బండి వ్యాఖ్యలపై దుమారం.. మత విద్వేషాలే లక్ష్యమా?
భారతీయ జనతా పార్టీ, బీజేపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సాగిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు మంచి స్పందనే వస్తోంది. ప్రజలు అనుభవిస్తున్న కష్టాలనే ఆయన తమ ప్రసంగాలలో ఏకరువు పెడుతున్నారు, కాబట్టి ప్రజలు గట్టిగానే చప్పట్లు కొడుతున్నారు. సమస్యలు చెప్పుకుంటున్నారు. బండి సంజయ్ కూడా, ఆలా నడుచుకుంటూ పోవడం కాకుండా, ఎక్కడంటే అక్కడ ఆగి, స్థానికులతో మాటామాటా కలుపుతున్నారు. వ్యక్తిగత సమస్యలు కూడా వింటున్నారు. ఆ విదంగా ప్రజా సమస్యల వరకే పరిమితమై, ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేయడం వరకు అయితే, ఎవరికే ఎలాంటి అభ్యంతరం ఉండదు. సమస్యలకు తక్షణ పరిష్కారం చూపినా చూపక పోయినా, బండి యాత్ర రాజకీయంగా మంచి ముందడుగే అనిపించుకుంటుంది.
అయితే బండి సంజయ్,ఆయన వెంట నడుస్తున్నఇతర నాయకులు, కార్యకర్తలు అంతటితో ఆగడం లేదు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు వివాదస్పదం అవుతున్నాయి. హైదరాబాద్ పాత బస్తీ, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి యాత్ర ప్రారంభించిన బండి సంజయ్, ఎంఐఎం బుజాన తుపాకిపెట్టి, తెరాస లక్ష్యంగా చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలు మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని బండి అన్నారు. అంతే కాదు, అంతకు మించి, రాష్ట్రంలో 80 శాతం ఉన్న హిందువులకు బీజేపీ అండగా ఉంటుందని కుండ బద్దలు కొట్టారు. బీజేపీ హిందువుల పార్టీనే కానీ, ఇంతవరకు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నాయకులు ఎవరూ కూడా, ‘అవును, మాది హిందువుల పర్త్య, హిందువులకు అండగా ఉండే పార్టీ, అని గట్టిగా చెప్పిన సందర్భం లేదు. అందుకే, బండి వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రగిల్చాయి. ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని ప్రత్యర్ధులు దుయ్యపడుతున్నారు. నిజానికి బడి సంజయ్, అక్కడితోనూ ఆగలేదు,మరో అడుగు ముందుకేశారు. హిందువులకు హని తలపెడితే మత విద్వేషాలను రెచ్చ కొట్టేందుకు కూడా బీజేపీ వెనకాడదని కుండబద్దలు కొట్టారు. ఒక విధంగా కుహన లౌకిక వాదంపై యుద్దాన్ని ప్రకటించారు. కుహనలౌకిక వాదులకు సవాలు విసిరారు.అయితే, బండి వ్యాఖ్యలపై ఎంఐఎం కంటే తెరాస నాయకులే ఎక్కువగా స్పందిస్తున్నారు.
తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ అవినీతి, అక్రమాస్తుల గురించి బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు, హెచ్చరికలు హాస్యాస్పదంగా, నవ్వుతెప్పించేలా ఉంటున్నాయని అంటున్నారు. నిజానికి, బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు అయిన నాటి నుంచి, కేసీఆర్ అవినీతిని నిరూపించి జైలుకు పంపడం ఖాయమని అంటూనే ఉన్నారు. అందుకు అవసరమైన ఆధారాలు సేకరిస్తున్నామని, ఇక రేపో మాపో కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమన్న రీతిలో ప్రకటనలుచేస్తూనే ఉన్నారు. కానీ, అదేమీ జరగలేదు. అయినా, ఇప్పుడు పాదయాత్రలో మరోమారు. లేస్తే మనిషిని కాదు, అన్నట్లుగా, తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ నేతల లెక్కలన్నీ తేల్చి బొక్కలో వేస్తామంటున్నారు. అంటే, ఇప్పటికి ఏమీ చేయలేమని చేతులు ఎత్తేశారు అనుకోవచ్చును. అందుకే, కేసీఆర్ అవినీతి గురించి చెప్పే ఆయనకు ఎలా ఉన్నా వినేవారికి మాత్రం బ్రహ్మానందం జోకులా నవ్వు తెప్పిస్తోందని అంటున్నారు. అప్పటిదాకా, ఆగడం ఎందుకు, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, ఆరోపణలే నిజం అయితే, అందుకు ఆధారాలు నిజంగా ఉంటే ఇప్పుడు చర్యలు తీసుకునేందుకు అభ్యంతరం ఏమిటి అన్న ప్రశ్నలకు బీజేపీ నాయకుల వద్ద సమాధానం లేదు.
కేంద్ర నిధుల విషయంలోనూ బండి సంజయ్ ప్రజలను కన్విన్సు చేయలేక పోతున్నారని పార్టీ నాయకులే అంటున్నారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్.. అవేవో తమ సొంత నిధులైనట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శలు అయితే చేస్తున్నారు, కానీ, నిజానిజాలను జనం ముందు పెట్టడం లేదని అంటున్నారు. బండి సంజయ్ సంగ్రామ యాత్ర సాగుతున్న తీరు పట్ల కేంద్ర నాయకత్వం సంతృప్తిని వ్యక్తచేసిందని, ప్రజల నుంచి వస్తున్న స్పందన కూడా ఆశాజనకంగా ఉందని, పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. మరో వంక తెరాస నాయకులు బండి పాదయాత్రను తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. పెట్రోల్ ధరల పెరుగుదలో ముడి పెట్టి జోకు లేస్తున్నారు. కానీ, అద్దాల మేడలో కూర్చున్న వారు, రోడ్డున పోయేవారి మీద రాళ్ళూ వేయడం అంత మంచింది కాదు.