచ్చినట్లు కేంద్ర సంస్థలు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ఈసొమ్ముతోనే సుధాకర్‌ చెన్నైలో ఇతర వ్యాపారాలు చేస్తున్నట్లు సమాచారం.  ఎన్‌ఐఏ సమాచారం మేరకు రంగంలోకి దిగిన సెంట్రల్‌ విజిలెన్స్‌, నార్కోటిక్‌ బ్యూరో, కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌, నేవీ ఇంటెలిజెన్స్‌ తమ తమ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. ఐదు లక్షల జనాభా ఉండే కాకినాడలో ఉండే సుధాకర్‌ ఎనిమిదేళ్లుగా చెన్నైలో ఏమి చేశాడనే దానిపై ఆరా తీస్తున్నాయి. చెన్నై ఎందుకు వెళ్లాడు? పోర్టులో ఎన్నాళ్లు పని చేశాడు? అతనికి ఏ వ్యాపారాలున్నాయి? విజయవాడ యువతిని పెళ్లాడి ఆమె పుట్టింటి అడ్ర్‌సతో ఏజెన్సీ ఏర్పాటు చేయడం వెనకున్న కారణాలు ఏంటి? తదితర కోణాలు కేంద్రదర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. హెరాయిన్‌ వెనుక ఉన్న వ్యక్తులు, సిండికేట్ల గురించి దర్యాప్తు చేస్తామని, అవసరమైతే నిందితుడి ఆస్తులను అచాచ్‌ చేస్తామని ఈడీ వర్గాలు తెలిపాయి. ఎగుమతి, దిగుమతులకు లైసెన్సు పొందడానికి విజయవాడలోని ఇంటి అడ్ర్‌సను వాడుకోవడం తప్ప.. నగరంలో ఆశి ట్రేడింగ్‌ కంపెనీకి సంబంధించిన కార్యకలాపాలేవీ ఇప్పటి వరకూ వెలుగులోకి రాలేదని విజయవాడ పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులు పీటీఐకి చెప్పారు. ఈ అంశంపై తమ సిబ్బంది కూలంకషంగా దర్యాప్తు చేశారని తెలిపారు.   

టీఎస్ ఆర్టీసీపై సజ్జనార్ మార్క్.. ఆదాయం కోసం చార్జీల పెంపు? 

ఐపీఎస్ అధికారిగా తనదైన ముద్ర వేసుకున్నారు వీసీ సజ్జనార్. వరంగల్ ఎస్పీగా, సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నప్పుడు జరిగిన ఎన్ కౌంటర్లు సంచననంగా మారాయి. అమ్మాయిలపై దాడికి పాల్పడిన నిందితులు ఎన్ కౌంటర్లలో చనిపోవడంతో సజ్జనార్ ను జనాలు నీరాజనం పట్టారు. ఇటీవలే ఆయనను  ఆర్టీసీ ఎండీగా పంపించింది తెలంగాణ సర్కార్. డైనమిక్ ఆఫీసర్ ను ఆర్టీసీ ఎండీగా బదిలీ చేయడంపై విమర్శలు వచ్చాయి. అందులోనూ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీలో సజ్జనార్ కు పోస్టింగ్ ఇస్తే ఎలా అన్న చర్చ కూడా వచ్చింది. అయితే ఆర్టీసీ ఎండీ తన మార్క్ చూపిస్తున్నారు సజ్జనార్. సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు చర్యలు ప్రారంభించారు. అదే సమయంలో సిబ్బంది సంక్షేమంపైనా ఫోకస్ చేశారు ఐపీఎస్ ఆఫీసర్. బస్సుల్లో ప్రయాణించి సమస్యలు తెలుసుకున్నారు. తాజాగా ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు నడుం బిగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆర్టీసీ బలోపేతానికి ప్రతిపాదనలు చేశారు వీసీ సజ్జనార్.  ప్రగతి భవన్‌లో  జరిగిన సమావేశంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సీఎస్ సోమేశ్‌కుమార్, రవాణా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్ శర్మ, రామకృష్ణారావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్  పాల్గొన్నారు. కరోనా కాటుతో  ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయాయని, కాబట్టి ఇప్పుడు చార్జీలు పెంచక  తప్పదని  సజ్జనార్..  కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. గత ఏడాదిన్నర కాలంలో డీజిల్ ధర లీటరుకు భారీగా పెరగడం వల్ల రూ.550 కోట్లు, టైర్లు, ట్యూబులు వంటి విడిభాగాల ధరలు పెరగడం వల్ల రూ. 50 కోట్లు కలిసి ఏడాదికి దాదాపు రూ. 600 కోట్ల మేర భారం పడుతోందని, కాబట్టి ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిందేనని  కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.  లాక్‌డౌన్ కారణంగానే ఆర్టీసీ దాదాపు రూ. 3 వేల కోట్ల వరకు నష్టపోయిందని, ఒక్క హైదరాబాద్ పరిధిలోనే నెలకు రూ. 90 కోట్ల మేర నష్టం వస్తోందని సజ్జనార్ నివేదించారు. ఇప్పుడు చార్జీలు పెంచకుంటే మరింత భారం మోయాల్సి వస్తుందన్నారు. చార్జీలు పెంచుతామని గతేడాది మార్చిలోనే ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చార్జీలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తే తప్ప ఆర్టీసీ మనుగడ సాధ్యం కాదని మంత్రి అజయ్ కుమార్, సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ అధికారుల ప్రతిపాదనపై సమీక్షించిన సీఎం.. చార్జీలను పెంచేందుకు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.  వచ్చే మంత్రిమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనను రూపొందించాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. కరోనా దెబ్బకుతోడు, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని ఆ సమావేశంలో  సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణలో చివరిసారిగా డిసెంబరు 2019 లో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. ఈసారి కూడా 10 నుంచి 20 శాతం మేర చార్జీలు పెంచేందుకు ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. 20 శాతం పెంచితే కనుక రోజుకు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

చైన్ స్నాచర్ బ్యాచ్.. రౌడీ షీటర్ల లీడర్! వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య రచ్చ రంబోలా

ఆ ఇద్దరు ఒకే పార్టీ నాయకులు.. ఒకరు ఎంపీ ఇంకొకరు ఎమ్మెల్యే. ఇద్దరు రాజకీయ  కుటుంబాల నుంచి వచ్చిన యువ నాయకులు. అయితే ఆ ఇద్దరి మధ్య పచ్చ గడ్డి  అవసరం అయినా లేకుండానే మాటల మంటలు ఎగసెగసి పడతున్నాయి. ఆ ఇద్దరు ఇంకెవరో కాదు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్.  ఈ ఇద్దరు వైసీపీ పార్టీకి చెందిన కీలక నేతలు.. పైగా ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  చాలా సన్నిహితులు. జక్కంపూడి రాజ తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ మంత్రి వర్గంలో పనిచేసారు. జక్కంపూడి అనారోగ్యంతో  మంచం పట్టినా, కదల లేక పోయినా వైఎస్ ఆయన్ని మంత్రివర్గం నుంచి తప్పించలేదు. బాద్యత (శాఖ) లేని మంత్రిగా కొనసాగించారు.  ఇప్పుడు జక్కంపూడి జూనియర్, యంగ్ ఎంపీ భరత్ మధ్య మాటల యుద్ధం మహా జోరుగా సాగుతోంది. జక్కంపూడి సోమవారం భరత్ మీద భగ్గుమన్నారు. తెలుగు దేశం పార్టీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో చేతులు కలిపి వైసేపీని దెబ్బ తీసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, జగన్ రెడ్డిని జైలు పాలు చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మినారాయణతో అదే విధంగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజుతో సంబంధాలున్నాయి, అటు నుంచి జరుగుతున్న కుట్రలలోనూ భరత్ ఇన్వాల్వ్ అయ్యారని జక్కం పూడి ఆరోపించారు.  జక్కంపూడికి జవాబుగా  కౌంటర్ ఇచ్చారు భరత్. కుమ్ముక్కు రాజకీయాలు ఎవరు చేస్తున్నారో, ఎవరు పార్టీకి. పార్టీ నాయకుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. అలాగే జక్కంపూడి, పిల్లోడు అన్నట్లుగా..ఆయనలా తానూ పిల్లల రాజకీయలు చేయనని అన్నారు. పార్టీ గీసిన లక్ష్మణ గీత దాటననీ అదనీ ఇదనీ చాలా చెప్పుకొచ్చారు. అయితే, ఇన్ని సుద్దులు చెప్పి చివరకు, సొంత పార్టీ ఎమ్మెల్యేను, ఆయన అనుచరులను  పట్టుకుని రౌడీ షీటర్, చైన్ స్నాచర్ బ్యాచ్’ అంటూ ఎద్దేవా చేశారు. అఫ్ కోర్స్ జక్కంపూడి కూడా సొంత పార్టీ ఎంపీ మీద ఇదే విధమైన ..అయితే .. ఈ వివాదం చూసిన జనాలు దొందూ దొందే ... ఇద్దరు ఆ తాను ముక్కలే అంటున్నారు. 

ఎరక్కపోయి ఇరుకున్నారా? యువనేత బుక్కయ్యారా?

తెలంగాణ రాజకీయాలలో రోజుకో వివాదం రివాజుగా మారి పోయింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో లేదని తేలడంతో రాజకీయ పార్టీలు కొత్త  మత్తు వేటలో పడ్డాయి. అనుకోకుండా  అన్ని మత్తుల్లోకి మహా మత్తు డ్రగ్స్ వివాదం కాలికి తగిలింది. ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే చాలు అదే వార్త... డ్రగ్స్ చుట్టూనే రాష్ట్ర రాజకీయం తూలుతోంది... ఊగుతోంది..ఊగుతూ తూలుతోంది.కీలక నేతలకు కంటికి  కునుకు లేకుండా చేస్తోంది. ఎరక్క పోయి  పోయి ఇరుక్కున్నను అని .. సోలో గా పాటలు కూడా పాదేసు కుంటున్నారు.  నిజానికి అటు ఉగ్రవాదం నుంచి ఇటు డ్రగ్ మాఫియా వరకు అన్ని రకాల అంతర్జాతీయ, జాతీయ స్థాయి  నేరాలు  ఘోరాలకు హైదరాబాద్ అడ్డాగా మారిందనేది అందరికీ తెలిసిన నిజం. అయితే, ఈ డ్రగ్ మాఫియాను వెనక నుంచి నడిపిస్తోంది మాత్రం, అన్ని నేరాలకు అమ్మ తల్లి. మదర్ ఆఫ్ ఆల్ క్రైమ్స్, ‘రాజకీయం’  దటీజ్ పాలిటిక్స్’ అనేది మాత్రం కొదరికి మాత్రమే తెలిసిన నిజం. అందులోనూ, ఇంతలోనే ఇంతై .. ఇంతింతై .. ఇంకెంతో అవ్వాలని, ఆ ఒక్క మెట్టు ఎక్కేయాలని.. ఆ కుర్చీ  ఎక్కేయాలని  ఆశ పడుతున్న కీలక నేత పాత్ర మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  నిజం... తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ డ్రగ్ మాఫియాది, మాములు సామ్రాజ్యం కాదు, మహా సామ్రాజ్యం. ఈ మహా సామ్రాజ్యంలో ఎవరున్నారు, ఎవరు లేరు అనే విషయాన్ని అలా ఉంచితే, యంగ్, ఎనర్జిటిక్, స్మార్ట్ బాస్  పాత్ర ఉందనేది మాత్రం కాదనలేని నిజం అంటున్నారు.  నిజానికి టీపీసీసీ అధ్యక్షుడు రెడ్డి వైట్ లెంజ్ లక్ష్యం కూడా ఈ నాయకుడే అంటారు. అంతే కాదుట .. రేవంత్ రెడ్డి, ‘ ఛాలెంజ్’ కి అవసరమైన సరకును అందించింది కూడా మరో పాపులర్ ‘ఛాలెంజరే .. అని  కూడా అంటారు.  అదలా ఉంటే తెర మీద వినిపిస్తున్న ఛాలెంజ్ ల విషయంలోకి వెళితే, తీగ లాగితే డొంకంతా కదినట్లు కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ డ్రగ్ కథ వెంక ఉన్న కథలో ... ఆయన పాత్ర చాలా కీలకం. నిజంగా ఆయనకు డ్రగ్స్ తీసుకునే అలవటు ఉందా.. లేదా అనేది ఈరోజు కాకపోతే రేపైనా తేలుతుంది. అయితే, ఆయనకు ఇటు  సినిమా రంగంలో, అటు వ్యాపార కుటుంబాల యువ రాజులతో మంచి సంబంధాలున్నాయి. అందులో కొందరికి డ్రగ్స్ అలవాటు కూడా ఉంది. అందాల తార విషయం అనగానే అయన స్పెషల్ ఇంటరెస్ట్ తీసుకున్నారు. విషయం ఏమంటే... మిత్ర ధర్మంగా వారిని రక్షించేందుకు అయన ..ఢిల్లీ వరకు వెళ్లారు ..న్యాయవ్యవస్థలో కీలక బాధ్యతలలో ఉన్నవారిని కలిశారు ... ఈడీ ఉచ్చు నుంచి ఆ ఇద్దరిని సేవ్ చేసేందుకు  అయన అందాక వెళ్లారు. అయితే, ఇప్పుడు అసలు కథ పక్కుకు పోయి అయన మెడకే డ్రగ్స్ ఉచ్చు చుట్టుకుంటోంది. చివరకు ఏమవుతుందో .. చూడవలసిందే..అంటున్నారు. 

వాణిజ్య ఉత్స‌వంతో జ‌గ‌న‌న్న ఆడంబ‌రాలు.. ఉద్యోగాలెక్కడ అంటున్న జనాలు? 

విజ‌య‌వాడ‌లో వాణిజ్య ఉత్స‌వం పేరుతో ఆడంబ‌రం. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందంటూ సీఎం జ‌గ‌న్ హామీలు. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయ‌ట‌. 2020-2021లో 1.23 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయట‌. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందట‌. 2020-2021లో ఎగుమతుల్లో ఏపీది నాలుగో స్థానమ‌ట‌. రెండేళ్లలో 20,390 కోట్లతో 10 మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేశార‌ట‌. 55వేల మందికి ఉపాధి కల్పించార‌ట‌. అబ్బో.. ఇలా వాణిజ్య ఉత్స‌వం వేదిక‌గా సీఎం జ‌గ‌న్ నోటి నుంచి అంతా అవాక్క‌య్యే ప్ర‌సంగం వినిపించింది.  టీవీల్లో ఆయ‌న ప్ర‌సంగం విన్న ఆంధ్రులంతా.. అవునా, మ‌న రాష్ట్రం ఇంత‌గా దూసుకుపోతోందా? ఏపీ నుంచి ఇంత భారీ ఎగుమ‌తులు జ‌రిగాయా? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక జ‌గ‌న్ చెప్పిన 10 మెగా ప్రాజెక్టులు, 55వేల మందికి ఉపాధి గురించి తెలిసి.. మ‌రింత అవాక్క‌వుతున్నారు. మేమంతా ఉపాధి లేక‌, ఉద్యోగాలు లేక‌, ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులు లేక నిరుద్యోగులుగా అవ‌స్థ‌లు ప‌డుతుంటే.. మాకు తెలీకుండా మా రాష్ట్రంలో ఇన్ని ప‌రిశ్ర‌మ‌లు, ఇన్ని వేల ఉద్యోగాలు ఎప్పుడొచ్చాయి? ఎవ‌రికి వ‌చ్చాయి? అంటూ నోరెళ్ల బెడుతున్నారు.  ఏపీ ప్ర‌భుత్వ బెదిరింపులు తట్టుకోలేక ద‌శాబ్దాలుగా కంపెనీ న‌డుపుతున్న‌ అమ‌ర‌రాజానే త‌ర‌లి వెళ్లిపోయేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతోంది. వైసీపీ ఎంపీ బెదిరింపుల‌తో కియా కంపెనీ ఎందుకొచ్చామా అని త‌ల‌ప‌ట్టుకుంటోంది. రిల‌య‌న్స్ సంస్థ చిత్తూరులో ఇచ్చిన భూములు తిరిగిచ్చేసి వెళ్లిపోయింది. ల‌ల్లూ గ్రూపు మొద‌ట్లోనే మేం రాం అని చెప్పేసింది. మ‌రి, సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు పారిశ్రామిక వేత్త‌ల‌కు ప్ర‌భుత్వం నుంచి పూర్తి స‌హ‌కారం ఎక్క‌డ ల‌భిస్తున్న‌ట్టు? ప్ర‌భుత్వ‌మే స‌హ‌క‌రించి ఉంటే అమ‌ర‌రాజా కంపెనీకి ఇప్పుడీ క‌ష్టాలు వ‌చ్చేవా? అని ప్ర‌శ్నిస్తున్నారు.  ఇక ఏపీ ఎగుమ‌తులు రెండేళ్ల‌లో 19.43 శాతం వృద్ధి చెందాయ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారంటే ఆ మేర‌కు అధికారిక లెక్క‌లు ఉండే ఉంటాయి. అయితే, ఆ ఎగుమ‌తులు జ‌రిగిన‌వి అంత‌కుముందే ఉన్న కంపెనీల నుంచే గానీ, జ‌గ‌న్ త‌ర్వాత ఏపీకి కొత్త‌గా ఎగుమ‌తులు చేసే కంపెనీలు వ‌చ్చింది లేద‌ని గుర్తు చేస్తున్నారు. అందులో ఈయ‌న గారి గొప్ప‌త‌నం ఏమీ లేద‌ని.. అయినా త‌మ ప్ర‌భుత్వం వ‌ల్లే ఎగుమ‌తులు పెరిగాయ‌నే విధంగా గొప్ప‌లు చెప్పుకున్నార‌ని అంటున్నారు. ఇక కొత్తం కంపెనీలు, పెట్టుబ‌డులే లేన‌ప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మొద‌టి స్థానంలో ఎలా ఉందో జ‌గ‌నే వివ‌రించాల‌ని వేడుకుంటున్నారు. వాణిజ్య ఉత్స‌వం పేరుతో వేడుక‌లు జ‌రుపుకోవాల్సినంత ఘ‌న‌కార్యం జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో ఏమీ జ‌ర‌గ‌లేద‌ని.. మ‌రెందుకు ఇంత‌టి ఆడంబ‌రమ‌ని జ‌నం నిల‌దీస్తున్నారు.

డబ్బులు ఇవ్వలేదని కూలీల ధర్నా... వైఎస్ షర్మిల అరెస్ట్..

హైదరాబాద్ శివారు బోడుప్పల్ లో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్ష తీవ్ర ఉద్రిక్తత స్పష్టించింది. ప్రతి మంగళవారం దీక్ష చేస్తున్నారు వైఎస్ షర్మిల. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాలను పరామర్శిస్తూ అక్కడే దీక్ష చేస్తున్నారు. అందులో భాగంగా బోడుప్పల్ వచ్చారు షర్మిల. అయితే దీక్షకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తల మధ్య దీక్ష చేసేందుకు వైఎస్ షర్మిల యత్నించగా ఆమెను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు షర్మిలను రెస్ట్ చేసి మేడిపల్లి స్టేషన్ కు తరలించారు. పోలీసులు తనను అరెస్ట్ చేయడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. వందల మంది నిరుద్యోగులను హత్య చేసిన హంతకుడు కేసీఆర్ అని మండిపడ్డారు. ఏళ్లుగా నిద్రపోయి ఇప్పుడు గర్జనలు అటూ ప్రతిపక్షాల ముందుకు వస్తున్నారని షర్మిల నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ లో ఒక నిరుద్యోగి చనిపోతే కనీసం పరామర్శించరా? అని నిలదీశారు. ప్రజా సమస్యలు పట్టని  రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మాలని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మరోవైపు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రికత కొనసాగుతుండగానే.. అడ్డా కూలీల ఆందోళనకు దిగారు. షర్మిల చేపట్టనున్న దీక్షకు తమను తీసుకొచ్చి డబ్బులు ఇవ్వలేదని అడ్డాకూలీలు మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో ఆందోళనకు దిగారు. తమను తీసుకొచ్చిన వారు డబ్బు ఇవ్వలేదని వారు దీక్ష స్థలి వద్దే నిరసన తెలిపారు. దీక్షలో కూర్చుంటే రూ.400 ఇస్తామని చెప్పి తీసుకొచ్చారని కూలీలు చెబుతున్నారు. తీరా వచ్చాక డబ్బులు ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు.

రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్ట‌డించిన టీఆర్ఎస్‌.. త‌రిమికొట్టిన రేవంత్ అనుచ‌రులు..

కేటీఆర్ వ‌ర్సెస్‌ రేవంత్‌రెడ్డి కాక రేపుతోంది. వైట్ ఛాలెంజ్‌పొలిటిక‌ల్ హీట్ పెంచుతోంది. డైలాగ్ వార్ ముదిరి కోర్టు కేసుల వ‌ర‌కూ దారి తీసింది. నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతుంటే.. కార్య‌క‌ర్త‌లు మాత్రం నేరుగా యాక్ష‌న్‌లోకి దిగిపోయారు. మా నేత‌నే అంటారా అంటూ డైరెక్ట్‌గా త‌ల‌బ‌డుతున్నారు. తాజాగా, ప‌లువురు టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు పీసీసీ చీఫ్ ఇంటిని ముట్ట‌డించేందుకు వెళ్లింది. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ‌ను ద‌గ్థం చేయాల‌ని ప్ర‌య‌త్నించింది. అయితే, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను రేవంత్‌రెడ్డి అనుచ‌రులు త‌రిమి త‌రిమి కొట్ట‌డం ఉద్రిక్త‌త‌ను రాజేసింది.  కేటీఆర్‌పై వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస్తూ.. టీపీసీసీ అధ్యక్షుడి రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడించే ప్ర‌య‌త్నం చేశారు టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో ఆయన ఇంటి ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, అనూహ్యంగా రేవంత్‌రెడ్డి అనుచ‌రుల నుంచి టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌కు గ‌ట్టి ప్ర‌తిఘ‌ట‌న ఎదురైంది. టీఆర్ఎస్‌ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు టీఆర్ఎస్‌ శ్రేణులు ప్ర‌యత్నించగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుని కర్రలతో వెంటపడ్డారు. గులాబీ కార్యకర్తలు రాళ్లతో ఎదురు దాడి చేసేందుకు ప్ర‌యత్నించారు. అయితే, రేవంత్‌రెడ్డి అనుచ‌రులు పెద్ద సంఖ్య‌లో ఉండ‌టంతో.. టీఆర్ఎస్ తోక ముండిచింది. కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో వెంటబ‌డి.. టీఆర్ఎస్‌ కార్యకర్తలను త‌రిమి త‌రిమి కొట్టారు.  ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.    

అప్పుడు అభిమానం..ఇప్పుడు అసహనం! అమ్మకానికి కేసీఆర్ టెంపుల్.. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉద్యమ సమయంలో ఆయన మాట్లాడితే జనాలు ఊగిపోయేవారు. ఆయన ప్రసంగం వినేందుకు ఎగబడేవారు. కేసీఆర్ ప్రెస్ మీట్ ఉందంటే తెలంగాణ జనమంతా టీవీలకు అతుక్కునిపోయేవారు. కాని కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకా ఆయన క్రేజీ క్రమంగా తగ్గిపోతోంది. కొన్ని రోజులుగా కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందని వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో తేలింది. గతంలో కేసీఆర్ ను విపరీతంగా అభిమానించిన వారు కూడా ఆయనను వ్యతిరేకిస్తున్నారు. గతంలో  కేసీఆర్ ను ఎవరైనా ఏమైనా అంటే ఎదురుదాడి చేసే వాళ్లే ఇప్పుడు కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు.  కేసీఆర్ పై అభిమానంతో ఆయనకు గుడి కట్టిన ఓ అభిమాని... ఇప్పుడు కేసీఆర్ అంటేనే అసహ్యించుకుంటున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అభిమానంతో  మంచి ర్యాల జిల్లా దండేపల్లికి చెందిన ఉద్యమకారుడు రవీందర్ గుడి కట్టించాడు.  తన ఇంటి ఆవరణలో ఆ గుడి కట్టించాడు. అందులో కేసీఆర్‌ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు కూడా చేస్తున్నాడు. అలాంటి రవీందర్ ఇప్పుడు కేసీఆర్ గుడిని అమ్మకానికి పెట్టాడు.తనకు పార్టీలో గుర్తింపు లేదని, కనీసం కేసీఆర్, కేటీఆర్‌లను కలిసే అవకాశం కూడా రాలేదని.. అందుకే గుడిని, గుడిలోని కేసీఆర్‌ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టానని చెబుతున్నాడు రవీందర్.  తనకు కేసీఆర్, కేటీఆర్‌ను కలిసే అవకాశం కూడా రావడం లేదని, టీఆర్‌ఎస్‌ పార్టీలోనూ గుర్తింపు దక్కలేదని నిరాశ చెంది కొన్ని రోజుల క్రితం బీజేపీలో చేరాడు రవీందర్. అప్పటి నుంచి కేసీఆర్‌ విగ్రహానికి ముసుగు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఉద్యమంలో పాల్గొని అప్పుల పాలయ్యానని, అప్పులు తీర్చేందుకు కేసీఆర్‌ గుడిని, విగ్రహాన్ని విక్రయిస్తున్నట్లు తాజాగా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. 

అసెంబ్లీలో అచ్చెన్న, నిమ్మ‌ల మైక్ కట్..

అసెంబ్లీ ప్రివిలైజ్ క‌మిటీ స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డిని వ్య‌క్తిగ‌తంగా దూషించారనే కారణంతో టీడీపీ శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మ‌ల రామానాయుడుకు ఈ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగిన‌న్ని రోజులూ.. మైక్ ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  ప్రివిలైజ్ క‌మిటీ ప్ర‌తిపాద‌న‌ల‌ను క‌మిటీ స‌భ్యుడు అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌ తీవ్రంగా వ్య‌తిరేకించారు. రామానాయుడిని సీఎం జ‌గ‌న్‌.. డ్రామా నాయుడు అంటేనే తిరిగి రామానాయుడు మాట్లాడార‌ని గుర్తు చేశారు. కావాలంటే రికార్డుల‌ను ప‌రిశీలించుకోవాల‌ని అన‌గాని సూచించారు. అయితే, ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను ప్రివిలైజ్ క‌మిటీ ప‌ట్టించుకోలేదు. అచ్చెన్నాయుడు, రామానాయుడికి అసెంబ్లీ స‌మావేశాల్లో మైక్ ఇవ్వ‌కూడ‌ద‌నే తీర్మానాన్ని ప్రివిలైజ్ క‌మిటీ.. స్పీక‌ర్‌కు పంపనుంది. స్పీక‌ర్ నిర్ణ‌యం తుది నిర్ణ‌యం కానుంది.  

జైలుకి పోయే గాలి గాడిని చూసుకొని రోడ్లపై ఆంబోతుల్లా తిరుగుతున్నారు..

రాజారెడ్డి రాజ్యాంగం.. రాక్ష‌స పాల‌న.. అంటూ జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంపై టీడీపీ మొద‌టి నుంచీ విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంది. ఆ పార్టీ ఆరోపిస్తున్న‌ట్టే.. ఏపీలో రౌడీ మూక‌లు రెచ్చిపోతున్నాయి. అరాచ‌క‌, విధ్వంస‌కాండ కొన‌సాగుతోంది. తాజాగా గుంటూరు జిల్లా పెద‌నందిపాడు మండ‌లం కొప్ప‌ర్రులో టీడీపీ నాయ‌కురాలి ఇంటిపై జ‌రిగిన దాడి ఘ‌ట‌న తీవ్ర భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తోంది. మొన్న‌టికి మొన్న ఉండ‌వల్లిలో ఏకంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇంటిపైనే దాడికి తెగించిన వైసీపీ మూక‌లు.. అదే స్పూర్తిగా తీసుకున్నారో ఏమో తాజాగా కొప్ప‌ర్రులో టీడీపీ మాజీ జెడ్పీటీసీ ఇంటిపై మ‌రింత‌గా రెచ్చిపోయారు. అర్థ‌రాత్రి అర‌ణ్య‌కాండ సృష్టించారు. రాళ్ల దాడితో ఇంటిని ధ్వంసం చేశారు. వాహ‌నాల‌కు నిప్పంటించి కిష్కింద‌కాండ చేశారు. వైసీపీ శ్రేణుల దాడిలో ఏకంగా ఓ ఎస్సైకి త‌ల ప‌గ‌ల‌డం.. ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉందంటే.. వైసీపీ నాయ‌కులు ఎంత‌కు తెగించారో అర్థం అవుతోంది. వైసీపీ దాడి నుంచి ప్రాణ‌ర‌క్ష‌ణ‌కు.. పోలీసులే ఇంట్లో దాక్కోవ‌డం.. ఎస్సై గాల్లో కాల్పులు జ‌ర‌ప‌డం.. వైసీపీ గుండాల అరాచ‌కానికి నిద‌ర్శ‌నం.  కొప్ప‌ర్రు దాడిపై టీడీపీ జాతీయ ఉపాధ్య‌క్షుడు నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. రాష్ట్రంలో జగన్‌రెడ్డి ఫ్యాక్షన్ మూకలు రెచ్చిపోతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. కొప్పర్రులో టీడీపీ నాయకురాలు శారద ఇంటిపై వైసీపీ గూండాల దాడిని ఖండించారు.  రేపో మాపో జైలుకి పోయే గాలి గాడిని చూసుకొని రోడ్లపై ఆంబోతుల్లా తిరుగుతున్న.. ప్రతి ఒక్కడూ జీవితాంతం గుర్తుండే శిక్ష అనుభవించడం ఖాయమన్నారు. వైసీపీ నేతలు చేసే తప్పుడు పనులకు ఆహా.. ఓహో అంటూ కితాబివ్వడం మాని..పోలీసులు శారద కుటుంబ సభ్యులపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్‌ డిమాండ్ చేశారు.

వైసీపీ చొక్కాలు వేసుకుంటే బెటర్.. గుంటూరు పోలీసులపై టీడీపీ నేతల ఫైర్ 

గుంటూరు జిల్లాలో టీడీపీ మహిళా నాయకురాలు ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంపై దుమారం రేగుతోంది. వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. హోంమంత్రి నియోజకవర్గం కావడం వల్లే పోలీసులు నిర్లక్ష్యం వహించారని అంటున్నారు. పెదనందిపాడు మండలం కొప్పర్రు ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు.  ఫ్యాక్షన్ మూకలు రెచ్చిపోతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నాయకురాలు శారద ఇంటిపై  దాడికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో లోకేష్ పోస్ట్ చేశారు. 'రేపో మాపో జైలుకి పోయే గాలి గాడిని చూసుకొని రోడ్లపై ఆంబోతుల్లా తిరుగుతున్న ప్రతి ఒక్కడు జీవితాంతం గుర్తుండే శిక్ష అనుభవించడం ఖాయం. వైసీపీ నాయకులు చేసే తప్పుడు పనులకు ఆహా...ఓహో అంటూ కితాబు ఇవ్వడం మాని పోలీసులు శారద గారి కుటుంబ సభ్యుల మీద విచక్షణారహితంగా దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకొకమాట .. ఆ దాడిలో ఒక ఎస్సైకి కూడా గాయాలు అయ్యాయి.. యథావిధిగా వైకాపా మసాజ్ అంటారా పోలీసు సంఘం వారు?' అంటూ  సెటైర్లు వేశారు నారా లోకేశ్. టీడీపీ శ్రేణుల‌పై దాడులు పెరిగిపోతున్నాయని టీడీపీ సీనియర్ నేత  ధూళిపాళ్ల న‌రేంద్ర ఆరోపించారు. పోలీసులు ఖాళీ డ్ర‌స్సు విప్పేసి వైసీపీ చొక్కాలు వేసుకుంటూ బాగుంటుంద‌ని ఆయ‌న ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో పోలీసు వ్య‌వ‌స్థ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న ఆరోపించారు. ఆ ప్రాంతంలో విచ్చ‌ల‌విడిగా పేకాట శిబిరాలు ఉంటున్నాయ‌ని, గుట్కా వ్యాపారాలు కొన‌సాగుతున్నాయని అన్నారు. గుంటూరు జిల్లాలో గంజాయి దొర‌క‌ని ప్రాంత‌మంటూ ఏదీ లేద‌ని దూళిపాళ్ల ఆరోప‌ణ‌లు గుప్పించారు. గుంటూరులో ఫ్యాక్ష‌న్ మూక‌లు రెచ్చిపోతున్నప్ప‌టికీ, పోలీసులు ప్రేక్ష‌క‌పాత్ర వ‌హిస్తూ చూస్తూ ఊరుకుంటున్నార‌ని మండిపడ్డారు. కొప్ప‌ర్రులో టీడీపీ నాయ‌కురాలిపై దాడికి పాల్పడిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నరేంద్ర డిమాండ్ చేశారు.

అల్లాపూర్ లో వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవం

కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ వివేకానంద నగర్ లో వినాయక శోభా యాత్రను కన్నులపండువగా నిర్వహించారు. వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. వివేకానంద సేవా సమితి అధ్యక్షులు పులిగోళ్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో  జరిగిన వినాయక శోభా యాత్రలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.  వివేకానంద నగర్ పుర వీధుల గుండా సాగిన యాత్రలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాలనీకి చెందిన యువతి, యువకులు తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టారు.  గణేష్ శోభాయాత్రకు ముందు 10 రోజుల పాటు భక్తులచే ఘనంగా పూజలందుకున్న వినాయకుడి లడ్డూ వేలం పాట నిర్వహించారు. పవిత్ర లడ్డూను సొంతం చేసుకోవటానికి భక్తులు పోటీ పడ్డారు. పోటాపోటీగా సాగిన వేలం పాటలో చివరకు వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు పులిగోళ్ల శ్రీనివాస్ యాదవ్ గణపతి లడ్డూను లక్షా 50 వేల రూపాయలకు దక్కించుకున్నారు. ఇక స్థానిక ఆలయంలో ఇటీవల నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో వెంకటేశ్వర స్వామికి అలంకరించిన లడ్డూని కూడా  వేలం వేశారు. వెంకన్న లడ్డూని పైలా గోపాల్ 71 వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు. గత సంవత్సరం గణపతి లడ్డూని కైవసం చేసుకున్న మస్తాన్ రెడ్డిని సేవా సమితి సభ్యులు సత్కరించారు.  ఇక గణేష్ నిమజ్జత్సవానికి ముందు వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. వందలాది మంది ప్రజలు గణనాథుడిని దర్శించుకుని అన్నదానం స్వీకరించారు. అనంతరం ఉట్ల ఉత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించారు. చిన్నారులు ఉట్లు కొట్టి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ నాయకులు యాదవరెడ్డి, మస్తాన్ రెడ్డి, బీ శ్రీనివాస్, రవిందర్ ముదిరాజ్, హరికృ-,్ణ, ఏడు కొండలు, చెల్లయ్య, రమేశ్,  కేశవరావు , రామారావు , హైటెక్ ప్రసాద్, దమ్మిడి రాజు, దినేష్ నాయక్, విజయ్ , ఆవుల ఆంజనేయులు పాల్గొన్నారు. 

విపక్షాల ఐక్యతకు ఆయనే అవరోధమా? 

కాంగ్రెస్ పార్టీ లేకుండా జాతీయ స్థాయిలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎని దీటుగా ఎదుర్కునే ప్రత్యాన్మాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేయడం అయ్యే పని కాదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే, కాంగ్రెస్ సారధ్యంలో లేదా కాంగ్రెస్ తో కలిసి బీజీపీయేతర పార్టీల కూటమి ఏర్పాటుకు అయన కొంత ప్రయత్నం చేశారు. అయితే, ఆతర్వాత ఏమైందో ఏమో కానీ, పీకే ఇంకేదో పనిలో పడిపోయారు. ఎక్కడ కనిపించడం లేదు. వినిపించడం లేదు. నిజానికి, ఇది పీకేనో మరొకరో చెపితేనేగాని, తెలియని రహస్యం ఏమీ కాదు.కాంగ్రెస్ సహా  అన్ని పార్టీలకు ఈ విషయంలో స్పష్టత ఉంది.  అదే సమయంలో  ప్రతిపక్షాల ఉమ్మడి వ్యూహానికి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రతిబంధకం అనే అభిప్రాయం కూడా ఇప్పుడ డిప్పుడు బయటకు వస్తోంది. కొద్ది రోజుల క్రితం ఎన్సీపీ అధినేత శరద్  పవార్ పరోక్షంగానే అయినా, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అనే కాంగ్రెస్ పార్టీ  ఆలోచనను తప్పు పట్టారు. భూ పరిమితి చట్టం వచ్చి భూములు కోల్పోయిన జమీందారులు, హవేలీలలో  పూట గవడమే కష్టంగా ఉన్నా తాము ఇంకా మునుపటి జమీందారులమే అనే భ్రమల్లో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ కూడా వర్తమానంలో కంటే గతంలో జీవిస్తోందని చురకలాంటించారు. ఒక విధంగా అయన కాంగ్రెస్ పార్టీ  కారణంగానే బీజేపీ, బలపడుతోందని అన్నారు.  అలాగే కాంగ్రెస్ మిత్ర పక్షం నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా కూడా., పంజాబ్ ముఖ్యమంత్రి మార్పు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, వ్యవహరించిన తీరును తప్పు పట్టారు. కాంగ్రెస్ పార్టీ పాత పోకడలు మార్చుకోకపోతే, ఇంకా గట్టి మూల్యమే చెల్లించవలసి వస్తుందని అన్నారు. అంతే కాదు   పార్టీగా కాంగ్రెస్ నష్ట పోవడమే కాదు, దేశం కూడా మూల్యం చెల్లిచవలసి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనతను ఆసరాగా చేసుకునే బీజేపీ హిందుత్వ అజెండాను ముందుకు తీసుకుపోతోందని, అందుకు కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించక తప్పదని ఒమర్ అబ్దుల్లా ఘాటైన విమర్శలు చేశారు.    ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ నాయకత్వం మీద ఘాటైనా వ్యాఖ్యలు చేసింది. కొత్తగా తృణమూల్ తీర్దం పుచ్చుకున్న, బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో 2024 ఎన్నికల్లో ప్రధాన మంత్రి పదవికి పోటీ పడే అభ్యర్థుల్లో పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందున్నారని అన్నారు. అయన అంతటితో ఆగలేదు మమతా బెనర్జీ  ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విపక్షాలు ముఖ్య పాత్రను పోషించాలి అంటూ కాంగేస్స్ పార్టీ ఆ  పాత్రను పోషించడంలో విఫలమైందని అన్నారు. అలాగే,  పార్టీ  ప్రధాన మంత్రి పదవికి మమత ముందు వరుసలో ఉన్నారనే వాస్తవాన్ని ఎవరూ విస్మరించలేరు’ అంటూ సుప్రియో పరోక్షంగా రాహుల గాంధీ మోడీకి సమ ఉజ్జీ కాదని అన్నారు. ప్రధాని మోదీని ఎదుర్కోవడంలో, ఆయనకు ప్రత్యామ్నాయంగా నిలవడంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విఫలమయ్యారని సుప్రియో అన్నారు. సుప్రియో అనడమే కాదు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక, ‘జాగో బంగ్లా’లో అదే విషయంపై ప్రత్యేక వ్యాసమే రాశారు.  ఇతర పార్టీలు, ఇతర పార్టీల నాయకులు మాత్రమే కాదు, సొంత పార్టీ నాయకులు కూడా అదే అంటున్నారు. సంవత్సరం క్రితమే పార్టీ సీనియర్ నాయకులు, ( జీ 23)  కూడా అదే అంటూ వస్తున్నారు. తాజాగా పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ అయితే, రాహుల్ గాంధీ అధికారికంగా పార్టీ బాధ్యతలు తీసుకోవాలని లేదంటే తప్పుకుని మరొకరికి అవకాశం ఇవాలని అన్నారు. అంటే,ఇటు సొంత పార్టీ నాయకులు,అటు మిత్ర పక్షాలు,రాహుల్ గాంధీని  ప్రతి బంధకం బావిస్తున్నాయా ... ఆనే సందేహం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్బారు.

బండి సంజ‌య్ సై.. కేటీఆర్ నై.. సంథింగ్ రాంగ్‌?

అంతా రాజ‌కీయం. ఏదైనా రాజ‌కీయం కోస‌మే. ఏ రాజ‌కీయ నేతైనా ఓ మాట మాట్లాడారంటే.. దాని వెనుక రాజ‌కీయ అవ‌స‌రం ఉండే ఉంటుంది. అది కాద‌న‌లేము. కానీ, అలా రాజ‌కీయం చేయ‌డంలోనే ఉంటుంది తెలివంతా. చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడే వారు.. అతి జాగ్ర‌త్త‌గా అడుగులు వేసేవారు మాత్ర‌మే రాజ‌కీయాల్లో రాణించ‌గ‌ల‌రు. లేదంటే.. ఎండాకాలం వాన‌లా ఇలా వ‌చ్చి అలా క‌నుమ‌రుగ‌వ‌క త‌ప్ప‌దు. ఇక సుదీర్ఘ కాలం రాజ‌కీయాల్లో ఉంటున్నా.. గ‌త రెండేళ్ల‌లోనే అనూహ్యంగా ఎదిగారు బండి సంజ‌య్‌. కార్పొరేట‌ర్ స్థాయి నుంచి నేరుగా ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు అయ్యారు. తనకేదో గాలివాటంగా ఈ ప‌ద‌వులు రాలేద‌ని.. అందుకు త‌గ్గ అన్ని అర్హ‌త‌లు త‌న‌కున్నాయ‌ని తొంద‌ర‌లోనే నిరూపించుకున్నారు. దుబ్బాక‌లో గెలిచి, జీహెచ్ఎమ్‌సీలో గెలిచినంత ప‌ని చేసి.. స‌త్తా చాటారు. రాష్ట్రంలో ఏ మూల‌న, ఏ బీజేపీ కార్య‌క‌ర్త‌పై ఏ చిన్న‌ దెబ్బ ప‌డినా.. అక్క‌డ వాలిపోతున్నారు. మీకు నేనున్నానంటూ ధైర్యం నూరిపోస్తున్నారు. ఇప్పుడు ప్ర‌జా సంగ్రామ యాత్ర‌తో ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌వుతున్నారు.  ఇక టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. తండ్రి వార‌స‌త్వంతో వేగంగా తారాస్థాయికి చేరారు. రాజ‌కీయంగా కేసీఆర్ అంత‌టోడిగా మారిన హ‌రీశ్‌రావును సైడ్ చేసేసి.. సైడ్‌వేస్‌లో అంద‌లం ఎక్కేశారు. ప‌రిపాల‌న చూసుకోవ‌డం.. కేసీఆర్ చెప్పిన‌ట్టు చేయ‌డమేగానీ.. కేటీఆర్ సొంతంగా పాలిటిక్స్ చేయ‌డం త‌క్కువే. కేటీఆర్ రాజ‌కీయ సామర్థ్యంపై అనేక అనుమానాలు ఉన్నాయి. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. కేటీఆర్‌ను ఉద్దేశించి.. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న‌ స్లీపింగ్ ప్రెసిడెంట్ అంటూ సెటైర్లు వేశారు.   ఇలా రెండు పార్టీల్లో కీల‌క నేత‌లుగా ఉన్న బండి సంజ‌య్‌, కేటీఆర్‌ల‌కు.. రేవంత్‌రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ శీల‌ ప‌రీక్ష పెట్టిందంటున్నారు. మంత్రి కేటీఆర్ త‌న రాజ‌కీయ అజ్ఞానంతో బ్ల‌డ్ శాంపిల్స్ ఇస్తానంటూ రేవంత్‌రెడ్డి చేతికి అద్భుత‌మైన అవ‌కాశాన్ని అందించారు. డైన‌మిక్ లీడ‌ర్ రేవంత్‌రెడ్డి అందివ‌చ్చిన అవ‌కాశాన్ని అత్య‌ద్భుతంగా అందుకున్నారు. ఇటు కేటీఆర్‌ను, అటు బండి సంజ‌య్‌ను ఇద్ద‌రినీ ఇర‌కాటంలో ప‌డేయాల‌ని స్కెచ్ వేసి వైట్ ఛాలెంజ్ విసిరారు. అయితే, రేవంత్ విసిరిన ట్రాప్‌లో కేటీఆర్ నిలువునా చిక్కుకోగా.. బండి సంజ‌య్ అనూహ్యంగా సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు. రేవంత్‌రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరితే కేటీఆర్ స్వీక‌రిస్తారా? అస్స‌లు స్వీక‌రించ‌రు. ఈ విష‌యం అందరికీ తెలుసు. ఆఖ‌రికి రేవంత్‌కు కూడా తెలుసు. అయినా, కావాల‌నే అలా ఛాలెంజ్ చేశారు. అనుకున్న‌ట్టుగానే కేటీఆర్ ఆ ఛాలెంజ్‌కు స్పందించ‌లేదు. వెంట‌నే.. కేటీఆర్‌లానే బండి సంజ‌య్‌ను సైతం ట్రాప్ చేద్దామ‌నుకున్నారు. కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డితో బండి సంజ‌య్‌కు స‌వాల్ విసిరిపించారు. ఇక్క‌డే  బండి సంజ‌య్ త‌న రాజ‌కీయ చాతుర్యం ప్ర‌ద‌ర్శించారు. త‌న పాద‌యాత్ర‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే త‌న‌కు వైట్ ఛాలెంజ్ విసిరార‌ని మండిప‌డ్డారు. డ్ర‌గ్స్‌ను, కాంగ్రెస్‌ను తిట్టిపోశారు. దుష్ట కాంగ్రెస్‌ను వీడి, ప్ర‌స్తుతం ఏ పార్టీలో లేని.. కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిపై గౌర‌వంతో తానీ వైట్ ఛాలెంజ్ స్వీక‌రిస్తున్నానంటూ రాజ‌కీయ చాణ‌క్యం ప్ర‌ద‌ర్శించారు బండి సంజ‌య్‌.  బండి సంజ‌య్ సైతం కాంగ్రెస్ లీడ‌ర్‌ ఛాలెంజ్ చేస్తే.. తిర‌ష్క‌రించేవారేమో. కానీ, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి ప్ర‌స్తుతానికి న్యూట్ర‌ల్‌గా ఉన్నారు కాబ‌ట్టి ఆయ‌న విసిరిన‌ వైట్ ఛాలెంజ్‌ను స్వీక‌రించడం బండికి రాజకీయంగా బాగా క‌లిసొచ్చింది. ఇక‌, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఛాలెంజ్ విస‌ర‌డంతో ఆయ‌న ఆ స‌వాల్‌ను స్పీక‌రించ‌లేద‌ని అనుకోవ‌చ్చు. ఇలా, ఎవ‌రి రాజ‌కీయ ఉద్దేశ్యాలు ఎలా ఉన్నా.. చూసేవారికి మాత్రం కేటీఆర్ దోషిగానే క‌నిపిస్తున్నారు. ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌ బండి సంజ‌యే ఛాలెంజ్ స్వీక‌రించ‌గా.. ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న కేటీఆర్ నిరాక‌రిస్తున్నారంటే..? ఏదో ఉందంటూ గుస‌గుస‌లు వ్యాపిస్తున్నాయి. లేనిపోని అనుమానాలకు తావిస్తోంది.  మ‌రోవైపు, రేవంత్‌రెడ్డిపై ప‌రువున‌ష్టం దావా వేస్తూ.. డ్ర‌గ్స్ విష‌యంలో త‌న పేరును ఎవ‌రూ ప్ర‌స్తావించ వ‌ద్దంటూ, మీడియాలో డ్ర‌గ్స్ మేట‌ర్‌లో త‌న గురించి వార్త‌లు రావొద్దంటూ.. కేటీఆర్ కోర్టును ఆశ్ర‌యించ‌డం చూస్తుంటే.. సంథింగ్ రాంగ్.. అనే డౌట్ వ‌స్తోంది.. అంటున్నారు.    

సీఎం చెప్పినా న్యాయం జ‌ర‌గ‌దా? అక్బ‌ర్‌బాషా కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

ముఖ్య‌మంత్రి అంటే రాష్ట్రానికే రాజు. ఆయ‌న చెప్పిందే వేదం. చేసిందే శాస‌నం. అలాంటి సీఎం జ‌గ‌నే ఓ కుటుంబానికి న్యాయం చేయ‌లేక‌పోయారంటే ఏమ‌నాలి? ముఖ్యమంత్రి త‌ర‌ఫున సీఎం కార్యాల‌యం రంగంలోకి దిగి నేరుగా జోక్యం చేసుకున్నా.. జిల్లా ఎస్పీనే స్వ‌యంగా ఆ కేసును ప‌ర్య‌వేక్షిస్తున్నా.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఓ మైనార్టీ కుటుంబానికి మాత్రం న్యాయం జ‌ర‌గ‌లేదు. వైసీపీ నేత‌ల బెదిరింపులు ఆగ‌లేదు. దీంతో తీవ్ర‌మ‌న‌స్థాపంతో అక్బ‌ర్‌బాషా కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ముఖ్య‌మంత్రే న్యాయం చేయ‌లేక‌పోతే.. సీఎం సొంత‌జిల్లాలోనే ఇలా జ‌రిగితే.. ఏపీలో ఇక వైసీపీ నాయ‌కుల నుంచి సామాన్యుల‌కు ర‌క్ష‌ణ ఏముంటుందంటూ ఆందోళ‌న చెందుతున్నారు ప్ర‌జ‌లు.  పొలం విషయంలో సీఎం కార్యాలయం హామీ ఇచ్చినప్పటికీ... తమకు న్యాయం జరిగేలా లేదని ఆందోళనకు గురైన అక్బర్‌ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. అక్బర్‌తోపాటు భార్య ఖాసీంబీ, కుమార్తెలు ఆసిఫా, ఆసిన్‌ పురుగుల మందు తాగారు. రాత్రి పది గంటల సమయంలో వారి పరిస్థితిని గుర్తించిన బంధువులు చాగలమర్రిలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది.  భూమి విషయంలో అన్యాయం జరుగుతోందని పోలీసులను ఆశ్రయిస్తే.. ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరిస్తున్నారంటూ అక్బర్‌బాషా ఈనెల 11న పోస్ట్‌ చేసిన సెల్ఫీ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం కార్యాలయ అధికారులు స్పందించి.. హామీ ఇచ్చినా, తమకు న్యాయం జరిగేలా లేదని సోమవారం అక్బర్‌ కుటుంబీకులంతా పురుగుమందు తాగారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అక్బర్‌బాషా మాట్లాడుతూ.. ‘మా భూమి మాకు ఇస్తామని సీఎం హామీ ఇచ్చినా కొందరు అడ్డుపడుతున్నారు. దిక్కున్న చోట చెప్పుకోండని దువ్వూరుకు చెందిన తిరుపేలరెడ్డి, మేయర్‌ సురేష్‌బాబు హెచ్చరించారు. పంచాయతీ చేసి రూ.10 లక్షలు కడితే నీ పత్రాలు నీకిస్తామంటూ చెప్పారు. గడువులోగానే డబ్బులను సమకూర్చుకుని వారి దగ్గరికి వెళ్లగా నాలుగైదు రోజులుగా ముఖం చాటేస్తున్నారు’ అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు అక్బ‌ర్‌బాషా. ఇక త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌నే ఉద్దేశ్యంతోనే కుటుంబ స‌మేతంగా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన‌ట్టు చెప్పారు.   

కమలంతో పవన్ కల్యాణ్ కటీఫేనా? ఉద్యమ కార్యాచరణ అందుకేనా? 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతోంది. సీఎం జగన్ విధానాలతో విసిగిపోయిన ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ప్రభుత్వాన్ని మార్చేద్దామా అని చూస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇక పార్టీల వ్యూహాల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఏపీలో బీజేపీతో ప్రస్తుతం జనసేన పార్టీ పొత్తులో ఉంది. కాని ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా తన స్టాండ్ మార్చుకునే  యోచనలో ఉన్నారని తెలుస్తోంది.  బీజేపీతో జనసేన కటీఫ్ చేసుకుంటుందనే ప్రచారమే చాలా కాలంగా సాగుతోంది. కాని బీజేపీ నేతలు మాత్రం ఖండిస్తూ వస్తున్నారు. తమపై పవన్ అసంతృప్తిగా ఉన్నారనే చర్చ రాగానే... కొందరు కమలం నేతలు వెళ్లి ఆయనతో చర్చలు జరిపి కూల్ చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తుందని చెబుతున్నారు. తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. పవన్ నిర్ణయంతో ఆయన బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకునే పనిలో ఉన్నారనే సంకేతం వస్తోంది.  ఏపీ ప్రయోజనాల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు  భిన్నంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. విభజనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీకి సాయం చేయపోగా.. గతంలో ఉన్న ప్రాజెక్టులకు కొర్రీలు పెడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు పోరాటం కూడా చేస్తున్నారు. బీజేపీ పొత్తులో ఉండటంతో ఇంతకాలం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో దూకుడుగా వెళ్లలేదు పవన్ కల్యాణ్. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమించాలని నిర్ణయించారు పవన్ కల్యాణ్. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు ఉద్యమ గోదాలో దిగనున్నట్లు స్పష్టం చేయటమే కాదు.. దానికి సంబంధించిన భారీ ప్రణాళికను విడుదల చేశారు పవన్ కల్యాణ్.  విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే విషయంలో కేంద్రం మరోసారి పునరాలోచన చేయాలన్న డిమాండ్ తో పాటు.. ఉక్కు కర్మాగారం భావోద్వేగాలతో ముడి పడి ఉందన్న విషయాన్ని పవన్ ప్రస్తావించారు. నిర్వాసితుల బాధలు.. కష్టాలు తనకు తెలుసన్న ఆయన.. ఆ దిశగా తాము పోరాడతామన్న విషయాన్ని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన ఒక ప్రెస్ రిలీజ్ ను విడుదల చేశారు.  విశాఖ ఉక్కు అంశం మీద తనకు తాను బరిలోకి దిగుతానని ప్రకటించడం ద్వారా జనసేనాని తన భవిష్యత్ కార్యాచరణను చెప్పేశారనే చర్చ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించడం అంటే బీజేపీపై పోరాటమే. కమలంతో కటీఫ్ చెప్పాలని నిర్ణయించుకున్న తర్వాత పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. బీజేపీ పొత్తు విషయంలో ఏం చేయాలన్న దానిపై పార్టీ నేతల నుంచి పవన్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారని తెలుస్తోంది. 

టీడీపీ మహిళా నేత ఇంటికి నిప్పు.. అర్ధరాత్రి వైసీపీ నేతల అరాచకం 

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. తమ అక్రమాలను ప్రశ్నించిన వాళ్లను టార్గెట్ చేస్తున్నారు. బరి తెగించి దాడులకు పాల్పడుతున్నారు. ప్రతి పక్ష టీడీపీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తల వీరంగం స్పష్టించారు. హోంమంత్రి సొంత నియోజకవర్గంలో వికృత చేష్టలతో రెచ్చిపోయారు. తప్పతాగి అరాచకం సృష్టించారు. అర్ధరాత్రి టీడీపీ నేత ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంటిపె పెట్రోల్ చల్లి నిప్పు పెట్టారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో జరిగిన వైసీపీ నేతల దౌర్జన్యకాండ తీవ్ర కలకలం రేపుతోంది.  సోమవారం రాత్రి గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో వైసీపీ వర్గీయులు వినాయక విగ్రహ ఊరేగింపు నిర్వహించారు. టీడీపీకి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బత్తిన శారద ఇంటి ముందుకు రాగానే ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఎలాంటి కారణం లేకుండానే ఉన్నట్టుండి ఆమె ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఇంట్లోకి ప్రవేశించి సామగ్రిని ధ్వంసం చేశారు. అనంతరం ఇంట్లోని వస్తువులతోపాటు ఆరు బైకులపై పెట్రోలు పోసి నిప్పంటించారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులూ వారి ఆగడాలను అడ్డుకోలేదు. దీంతో మాజీ జడ్పీటీసీతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలూ ప్రాణ భయంతో తమ ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.  పరిస్థితి అదుపు తప్పుతోందని, వెంటనే అదనపు బలగాలను పంపించాలని స్థానిక పోలీసులు ఉన్నతాధికారులను వేడుకున్నారు. స్వయంగా హోంమంత్రి సుచరిత సొంత నియోజకవర్గం కావడంతో పోలీసు ఉన్నతాధికారులు  ‘ఆచితూచి’ స్పందించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి దాటాక డీఎస్పీ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో పోలీసులు గ్రామానికి తరలివచ్చారు. దాడి జరిగిన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండానే తమ ఇంటిపై దాడికి దిగారని  ఆవేదన వ్యక్తం చేశారు.   తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలోనూ వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించాయి. గ్రామంలో వైసీపీ వర్గీయులు పెట్టిన గణేశ్‌ విగ్రహాన్ని నిమజ్జనం చేయటానికి సోమవారం రాత్రి  డీజేతో ఊరేగింపుగా బయలుదేరారు. గ్రామ బొడ్రాయి సెంటర్‌ వద్ద మహిళలు నిల్చొని ఊరేగింపును తిలకిస్తున్నారు. ఊరేగింపులోని ఓ వ్యక్తి తనపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేయగా, తోటి మహిళలు, టీడీపీ శ్రేణులు ఊరేగింపును అడ్డుకున్నారు. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో రాళ్లు, సీసాలు రువ్వుకున్నారు. నిమజ్జనానికి బందోబస్తు నిమిత్తం వచ్చిన తాడికొండ ఎస్‌ఐ వెంకటాద్రి ఇరువర్గాలను నియంత్రించడానికి ప్రయత్నించగా, ఆయన తలకు ఓ రాయి తగిలి రక్తస్రావమైంది.