హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆలస్యం.. ఎవరికి విషం?
హుజూరాబాద్ ఉపఎన్నిక ఇక ఇప్పట్లో లేనట్లే ... నవంబర్ లేదా డిసెంబర్ కాదంటే కొత్త సంవత్సరంలో ఉప ఎన్నిక జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఈ నేపధ్యంలో ఈ ఆలస్యం ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికీ కీడు చేస్తుంది, ఈ సమయంలో సమీకరణలు ఏ విధంగా మారిపోతాయని ఆలోచిస్తే, ఇప్పటికైతే అధికార తెరాసకు మేలు జరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.
నిజానికి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, అధికార పార్టీ ఓటమి ఖాయమని సర్వేలు ఘోషిస్తున్నాయి. దళిత బందు ప్రకటన తర్వాత కూడా మూడొంతుల ఓటర్లు ఆటు, ఈటల వైపే ఉంది పోయారు. అందుకే, ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. చివరకు రాష్ట్రంలో కరోనా లేదు పాడు లేదు అంటూనే, అదే లేని కరోనాను బూచిగా చూపించి, ప్రభుత్వం ఉప ఎన్నికను వెనక్కి నెట్టింది. ఇది కేవలం విపక్షాలు చేస్తున్న విమర్శ కాదు, స్వపక్షీయులు కూడా అవే గుసగుసలు పోతున్నారు. ఉప ఎన్నిక ఆలస్యం అవడం వలన అధికార తెరాసకు నిజంగా ప్రయోజనం చేకూరుతుందా అంటే, ఖచ్చితమైన సమాధానం చెప్పడం,రాజకీయ పండితులకు సైతం కష్టమే. రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో ఊహించడం ఎవరికైనా అయ్యే పని కాదు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు అతి వేగంగా పరుగులు తీస్తున్న ప్రస్తుత సంక్లిష్ట రాజకీయ వాతావరణంలో రేపేమి జరుగుతుందో ఈరోజే చెప్పడం ఒక విధంగా దుస్సాహసమే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి ఈటలను బర్తరఫ్ చేసిన సమయంలో ఉన్న లెక్కలు వేరు ఇప్పుడున్న లెక్కలు వేరు. అప్పుడు ముఖ్యమంత్రి, ఈటలను పిల్లోడు అనుకున్నారు. అంతే కాని, ఇంతలా ఏకు మేకవుతాడని అనుకోలేదు. అందుకే, చకచకా పావులు కదిపి, ఈటల మీద వేటు వేశారు. పరిస్థితి ఇంతలా విషమిస్తుందని అప్పుడే తెలిసుంటే, కేసీఆర్ అసలు ఈటల ఉద్వాసన వరకు వెళ్ళేవారే కాదని తెరాస వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. పరిశీలకులూ అదే అంటున్నారు. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది కాబట్టే కేసీఆర్ వేల కోట్లు కుమ్మరించినా, దళిత బంధు వంటి ‘అద్భుత’ పథకాన్నిప్రవేశ పెట్టినా, తమ శక్తి యుక్ట్లు అన్నీ సంపూర్ణంగా వినియోగించినా,ఆయన్ని ఓటమి భయం వెంటాడుతూనే ఉంది. ఈ విషయంలో ఇంత వరకు ఎవరికైనా ఏవైనా అనుమానాలుంటే, ఉప ఎన్నిక వాయిదా నిర్ణయంతో ప్రభుత్వం కరోనాకు కాదు, ప్రజలకు భయపడుతోందని తేలిపోయింది.
ఉపఎన్నిక రెండు మూడు నెలలు ఆలస్యంగా జరిగినంత మాత్రాన అధికార పార్టీకి ఫలితం దక్కుతుందా అంటే, ఖాయంగా ప్రయోజనం జరుగుతుందని చెప్పీ పరిస్థితి లేదనే అంటున్నారు పరిశీలకులు.వ్రతం చెడ్డా ఫలితం దక్కకుండా పోతుందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అంతే కాదు, ఎన్నికలు ఆలస్యం అయిన కొద్దీ కొత్తసమస్యలు చుట్టుముడతాయని, ముఖ్యంగా కేసీఆర్ ఆశలు పెట్టుకున్న దళిత బంధు పథకమే ప్రతికూల అంశంగా మారే ప్రమాదం ఉందని పార్టీ నాయకులే అంటున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని 21 వేల పై చిలుకు దళిత కుటుంబాలకు కుటుంబానికి పది లక్షల రూపాయల వంతున ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అందుకోసం ఇప్పటికే రూ. 2 వేల కోట్లు రిలీజ్ చేసింది. లబ్ధిదారులతో కొత్త బ్యాంకు ఖాతాలు తెరిపించింది.
మొదటి దశలో ప్రభుత్వ ఉద్యోగులు తప్ప మిగతా వారి ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. ఇప్పటికి దాదాపు 8 వేల మంది ఖాతాల్లో రూ.9.90 లక్షల చొప్పున డబ్బులు జమ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో లేదని తేలడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కలెక్టర్ క్లియరెన్స్ ఇచ్చే వరకు డబ్బులను లబ్ధిదారులు తమ ఖాతాల నుంచి విత్‌డ్రా చేయకుండా ఫ్రీజింగ్ చేస్తూ అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చింది. కొత్తగా ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్ఓ) మెలిక పెట్టింది. అంటే, నియోజకవర్గ పరిధిలోని 21 వేల కుటుంబాలకు లబ్ది చేకూరే సమయానికి పుణ్య కాలం కాస్తా పూర్తయి పోతుంది. ఆలా కొంతమందికి వచ్చి కొంతమందికి రాక, అదొక సమస్యగా మారుతుంది. అలాగే, ఇతర సామాజిక వర్గాల నుంచి వత్తిళ్ళు పెరుగుతాయి. ఆ వర్గాలు దూరమవుతాయి..ఇలా కొత్త సమస్యలు తలకు చుట్టుకుంటాయని పార్టీ నాయకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. అంతే కాకుండా ఈ ప్రభావం 2023 అసెంబ్లీ ఎన్నికల మీద కూడా ఉంటుందని అంటున్నారు.
తెరాసకు ప్రధాన ప్రత్యర్ధిగా భావిస్తున్న మాజీ మంత్రి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్కు నియోజక వర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సానుభూతి, సానుకూలత వ్యక్తమవుతున్నాయి. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి ఆయనకు ప్రత్యక్ష పరోక్ష మద్దతు లభిస్తోంది. అయితే ప్రస్తుతం వీస్తున్నాఈ సానుకూల పవనాలు, అందాకా అలాగే ఉంటాయా అనేది అనుమానమే అంటున్నారు. ప్రస్తుత సానుకూల పరిస్థితులు నిలబెట్టుకోవడం ఈటలకు అంత సులభం కాదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు, ఎత్తుగడలు ఎదుర్కుంటూ, పట్టు నిలుపుకోవడమే అంటే అది మాములు విషయం కాదు. ఒక విధంగా అది ఈటలకు కత్తి మీద సాము లాంటిదే అంటున్నారు.
ఇక ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా బరిలో దిగలేదు. కానీ ఇప్పుడు కావలసినంత సమయం చిక్కడంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగితే, అది కేసీఆర్ కే కాదు ఈటలకు చిక్కులు తెచ్చిపెడుతుందని అంటున్నారు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఈటల పట్ల సానుకూలత ఉన్నా, ఆయన బీజేపీ అభ్యర్ధి కావడం వలన కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వక తప్పదు. సో, కాంగ్రెస్ బరిలో దిగితే అది ఈటల గెలుపు అవకాశాలను దెబ్బ తీస్తుందని, ఆ కోణంలో చూసినప్పుడు ఈటలకు, ఆలస్యం అమృతం విషంగా మారుతుందని అంటున్నారు.