శహభాష్ సజ్జనార్.. పండుగ ప్రత్యేక బస్సులకు పాత చార్జీలే!

ఐపీఎస్ అధికారిగా విధి నిర్వహణలో ప్రజల ప్రశంసలు పొందిన వీసీ సజ్జనార్.. ఆర్టీసీ ఎండీగాను తన మార్క్ చూపిస్తున్నారు. ఇటీవలే టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్.. అప్పుల్లో కూరుకుపోయిన సంస్థను గాడిలో పెట్టడంతో ఉద్యోగుల సంక్షేమంపైనా ఫోకస్ చేశారు. అదే సమయంలో ప్రజలపై భారం మోపకుండా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం అందరిని సంతోష పరుస్తోంది. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. ఈ పండుగ కోసం లక్షలాది మంది జనాలు పట్టణాల నుంచి సొంత గ్రామాలకు వెళుతుంటారు. ఇక గ్రామాల్లోనూ రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఇదే అదనుగా ప్రతి ఏటా దసరా కోసం ప్రత్యేక బస్సులు నడుపుతుంది ఆర్టీసీ, అయితే సాధారణ చార్జీలు కాకుండా అదనపు చార్జీలు వసూల్ చేసేది. పాత టికెట్ కన్నా 50 శాతం.. ఒక్కసారి డబుల్ రేట్లు కూడా వసూల్ చేసిన సందర్భాలున్నాయి. ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వచ్చినా... పండుగ సమయంలో ప్రత్యేక బాదుడు ఆపలేదు ఆర్టీసీ అధికారులు. కాని ప్రస్తుతం ఎండీగా ఉన్న సజ్జనార్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు.  దసరా పండుగ సందర్భంగా నడిపే బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని వీసీ సజ్జనార్‌ తెలిపారు. అంతేకాదు.. ఇక ముందు తెలంగాణ రాష్ట్రంలో అదనపు ఛార్జీలు ఉండవని తెల్చి చెప్పారు. గడిచిన ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల మంది ప్రయాణికులను TSRTC సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిందన్నారు. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికుల సౌకర్యం భధ్రతే ధ్యేయంగా ఈ పండుగ సమయంలో తాము ఆర్టీసీ సేవలు అందిస్తున్నామని తెలిపారు సజ్జనార్. ఆర్టీసీలో ప్రయాణిస్తూ ప్రయాణీకులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పాటునందిస్తాయని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు. అందరు ప్రతి ప్రయాణాన్ని ఆర్టీసీ బస్సులో చేసి.. సురక్షితంగా గ్యమస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ కోరారు. దసరా పండగకు నడిపే ప్రత్యేక బస్సులో అదనపు చార్జీలు ఉండవంటూ సజ్జనార్ చేసిన ప్రకటనపై అన్ని వర్గాల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. గతంలో తమకు వేల రూపాయల భారం పడేదని, చార్జీలు పెంచకపోవడం వల్ల తమకు ఊరట లభించిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఇక ఎండీగా బాధ్యతలు తీసుకోగానే కార్మికుల సమస్యలపై ఫోకస్ చేసిన సజ్జనార్.. అక్టోబర్ నెలలో ఒకటో తారీఖునే వేతనం అందేలా చర్యలు తీసుకున్నారు. గత నాలుగేండ్లుగా ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందడం లేదు. 15వ తారీఖు వరకు జీతాలు జమకాని రోజులు కూడా ఉన్నాయి. అయితే సజ్జనార్ మాత్రం బ్యాంకర్లతో మాట్లాడి ఫస్ట్ రోజే వేతనాలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ తీసుకుంటున్న నిర్ణయాలపై సంస్థ ఉద్యోగుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ప్రయాణికులు కూడా హ్యాపీగా ఉన్నారు. మొత్తంగా ఐపీఎస్ ఆఫీసర్ గా తనదైన మార్క్ చూపించిన సజ్జనార్.. ఆర్టీసీ ఎండీగాను అద్భుతంగా పని చేస్తున్నారనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో ప్రజల్లో సాగుతోంది. 

బాబోయ్‌.. ప్ర‌కాశ్‌రాజ్ ఓట‌మికి ఇన్ని కార‌ణాలా..?

మంచు విష్ణు చేతిలో ప్ర‌కాశ్‌రాజ్ ఘోర ప‌రాజ‌యం. మెగా ఫ్యామిలీ మ‌ద్ద‌తిచ్చినా.. ప్ర‌కాశ్‌రాజ్ ఓడిపోవ‌డం ఒకింత షాకింగ్ విష‌య‌మే. ఇన్నాళ్లూ టాలీవుడ్ త‌మ గుప్పిట్లో ఉంద‌ని భావించిన మెగా-అల్లు కుటుంబానికి ప్ర‌కాశ్‌రాజ్ ఓట‌మి ఊహించ‌ని ప‌రిణామ‌మే. అయితే, ఇదంతా ప్ర‌కాశ్‌రాజ్ స్వ‌యంకృతాప‌రాధ‌మేన‌ని అంటున్నారు. మా ఎన్నిక‌ల విష‌యంలో మెగా స‌పోర్ట్‌ను ప‌క్క‌న‌పెట్టేసి మ‌రీ, ప్ర‌కాశ్‌రాజ్‌ను అన్ని శ‌క్తులు క‌లిసి ఓడించాయ‌ని విశ్లేషిస్తున్నారు. క‌ర్ణుడి చావుకు స‌వాల‌క్ష కార‌ణాలు అన్న‌ట్టు.. ఆయ‌న ఓట‌మికి అనేక రీజ‌న్స్ చెబుతున్నారు.  ఫైర్‌బ్రాండ్‌గా ముద్ర‌ప‌డిన ప్ర‌కాశ్‌రాజ్‌.. మోదీ వ్య‌తిరేకనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అందుకే,, మా ఫ‌లితాల‌పై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ సైతం స్పందించి.. విచ్చిన్న‌క‌ర శ‌క్తుల‌కు ఇది గుణ‌పాఠమ‌న్నారు. మా ఎన్నిక‌ల్లో బీజేపీ వ‌ర్గమంతా ప్ర‌కాశ్‌రాజ్‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసింది. విజ‌య‌శాంతి, బాబుమోహ‌న్‌, సీవీఎల్ లాంటి వాళ్లు ప్ర‌కాశ్‌రాజ్ ఓట‌మి కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నించి స‌క్సెస్ అయ్యారు.  బీజేపీ అనే కాదు.. టీడీపీ వ‌ర్గీయులు సైతం ప్ర‌కాశ్‌రాజ్‌కు యాంటీగా ప‌ని చేశారు. 2018లో టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు కార‌ణం. తెలంగాణ‌లో చంద్ర‌బాబుకు ఏం ప‌ని అంటూ.. 2018 ఎన్నిక‌ల్లో లోక‌ల్ వాయిస్ రైజ్ చేశారు ప్ర‌కాశ్‌రాజ్‌. ఇప్పుడు అదే లోక‌ల్ వాయిస్‌తో ప‌ర‌భాషీయుడైన ప్ర‌కాశ్‌రాజ్‌కు 'మా'తో ఏం ప‌ని అంటూ టీడీపీ సానుభూతిప‌రులంతా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఓటింగ్ చేశారు.  ఇక‌, వైసీపీ వ‌ర్గం సైతం ప్ర‌కాశ్‌రాజ్‌ను ఓడించ‌డంలో కీ రోల్ ప్లే చేసింది. వైఎస్ జ‌గ‌న్, మంచు విష్ణులు ద‌గ్గ‌రి బంధువులు. సో, జ‌గ‌న్ బ్యాచ్ అంతా మంచుకే మ‌ద్ద‌తు ఇచ్చింది. ఇక‌, ఆన్‌లైన్ టికెటింగ్‌పై ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైసీపీ ప్ర‌భుత్వాన్ని కుమ్మేయ‌డం.. మెగా ఫ్యామిలీ ప్ర‌కాశ్‌రాజ్‌కు స‌పోర్ట్ చేయ‌డంతో.. వైసీపీ సానుభూతిప‌రులంతా మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్‌రాజ్‌కు యాంటీగా ఓటింగ్ చేశారు.  ఇలా.. రాజ‌కీయ కార‌ణాల‌తో పాటు క్యాస్ట్ ఈక్వేష‌న్ సైతం మంచు విష్ణుకు అనుకూలంగా, ప్ర‌కాశ్‌రాజ్‌కు వ్య‌తిరేకంగా మారింది. మొద‌టి నుంచీ 'మా'లో ఆధిప‌త్యం అంతా క‌మ్మ వ‌ర్గీయుల‌దే. ముర‌ళీమోహ‌న్ ఏకంగా ఐదు సార్లు మా అధ్య‌క్షులుగా ఉన్నారు. మోహ‌న్‌బాబు, నాగార్జున, న‌రేశ్, రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. ఇలా ప‌లువురు క‌మ్మ వారు 'మా'కు ఆధిప‌త్యం వ‌హించారు. మంచు విష్ణు సైతం క‌మ్మ‌నే. ఆయ‌న స‌తీమ‌ణి రెడ్డి-క్రిష్టియ‌న్‌ కావ‌డంతో ఆ వ‌ర్గాలూ స‌పోర్ట్ చేశాయి. ప్ర‌కాశ్‌రాజ్ చిత్తుచిత్తుగా ఓడేందుకు కార‌ణ‌మ‌య్యాయి.   

ప్రియాంక దూకుడుతో కాంగ్రెస్ బలపడేనా?యూపీలో అద్భుతాలు జరిగేనా? 

ఉత్తర పదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పది సీట్లు గెలుచుకున్నా, గొప్పే, ఇది కాంగ్రెస్ శ్రేణులతో సహా అందిరిలో ఇప్పటికి ఉన్న అభిప్రాయం. తాజాగా, ఎబీపీ,సీ- ఓటర్ నిర్వహించిన సర్వే కూడా, కాంగ్రెస్ పార్టీ ఆరు శాతం ఓట్లు, మూడు నుంచి ఏడు వరకు సీట్లు వస్తే రావచ్చని తేల్చేసింది. అంటే, చాలా ఎక్కువ అనుకుంటే, కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లు ఏడని చెప్పింది.  అయితే ఇది లఖీంపూర్‌ ఖీరీ ఘటనకు ముందున్నపరిస్థితి ... కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా యూపీలోని లఖీంపూర్‌ ఖీరీవద్ద ఆందోళన చేస్తున రైతులపైకి,కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కాన్వాయ్’లోని వాహనం ఒకటి దూసుకు పోయి నలుగు రైతులు, అనంతర ఘర్షణలో మరో ఐదుగురు ప్రాణాలు పోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన తర్వాత యూపీ రాజకీయం మరో మలుపు తిరిగింది. ఈ దుర్ఘటనకు  కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు. ఆశిష్ మిశ్ర  కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ మిశ్ర జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ సంఘటన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే సంచలనం సృష్టించింది.   ఇంత ‘చక్కటి’ అవకాశాన్ని రాహుల గాంధీ, ప్రియాంక వాద్రా అంత ‘చక్క’గా ఉపయోగించుకో లేదని ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ అసంతృప్తి,ఆగ్రహం వ్యక్తం చేస్తే చేసి ఉండవచ్చును. ఆలాగే రాహుల్ గాంధీ ఎప్పటిలానే ఈ డ్రామాలోనూ గెస్ట్ ఆర్టిస్ట్’గానే మిగిలిపోవచ్చును. కానీ, ప్రియాంక వాద్రా వదిలేయలేదు. ఒక్కసారిగా, మొత్తం వ్య్వహారాని తమ గుప్పిటలోకి తీసుకున్నారు. దూకుడు పెంచారు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు ఉధృత కార్యాచరణకు పూనుకున్నారు. బీజీపీకే కాదు, ఎస్పీ, బీస్పీ సహా ఇతర పార్టీలకు కాకలు తీరిన  సీజన్ద్ పొలిటీషియన్స్ అనుకునే అఖిలేష్ యాదవ్, మాయావతికి కూడా ఝలక్ ఇచ్చారు.   అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ సొంత నియోజక వర్గం వారాణసీ నుంచి సమర శంఖం పూరించారు ప్రియాంక. ’కిసాన్ న్యాయ ర్యాలీ’ పేరిట ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ టార్గెట్’గా అస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్’ను వదిలి పెట్టలేదు. దేశ, విదేశాల్లో తిరిగే మోడీకి రైతులను పరామర్శించేందుకు పది నిముషాలు సమయం చిక్కలేదని ఎద్దేవా చేశారు.అంతే కాదు, ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అనిగర్జించారు. కేంద్ర మంత్రి రాజీనామ చేసే వరకు పోరాటం కొనసాగుతుందని, గట్టి శపధం చేశారు. అలాగే, ఇప్పటికే సుప్రీం కోర్టు సుమోటాగా విచారణ జరుపుతున్న లఖీంపూర్‌ ఖీరీ దుర్ఘటన విషయాన్ని రాష్టపతి రామ్ నాథ్ కొవింద్’కు విన్నవించి న్యాయం కోరతామని అన్నారు. ప్రతిజ్ఞా యాత్ర పేరిట 12 వేల కిలోమీటర్లు యాత్ర నిర్వహిస్తానని, మోడీ, యోగీ పాలనల బండారాన్ని బయట పెడతానని  ప్రకటించారు. ఇలా ప్రియాంక లఖీంపూర్‌ ఖీరీదుర్ఘటన ఆధారంగా సాగిస్తున్నరాజకీయ పోరాటం పుణ్యాన  యూపీఅసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంతోకొంత ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్నికలకు మరో నాలుగైదు నెలల సమయముంది. అందాకా ప్రియాంక దూకుడు కొనసాగితే, ఇంతవరకు అంటరని పార్టీగా చూస్తూ ఎవరూ దగ్గరకు కూడా రానీయని కాంగ్రెస్ పార్టీనే, రేపు ఎస్పీకో, బీఎస్పీకో ముద్దు రావచ్చును. కొత్త పొత్తు పొడవావచ్చును .. అదే జరిగితే, ప్రియాంక సారధ్యంలో కాంగ్రెస్ పునర్జీవన ప్రస్థానం ప్రారంభం కావచ్చును.. రాజకీయాల్లో ఏదైనా జరగ వచ్చును.

'అంధ‌'ప్ర‌దేశ్‌.. 'అదానీ'ప్ర‌దేశ్‌.. జ‌గ‌న్ చీక‌టి పాల‌న‌..

ఒక‌ప్పుడు స‌న్‌రైజ్ స్టేట్‌. ఇప్పుడు డార్క్ స్టేట్‌. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ అంధ‌కారం దిశ‌గా దూసుకుపోతోంది. రాష్ట్రాన్ని తీవ్ర విద్యుత్ కొర‌త వేధిస్తోంది. బొగ్గు నిల్వ‌లు నిండుకోవ‌డమే ఇందుకు కార‌ణ‌మ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. సీఎం జ‌గ‌న్ క‌మిష‌న్ల కక్కుర్తి వ‌ల్లే ఈ దుస్థితి అని ప్ర‌తిప‌క్షం మండిప‌డుతోంది. ఎవ‌రి వాద‌న ఎలా ఉన్నా.. అతిత్వ‌ర‌లోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చీక‌ట్లు క‌మ్ముకోనున్నాయ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే సాయంత్రం వేళ‌లో ఏసీలు వాడొద్దంటూ విద్యుత్‌శాఖ అధికారులు ఇప్ప‌టికే సూచించారు. ప‌వ‌ర్ సిస్ట‌మ్ మొత్తం కుప్ప‌కూల‌నుంద‌నే న్యూస్ ఏపీని షేక్ చేస్తోంది.   విద్యుత్ స‌మ‌స్య‌ల‌పై తాజాగా మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిందని.. అంధ‌ప్ర‌దేశ్‌గా మారింద‌ని అన్నారు, వచ్చే నెలలో అసలు ఏపీలో కరెంట్ కూడా ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్ అదానీప్రదేశ్‌గా మారిందని విమర్శించారు. ప్రతి ఆదివారం అదానీ తాడేపల్లి వచ్చి వెళ్తుంటారని చింతా మోహ‌న్ ఆరోపించారు.  రాష్ట్రంలో విద్యు దుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలు లేవని.. ఆర్టీపీపీ, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ వంటివి పనిచేసే స్థితుల్లో లేవంటూ ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీకి రాసిన లేఖపై విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఏపీలోని థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్ని మూసివేత దిశగా తీసుకెళ్లి, ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనాలనే దుర్మార్గపు ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపిస్తున్నాయి.  ఏపీలో బొగ్గు సరఫరా ఎందుకు లేకుండా పోయింది? ముందుచూపు లేకుండా బొగ్గు ఉత్పత్తి సంస్థలకు డబ్బు చెల్లించనందునే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందనేది విప‌క్షం వాద‌న‌. హిందూజాలు, కృష్ణపట్నం పవర్ ధర్మల్ ప్లాంట్లు 6 నెలలుగా విద్యుదుత్పత్తి నిలిపేయడానికి కారణం ఈ ప్రభుత్వం కాదా? ఆయా సంస్థల నుంచి విద్యుత్ కొనకుండా, కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి అధిక ధరకు విద్యుత్ కొంటున్నార‌ని ఇటీవ‌ల పీఏసీ ఛైర్మ‌న్‌ ప‌య్యావుల కేశ‌వ్ ఆరోపించారు. తాజాగా, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత చింతా మోహ‌న్ సైతం ఆంధ్రప్ర‌దేశ్‌.. అంధ‌ప్ర‌దేశ్‌, అదానీప్ర‌దేశ్‌గా మారిందంటూ విమర్శించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.   

ఆర్థిక కష్టాల్లో కరెంట్ కొనడమెలా? జగన్ రెడ్డి పాలనలో ఏపీకి చీకట్లేనా? 

ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ కు కరెంట్ గండం రాబోతోందా? రానున్న రోజుల్లో రాష్ట్రం అంధకారం కాబోతోందా? అంటే ప్రభుత్వ వర్గాలు, విద్యుత్ రంగ నిపుణుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరెంట్ కు కటకట ఏర్పడింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోవడంతో.. పవన్ ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. ఈ పరిస్థితి ఏపీలో మరీ దారుణంగా ఉంది. ఏపీలోని ఎనిమిది థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉత్పత్తికి గండం ఏర్పడింది. గతంలో మిగిలు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్.. రానున్న రోజుల్లో తీవ్ర సంక్షోభంలో పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో ఏపీకి పవర్ గండంతో పాటు ఆర్థిక కష్టాలు మరింతగా పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికంతటికి కారణం జగన్ రెడ్డి సర్కార్ విధానాలేననే ఆరోపణలు వస్తున్నాయి. విద్యుత్ పై గతంలో సీఎం జగన్ చేసిన ప్రకటనలను గుర్తు చేస్తూ.. గత రెండున్నర ఏండ్లుగా విద్యుత్ రంగంలో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ... జగన్ సర్కార్ ఎలాంటి తప్పులు చేసిందో వివరిస్తున్నారు విద్యుత్ రంగ నిపుణులు. 2019 మే 30వ తేదీన ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగంలో విద్యుత్ పై మాట్లాడారు” కరెంటు రేట్లు చూడండి. ఇతర రాష్ట్రాల్లో సోలార్, విండ్‌ పవర్‌ కోసం గ్లోబల్‌ టెండరింగ్‌ చేస్తూ యూనిట్‌ రూ.2.65కు, రూ.3కే అందుబాటులో ఉంటే, మన రాష్ట్రంలో ఎంతో తెలుసా? యూనిట్‌కు రూ.4.84తో నిన్నటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసింది. ఈ రకంగా దోచుకుంటున్న పరిస్థితి. అదే పీక్‌ అవర్స్‌ అయితే, దోచుకున్నది చాలదన్నట్టుగా అక్షరాల యూనిట్‌ రూ.6 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీ కళ్లెదుటకే తీసుకొచ్చి, ఈ రేట్లన్నీ పూర్తిగా తగ్గిస్తాను…” ఇది సీఎం జగన్ తన తొలి ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు. చెప్పినట్లుగానే సీఎం జగన్ పీపీఏలు రద్దు చేశారు. ఈ వ్యవహారాన్ని మాజీ చీఫ్ సెక్రటరీ.. చంద్రబాబు వద్దే  సీఎస్‌గా పని చేసి రిటైరన కల్లా అజేయరెడ్డి చూశారు.  విద్యుత్ రేట్లు భారీగా తగ్గాయని, ఈ పరిస్థితుల్లో ఎక్కువ రేట్లు పెట్టి విద్యుత్ కొనాల్సిన అవసరం లేదని వాదించారు. ఎలాంటి ఒప్పందాలు లేకుండానే యూనిట్‌ రూ.2.72కు అందిస్తామని.. కంపెనీలు ముందుకు వచ్చాయని.. పీపీఏలు అవసరం లేదన్నారు. కానీ రెండేళ్లు తిరిగే సరికి సీన్ మారిపోయింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ. ఇరవై పెట్టి యూనిట్ విద్యుత్ కొనాల్సిన పరిస్థితి ఏపీకి వచ్చింది. కొంతకాలంగా ప్రభుత్వం రూ.పది కన్నా ఎక్కువ రేటుకే కొనుగోలు చేస్తోంది. అందుకే ట్రూ అప్ చార్జీల భారం కూడా పడింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు  చేసిన ఎనిమిది వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంప్రదాయేతర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేశారు. కోర్టుల్లో కుదరకపోయినా కొనుగోలు మాత్రం ఆపేశారు. ఆ విద్యుత్ ధర యూనిట్‌కు నాలుగున్నర వరకూ ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం పవర్ ఎక్సైంజీల్లో రూ. ఇరవై పెట్టి కొంటోంది. పవర్ ఎక్సైంజీల్లో సెప్టెంబర్‌ 15 వరకు సగటున యూనిట్‌ రూ.4. 60 పైసలు ఉండగా ఇప్పుడు అది రూ.20కు చేరింది. బహిరంగ మార్కెట్‌లో డిమాండ్ సప్లయ్‌కు తగ్గట్లుగానే కరెంట్ చార్జీలు ఉంటాయి. ఏపీ సర్కార్ కొరత కారణంగా విద్యుత్‌ ఎక్స్చేంజ్‌ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొనుగోలు తప్పడంలేదు. ఓ వైపు ఆర్థిక కష్టాలు మరో వైపు చేసిన తప్పులు మీద పడటంతో ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది.  రెండు రోజుల క్రితం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఏపీ విద్యుత్ సంక్షోబంలో చిక్కుకుపోయిందని.. తక్షణం ఆదుకోవాలని కోరారు. ఏపీలోని 2,300 మెగావాట్ల గ్యాస్‌ విద్యుత్‌ ప్లాంట్లకు ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ సంస్థల నుంచి అత్యవసరంగా గ్యాస్‌ సరఫరా చేయాలన్నారు. ఏపీలో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతోందని దానికి తగ్గట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి బొగ్గు ఉండటం లేదన్నారు. ఏపీ విద్యుత్ సంస్థలు సామర్థ్యం మేర విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదని సగం మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని ప్రధానికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 8 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు బొగ్గు ఆధారిత ప్లాంట్లతో ఉన్న ఒప్పందాలను వినియోగించుకోలేకపోతున్నామని దీని వల్ల ప్రతి రోజూ 40 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తుండగా.. దాని ధర ఇప్పుడు మూడు రెట్లు పెరిగిందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ 15 వరకు సగటున యూనిట్‌ రూ.4.6 ఉండగా, అక్టోబర్‌ 8 నాటికి రూ.15కు చేరిందని కొన్ని సందర్భాల్లో విద్యుత్‌ కొనుగోలుకు యూనిట్‌కు రూ.20 చెల్లించాల్సి వస్తోందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏం చేయాలో కూడా లేఖలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చారు. ఏపీలోని విద్యుత్ కేంద్రాలకు 20 బొగ్గు ర్యాక్స్‌ను కేటాయించాలని కోరారు. ప్రధాని మోడీకి సీఎం జగన్ రాసిన లేఖతో రాబోయే కాలంలో కరెంట్ కోతలకు.. వాతలకు సూచనగా ఎక్కువ మంది భావిస్తున్నారు. అధిక ధరను పెట్టి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామంటే ఆ భారం ప్రజలపై వేయడానికేననని భావిస్తున్నారు.  

విచ్చిన్నకారులకు తగిన గుణపాఠం.. మా ఫలితంపై బండి సంజయ్ సంచలనం

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నిక‌ల ఫలితాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారని ఆయ‌న ట్వీట్ చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే గుంపున‌కు మద్దతు పలికిన వారికి సరైన గుణపాఠం చెప్పారన్నారు. జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన మా ఓటర్లకు ధన్యవాదాలు అంటూ ఆయ‌న కామెంట్ చేశారు.   మా విజేతలకు బండి సంజయ్ అభినందనలు తెలిపారు. మంచు విష్ణు, ప్ర‌కాశ్ రాజ్ ప్యానళ్ల విజేతలకు బండి సంజ‌య్‌ శుభాకాంక్షలు తెలిపారు. మా ఎన్నిక‌ల్లో ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని తెలంగాణ‌, ఆంధ్రప్ర‌దేశ్‌ రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎదురుచూశారని బండి సంజయ్ ట్వీట్ చేశారు.  

పవన్ కల్యాణ్ గంగిరెద్దు! రెచ్చిపోయిన ఏపీ మంత్రి..

ఆంధ్రప్రదేశ్ లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వ్యక్తిగత దూషణలు ఆపడం లేదు ఇరు పార్టీల నేతలు. జనసేన చీఫ్ టార్గెట్ గా ఏపీ మంత్రులు దాడి కొనసాగిస్తున్నారు. తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోఉండే కొడాలి నాని మరోసారి రెచ్చిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా అడ్రస్ లేదన్నారు కొడాలి నాని. భవిష్యత్ లోనూ ఉండదని హెచ్చరించారు. 'జగన్ మిమ్మల్ని చీల్చి చెండాడుతాడు' అంటూ కొడాలి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిన చేసిన చంద్రబాబు.. స్థానిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారన్నారు నాని. బద్వేలు ఉప ఎన్నిక నుంచి పారిపోయాడన్నారు. పద్నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు.. తానిచ్చిన ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేని దద్దమ్మగా కొడాలి నాని విమర్శించారు. లోకేశ్ పై నమ్మకం లేకే  దత్తపుత్రుడు పవన్ వైపు చంద్రబాబు చూస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు చేతిలో పవన్ గంగిరెద్దు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. టీడీపీని జనసేనలో విలీనం చేస్తే మంచిదని సూచించారు. చంద్రబాబు, పవన్ కలిసి ఎన్ని నాటకాలు ఆడినా.. కుట్రలు చేసినా.. యువ సింహం జగన్ ను ఏమీ చేయలేరన్నారు.  ఏ రాజకీయ పార్టీ అయిన బలహీన వర్గాలకు అండగా ఉంటుందని.. పవన్ మాత్రం కమ్మ సామాజిక వర్గానికి అండగా ఉంటానని చెప్పారని కొడాలి నాని అన్నారు. ఐటీ శాఖకు పన్నులు ఎగ్గొట్టి హెరిటేజ్ లో డబ్బులు పెట్టారని.. లేకుంటే రెండు ఎకరాల చంద్రబాబుకు రూ.2వేల కోట్లకు ఎలా ఎదిగారంటూ ప్రశ్నించారు. డ్రగ్స్ ను తీసుకునేది బాబు కుటుంబమేనని.. జగన్ మీద ఎన్ని నిందలు వేసినా.. నిరూపించటం సాధ్యం కాదన్నారు. మాఫియాతో సంబంధాలు ఉండేవి చంద్రబాబుకేనని.. ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఉత్తరాంధ్ర నుంచి గంజాయి స్మగ్లింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు కొడాలి నాని.  డ్వాక్రా సంఘాల విషయంలోనూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని నాని మండిపడ్డారు. పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలోనే డ్వాక్రా సంఘాల్ని ఏర్పాటు చేశారని చెప్పారు. వైఎస్సార్ హయాంలో ఆ సంఘాలకు పావలా వడ్డీ రుణాల్చి ప్రోత్సహించారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా  సంఘాలకు వెన్నుపోటు పొడిని వారి సొమ్ముల్ని దోచుకున్నారని ఆరోపించారు. మహిళల దృష్టిలో చంద్రబాబు మోసగాడిగా నిలిచిపోతాడన్నారు.   

‘మా’లో ముందంజ‌.. క‌డ‌ప బాంబు విసిరిన చంద్ర‌బాబు.. టాప్ న్యూస్ @ 7pm

1. ‘మా’ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మంచు విష్ణు ప్యానెల్ ముందంజలో ఉంది. పోలైన ఓట్లలో 50 చెల్లనివిగా ఈసీ నిర్ధారించారు. ఈసారి రికార్డు స్థాయిలో 75శాతం పోలింగ్ జరిగింది. మురళీ మోహన్, మోహన్ బాబు సమక్షంలో కౌంటింగ్ సాగుతోంది. గెలుపుపై ప్ర‌కాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానెళ్లు ఎవరికివారు ధీమాగా ఉన్నారు. ప్ర‌స్తుతానికి ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ స‌భ్యులు ముందున్నారు.  2. మా ఎన్నిక‌ల సంద‌ర్భంగా శివబాలాజీ చేతిని హేమ కొరికారు. చికిత్స కోసం శివబాలాజీ నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నట్లు శివబాలాజీ తెలిపారు. హేమ తన చేతికి ఎందుకు కొరికిందో తనకు తెలీద‌న్నారు. శివబాలాజీ ఒకరిని కొట్టబోతుంటే తాను ఆపడానికి వెళ్లానని.. ఆయన తనను అడ్డుకోవడంతో కొరికినట్లు చెప్పారు. ఏదో చేయకపోతే ఊరికే కొరుకుతారా? అని హేమ అన్నారు.  3. ‘‘రాజకీయ లబ్ధి కోసం నటీనటులను వాడుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ గెలిచినా, మంచు విష్ణు గెలిచినా ఈ విషయంపై దృష్టి పెట్టాలి. రాజకీయాల కోసం ఆర్టిస్టులను సతాయించడం మానేయాలి అని కోరుతున్నా.’’ అని న‌టి పూనమ్ కౌర్ అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ పోసాని ఎపిసోడ్‌లో ఇటీవ‌ల వార్త‌ల్లో నిలిచిన పూన‌మ్‌కౌర్ ఇలాంటి కామెంట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.  4. కడప నుంచి ఇతర ప్రాంతాలకు విమాన సర్వీసులను పునరుద్ధరించాలంటూ సీఎం జగన్‌కు టీడీపీ అధినేత‌ చంద్రబాబు లేఖ రాశారు. ప్రాథమిక, పారిశ్రామిక సేవా రంగాల అభివృద్ధికి రవాణా సౌకర్యాలు అత్యంత కీలకమని అన్నారు. త‌న హ‌యాంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, తిరుపతి నుంచి కడపకు నేరుగా విమాన సర్వీసులు ఏర్పాటు చేసిన విషయం గుర్తు చేశారు.  5. సీఎం జగన్‌కి పవర్‌ ఇస్తే ప్రజలకు కరెంట్‌ లేకుండా చేశారని టీడీపీ నేత పట్టాభి దుయ్యబట్టారు. జగన్ రివర్స్ గేర్ పాలనలో త్వరలోనే ప్రజలు లాంతర్లు పట్టుకొని తిరగడం ఖాయమన్నారు. విద్యుత్ శాఖలో ఏం జరుగుతోందో ఆ శాఖా మంత్రి బాలినేనికి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. బొగ్గునిల్వలు లేవని కేంద్రానికి కుంటిసాకులు చెబుతారా? రాష్ట్రంలో బొగ్గు నిల్వలు లేకపోవటానికి సీఎం కారణం కాదా? అని పట్టాభి ప్రశ్నించారు. 6. సీఎం పీఠం ఎక్కేవరకూ ఒకమాట.. ఆ తర్వాత మరోకలా సామాన్యులకు ఎటువంటి ఉపయోగం లేకుండా పరిపాలన సాగిస్తున్నారని సీఎం జ‌గ‌న్‌ను జ‌న‌సేన నాయ‌కులు నాదేండ్ల మ‌నోహ‌ర్‌ విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కనీవినీ ఎరుగని రీతిలో ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఏపీలో జరుగుతున్న అవినీతి.. వ్యాపారవేత్తలను బెదిరించి వసూళ్లు చేయటం.. వారు రాష్ట్రం విడిచి వెళ్లిపోయేలా చేస్తున్న తీరు గురించి.. దారుణ‌మ‌న్నారు. రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాల విషయంలో ఎవరిని ప్రశ్నించాలన్నా ప్రభుత్వ యంత్రాంగమే దాడి చేస్తుందని భయపడాల్సిన పరిస్ధితి ఏర్పడిందని నాదేండ్ల మండిప‌డ్డారు.   7. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు హుజురాబాద్ ఎన్నికలే అన్నారు ఎమ్మెల్యే సీత‌క్క‌. అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీనేన‌ని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్‌తో అభివృద్ధి, వసతులు కల్పించిన పార్టీ అని.. ఇప్పుడు అప్పుల పాలు, నష్టాల్లో ఉన్న రాష్ట్రం మనదని దుయ్య‌బట్టారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని సీత‌క్క‌ కోరారు.  8. రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి కూడా అసంతృప్తితో ఉన్నాడని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత‌లు అన్నారు. పీఆర్సీ, డీఏ కాదు కదా కనీసం, దహన సంస్కారాల ఖర్చులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.  పదవీ విరమణ చేసిన వారు బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదన్నారు. సమస్యలపైన ఎవరిని కలిసినా ప్రయోజనం ఉండటం లేదన్నారు. ప్రభుత్వ౦ సమస్యలు పరిష్కరించకపోతే జనవరి నుండి పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.  9. టీటీడీ అధికారులపై రమణదీక్షితులు విమర్శలు చేశారు. పద్మావతి ఆలయంలో వంశపారంపర్య అర్చకులను నియమించారు కానీ ఏప్రిల్ నుంచి సంభావనలను ఇవ్వడం లేదన్నారు. శ్రీవారి గర్భాలయంలోకి ప్రవేశించలేక.. పూజా కైంకర్యాలు నిర్వహించలేకపోతున్నామని చెప్పారు. సమస్యల నుంచి వెంటనే అర్చకులకు ఉపశమనం కలిగించాలని సూచించారు.  10. ఇంద్రకీలాద్రిపై భక్తులు రద్దీ భారీగా ఉంది. దుర్గగుడిలో రాజకీయ నాయకులు, వారి బంధువుల సేవలో ఆలయ అధికారులు, పోలీసులు తరిస్తున్నారు. సామాన్యులకు అమ్మదర్శనం క‌ష్టంగా మారింది. దొంగపాస్‌లతో వీఐపీ దర్శనం చెయ్యిస్తున్నట్లు భ‌క్తులు ఆరోపిస్తున్నారు. క్యూ లైన్‌లో శానిటైజేష‌న్ కూడా చేయ‌డం లేద‌ని మండిప‌డుతున్నారు.    

కడప నుంచి విమాన సర్వీసులు నడపండి! సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప. గత టీడీపీ హయాంలో కడప విమానాశ్రయాన్ని అధునీకరించారు. 2018లో కడప ఎయిర్ పోర్టు నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే కొన్ని రోజులుగా కడప నుంచి విమాన సర్వీసులు నడవడం లేదు. దీంతో వ్యాపారులు, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం జగన్ సొంత గడ్డ నుంచే విమాన సర్వీసులు ఆగిపోవడంపై జనాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కడప విమానాశ్రయం నుంచి సర్వీసులు నిలిచిపోవడంతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు.. ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు.  టీడీపీ హయాంలో టయర్ 2, టయర్ 3 నగరాల మధ్య విమాన సర్వీసులను ఏర్పాటు చేశామని, అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఉడాన్ స్కీమ్ ను అమలు చేశామని తన లేఖలో చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, తిరుపతి నుంచి కడపకు విమాన సర్వీసులుండేవని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు సర్వీసులు ఆగిపోయాయన్నారు. కడప నుంచి వేరే ప్రాంతాలకు విమానాలను నడపాలని కోరుతూ సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ రాశారు. గతంలో కడప నుంచి హైదరాబాద్, విజయవాడకు విమానంలో వెళ్లాలంటే తిరుపతి, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సి వచ్చేదని చంద్రబాబు గుర్తు చేశారు. దాని వల్ల సమయం వృథా అయ్యేదని, ఖర్చు కూడా ఎక్కువేనని చెప్పారు. ఆ ఇబ్బందులను తప్పించేందుకే 2018లో కడప నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులను టీడీపీ ప్రభుత్వం మొదలుపెట్టిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కడప నుంచి విమాన సర్వీసులను నిలిపేశారని, దీంతో వ్యాపారులే కాకుండా సామాన్య ప్రయాణికులూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు, వీలైనంత త్వరగా కడప నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరించాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

దీక్ష‌లో బండి సంజ‌య్‌.. ఈట‌ల ఆగ‌మేనా? క‌మ‌లంలో కిరికిరి న‌డుస్తోందా?

శ‌ర‌న్న‌వ‌రాత్రి సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ అమ్మ‌వారి దీక్ష చేస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు సాగే దీక్ష‌తో పూర్తిగా దుర్గామాత సేవ‌లో ఉండ‌నున్నారు. మామూలుగానైతే ఇదేమంత ప్ర‌త్యేక‌మైన విష‌యం కాదు కానీ.. ఈ నెలాఖ‌రున హుజురాబాద్ ఉప ఎన్నిక ఉన్న నేప‌థ్యంలో బండి చేస్తున్న దీక్ష రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగా మారింది. ఆయ‌నేమీ ఈట‌ల గెల‌వాల‌ని ఈ దీక్ష చేయ‌డం లేదు. కీల‌క‌మైన హుజురాబాద్ ఎన్నిక‌ల స‌మ‌యంలో.. ఏకంగా తొమ్మిది రోజుల పాటు దీక్ష‌లో ఉండ‌టం.. హుజురాబాద్ ప్రచారానికి దూరమ‌వ‌డం.. రాజ‌కీయంగా కలంక‌లం రేపుతోంది. ఓవైపు అధికార టీఆర్ఎస్‌ ప్ర‌చారంతో హోరెత్తిస్తుంటే.. బీజేపీ అధ్య‌క్షులే హుజురాబాద్‌కు వెళ్ల‌కుండా.. అమ్మ‌వారి దీక్ష చేప‌ట్ట‌డం ఈట‌ల రాజేంద‌ర్‌కు ఇబ్బందిగా మారిందంటున్నారు. పార్టీలో ఈట‌ల ఒంట‌రిగా మిగిలార‌ని చెబుతున్నారు. బీజేపీ బ‌డా నాయ‌కులెవ‌రూ ఆయ‌న‌కు అంత‌గా స‌హ‌క‌రించడం లేదంటున్నారు. ఈట‌ల‌ను బీజేపీలోకి తీసుకు రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన వివేక్ వెంకటస్వామి సహా అగ్ర‌నేత‌లంతా అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు.  నామినేషన్ రోజున బండి సంజయ్, కిషన్ రెడ్డి మాత్రం హాజరయ్యారు. లేదంటే అధిష్టానం ద‌గ్గ‌ర‌ వారికే ఇబ్బంది. ఇక అంతే. ఆ త‌ర్వాత పెద్ద స్థాయి నేత‌లెవ‌రూ అటువైపు వెళ్ల‌డం లేదు. నామినేష‌న్ల ప‌ర్వం ముగిసినా.. ఈట‌ల‌కు మ‌ద్ద‌తుగా క‌మ‌ల‌నాథులు క్యూ క‌ట్ట‌డం లేదు. అస‌లే, కొవిడ్‌ కారణంగా బహిరంగసభలు, ర్యాలీలను ఈసీ నిషేధించింది. దీంతో అమిత్‌షా, న‌డ్డాలాంటి జాతీయ స్థాయి నేత‌లు వ‌స్తారో రారో అనే డౌట్‌. వాళ్లు వ‌చ్చినా రాక‌పోయినా.. ఈ ఇర‌వై రోజులైనా బండి సంజ‌య్‌, కిష‌న్‌రెడ్డి, వివేక్‌, డీకే అరుణ లాంటి లీడ‌ర్లు హుజురాబాద్‌లో మ‌కాం వేసి.. ఈట‌ల‌కు మ‌ద్ద‌తుగా గ‌ట్టి ప్ర‌చారం చేస్తే అభ్య‌ర్థికి ప్ర‌యోజ‌నం. కానీ, అధ్య‌క్ష‌లు బండి సంజ‌య్ ఇలా దీక్ష పేరుతో దూర‌మ‌వ‌డం.. మిగ‌తా నేత‌లూ హుజురాబాద్‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డం అనుమానాస్ప‌దం అవుతోంది.  కేసీఆర్ ఢిల్లీ టూర్ త‌ర్వాత బీజేపీలో మార్పు క‌నిపిస్తోందని అంటున్నారు. హుజురాబాద్ ఎన్నిక‌కు జాతీయ నాయ‌క‌త్వం పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌టం లేద‌ని తెలుస్తోంది. ఢిల్లీ మ‌న‌సెరిగిన రాష్ట్రస్థాయి నేత‌లు ఆ మేర‌కు దూకుడు త‌గ్గించార‌ని అనుమానిస్తున్నారు. మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈట‌ల రాజేంద‌ర్ ఆగ‌మ‌య్యార‌ని అంటున్నారు.  పోలింగ్‌ కేంద్రాల వారీగా సీనియర్‌ నాయకులను ఇన్‌చార్జ్‌లుగా నియమించాల‌ని బీజేపీ భావిస్తోంది. ఆ ఇంఛార్జిల‌ను నియ‌మించాల్సిన బండి సంజ‌య్ దీక్ష పేరుతో.. దసరా త‌ర్వాత హుజురాబాద్ విష‌యం చూద్దామ‌ని అంటున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే, ఈట‌ల పూర్తిగా త‌న సొంత బ‌లం మీద‌నే ఆధార‌ప‌డుతున్నారు. బీజేపీని కాకుండా త‌న‌ను తానే న‌మ్ముకుంటున్నారు. త‌న అనుచ‌రుల‌తోనే ప్ర‌చారం చేస్తున్నారు. అన్నిర‌కాలుగా ఇబ్బంది పెడుతున్న అధికార పార్టీ దూకుడును, హ‌రీష్‌రావు వ్యూహాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు కాచుకుంటూ.. హుజురాబాద్ బ‌రిలో ఒంట‌రి పోరాటం చేస్తున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌. ఈ ధ‌ర్మ‌యుద్ధంలో గెలుపు త‌న‌దేన‌ని ధీమాగా చెబుతున్నారు. 

సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌పై వేటు త‌ప్ప‌దా? కేంద్రం ఫైన‌ల్ వార్నింగ్‌..

ఎంపీ ర‌ఘురామ‌తో పెట్టుకున్నోళ్లు ఎవ‌రూ ప్ర‌శాంతంగా ఉండేలా లేరు. క‌స్ట‌డీ పేరుతో థర్డ్ డిగ్రీ ప్ర‌యోగించిన పాప‌మో.. ర‌ఘురామ రివేంజో.. కార‌ణం ఏదోకానీ.. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌కు కేంద్రం త‌ర‌ఫున ఉచ్చు గ‌ట్టిగానే బిగిసుకుంది. ఆ మెడ‌కు చుట్టుకున్న‌ ఉచ్చు నుంచి ఎంత‌గా త‌ప్పించుకోవాల‌ని చూస్తున్నా.. సునీల్‌కు జ‌గ‌న‌న్న ర‌క్ష‌, దీవ‌న ఎంత‌గా ఉన్నా.. కేంద్ర హోంశాఖ మాత్రం ఆయ‌న్ను అంత ఈజీగా వ‌దిలిపెట్ట‌డం లేదు. సీఐడీ బాస్ సునీల్‌కుమార్‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారంటూ మ‌రోసారి కేంద్ర హోంశాఖ ఏపీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీసింది. ఆ మేర‌కు మ‌రోసారి లేఖ రాసింది. సునీల్‌ కుమార్‌ సతీమణి అరుణ తెలంగాణ సీఐడీ విభాగానికి చేసిన ఫిర్యాదు, అక్కడ నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నుంచి వచ్చిన లేఖను రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రేవు ముత్యాలరాజు.. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు పంపించారు. ఈ వ్యవహారంలో నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి డీజీపీకి సూచించారు.   గతంలో కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన లేఖలు.. వాటికి జత చేస్తూ వచ్చిన ఫిర్యాదు లేఖలపై ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర హోంశాఖ నుంచి ఒత్తిడి వ‌స్తుండ‌టంతో.. ప్ర‌భుత్వం ఫైల్‌ను ముందుకు కదిలించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌చ్చింది. సునీల్‌కుమార్ ఎంత‌గా త‌మ‌కు కావ‌ల‌సిన అధికారి అయిన‌ప్ప‌టికినీ.. కేంద్రం క‌న్నెర్ర చేయ‌డంతో త‌దుప‌రి చ‌ర్య‌లు త‌ప్ప‌వంటున్నారు. అందుకే, సునీల్‌పై చర్యల విషయంలో వెంట‌నే నిర్ణయం తీసుకోవాలంటూ ఫైల్‌ను డీజీపీకి పంపించారు.  ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సునీల్‌కుమార్‌ కీలకమైన సీఐడీ చీఫ్‌ బాధ్యతల్లో ఉండటానికి వీల్లేదంటున్నారు. కేసు దర్యాప్తు పూర్తయి.. సచ్చీలుడుగా నిరూపించ‌బ‌డితేనే.. కీలక పోస్టులో ఉండ‌టానికి అర్హుడు. అయితే, ఆయనకు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు పుష్క‌లంగా ఉండటంతో సీఐడీ చీఫ్ హోదాలో జ‌గ‌న్‌కు న‌మ్మిన బంటుగా ఉన్నారు. ముఖ్య‌మంత్రిని ఇంప్రెస్ చేయ‌డానికే.. ర‌ఘురామ అరెస్ట్, క‌స్ట‌డీ విష‌యంలో విప‌రీతంగా స్పందించార‌ని అంటారు. ర‌ఘురామ ఆరోపిస్తున్న‌ట్టు.. ఆయ‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించినందుకు పాల‌కులు సునీల్‌కుమార్‌పై మ‌రింత ప్రేమ ఒల‌క‌బోస్తున్నారు. అందుకే కాబోలు, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తినా.. కేంద్రం సైతం సునీల్‌కుమార్‌పై త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించినా.. ఆయ‌న్ను సీఐడీ చీఫ్ పోస్ట్ నుంచి కదపడం లేదు. సీఐడీ చీఫ్‌గా.. ప్ర‌తిప‌క్షంపై కుట్ర‌లు, కేసులు, ఆఖ‌రికి సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపైనా వేధింపులకు పాల్ప‌డుతూ.. విధి నిర్వహణలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్‌కుమార్‌కు స‌ర్కారు కొమ్ముకాస్తోంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే.. డీజీపీ కంటే కూడా సీఐడీ చీఫే ఏపీలో ఎక్కువ ప‌వ‌ర్‌ఫుల్ అనే విమ‌ర్శ కూడా ఉంది. ఇప్పుడు కేంద్రం ఒత్తిడి చేయ‌డంతో.. సునీల్‌కుమార్‌పై చ‌ర్య‌లు తీసుకునే బాధ్య‌త‌ను ప్ర‌భుత్వం డీజీపీకి క‌ట్ట‌బెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి, పోలీస్ బాస్‌.. సూప‌ర్ బాస్‌గా చెలామ‌ని అవుతున్న సీఐడీ చీఫ్‌పై ఎలాంటి యాక్ష‌న్ తీసుకుంటారో చూడాలి..  

ఏసీలు ఆపేయాల‌ట‌.. ఇదేమి ఖ‌ర్మ జ‌గ‌న‌న్న‌..!

ఆర్థిక క‌ష్టాలు చాల‌వ‌న్న‌ట్టు.. క‌రెంట్ క‌ష్టాలు ఏపీని అత‌లాకుత‌లం చేస్తున్నాయి. ఓవైపు ఫుల్లుగా వాన‌లు ప‌డుతున్నా.. మ‌రోవైపు ఎండాకాలం మాదిరి క‌రెంట్ కోత‌లు ఇబ్బంది పెడుతున్నాయి. స‌మ్మ‌ర్‌లో అంటే విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంటుంది.. జ‌ల విద్యుత్ ఉత్పాద‌న త‌గ్గుతుంది కాబ‌ట్టి.. ప‌వ‌ర్ క‌ట్స్ ఉంటాయంటే అర్థం ఉంది. మ‌రి, మునుపెన్న‌డూ లేన‌ట్టు అక్టోబ‌ర్‌లో ఈ క‌రెంట్ కోత‌లేంటి జ‌గ‌న‌న్న అంటూ ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. జ‌గ‌న్ స‌ర్కారు చెబుతున్న కార‌ణం.. బొగ్గు కొర‌త‌. బొగ్గు కొర‌త వ‌ల్ల ధ‌ర్మ‌ల్ విద్యుత్ ఉత్ప‌త్తి ప‌డిపోయి.. క‌రెంట్ క‌ష్టాలు వ‌చ్చాయ‌నేది ప్ర‌భుత్వం వాద‌న‌. ప్ర‌స్తుత స‌మ‌స్య‌.. జ‌గ‌న్ నిర్వాకం వ‌ల్లేన‌నేది ప్ర‌తిప‌క్షం విమ‌ర్శ‌. క‌మిష‌న్ల కోసం ప్ర‌ముఖ కంపెనీల నుంచి బొగ్గు, విద్యుత్ కొన‌కుండా కుట్ర‌లు చేసి.. ఇప్పుడు చేతులెత్తేస్తోంద‌ని అంటోంది. త‌మ త‌ప్పేమీ లేద‌న్న‌ట్టు ప్ర‌ధాని మోదీకి లేఖ రాసి.. బొగ్గు స‌మ‌స్య‌ను బూత‌ద్దంలో పెట్టి చూపిస్తోంద‌ని త‌ప్పుబ‌డుతోంది. ప‌క్క రాష్ట్రం తెలంగాణ‌లో లేని ప్రాబ్ల‌మ్‌... ఏపీకే ఎందుకొచ్చింద‌నేది టీడీపీ క్వ‌శ్చ‌న్‌. ఎప్ప‌టిలానే ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర స‌మాధానం లేక‌పోగా.. తాజాగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఆదేశాలు ఇచ్చింది ఏపీ విద్యుత్‌శాఖ‌. అదేంటంటే.... ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్ర‌జ‌లు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వ‌ర‌కు ఏసీలు వాడొద్దని సూచన చేశారు. ఈ స్టేట్‌మెంట్ విని అంతా అవాక్క‌వుతున్నారు. ఇదేంటి.. ఇదేమైనా ఎండాకాల‌మా.. పీక్ అవ‌ర్స్‌లో క‌రెంట్ డిమాండ్ అధికంగా ఉండ‌టానికి? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఏసీలు వాడ‌క‌పోతే.. షాపింగ్ మాల్స్‌, మెడిక‌ల్ షాప్స్‌, సినిమా థియేట‌ర్స్‌.. ఇలా గిరాకీ అధికంగా ఉండే ఈవెనింగ్ టైమ్‌లో వ్యాపార‌సంస్థ‌లు ఇబ్బంది ప‌డ‌తాయ‌ని వాపోతున్నారు.  ఏపీలో విద్యుత్తు డిమాండ్- సరఫరా మధ్య అంతరం ఎక్కువగా ఉందని.. అందుకే సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏసీల్ని వినియోగించొద్దని అంటున్నారు అధికారులు. గత ఏడాదితో పోలిస్తే ఏపీలో విద్యుత్ డిమాండ్ 20 శాతం పెరిగిందని.. కొవిడ్ కు ముందు అక్టోబరులో రోజుకు 160 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా.. ఇప్పుడు 195 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉందన్నారు. బొగ్గు కొరత కారణంగా థర్మల్ ప్లాంట్లలో 40 మిలియన్ యూనిట్ల మేర ఉత్పత్తి తగ్గిందని.. పవన్ విద్యుత్తు రెండు.. మూడు మిలియన్ యూనిట్లకు మించి రావటం లేదని చెబుతున్నారు. ఈ కొరతను తగ్గించుకోవటం కోసం ఏసీలు అందరూ వాడటం ఆపేస్తే.. 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందనేది అధికారుల వాద‌న‌.  ఇక డిమాండ్, కొర‌త‌ పెర‌గ‌డంతో.. విద్యుత్ కొనుగోలు రేటు కూడా బాగా పెరిగిందట‌. సెప్టెంబరు 16న యూనిట్ కు రూ.4.60 ఉన్న ధర.. ఇప్పుడు ఏకంగా రూ.9.40కు చేరుకుందని.. అక్టోబరు ఆరో తేదీకి ఇది  రూ.14 అవుతుంద‌ని చెబుతున్నారు. అందుకే ప్రజలు వీలైనంత వరకు విద్యుత్ వినియోగం తగ్గించాలని అధికారులు సూచిస్తున్నారు. అస‌లే అప్పుల రాష్ట్ర‌మైన ఏపీ.. ఇంతేసి ధ‌ర‌లు పెట్టి క‌రెంట్ కొన‌డం త‌ల‌కుమించిన భారంగా మారుతోంది. పాల‌కులు చేసిన త‌ప్పుల‌కు ఇప్పుడిలా ప్ర‌జ‌లు అవ‌స్థ‌లు ప‌డాల్సి వ‌స్తోంది. ఇదంతా స‌రేకానీ, మ‌రి, ఇవే స‌మ‌స్య‌లు మ‌న పక్క రాష్ట్రాలైన తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌లో ఎందుకు లేవు? ఒక్క ఏపీలోనే ఎందుకీ క‌రెంట్ కోత‌లు? అని ప్ర‌శ్నించుకుంటే చాలు.. సీఎం జ‌గ‌న్ పాల‌నా సామర్థ్యం ఏపాటిదో ఇట్టే అర్థ‌మైపోతుంద‌ని అంటున్నారు.  న్నారు. అలా కాని పక్షంలో ఫ్యూచర్ లో సర్దుబాటుఛార్జీల పేరుతో భారం తప్పదన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది. సో.. ఏపీ ప్రజలు బుద్ధిగా విద్యుత్ వినియోగం విషయంలో ఆచితూచి అన్నట్లు వాడాల్సిన సమయం వచ్చేసిందన్న మాట.  

మా ఎన్నికల్లో ఫైటింగ్.. అమరావతి రైతుల మహాయాత్ర...టాప్ న్యూస్@ 1PM

ఏపీ రాజధాని అమరావతి కోసం 'రైతు' మహా పాదయాత్ర ప్రారంభమైంది. 50 రోజులపాటు 400 కిలోమీటర్లు మేర నిర్విరామంగా పాదయాత్ర  సాగనుంది. తుళ్ళూరు న్యాయస్థానం నుంచి తిరుమల శ్రీవారి దేవస్థానం వరకు రైతుల పాదయాత్ర జరుగుతుంది.డిసెంబర్ 17కి సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రకటన చేసి రెండేళ్లు అవుతుంది. అదే రోజు రైతులు తిరుపతి చేరుకుని భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.  ------- విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ  వినుకొండ మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు వినూత్న నిరసన చేపట్టారు. శావల్యాపురం మండలం శానంపూడి ఎస్సీ కాలనీలో పర్యటిస్తున్న జీవీ... విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఒక లైట్, ఒక ఫ్యాన్ ఉన్న గుడెసెకు రూ.49 వేలు బిల్లు వచ్చిందని  బాధితురాలు వాపోయింది. కరెంట్ బిల్లులు చెల్లింపు కోసం జగన్ రెడ్డి బ్యాంకులో లోన్లు ఇవ్వాలని జీవీ ఆంజనేయులు నినాదాలు చేశారు.  -----  విశాఖలో అన్ని ఆస్తులు అమ్మేస్తున్నారని...శ్మశానంలో పరిపాలన రాజధాని పెడతారా? అని సీపీఐ రామకృష్ణ ప్రశ్నించారు. పరిపాలన రాజధాని పేరుతో విశాఖను దగా చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్ధిక మంత్రిని...అప్పుల మంత్రిగా మార్చేశారన్నారు. టీడీపీ, వైసీపీ అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని ఎంపీలు ఒక్కసారి అయిన పీఎం దగ్గరకు వెళ్లారా? అని నిలదీశారు. ------- జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీ ఉన్న నివాసంలో సోదాలు చేసింది. గుజరాత్‌లోని ముంద్రాపోర్టులో ఇటీవల పెద్ద ఎత్తున పట్టుబడిన హెరాయిన్‌తో విజయవాడకు సంబంధాలు ఉన్నట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే చెన్నై, కోయంబత్తూరులోనూ తనిఖీలు నిర్వహించారు. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీ చిరునామాతో వచ్చిన కంటెయినర్లను ముంద్రా పోర్టులో పట్టుకున్నారు.  --- జనసేన అధినేత పవన్‌పై సీపీఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంటు ఉద్యమానికి పవన్ మద్దతు ఇవ్వడమంటే.. బ్లఫ్ చేయడమే అని అన్నారు. ప్రైవేటీకరణ చేయవద్దని మిత్ర పక్షమైన బీజేపీని పవన్ గట్టిగా అడగాలన్నారు. స్టీల్ ప్రైవేటీకరణను మోదీ మాత్రమే అపగలరని...జగన్ చేతిలో ఏమీలేదని వ్యాఖ్యానించారు. ఏపీకి బీజేపీ పక్కా నష్టం కలిగిస్తోందన్నారు. రైతులు చంపిన పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. -- ఇంద్రకీలాద్రిపై 300 రూపాయల‌ టికెట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ దర్శనంతో సమానంగా 300 రూపాయల దర్శనం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నడవలేని వారి కోసం తీసుకునే 300 రూపాయల టికెట్టుకు కూడా ఫ్రీ దర్శనంతో సమానంగా దర్శనం కల్పిస్తున్నారని ఆరోపించారు. వీఐపీలకు పెద్దపీట వేస్తూ, సామాన్య భక్తులను అధికారులు పట్టించుకోవడం లేదంటూ భక్తులు ఆవేదన చెందుతున్నారు -- దసరా పండుగలకు వెళ్తున్న ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. దసరా సందర్భంగా టీఎస్ఆర్టీసీలో పెంచిన అదనపు చార్జీలను ఎత్తివేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పుడు ఉన్న సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికులపై అదనపు భారం వద్దని, ఇప్పటి వరకు తీసుకున్న రిజర్వేషన్ల టికెట్లు, అదనపు చార్జీలను వెనక్కి తీసుకోవాలని సజ్జనార్ ఆదేశించారు. -- జోగులాంబ గద్వాల: జిల్లాలోని అయిజ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున వర్షానికి నివాస గుడిసె కూలింది. ఈ ప్రమాదంలో గుడిసెలో నిద్రిస్తున్న ఏడుగురు వ్యక్తుల్లో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిదండ్రులతో పాటు ముగ్గురు అక్కడికక్కడే సజీవ సమాధి కాగా, మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు.  ----- దేశ రాజధాని ఢిల్లీలో హై ఆలర్ట్ ప్రకటించారు. దసరా, దీపావళి పండగల సంధర్భంగా రాజధానిలో తీవ్రవాదుల దాడులు చేయవచ్చునని ఢిల్లీ పోలీసులకు ఇంటలిజెన్స్ వర్గాలు సమాచారమిచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్తానా పోలీసు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. తీవ్రవాదుల దాడులకు స్థానిక క్రిమినల్స్, గ్యాంగ్‌స్టర్ల సహకారం తీసుకునే అవకాశం ఉందంటూ అప్రమత్తం చేశారు. --- ‘మా’ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తీరుపై విష్ణు ప్యానెల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండు ప్యానెళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. నమూనా బ్యాలెట్ ఇస్తున్నారంటూ శివారెడ్డిని శివబాలాజీ అడ్డుకున్నారు. అలాగే పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ వర్గంపై విష్ణు వర్గం దూసుకెళ్లింది. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ బాబు.. బెనర్జీని చంపేస్తానని బెదిరించారు. 

బెదిరించారా.. బండ బూతులు తిట్టారా? సజ్జల ఫోన్ తో జేఏసీ నేతలకు చెమటలు అందుకేనా? 

ఏపీ ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాలు ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా.. ఉద్యోగ సంఘాల నేతలకు సజ్జల నుంచి ఫోన్ వచ్చిందని.. ఆ వెంటనే ఆ నేతలు గజగజ వణికిపోయారని, ముఖాలకు చెమటలు పట్టాయని, ప్రెస్ మీట్ ను అర్ధాంతరంగా ముగించారని తెలుస్తోంది. మీడియా సమావేశాన్ని కవర్ చేసిన జర్నలిస్టులు కూడా ఇదే చెబుతున్నారు. ఇదే ఇప్పుడు రచ్చగా మారింది. సజ్జల ఫోన్ రాగానే ఉద్యోగ సంఘాల నేతలకు ఎందుకు చెమటలు పట్టాయి? మీడియా సమావేశాన్ని ఎందుకు ముగించారు? సజ్జల బెదిరించడం వల్లే వాళ్లు వణికిపోయారా? అన్న చర్చ సాగుతోంది.  బండి శ్రీనివాస్ అధ్య‌క్షుడిగా ఉన్న ఏపీజేఏసీ, బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు అధ్య‌క్షుడిగా ఉన్న ఏపీజేఏసీ అమ‌రావ‌తి సంఘాలు నాలుగు రోజుల క్రితం ఉమ్మ‌డిగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేశాయి. ఇక‌పై రెండు సంఘాలు క‌లిసికట్టుగానే ప‌నిచేస్తాయ‌ని, ప్ర‌భుత్వంపై మ‌రింత ఒత్తిడి పెంచేస్తామ‌న్న విష‌యాన్ని చెప్పేందుకే ఈ మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన‌ట్లుగా స‌మాచారం. స‌రైన స‌మ‌యానికి వేత‌నాలు ఇవ్వ‌లేని జ‌గ‌న్ స‌ర్కారుపై నిర‌స‌న గ‌ళం వినిపించేందుకు మీడియా ముందుకు వ‌చ్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ స‌మాచారం స‌జ్జ‌ల‌కు ఎలా తెలిసిందో గానీ.. బండి, బొప్ప‌రాజుల్లో ఒక‌రికి ఫోన్ చేశార‌ట‌. దాంతో వారిద్ద‌రూ మాట మార్చేసి అప్ప‌టికి మీడియా స‌మావేశం ముగిసినట్టుగా చెప్పుకుని వెళ్లిపోయారట.  సజ్జ‌ల బెదిరింపుల‌ వల్లే ఉద్యోగ సంఘాల  నేతలు వెన‌క్కు త‌గ్గారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంట్రోల్ లో ఉండమని సజ్జల ఫోన్ లో బెదిరించడం వల్లే ఉద్యోగాల సంఘాలు నేతలు భయపడి పోయారని అంటున్నారు. ఫోన్ రాగానే చెమటలు వచ్చాయంటే దారుణంగా తిట్టి ఉంటారనే టాక్ కూడా వస్తోంది. సజ్జల ఫోన్ కాల్ అంశం వివాదం కావడంతో  శ‌నివారం  మ‌ళ్లీ మీడియా ముందుకు వ‌చ్చారు ఉద్యోగ సంఘాల నేతలు. రెండు JAC లు కలిసి పోయాయని చెప్పడానికే మూడు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టామని చెప్పారు. తాము ప్రెస్ మీట్ లో ఉండగా సజ్జల ఫోన్ చేసిన మాట వాస్తవమే అన్నారు బండి శ్రీనివాస్. అయితే  కంట్రోల్ లో ఉండమని చెప్పడం అవాస్తవమన్నారు. తమకు శుభాకాంక్షలు తెలియ జేయడానికే సజ్జల ఫోన్ చేశారని కవరింగ్ ఇచ్చారు.  అంతేకాదు ప్రభుత్వానికి వ్యతిరేకం గా మేము ప్రెస్ మీట్ పెట్టలేదు అని సజ్జలకు చెప్పాము.. ఫ్యాన్ లు తీయడం వల్ల నాడు చెమటలు పట్టాయి..  ప్రభుత్వ పెద్దలకు భయపడి కాదు. ఏ రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉండం. ఇప్పటికి జీతాలు రాని వారు ఉన్నారు. 10 తేదీ అయ్యింది.. సమాధానం చెప్పే వారు లేరు. మంత్రి బుగ్గన, రావత్ తో సహా ఒక్కరు సచివాలయం లో కనిపించడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇప్పటికి అందడం లేదు. మంత్రుల ఇళ్లలో కుక్కలకు వేసే బిస్కట్ల కు కూడా ఉద్యోగుల జీతాల నుంచే బడ్జెట్’’ అని బండి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఏపీజేఏసీ అమ‌రావ‌తి అధ్య‌క్షుడు బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు వాదన కూడా అచ్చం అలానే ఉంది. ‘‘మా సమస్యలపై స్పందించేది సజ్జల ఒక్కరే. మమ్మల్ని సజ్జల బెదిరించలేదు. మేమిద్దరం ఒకే వేదిక మీదకు వచ్చే సరికి సజ్జల ఫోన్ చేశారు. మేము ఉద్యోగులం. ప్రభుత్వానికి లోబడి ఉంటాము. ఉద్యోగుల సమస్యలపై రాజీ పడే అవకాశమే లేదు. ఆర్థికేతర సమస్యల పై సీఎం స్పందించాలి. CPS రద్దు చేస్తారని సీఎం పై నమ్మకం ఉంది. 11 వ PRC దసరా నాటికి ఇవ్వాలని కోరాం..ఆర్ధిక మంత్రి మాకు దొరకడం లేదు. ఏమి చెయ్యాలో తెలియడం లేదు’’ అని బొప్పరాజు చెప్పుకొచ్చారు.  ఉద్యోగ సంఘాల వివరణ తర్వాత మరిన్ని అనుమానాలు వస్తున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నట్లు శుభాకాంక్షలు చెప్పడానికే సజ్జల ఫోన్ చేస్తే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము మాట్లాడటం లేదని సజ్జలకు వాళ్లు చెప్పాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న వస్తోంది. మాకు చెమటలు పట్టిన మాట వాస్తవమే గానీ.. అది సజ్జల బెదిరింపుల వల్ల కాదు అంటూ వివరణలు ఇచ్చాక.. వారిద్దరికీ సజ్జల నుంచి బెదిరింపులు నిజంగానే వచ్చి ఉంటాయని సామాన్య జనం కూడా భావిస్తున్నారు. అసలు ఉద్యోగ సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టగానే సజ్జల ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటీ? శుభాకాంక్షలు చెబితే నేతలకు చెమటలు ఎందుకు వచ్చాయి? అన్నది తేలడం లేదు. ఉద్యోగ సంఘాల నేతల అంతర్గత సమాచారం ప్రకారం ప్రెస్ మీట్ పెట్టిన నేతలను సజ్జల తీవ్ర పదజాలంతో తిట్టారని అంటున్నారు. ప్రెస్ మీట్ ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారట. అందుకే బండి శ్రీనివాస్, బొప్పరాజు భయంతో వణికిపోయారని, అందుకే వాళ్లకు చెమటలు వచ్చాయని చెబుతున్నారు.   

హుజురాబాద్ లో రేవంత్ టీమ్ దూకుడు.. టీఆర్ఎస్, బీజేపీలో వణుకు! 

హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై ఇంతకాలం అంతగా దృష్టి కేద్రీకరించని కాంగ్రెస్ పార్టీ ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలని నిర్ణయించింది.,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధనాల పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. హుజూరాబాద్ బరిలో ప్రధాన ప్రత్యర్దులుగా నిలిచిన తెరాస, బీజేపీ  వ్యక్తిగత విమర్శలు, సెంటిమెంట్స్ అదారంగా ప్రచారం సాగిస్తున్న నేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీ, పోడు భూముల సమస్య మొదలు పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్ ధరల మంట వరకు ప్రజాసమస్యలు ప్రధాన అస్త్రాలుగా ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం.  శనివారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ ముఖ్యనేతల సమావేశంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించి స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు.ఇందులో భాగంగా మండలాలు, గ్రామాల వారీగా ఇన్‌చార్జులను, సమన్వయకర్తలను నియమించింది. 20 మందితో స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. దసరా పండుగ తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. ప్రచారంలో ప్రధానంగా విద్యార్థుల, నిరుద్యోగుల, రైతాంగ సమస్యలపై దృష్టి సారించి ఆ వర్గాలను ఆకట్టుకోవాలని, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు మద్దతు కూడగట్టాలని తీర్మానించింది.  దీర్ఘకాల ప్రణాళికలో భాగంగా సొంతబలానికి అదనంగా, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు కూడగట్టే ప్రయత్నంకొనసాగించాలని నిర్ణయించారు. అదే సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని అఖిలపక్ష నాయకులను కోరే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి పలు దఫాలుగా తెరాస, బీజేపీ యేతర పార్టీల నాయకులతో చర్చలు జరిపారు. వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపక పోయినా, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. బీజేపీ దేశానికి ప్రమాదకరమని.. ప్రజలు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలకు అది వ్యతిరేకమని గుర్తు చేసింది. హైదరాబాద్‌లో శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. హుజూరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన కర్తవ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేంద్ర విధానాలను వ్యతిరేకించకుండా కేంద్రంతో కేసీఆర్‌ ప్రభుత్వం లాలూచీ పడుతోందని సిపిఐ ఆరోపించింది. దీంతో ఈ రెండు పార్టీల మద్దతు కాంగ్రెస్ కు లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. హుజురాబాద్ లో కాంగ్రెస్ దూకుడు పెంచడంతో అధికార టీఆర్ఎస్, బీజేపీల్లో కలవరం మొదలైందని తెలుస్తోంది. ఇప్పటివరకు గెల్లు, ఈటల మధ్యే పోటీ ఉంటుందని, కాంగ్రెస్ కు డిపాడిట్ రాకపోవచ్చనే చర్చ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి టీమ్ పక్కా వ్యూహాలతో రంగంలోకి దిగడంతో సమీకరణలు మారిపోతున్నాయని చెబుతున్నారు. కాంగ్రెస్ బలపడితే ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ కు ఓట్లు పెరిగితే ప్రజా వ్యతిరేకత ఓటు చీలి టీఆర్ఎస్ కు ప్రయోజనం ఉంటుందని కొందరు వాదిస్తుండగా.. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే మైనార్టీ, ఎస్టీ, ఎస్టీ ఓట్లు కాంగ్రెస్ కు పడే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే కారుకు గండం ఉంటుందంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రచారం పెరగడంతో టీఆర్ఎస్, బీజేపీ నేతలు మాత్రం కలవరపడుతున్నారని అంటున్నారు.   

రాహుల్ చేతికి కాంగ్రెస్ పగ్గాలు? పీకే డైరెక్షన్ లో కొత్త వ్యూహాలు..

కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలు కానుందా? ఎంతో కాలంగా పార్టీ సీనియర్ నాయకులు కోరుతున్న విధంగా సంస్థాగత మార్పులకు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ శ్రీకారం చుడుతున్నారా? లేక, పాత పద్దతిలోనే మరో మారు, పదవుల కుండమార్పిడితో సరిపుచ్చుతారా అంటే అదైనా ఇదైనా ఏదైనా జరగవచ్చని  అంటున్నారు పార్టీ నాయకులు.   పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్వోన్నత విధాన నిర్ణయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఈ నెల 16న సమావేశంలో ఎదో ఒకటి తేలిపోతుందని అంటున్నారు.  ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను ముఖ్యంగా పంజాబ్ సంక్షోభ పరిష్కారం మొదలు అనేక కీలక నిర్ణయాల్లో రాహుల్ గాంధీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్న తీరును గమనిస్తే ఆయన పార్టీ బాధ్యతలను స్వీకరించేందుకు సిద్దమయినట్లు కనిపిస్తోంది. అయితే, ఆయన నాయకత్వాన్ని, ఇటు పార్టీ, ముఖ్యంగా పార్టీలో సమ్మతి కుంపటి రాజేసిన జీ23 సీనియర్ నాయకులు అంగీకరిస్తారా? అనే ప్రశ్నలు ఉన్నాయి. అయినా చివరాఖరుకు రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్ట్టే, అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే, పార్టీ సీనియర్ నాయకుల రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూడవలసి ఉందని పరిశీలకులు అంటున్నారు. అయితే, అదే సమయంలో అధ్యక్ష పదవిలో సోనియా గాంధీ కొనసాగుతూ, రాహుల్ గాంధీని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే ఆలోచన కూడా ఉన్నట్లు  తెలుస్తోంది. అదైనా, ఇదైనా ఏదైనా పార్టీ భవిష్యత్ ప్రస్థానానికి సంబందించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో స్పష్టత వచ్చే, అవకాశం ఉందని తెలుస్తోంది.  పంజాబ్ సంక్షోభం, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా నేపధ్యంగా చోటు చేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా ఇందుకు సంబదించి పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్, “అధ్యక్షుడు లేని పార్టీలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో” అంటూ చేసిన వ్యాఖ్యలు.. అదే సమయంలో అయన జీ 23 అంటే జీ హుజూర్ 23 కాదని అంటించిన చురకలు  పార్టీలో  తీవ్ర దుమారన్నే రేపాయి. కాంగ్రెస్ కార్యకర్తలు , కపిల్ సిబల్ ఇంటిపై కోడి గుడ్లు, టమోటాలతో దాడి చేశారు.దీంతో గాంధీలు ( సోనియా, రాహుల్, ప్రియాంక) జీ 23 మధ్య దూరం మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ భేటీ తేదీని ప్రకటించడం, అందులో పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించబోతున్నట్లు స్పష్టం చేయడంతో కాంగ్రెస్‌కు పూర్తి స్థాయిలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉందన్న వార్తలు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో  వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో యూపీ, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోల్ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్ కిశోర్‌‌  కాగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా లోతైన సమస్యలు ఉన్నాయని, వాటిని ఒక్కసారిగా పరిష్కరించడం సాధ్యం కాదంటూ ట్వీట్ చేయడం కూడా ప్రాముఖ్యం సంతరించుకుంది. ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభానికి ఇప్పట్లో పరిష్కారం లభించడం అయితే అయ్యే పని కాదని, ముఖ్యంగా నాయకత్వ సమస్య ఇప్పట్లో పరిష్కారం అయ్యేసూచనలు కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.

వ‌ర్షాలు కురుస్తున్నా కోత‌లెందుకు? క‌మీష‌న్ల కోస‌మే విద్యుత్ సంక్షోభం!

ఏపీలో విస్తారంగా వ‌ర్షాలు కురిశాయి. రిజ‌ర్వాయ‌ర్లు నిండుగా క‌ళ‌క‌ళ్లాడుతున్నాయి. అయినా, రాష్ట్ర‌వ్యాప్తంగా విద్యుత్ కోత‌లు ప్ర‌జ‌ల జీవితాల్లో చీక‌ట్లు నింపుతున్నాయి. ఏపీలో ఈ స్థాయిలో క‌రెంట్ క‌ష్టాల‌కు కార‌ణ‌మేంటో తెలుసా? చైనా, యూర‌ప్‌లేన‌ట‌. ఈ మాట అంటున్న‌ది మ‌రెవ‌రో కాదు.. స్వ‌యానా ముఖ్య‌మంత్రే ఈ విధంగా సెల‌విచ్చారు. అది కూడా ప్ర‌ధాని మోదీకి లేఖ రాసి మ‌రీ ఏపీ విద్యుత్ ఇబ్బందుల‌ను విదేశాల‌తో ముడిపెట్టారు. అందుకే, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి చిర్రెత్తుకొచ్చింది. ఏ విష‌యాన్నైనా లోతుగా విశ్లేషించి.. స‌మ‌గ్ర స‌మాచారం అందించే.. టీడీపీ సీనియ‌ర్ నేత‌, పీఏసీ ఛైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్ రంగంలోకి దిగారు. ఏపీలో విద్యుత్ సంక్షోభానికి సీఎం జగనే కారణమని విరుచుకుప‌డ్డారు. ఇంత‌కీ ప‌య్యావుల ఏమ‌న్నారంటే... ‘‘విద్యుత్‌ సంక్షోభంపై సీఎం జ‌గ‌న్‌ ప్రధానికి రాసిన లేఖలో చైనా, యూరప్‌తో ఏపీని పోలుస్తారా? విద్యుత్‌ విషయంలో పొరుగున ఉన్న తెలంగాణతో పోల్చుకోలేదు. తెలంగాణలో విద్యుత్ వ్యవస్థ మెరుగ్గా ఉంటే చైనా సమస్య జగన్‌కు ఎందుకు? విభజన నాటికి ఏపీ మిగులులో ఉంటే.. తెలంగాణ లోటులో ఉంది. విద్యుత్‌ విషయంలో ఇప్పుడు తెలంగాణ మెరుగ్గా ఉంది. వర్షాకాలంలో.. రిజర్వాయర్లు నిండిన సమయంలో విద్యుత్‌ కోతలా? ఆర్థిక రంగాన్ని సంక్షోభంలోకి నెట్టినట్లే విద్యుత్‌ వ్యవస్థను కుదేలు చేశారు. విద్యుత్‌ సంస్థల దివాళాకు కారణం ప్రభుత్వ కక్ష సాధింపే. ప్రధానికి లేఖ రాసి బాధ్యత నుంచి తప్పుకోవడం సరికాదు’’. అంటూ మండిప‌డ్డారు ప‌య్యావుల కేశ‌వ్‌.  ‘‘ రాష్ట్రంలో విద్యు దుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలు లేవని.. ఆర్టీపీపీ, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ వంటివి పనిచేసే స్థితుల్లో లేవని లేఖలో రాసి, ప్రధానిని కాపాడమంటున్నారు. ప్రభుత్వ చేతగానితనం, ముందుచూపులేని తనానికి ప్రధాని ఎలా స్పందిస్తారు? రాష్ట్రంలోని థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్ని మూసివేత దిశగా తీసుకెళ్లి, ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనాలనే దుర్మార్గపు ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో బొగ్గు సరఫరా ఎందుకు లేకుండా పోయింది? ముందుచూపు లేకుండా బొగ్గు ఉత్పత్తి సంస్థలకు డబ్బు చెల్లించనందునే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందనేది నిజం కాదా? హిందూజాలు, కృష్ణపట్నం పవర్ ధర్మల్ ప్లాంట్లు 6 నెలలు గా విద్యుదుత్పత్తి నిలిపేయడానికి కారణం ఈ ప్రభుత్వం కాదా? ఆయా సంస్థల నుంచి విద్యుత్ కొనకుండా, కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి అధిక ధరకు విద్యుత్ కొంటున్నారు. రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన విద్యుదుత్పత్తి సంస్థలను నీరుగార్చేలా ప్రభుత్వ చర్యలున్నాయి’’. అని ప్రభుత్వ తీరుపై ప‌య్యావుల ఫైర్ అయ్యారు.  ‘‘ట్రు అప్‌ పేరుతో ఛార్జీల భారాన్ని ప్రజలు భరించాలా? ప్రజలపై రూ.50 వేల కోట్ల అదనపు భారం ఎందుకు మోపుతున్నారు’’ అని పయ్యావుల ప్రశ్నించారు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.12వేల కోట్లు చెల్లించనందున దాదాపు రూ.20వేల కోట్ల వరకు ప్రభుత్వం బకాయి ఉంది. ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఆ భారాన్ని కూడా ట్రూ అప్ ఛార్జీల పేరుతోప్రజలపైనే వేసింది’’ అంటూ జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారును త‌న ప‌రిజ్ఞానంతో, పూర్తి స‌మాచారంతో ఏకిపారేశారు ప‌య్యావుల కేశ‌వ్‌.   

టాప్ న్యూస్ @ 7pm

1. తెలంగాణ ప్రజలు తనను పిలిచే వరకు ఇక్కడకు రానని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ సమస్యలపై పోరాడే వారిని అసెంబ్లీకి పంపించటానికి కృషి చేస్తానన్నారు. కులం, మతం, రంగు, ప్రాంతం మనకు తెలియకుండా జరిగిపోతాయని, కులాలను రెచ్చగొట్టడం తన ఉద్దేశం కాదని చెప్పారు.. కులాల కొట్లాటతో ఏపీ అభివృద్ధి దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ నాయకులు తనకు శత్రువులు కాదని.. దౌర్జన్యం, అవినీతి, పేదరికమే జనసేనకు బద్దశత్రువులని ప‌వ‌న్ అన్నారు.  2. ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని.. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిప‌డ్డారు. జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6 లక్షల కోట్ల అప్పు చేసిందని.. అమరావతిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని త‌ప్పుబ‌ట్టారు. ఎంతో మంది సలహాదారులు ఉన్న ఈ ప్రభుత్వం ఆర్థిక దయనీయ పరిస్థితులు ఉండటం దారుణమన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీకి గడ్డు పరిస్థితి తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. 3. హరీష్‌రావు, ఈటల రాజేంద‌ర్‌.. ఇద్దరూ తోడు దొంగలేనని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈటల వందల కోట్లు, కేసీఆర్ వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్‌లోకి పోతే పదవి వస్తుందని అనుకున్నారని.. పదవీ రాలే.. పైసలు కూడా రాలేదని రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. 4. తాము బీజేపీతో కలిసే ఉన్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. పార్టీ స్టాండ్ ప్రకారమే బద్వేలులో తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదని తెలిపారు. బద్వేల్‌ ఉపఎన్నికలో బీజేపీ గెలుపు కోసం సహకరిస్తామని ప్రకటించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్ర‌భుత్వానికి నాదెండ్ల మనోహర్ సూచించారు. 5. ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు తీర్పు హర్షణీయమ‌ని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని మంత్రి బొత్స మాట్లాడడం దిగజారుడుతనమని దుయ్యబట్టారు. ఒక సెంటు, ఒకటిన్నర సెంటు స్థలంలోనే ఇంటి నిర్మాణం అవుతుందా? అని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాలకు భూ సేకరణలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించేవారిపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.  6. హెటిరో డ్రగ్స్‌లో రూ.142 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. మరో రూ.550 కోట్ల నగదు నిల్వల లెక్కలు తేలాల్సి ఉంద‌ని అంటున్నారు. 4 రోజులుగా 6 రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో  హెటిరో సంస్థ కార్యాల‌యాలు, డైరెక్ట‌ర్ల ఇళ్ల‌ల్లో ఐటీ సోదాలు జ‌రుగుతున్నాయి. సోదాల్లో పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్కులతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఆధారాలను హెటిరో సిబ్బంది ధ్వంసం చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించింది. చాలా వరకు నకిలీ ఇన్వాస్‌లు తయారు చేసినట్లుగా గుర్తించారు. కంపెనీ డబ్బులతో యాజమాన్యం భారీగా స్థలాలు కొనుగోలు చేసిన‌ట్టు తేలింది.  7. దుర్గగుడిలో కొవిడ్ నిబంధనలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. వీవీఐపీలు కాని వారిని కూడా అంతరాలయంలోకి అనుమ‌తిస్తుండ‌టం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. అంతరాలయంలో రద్దీతో  క్యూలైన్లలో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే వ్యవహారంపై కలెక్టర్ సీరియస్ అయినా అధికారులు పట్టించుకోవ‌ట్లేదు. దుర్గగుడిలో అధికారుల తీరుపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ వాకబు చేసినట్టు తెలుస్తోంది.  8. ప్రధాని మోదీతో డెన్మార్క్‌ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ న్యూఢిల్లీలో సమావేశమ్యయారు. కీలక రంగాలైన ఆరోగ్యం, వ్యవసాయం, జల నిర్వహణ, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారానికి ఫల ప్రదమైన చర్యలు జరిపినట్టు ఇరుదేశాల ప్రధానులు సమావేశానంతరం సంయుక్తంగా ప్రకటించారు. శాస్త్ర, సాంకేతిక రంగం, వాతావరణ మార్పులు, నైపుణాభివృద్ధి వంటి రంగాల్లో మరింత సహకారానికి నాలుగు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. 9. క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ అగ్రనటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు అర్యన్ ఖాన్ డ్రైవర్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రశ్నించింది. మరోవైపు, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఎన్‌సీబీపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నేత మోహిత్ కాంభోజ్ బావమరిదిని కూడా ఎన్‌సీబీ తొలుత అరెస్ట్ చేసిందని అయితే, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అతడిని విడిచిపెట్టిందని ఆరోపించారు. ఢిల్లీ, మహారాష్ట్ర బీజేపీ పెద్దల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌తోనే అతడిని విడిచిపెట్టారని అన్నారు.  10. ఆదివారం జ‌రిగే "మా" ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. పోలింగ్ సంద‌ర్భంగా 3 ప్లాటూన్ల పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ‘మా’ ఎన్నికల్లో మొత్తం 883 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.   

సీఎం జగన్ ఫోటోకు మొక్కిన స్పీకర్.. ఇంత దారుణమా?

భారత రాజ్యాంగం చాలా పవర్ ఫుల్, మన రాజ్యాంగంలో ప్రజా ప్రతిధులు, వాళ్ల పదవులు, హోదాలకు సంబంధించి సమగ్రంగా పొందు పరిచింది. అయితే  రాజ్యాంగ బ‌ద్ధ ప‌దవుల‌కు వ‌న్నె తెచ్చేలా వ్య‌వ‌హ‌రించాల్సిన మ‌న నేత‌లు,, ఆ ప‌ద‌వుల‌కు ఉన్న గౌర‌వాన్ని మంట‌గ‌లుపుతున్నారు. ఏపీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కూడా ఇప్పుడు అదే ప‌నిచేశారు. స‌భాధ్య‌క్షుడి స్థానంలో ఉండి.. ఆ పదవికి కళంకం తెచ్చేలా వ్యవహరించారు.  ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫొటోకు కొంద‌రు మ‌హిళ‌లు పాలాభిషేకం చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన త‌మ్మినేని త‌నలోని స్వామి భ‌క్తిని దాచుకోలేక‌పోయారు. సీఎం జ‌గ‌న్ ఫొటోకు మొక్కారు. జ‌గ‌న్ ఫొటోకు మ‌హిళ‌లు పాలాభిషేకం చేస్తుండ‌గా.. ఆ ప‌క్క‌నే నిలుచున్న త‌మ్మినేని.. రెండు చేతులు జోడించారు. ఇలా చేతులు జోడించ‌డంలోనూ త‌మ్మినేని త‌న‌దైన మార్కును చూపారు. మొక్క‌డ‌మంటే.. రెండు చేతులు గాల్లోకి ఎత్తి మొక్క‌డం కాకుండా.. హ‌రతి తీసుకుంటున్న సంద‌ర్భంగా చేతులు జోడించిన‌ట్టుగా, లేదంటే.. కొంద‌రు పెద్ద‌ల పాదాల‌ను తాకిన‌ట్లుగా త‌మ్మినేని కూడా త‌న రెండు చేతుల‌ను జ‌గ‌న్ బొమ్మ‌పై పెట్టారు. ఈ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిపోయింది.ఈ చ‌ర్య ద్వారా స్పీక‌ర్ స్థానంలో ఉన్న త‌మ్మినేని.. సీఎం జ‌గ‌న్‌కు భ‌క్తుడిగా మారిపోయార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.  ఈ ఘ‌ట‌న శ్రీ‌కాకుళం జిల్లాలోని త‌మ్మినేని సొంత నియోజ‌కవ‌ర్గం ఆముదాలవ‌ల‌స‌లో చోటుచేసుకుంది. స్వయం శక్తి సంఘాల మహిళలకు ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో త‌మ్మినేని పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళ‌లు సీఎం ఫొటోకు పాలాభిషేకం చేయ‌గా.. త‌మ్మినేని ఆ ఫొటో ముందు చేతులు జోడించి నిల‌బ‌డ్డారు.  శ్రీ‌కాకుళం జిల్లా ఆముదాల‌వ‌ల‌స ఎమ్మెల్యేగా ఎన్నికైన త‌మ్మినేని సీతారాంను స్పీక‌ర్‌గా తాము ప్ర‌తిపాదిస్తే.. స‌భ‌లో విప‌క్ష నేత‌గా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌ల‌క‌లేద‌ని అప్పుడు వైసీపీ నానా రచ్చ చేసింది. ఇప్పుడు స్పీక‌ర్ స్థానంలో కూర్చున్న త‌మ్మినేని తాను కూర్చున్న ప‌ద‌వి గౌరవ మ‌ర్యాద‌ల‌ను మంట‌గ‌లిపేలా వ్య‌వ‌హ‌రించారు.