ఊరుకోబోమంటున్న కేటీఆర్.. తగ్గేదే లేదంటున్న విపక్షం! అందరికి ఆయనే ఆదర్శమట..
తెలంగాణలో రాజకీయాలు ఎంతగా దిగాజారాయో, రాజకీయ నాయకుల భాష అంతకంటే, అధః పాతాళానికి.. ఇంకా ఇంకా కానరాని లోతుల్లోకి దిగజారి పోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ భాషలో చెప్పాలంటే, దరిద్రగొట్టు, దిక్కుమాలిన స్థాయికి చేరింది. మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నట్లుగా దిగజారింది, ప్రతిపక్షాల భాష మాత్రమే కాదు, అధికార పార్టీ భాషా పాండిత్యం అంతకంటే పది రెట్లు ఎక్కువ దిక్కుమాలిన స్థితికి ఎప్పుడో చేరుకుంది అనేది కాదనలేని జన వాక్యం. నిజం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ముఖ్యమంత్రి కేసీఆర్, అడుగుజాడల్లోనే అధికార, ప్రతిపక్ష పార్టీల చిన్న పెద్ద నాయకులు అందరూ తమ భాషా పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్నారు. ’నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అన్నట్లుగా విపక్ష పార్టీల నేతలు కేసీఆర్ ‘సార్’ కు ఆయన భాషలోనే గురుదక్షిణ సమర్పించుకుంటున్నారు.
భాష విషయంలో ముఖ్యమంత్రి కేసీఆరే తన గురువని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంగీకరించారు. బండి సంజయ్ లేదా మరొకరు అంగీకరించారా లేదా అనేది పక్కన పెడితే.. సామాన్య జనం మాత్రం ప్రస్తుతం వివాదంగా మారిన తెలంగాణ రాజకీయ భాషకు, కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే అని అంగీకరిస్తున్నారు. అందుకే ఈ భాషను సామాన్యులు కూడా కేసీఆర్ భాషగా పేర్కోవడం జరుగుతోంది. బండి సంజయ్ కానీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానీ, మరొకరు కానీ, మాట్లాడుతోంది, వేరెవరి భాషో కాదు, కేసీఆర్ భాషలోనే మాట్లాడుతున్నారు. సరదాగానే కావచ్చు, బండి సంజయ్, రేవంత్ రెడ్డికి తమ తమ పార్టీ అధ్యక్ష పదవులు రావడానికి కూడా వారికున్న, ‘కేసీఆర్ భాషా పాండిత్యం’ కూడా ఒక కారణంగా చెపుతారు. కేసీఆర్’ కు కేసీఆర్ భాషలో సమాధానం చెప్పగలగడం ఆ ఇద్దరికి ఉన్న అదనపు అర్హతగా టీవీ చర్చల్లో, ఇతరత్రా మేథావులు, రాజకీయ విశ్లేషకులు అనేక సందర్భాలలో పేర్కొన్నారు. అంటే అటు సామాన్యుల నుంచి ఇటు మేథావుల వరకు, చివరకు ప్రతిపక్ష పార్టీల వరకు అందరూ కూడా ఈ భాషకు ఆద్యుడు కేసీఆర్ అనే భావనలోనే ఉన్నారు.
నిజంగా, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఅర్’కు రాజకీయ నాయకుల భాష విషయంలో అభ్యంతరం ఉంటే, రాజకీయ భాషను సంస్కరించాలనే పవిత్ర ఆశయమే ఉంటే, అదేదో తమ ఇంట్లో మొదలు పెడితే బాగుటుంది. చిన్నవాడైనా చక్కని అడుకేశారని సభ్యసమాజం ఆయన్ని అభినందిస్తుంది. నిజమే, కేటీఆర్ అనంట్లుగా ముఖ్యమంత్రికి ఇవ్వవలసిన గౌరవం ముఖ్యమంత్రికి ఇవ్వాలి ... అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలకు, ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఇవ్వవలసిన గౌరవం వారికీ ఇవ్వాలి ... ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో, ఆ ఇంటికి ఈ ఇల్లు అంతే దూరం. అయితే, సోనియా గాంధీని దయ్యం అన్నా, అమిత షా అనామకుడు అన్నట్లుగా అవమానించినా, ప్రతిపక్ష నాయకులను దద్దమ్మలు, దగుల్బజీలు, థూ మీ బతుకులు... అన్నా, పెద్దాయన ప్రయోగించిన భాషను, మంత్రి కేటీఆర్ సంస్కారవంతమైన భాషా, భావిస్తున్నారు. అదే అసలు దురదృష్టం.
అంతే కాదు మంత్రి కేటీఆర్ ప్రతిపక్ష పార్టీలకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు పేలితే ఊరుకున్నామని.. ఏడేళ్లు భరించామని.. ఇక భరించే ప్రసక్తే లేదని.. ఇకపై ఏదైనా మాట అంటే బరాబర్ సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అవతలి వారు ఒక్కటి అంటే.. పది మాటలు అనాలంటూ బోధించారు. బహశా, ఇది తెలంగాణ భాషాదినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షడు కేటీఆర్ ఇచ్చిన సందేశం కావచ్చును. కాళోజీ మమ్ములను క్షమించు గాక..