రఘునందన్ కు మంచి భవిష్యత్! బీజేపీ ఎమ్మెల్యేకు కేసీఆర్ ప్రశంసలు..
posted on Oct 5, 2021 @ 7:40PM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుండగా.. నిండు సభలో బీజేపీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ప్రశంసపూర్వక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. అది కూడా నిత్యం తనపై విరుచుకుపడే ఎమ్మెల్యేను పొగడటం ఆసక్తిగా మారింది. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా జయకేతనం ఎగురవేస్తూ వస్తున్న తమ జైత్రయాత్రకు బ్రేకులు వేసిన ఎమ్మెల్యేపై ఆ కామెంట్లు చేయడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇంతకూ సీఎం కేసీఆర్ చేత ప్రశంసలు అందుకున్నది బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. గతంలో టీఆర్ఎస్ పని చేశారు రఘునందన్ రావు. టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉంటూ కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు రఘునందన్ రావు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీలో చేరిన రఘునందన్.. ఏడాది క్రితం జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించి టీఆర్ఎస్ కు, సొంత జిల్లాలో సీఎం కేసీఆర్ కు షాకిచ్చారు. ఆ తర్వాత గులాబీ పార్టీ టార్గెట్ గా మరింత దూకుడు పెంచారు రఘునందన్. బండి సంజయ్ పాదయాత్ర, హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలోనూ కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయినా రఘునందన్ రావును ఉద్దేశించి కేసీఆర్ సానుకూల కామెంట్లు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
దళిత బంధు పథకంపై సభలో జరిగిన చర్చలో మాట్లాడిన కేసీఆర్... హుజురాబాద్ కోసం దళిత బంధు పెట్టలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నాయని అన్నారు. ఈ సందర్బంగా బీజేపీపై సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. వర్గీకరణ చేయాలని ఇప్పటికే ప్రధానికి చాలాసార్లు చెప్పానన్నారు. కేంద్రంలో ఉన్నారు కదా.. వర్గీకరణ చేసి తీసుకువస్తే.. బేగంపేట నుంచి పెద్ద పెద్ద దండలు వేసి స్వాగతం పలుకుతామన్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు యువకుడని, మంచి భవిష్యత్ ఉందన్నారు. ఇంత పెద్ద స్కీమ్‌పై మాట్లాడే ముందు ఆలోచన ఉండాలి కదా అని అన్నారు. ఏదో ఒకటి అనాలనుకునే మాటలు ఇకనైనా మానుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.
దళితులు దయనీయ స్థితిలో ఉన్నారని, దేశమంతా ఇదే పరిస్థితి ఉందన్నారు కేసీఆర్. అణచివేయబడ్డ వారికి సాధికారత రావట్లేదన్నారు. దళిత వర్గాలకు అంబేద్కర్ చేయాల్సిందంతా చేశారని, అంబేద్కర్ ఆలోచన సరళి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు వస్తోందన్నారు. దళితుల గురించి కాంగ్రెస్ ఏం చేయలేదని అనలేమని, వారు చేసేది చేశారని, అయితే అనుకున్నంత జరగలేదనేది తమ వాదన అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.ముందు ముందు కూడా తామే అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదన్నారు. ఎన్నికలు వస్తే తమకు అంచనాలు ఉండవా?.. తమది రాజకీయ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం గుర్తించి.. దళితుల రిజర్వేషన్ శాతం పెంచాలన్నారు. బీసీల కులగణన కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయదని సీఎం నిలదీశారు.
మార్చిలోపే రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలో 100 మందికి దళిత బంధు అందజేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకే అప్పగిస్తున్నామన్నారు. వచ్చే మార్చిలో రూ. 20 వేల కోట్లు బడ్జెట్‌లో పెడతామన్నారు. రూ.10 లక్షలు లబ్ధిదారుల ఇష్టమని, నిబంధనలు లేవని, ఎక్కడైనా వ్యాపారం పెట్టుకోవచ్చునని, తమకెలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో భూముల ధరలు పెరిగిపోయాయన్నారు. ఎకరం భూమి రూ.20 లక్షలకు తక్కువ ఎక్కడ దొరకడం లేదన్నారు.ఏడాది కిందటే దళితబంధు పథకం ప్రారంభం కావాల్సిందని, అయితే కరోనా వల్లే ఆలస్యమైందన్నారు. దళితబంధుపై అఖిలపక్షం సమావేశం పెట్టి చర్చించామన్నారు. ఆచరణలో వచ్చే ఇబ్బందులను అధిగమిస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.